కొత్త సంవత్సరం దగ్గరలో ఉంది. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ‘హ్యాపీ న్యూ ఇయర్’ పాట పాడగానే సరిపోతుందా? ‘పాటతోపాటు ప్రణాళిక కూడా ఉంది’ అంటుంది మన జెన్ జెడ్. కొత్త సంవత్సరంలో జెన్ జెడ్ లక్ష్యాలు, ప్రణాళికలు, అభిరుచులకు సంబంధించి ‘ట్రెండ్ టాక్ రిపోర్ట్–2024’ అద్దం పడుతోంది.
ఇండియా, యూఎస్, యూకే, బ్రెజిల్, సౌత్ కొరియా దేశాలలోని జెన్ జెడ్ ట్రెండ్స్‌కు సంబంధించి ‘ట్రెండ్ టాక్ రిపోర్ట్’ను విడుదల చేసింది ఇన్‌స్టాగ్రామ్. వర్త్ గ్లోబల్ స్టైల్ నెట్‌వర్క్ (డబ్ల్యూజీఎస్‌ఎన్)తో కలిసి నిర్వహించిన ఈ సర్వేలో 2024 సంవత్సరానికి సంబంధించి ఫ్యాషన్, బ్యూటీ, సోషల్ మీడియా, ఫ్రెండ్‌షిప్‌కు సంబంధించిన ప్రశ్నలు జెన్ జెడ్‌ను అడిగారు.
ఈ రిపోర్ట్ ప్రకారం ఫ్యాషన్ ట్రెండ్స్, బ్యూటీ అండ్ ఫుడ్ విభాగాలలో మన దేశం ట్రెండ్ సెట్టర్‌గా ఉంది. ఫుడ్ విషయానికి వస్తే కొత్త రుచులను ఆస్వాదించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇతరుల కంటే భిన్నంగా కనిపించే వస్త్రధారణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్త హెయిర్‌స్టైల్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. 2024కు సంబంధించి ‘జెన్ జెడ్’ ప్రాధాన్యతలలో హెల్త్, ట్రావెల్, కెరీర్‌లు మొదటి స్థానంలో ఉన్నాయి. తమ కెరీర్‌పై ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నట్లు 43 శాతం మంది తెలియజేశారు. ఇతర దేశాలతో పోల్చితే మన ‘జెన్ జెడ్’ వ్యాపారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. సంపద సృష్టికి వ్యాపారమే మార్గం అని చెబుతోంది.
మన దేశంలో ‘జెన్ జెడ్’లో ఎక్కుమంది స్పోర్ట్స్‌కు సంబంధించి సూపర్‌ఫ్యాన్స్ ఉన్నారు. లైఫ్ అడ్వైజ్, తమ ప్రొఫెషన్‌కు సంబంధించి కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. జీఆర్‌డబ్ల్యూఎం(గెట్ రెడీ విత్ మీ)లాంటి క్రియేటివిటీతో కూడిన ఫ్యాషన్ ట్రెండ్స్‌పై అమిత ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. మన దేశంలో జెన్ జెడ్‌లో 44 శాతం మంది సొంత ఆలోచనలకు ప్రాధాన్యత ఇచ్చే డీఐవై(డూ–ఇట్–యువర్‌సెల్ఫ్) విధానాన్ని ఇష్టపడుతున్నారు. సంగీతం విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్, శ్రేయా ఘోషల్, అనిరుథ్ నుంచి సౌత్ కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ ‘బీటీఎస్ ఆర్మీ’ వరకు ఇష్టపడుతున్నారు.
వారికి నచ్చిన వీడియో గేమ్స్‌లో ఫోర్ట్‌నైట్, కాల్ ఆఫ్ డ్యూటీ, రాబ్‌లక్స్... మొదలైనవి ఉన్నాయి. జెన్ జెడ్‌లోని పదిమందిలో తొమ్మిదిమంది వారు ఇష్టపడే రంగాలకు సంబంధించి సెలబ్రిటీల అభిమానగణంలో ఉన్నారు. తమ అభిమాన సెలబ్రిటీలు, అథ్లెట్లు, క్రియేటర్ నుంచి జెన్ జెడ్ రాబోయే కాలంలో ఆశిస్తున్నది ఏమిటి? అనే ప్రశ్నకు వినిపించే జవాబు... లైఫ్ అడ్వైజెస్, వారి ప్రొఫెషన్‌కు సంబంధించిన కంటెంట్... ఇక మీమ్స్ విషయానికి వస్తే మూడింట ఒక వంతుమంది ‘బ్యాడ్ టేస్ట్ మీమ్స్’ను తమ ‘టాప్ టర్న్ ఆఫ్’గా ఎంచుకున్నారు.
గతం సంగతి ఎలా ఉన్నా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో యువతరం ముందు ఉంటుంది. అభిరుచుల నుంచి కెరీర్ ఆప్షన్స్ వరకు కొత్తగా ఆలోచిస్తోంది. ‘కాలేజీ చదువు పూర్తయిన తరువాత వైట్–కాలర్ జాబ్ తెచ్చుకోవాలి’ అనేది సంప్రదాయ ఆలోచన. అయితే యువతరంలో అందరూ ఇలాగే ఆలోచించడం లేదు.‘కంఫర్టబుల్ లైఫ్‌స్టైల్’కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీనికి కారణం జెనరేటివ్ ఏఐ. జెనరేటివ్ ఏఐ ప్రభావంతో వైట్–కాలర్ జాబ్స్‌కు ఉద్యోగభద్రత తక్కువ అనే అభిప్రాయం ఉంది. పియర్సన్ రిపోర్ట్ ప్రకారం జెనరేటివ్ ఏఐ వల్ల వైట్–కాలర్ ఉద్యోగాలలో 30 శాతం రిప్లేస్‌మెంట్ జరుగుతుంది.
వైట్–కాలర్ జాబ్‌లతో పోల్చితే బ్లూ–కాలర్ జాబ్‌లకు అధిక ఉద్యోగ భద్రత ఉంది. రోబోట్స్ చేయలేని పనులు వీటిలో ఉండడమే కారణం. ఈ పనులు చేయడానికి ప్రత్యేక శిక్షణ, నైపుణ్యం అవసరం. అయితే జెన్ జెడ్‌లో ఎక్కువమంది ఈ హై–డిమాండ్ ఫీల్డ్‌పై ఆసక్తి ప్రదర్శించడం లేదు. వైట్–కాలర్ జాబ్, బ్లూ–కాలర్ జాబ్ అనేదానితో సంబంధం లేకుండా ప్రతి ఉద్యోగికి విశ్లేషణాత్మక ఆలోచన విధానం, సమస్య పరిష్కార నైపుణ్యం, సమర్థవంతమైన కమ్యూనికేషన్, స్ట్రెస్ మెనేజ్‌మెంట్ స్కిల్స్... మొదలైన వాటికి సంబంధించి ప్రొఫెషనల్ స్కిల్స్ అవసరం. వీటిపై జెన్ జెడ్ ఆసక్తి ప్రదర్శిస్తోంది. నిర్ణయాలు తీసుకోవడంలో ‘లైఫ్‌స్టైల్’ అనేది కీలకపాత్ర పోషిస్తోంది. డబ్బు నుంచి ఫ్రీ టైమ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ వరకు ఎన్నో విషయాలను దృష్టిలో పెట్టుకుంటుంది జెన్ జెడ్.
గుడ్ ప్లానింగ్
2024లో యువతరం ఆసక్తి చూపుతున్న రంగాలలో ట్రావెల్ ఒకటి. ట్రావెల్ ప్రేమికులకు టాన్యాలాంటి ట్రావెల్ వ్లోగర్‌ల సలహాలు ఉపయోగపడుతున్నాయి. అడ్వర్‌టైజింగ్ రంగంలో ఉద్యోగం చేసిన టాన్యా సోలోగా ట్రావెలింగ్ మొదలుపెట్టి తాను వెళ్లిన ప్రదేశాలకు సంబంధించి వ్లోగింగ్ మొదలు పెట్టింది. యూట్యూబ్, ఎయిర్‌టెల్‌లాంటి పెద్ద కంపెనీలతో కలిసి పనిచేసింది. ట్రావెలింగ్‌పై ఆసక్తి ఉన్నవారికి గుడ్ ప్లానింగ్ అనేది ముఖ్యం అంటుంది టాన్యా. ‘గుడ్ ప్లానింగ్’కు సంబంధించి టిప్స్ చెబుతుంటుంది.
ప్రణాళిక ఉండాలి
దిల్లీకి చెందిన మౌనికా మాలిక్ బిజినెస్ అండ్ ఫైనాన్స్‌కు సంబంధించి కంటెంట్ క్రియేటర్‌గా చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకుంది. పర్సనల్ ఫైనాన్స్ నుంచి స్టాక్‌మార్కెట్ వరకు ఎన్నో విషయాలను సులభంగా అర్థమయ్యేలా చెబుతోంది. ‘ఒక రంగంపై ఇష్టం ఉన్నంత మాత్రాన విజయం చేరువ కాదు. భవిష్యత్ ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలి. పరిశ్రమకైనా, వ్యక్తికైనా ఇది ముఖ్యం’ అంటుంది మాలిక్.
(చదవండి: జుట్టు లేకపోయినా మోడల్‌గా రాణించి శభాష్ అనిపించుకుంది! హెయిర్‌లెస్ మోడల్‌గా సత్తా చాటింది)
Comments
Please login to add a commentAdd a comment