మళ్లీ..చిందులు! | song Concerts in the pursuit sociopaths activities | Sakshi
Sakshi News home page

మళ్లీ..చిందులు!

Published Mon, Apr 11 2016 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM

మళ్లీ..చిందులు!

మళ్లీ..చిందులు!

పాట కచ్చేరీల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు
యువతుల బతుకులను చిదిమేస్తున్న  ‘మహిళ ’
పాత రోజులను జ్ఞప్తికి తెస్తున్న చిలకలూరిపేట

 
 చిలకలూరిపేట టౌన్:  సమసి పోయిందనుకున్న దురాచారం అధికారదర్పంతో బుసలు కొడుతోంది. నైతికత కలిగిన నాయకులు, నిబద్ధత కలిగిన కొందరు పోలీసు అధికారులు ఎన్నో ఏళ్ల కృషి ఫలితంగా సీసాలో బందీ అయిన వ్యభిచార భూతం ఇప్పుడు బంధనాలు తెంచుకుంటోంది. పాటకచ్చేరీలు, సాంస్కృతిక కార్యక్రమాల ముసుగులో యువతుల జీవితాలను విటుల పాదాల కింద నలిపేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి ఓ మహిళ  కేంద్రబిందువుగా మారడం బాధాకరం.

చీకటి దందా...
ఒకప్పుడు చిలకలూరిపేట పట్టణంలోని రెండు వీధుల్లో వ్యభిచారం కొనసాగేదన్నది బహిరంగ రహస్యం. దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇక్కడి వారు తమ ఊరు పేరు చెప్పుకొనేందుకు కొంత సంకోచించేవారు. ఈ సామాజిక రుగ్మతను రూపుమాపేందుకు ఎందరో చేసిన కృషి ఫలితంగా క్రమంగా అనాచారం అంతరించి పోయింది. ఇటీవల కాలంలో పట్టణంలోని వడ్డెర పాలెం ప్రాంతంలో ఓ మహిళ  తిరునాళ్ల వంటి వేడుకలకు
 
పాటకచ్చేరీలు, సాంస్కృతిక కార్యక్రమాల ముసుగులో డాన్సర్లను ఇక్కడ నుంచి పంపే వ్యాపారానికి తెరతీసింది. పనిలో పనిగా ఖాళీగా ఉన్న సమయాలలో వాళ్లతో వ్యభిచారం చేయిస్తూ అక్రమ సంపాదనకు పాల్పడుతోంది. ఈ వ్యభిచార కూపంలో మగ్గేది మొత్తం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడి వచ్చిన యువతులు కావటం విశేషం.


 గుట్టుచప్పుడు కాకుండా...
అనైతికంగా సాగే ఈ చీకటి వ్యాపారం రాత్రి సమయాల్లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతుంటుంది. నృత్యాలకు వెళ్లే యువతులను వడ్డెరపాలెం ప్రారంభం నుంచి ఓగేరు వాగు వడ్డువరకు ఉన్న తమ వారికి చెందిన గృహాలలో అక్కడక్కడ ఇద్దరి నుంచి నలుగురు చొప్పున ఉంచుతారు. రాత్రి వే ళల్లో సంబంధిత ప్రదేశాలలో వీధి దీపాలు వెలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అదే సమయాలలో కొంతమంది వ్యక్తులు పోలీసు దాడులు జరగకుండా వీధి ఆరంభంలోనే కాపలా ఉంటారు.

అటుగా పోలీసు వాహనాలు వస్తే వెంటనే సెల్ ఫోన్లద్వారా సమాచారం చేరిపోతుంది. రాత్రివేళ తమ ఇళ్ల ముందు ఎవరో గుర్తుతెలియని వ్యక్తుల వాహనాలు, కార్లు వచ్చి ఆగటం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తే వారిపై మూకుమ్మడిగా గొడవకు దిగుతారు. అంగబలం, అర్ధబలం ఉన్న వీరిని ఎదిరించేందుకు ధైర్యం లేక, గొడవలు పడలేక చీకటి కార్యకలాపాలకు మూగసాక్షులుగా మిగలడం స్థానికుల వంతైంది. అంతరించి పోయిందనుకున్న విష సంస్కృతి కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం కొత్త రూపు దాల్చటం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పోలీస్ అధికారులు ఈ మొత్తం వ్యవహారంపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.
 
 ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటాం..
పట్టణంలో చీకటి దందా గురించి అర్బన్ సీఐ బి. సురేష్‌బాబును వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని తెలిపారు. వ్యభిచారం జరుగుతున్నట్లు ఎవరైనా స్థానికులు ఫిర్యాదు చేస్తే నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమస్యపై దృష్టి సారిస్తామన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement