ఆశ అనేది మనిషి శ్వాస ఆసక్తి అనేది నిత్యనూతన శక్తి. ఆశ, ఆసక్తులతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది యువతరం. ‘భవిష్యత్ మీదే ఎప్పుడూ నా నిఘా ఉంటుంది ఇవాళ కంటే రేపే ఎంతో బాగుంటుందంటాను నేను’ అనే శ్రీశ్రీ మాట రేపటి వైపు చూసినప్పుడల్లా వినిపిస్తూ ఉంటుంది. కొత్త ఉత్సాహాన్ని ఇస్తూనే ఉంటుంది.
ఇంకో మూడు రోజుల తరువాత మనల్ని పలకరించనున్న 2023 గురించి యూత్ ఏం ఆలోచిస్తుంది? కొత్త సంవత్సరంలో కొత్తగా ఏం చేయాలనుకుంటుంది? రకరకాల ట్రెండ్ రిపోర్ట్‌ల సారాంశం ప్రకారం యాక్టివిజం, ఫ్యాషన్ సస్టెయినబిలిటీ, క్లైమెట్, ఫైనాన్స్, కల్చర్, మ్యూజిక్... మొదలైన అంశాలపై ఆసక్తి కనబరుస్తుంది యువతరం.
యాక్టివిజానికి సంబంధించి ఆన్ అండ్ ఆఫ్ సోషల్ మీడియాలో యువతరం చురుకైన పాత్ర పోషిస్తోంది. రాజకీయరంగంలోకి తమ వయసు వాళ్లు రావాలని కోరుకుంటోంది. అయితే ఇదేమీ అసాధ్యమైన కోరిక కాదని కొందరు యువ రాజకీయ నాయకులు నిరూపిస్తున్నారు. ఉదా: యూఎస్ కాంగ్రెస్–2022కు ఎంపికైన జెన్–జెడ్ లీడర్ మాక్స్‌వెల్ ఫ్రాస్ట్.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ల హవా గురించి మనకు తెలిసిందే. అయితే రాబోయే రోజుల్లో ఎలాంటి ఇన్‌ఫ్లూయెన్సర్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు? అనే విషయానికి వస్తే‘దివ్యాంగులైన ఇన్‌ఫ్లూయెన్సర్‌లు’ అనే సమాధానం వినిపిస్తుంది. దీనికి కారణం సానుభూతి అనడం కంటే వారి శక్తిసామర్థ్యాలకు ఉత్సాహం ఇచ్చే ప్రయత్నం అనుకోవచ్చు.
‘పర్యావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు–వాటి పర్యవసానాలు’ ఇప్పుడు యూత్‌కు పట్టని విషయం కాదు. తమ షాపింగ్ వ్యవహారాలపై పర్యావరణ స్పృహ గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. కొత్త సంవత్సరంలో పర్యావరణానికి హాని కలిగించే వస్తువులకు దూరంగా ఉండాలనుకుంటున్నారు.
క్లైమెట్–ప్రూఫ్ ప్రాడక్ట్స్‌కు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ‘మనం దృష్టి పెట్టాలేగానీ మార్కెట్‌లో ఎన్నో ప్రత్యామ్నాయాలు కనిపిస్తాయి. కాఫీ కప్పు, ల్యాంప్ షేడ్, యోగా మ్యాట్, ఫ్లవర్ పాట్ స్టాండ్...ఇలా ఎన్నో పర్యావరణ హిత వస్తువులు కనిపిస్తాయి. వీటిని కొనడం ద్వారా ఎకో–ఫ్రెండ్లీ కల్చర్‌ను ముందుకు తీసుకెళ్లవచ్చు’ అంటుంది జైపుర్(రాజస్థాన్)కు చెందిన వైష్ణవి.
ఆర్థిక విషయాలకు వస్తే ‘2023లో సోషల్ మీడియా వేదికగా డబ్బులు ఎలా సంపాదించాలి?’ అనేదాని గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పటివరకు తమ ఆనందం కోసం చేసిన కంటెంట్ క్రియేషన్‌ని ఇకముందు కరెన్సీలోకి మార్చుకోవడంపై దృష్టి పెడుతున్నారు.
యూత్‌లో ఎక్కువ మంది వేరే ప్రాంతాలకు చెందిన రుచికరమైన ఆహారంపై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో అది ఆసక్తికి మాత్రమే పరిమితం కాబోవడం లేదు. ‘వైరల్ ఫుడ్ కంటెంట్’ను అనుసరిస్తూ ఆయా ప్రాంతాలకు వెళ్లి తమకు ఇష్టమైన ఆహారపదార్థలను రుచి చూడాలనుకుంటున్నారు. ఇది ఒకరకంగా ‘ఫుడ్ ట్రావెల్’ అని చెప్పుకోవచ్చు.
ఇన్–పర్సన్ ఇంటరాక్షన్‌కు ప్రాధాన్యత పెరగబోతుంది. తమ ఫేవరెట్ ఇన్‌ఫ్లూయెన్సర్‌ను అభిమానించే యువతరం ఇక ముందు వారిని ప్రత్యక్షంగా కలుసుకొని చాలాసేపు మాట్లాడాలనుకుంటోంది. ఇన్–పర్సన్ వెంచర్స్‌కు ప్రాధాన్యత పెరగబోతుంది. మ్యూజిక్ విషయానికి వస్తే గ్లోబల్ మ్యూజిక్ తమకు ఇష్టమైన అభిరుచిగా మారనుంది. ముఖ్యంగా నాన్–ఇంగ్లీష్ స్పీకింగ్ ఆర్టిస్ట్‌ల సంగీతాన్ని వినాలనుకుంటున్నారు.
ఇక సాంకేతిక ప్రపంచం వైపు తొంగిచూస్తే...
‘న్యూ జెనరేషన్ ఆఫ్ ది ఇంటర్నెట్’గా చెప్పుకునే ‘వెబ్3’ గురించి, వాటి ట్రెండ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ–కృత్రిమ మేధస్సు) అనేది ‘2023’ హెడ్‌లైనింగ్ ట్రెండ్‌గా మారనుంది. కొత్త సంవత్సరంలో ఎన్నో ఏఐ టూల్స్ మార్కెట్‌లోకి రానున్నాయి.
భాషకు సంబంధించి ‘యంత్ర’ వాసన పోగొట్టి సహజత్వాన్ని తీసుకువచ్చే ఏఐ టూల్స్ రాబోతున్నాయి. స్క్రిప్ట్‌లు, వ్యాసాలు రాయనున్నాయి... ఇలాంటి వాటిపై యూత్ ఆసక్తి ప్రదర్శిస్తోంది. 2023ను ‘ఫోల్డబుల్ ఫోన్‌ల సంవత్సరం’ అంటున్నారు. సామ్‌సంగ్ నుంచి వన్‌ప్లస్ వరకు ఎన్నో కంపెనీల నుంచి స్టైలిష్ ఫోల్డబుల్ ఫోన్స్ వస్తున్నాయి. సహజంగానే యూత్ వీటిపై ఆసక్తి కనబరుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment