అవతరణ సంబురం
► రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
► నేడు పల్లె పల్లెన ‘ప్రత్యేక’ సంబరాల నిర్వహణ
► ప్రారంభించనున్న మంత్రి ఈటల
తెలంగాణ అవతరణ వేడుకలకు జిల్లా ముస్తాబైంది. రాష్ర్ట ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేం దుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, తెలంగాణ తల్లి విగ్రహాలు, అమరవీరుల స్థూపా లను విద్యుద్దీపాలతో అలంకరిం చారు. గురువారం ఉదయం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో రాష్ర్ట ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనం తరం సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. - కరీంనగర్ కల్చరల్
ముకరంపుర: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రెండేళ్లు పూర్తయ్యాయి. అధికారిక ప్రకటన వెలువడిన ఉద్విగ్న క్షణాలు.. హర్షాతిరేకాలు.. రెండేళ్ల పాలన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అట్టహాసంగా తెలంగాణ అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలో ఉత్సవాలు మరింత హోరెత్తించనున్నాయి. అందుకు పరేడ్ గ్రౌండ్ వేదిక కానుంది. కలెక్టర్, ఎస్పీ ఆహ్వానితులుగా వ్యవహరించనుండగా.. వేడుకలను రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించనున్నారు. జిల్లాలో ఎటు చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తోంది.
జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో మహిళా సంఘాలతో అమరవీరుల సంస్మరణార్థం బుధవారం కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్తు దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన కూడళ్లను దీపాలంకరణ, స్వాగత తోరణాలతో మిరుమిట్లుగొలిపేలా తీర్చిదిద్దారు. అమరవీరుల స్థూపాలన్నింటికీ మరమ్మతుతో ముస్తాబు చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని పరేడ్‌గ్రౌండ్‌లో మంత్రి ఈటల రాజేందర్ పరేడ్ గ్రౌండ్‌లో ఉదయం 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. అంతకుముందు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించనున్నారు.
పోలీసుల వందనస్వీకారం అనంతరం మంత్రి సందేశమిస్తారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు, కవులు, కళాకారులు, కవులు, రచయితలు, అధికారులు, జర్నలిస్టులతో పాటు అన్ని రంగాల్లో సమాజానికి విశిష్ట సేవలందిస్తున్న వారిని జిల్లా స్థాయిలో 25 మందిని సత్కరించనున్నారు. వీరికి రూ. 51 వేల నగదుతో పాటు శాలువాతో మంత్రి ఈటల రాజేందర్ సన్మానించనున్నారు. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆస్తుల పంపిణీ కార్యక్రమాలుంటాయి.
రక్తదానాలు, అనాథలు, వృద్ధులకు బట్టలు, పండ్ల పంపిణీ, సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులు, వృద్ధాశ్రమాల్లో మాంసాహార భోజనం, సాయంత్రం కవి సమ్మేళనం, ముషాయిరా, సాంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.