
సినిమాకు ప్లస్ అయ్యే పాటను ‘కోటి రూపాయల పాట’ అనడం మనకు తెలుసు. మాటలకే పరిమితమైన ఈ విశేషణాన్ని తన పాటలతో నిజం చేసింది గీతా రబరి. ‘కచ్ కోయిల’గా పేరుగాంచిన గీత కచ్ (గుజరాత్) జిల్లాలోని రాపర్ పట్టణంలో ఒక రాత్రి మొత్తం పాటల కచేరి నిర్వహించింది. భజనల నుంచి జానపదాల వరకు ఎన్నో పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
ఆమె పాటలకు మైమరచిపోయిన ప్రేక్షకులు నోట్లు వెదజల్లుతూనే ఉన్నారు. కార్యక్రమం పూర్తయ్యేసరికి అలా వచ్చి చేరిన నోట్ల విలువ నాలుగు కోట్ల పై మాటే. గీతపై నోట్ల వర్షం కురిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కచ్ జిల్లాలోని ఒక గ్రామంలో పుట్టిన గీత అయిదవ తరగతి నుంచే భజనలు, జానపదాలు పాడేది. ‘రోమా సేర్‌మా’ పాటతో జిల్లావ్యాప్తంగా పేరు తెచ్చుకుంది.