
అలరించిన సంబరాలు
జిల్లాస్థాయి సంక్రాంతి సంబరాలు అనకాపల్లి మున్సిపల్ స్టేడియంలో మంగళవారం సాయంత్రం అట్టహాసంగా మొదలయ్యాయి.
జిల్లాస్థాయి సంక్రాంతి సంబరాలు అనకాపల్లి మున్సిపల్ స్టేడియంలో మంగళవారం సాయంత్రం అట్టహాసంగా మొదలయ్యాయి. పోటీలను ఎమ్మెల్యే పీలా గోవింద ప్రారంభించారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన సంబరాల సెట్టింగ్, స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, వివిధ పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల సంప్రదాయక దుస్తుల పోటీలు అలరించాయి.
అనకాపల్లి: జిల్లాస్థాయి సంక్రాంతి సంబరాలు అనకాపల్లి మున్సిపల్ స్టేడియంలో మంగళవారం సాయంత్రం అట్టహాసంగా మొదలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పోటీలను ప్రారంభించారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన సంబరాల సెట్టింగ్, స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, వివిధ పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి ముగ్గుల పోటీలను, పిల్లల గాలిపటాల పోటీలను, మహిళల వంటల పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. విద్యార్థులు నిర్వహించిన సంప్రదాయక దుస్తుల పోటీలను పలువురు ఆసక్తిగా తిలకించారు. హరిదాసులు, గంగిరెద్దులు, ఎడ్లబండ్ల అలంకారాలు, సంక్రాంతి కుటీరాలు, కోలాటాలు, బొమ్మలకొలువులు, తప్పెటగుళ్లు, చిడత భజన వంటి కార్యక్రమాల ద్వారా మన సంస్కృతిని చాటిచెప్పారు.
వ్యవసాయ ఉత్పత్తులు, ఉద్యాన పంటల ఉత్పత్తులు, పాడి పశువులతో పాటు ఎస్‌వీడీఎస్ స్టాళ్లు, ఐసీడీఎస్ స్టాళ్లు ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే సొంత నిధులతో ఏర్పాటు చేసిన లక్కీడిప్ బహుమతులు, పోటీలలో పాల్గొన్న మహిళలకు ప్రోత్సాహక బహుమతులతో అందరిలో ఉత్సాహం కనిపించింది. ఆర్డీవో పద్మావతి, జీవీఎంసీ సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బంది, రెవెన్యూ, మండల పరషత్ సిబ్బంది, పశుసంవర్థక శాఖ, వ్యవసాయ, ఉద్యానశాఖ సిబ్బంది, వెలుగు సిబ్బందితో పాటు పలువురు అధికార పార్టీ నాయకులు పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా మంగళవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి గంటా ఉత్తమ రైతులకు పురస్కారాలు అందజేశారు.