
నూతనోత్సాహం
ఘనంగా నూతన సంవత్సరాది వేడుకలు
విందు వినోదాల్లో యువత కేరింత
జన సందోహంతో హోటళ్లు కిటకిట
తిరుపతి కల్చరల్: నూతన సంవత్సర వేడుకలు జిల్లాలో హోరెత్తాయి. ఆనందోత్సాహాల నడుమ నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటారుు. అర్ధరాత్రి 12 గంటలు దాటగానే యువత కేక్‌లు కట్ చేసి కేరింతలు కొట్టింది. బాణసంచా పేల్చి రంగులు చల్లుకుంటూ ఆనంద హేలలో మునిగి తేలారు. బంధు మిత్రులకు నూతన శుభాకాంక్షలు చెప్పారు. ఉదయం నుంచే నగరంలో సందడి కనిపించింది. బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలిపేందుకు పుష్పగుచ్ఛాలు, కేక్‌లు, స్వీట్లు కొనుగోళ్లతో నగరంలో సందడి నెలకొంది. నూతన సంవత్సరం సందర్భంగా ఫ్లవర్ బాస్కెట్స్, బేకరీ షాపులు కిటకిటలాడాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆనందోత్సాహల మధ్య నూతన సంవత్సర సంబరాలు చేసుకున్నారు.
నగరంలోని స్టార్ హోటళ్లలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. టీవీ యాంకర్, జబర్దస్త్ టీమ్‌తో కార్యక్రమాలు సాగారుు. సంగీత విభావరి, హాస్య ప్రదర్శనలు నిర్వహించారు. ప్రత్యేక ఆఫర్లతో ఆహార పదార్థాలు అందించడంతో స్టార్ హోటళ్లు కిటకిటలాడారుు. బాణసంచా వేడుకలు, డప్పు వాయిద్యాలు మార్మోగాయి. చిన్నాపెద్దా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ సందడి చేశారు.