కీర్తి పతాక...సంబురం | telenagana formation day | Sakshi
Sakshi News home page

కీర్తి పతాక...సంబురం

Published Fri, Jun 3 2016 12:41 AM | Last Updated on Mon, Sep 4 2017 1:30 AM

కీర్తి పతాక...సంబురం

కీర్తి పతాక...సంబురం

జనసాగరం..

 

కన్నుల పండువగా తెలంగాణ ఆవిర్భావోత్సవం
నగరం నలుదిశలా  మువ్వన్నెల రెపరెపలు
హోరెత్తిన తెలంగాణ నినాదాలు 
ఆట, పాటలు..సాంస్కృతిక కార్యక్రమాలు
నోరూరించిన  తెలంగాణ రుచులు

 

సిటీబ్యూరో: తెలంగాణ ఆవిర్భావ ఉత్సవం అంబరాన్నంటింది. మువ్వన్నెల జెండా ఎగిసింది. మహానగరం మురిసింది. జై తెలంగాణ నినాదం  హోరెత్తింది. మదినిండా అమరుల జ్ఞాపకాలను నింపుకొని, సాధించుకొన్న కలల తెలంగాణను స్మరించుకొని జనం ఘనంగా వేడుకలు చేసుకున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో తెలంగాణ అవతరణ ద్వితీయ వేడుకలు గురువారం కన్నుల పండువగా జరిగాయి. వందలాదిగా తరలి వచ్చిన తెలంగాణ జానపద, గిరిజన కళాకారులు, వివిధ రకాల కళాప్రదర్శనలు బతుకమ్మలతో సాగిన  భారీ ఊరేగింపుతో ట్యాంక్‌బండ్ తెలంగాణ కల్చరల్ కార్నివాల్‌కు వేదికైంది. ఒకవైపు అద్భుతంగా సాగిన  కళా,సాంస్కృతిక ప్రదర్శనలు, మరోవైపు ఆకాశంలో హరివిల్లులను ఆవిష్కరిస్తూ వెలుగులు విరజిమ్మిన తారాజువ్వలు, తరలి వచ్చిన అతిరథమహారధులు, నింగినంటిన ఆనందోత్సాహాలతో హుస్సేన్‌సాగర్ పోటెత్తింది. రంగురంగుల విద్యుద్దీపాలతో మహానగరం సరికొత్త అందాలను సంతరించుకొంది. నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్, రవీంద్రభారతి, హరిహరకళాభవన్, సచివాలయం,అసెంబ్లీభవనం, నింగినంటే జాతీయ జెండాకు వేదికైన సంజీవయ్యపార్కు, ఎన్టీఆర్, లుంబినీ, ఇందిరాపార్కు, శిల్పారామం తదితర ఉద్యానవ నాలు, కళల లోగిళ్లు, సాంస్కృతిక కేంద్రాలలో సంబురాలు అంబరాన్నంటాయి. గన్‌పార్కు వద్ద, సికింద్రాబాద్ క్లాక్‌టవర్ వద్ద అమరుల స్థూపాలకు నివాళులర్పించారు. పలుచోట్ల  ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు,  తెలంగాణ ఆట, పాటలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. పీపుల్స్‌ప్లాజా తదితర ప్రాంతాల్లో  ఏర్పాటు చేసిన నోరూరించే వివిధ రకాల తెలంగాణ ప్రత్యేక వంటకాలు ప్రతి ఒక్కరిని కట్టిపడేశాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లోనూ  రాష్ర్ట అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

     
జీహెచ్‌ఎంసీలో జరిగిన వేడుకల్లో నగర మేయర్ బొంతు రామ్మోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచశ్రేణి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఖైరతాబాద్ రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో  సంయుక్త రవాణా కమిషనర్లు వెంకటేశ్వర్లు, రఘునాథ్, ఆర్టీఓ జీపీఎన్ ప్రసాద్, సామ్యూల్‌పాల్ తదితరులు జాతీయ జెండాను ఆవిష్కరించి వాహనదారులకు, సిబ్బందికి మిఠాయిలు పంచారు. 100 మందికి పైగా అనాథ పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు.

     
జలమండలి ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఎండీ దానకిషోర్, ఇతర ఉన్నతాధికారులు  పాల్గొన్నారు. ఘనంగా అవతరణ వేడుకలు జరిగాయి.హైదరాబాద్ మెట్రో రైల్ కార్యాలయంలో ఎండీ ఎన్‌వీఎస్‌రెడ్డి  జాతీయ జెండాను ఆవిష్కరించారు.  ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లోనూ, జూబ్లీ, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లలోనూ  ఘనంగా వేడుకలు జరిగాయి. ఆర్టీసీ జేఎండీ  రమణ రావు, ఈడీలు పురుషోత్తమ్, నాగరాజు, అధికారులు, సిబ్బంది, కార్మికులు పెద్ద సంఖ్యలో  పాల్గొన్నారు. కలెక్టరేట్, హెచ్‌ఎండీఏ, విద్యుత్తు తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో, నగరంలోని ప్రధాన కూడళ్లలో  జాతీయ జెండాను ఆవిష్కరించి  వేడుకలు చేసుకున్నారు.

 
సాంస్కృతికోత్సాహం....

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కతిక శాఖ ఆధ్వర్యంలో  పబ్లిక్‌గార్డెన్స్ లలితకళాతోరణంలో  ఏర్పాటు చేసిన డప్పు, డోళ్ల  దరువు ప్రదర్శన, 200 మందికి పైగా కళాకారులతో సాగిన పేరిణి నృత్య మహా ప్రదర్శన అద్భుతంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని సమున్నతంగా ఆవిష్కరించాయి.

     
రవీంద్రభారతిలో  ఏర్పాటు చేసిన తెలంగాణ గీత రచయితల ప్రత్యేక సంగీత విభావరి, అర్ధనారీశ్వరం నృత్య ప్రదర్శన,  ‘నా తెలంగాణ -కోటి రతనాల వీణ’ నృత్యరూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నృత్య రూపక ప్రదర్శనలో ఇందిరాపరాశరం బృందం తమ కళా నైపుణ్యాన్ని ఎంతో అద్భుతంగా  చాటారు. అలాగే ఎస్.శరత్ బృందం ప్రదర్శించిన ‘అమరవీరులకు జై బోలో’  ప్రదర్శన సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

     
రసమయి బాలకిషన్ నేతృత్వంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పబ్లిక్‌గార్డెన్, తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన కవి సమ్మేళనంలో 45 మంది కవులు తమ కవితా గానం చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యంపై కవులు తమ కవిత్వాన్ని వినిపించారు.  సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో సిక్కు సోదరుల కళా ప్రదర్శనలు, క్రైస్తవ సోదరుల సాంస్కృతిక కార్యక్రమాలు, బషీర్‌బాగ్ ఎల్‌బీస్టేడియంలో ప్రముఖ గజల్ గాయకుడు తలత్ అజీజ్ గానం చేసిన ‘షామ్-ఎ.గజల్’ అందరినీ ఆకట్టుకున్నాయి. ఉర్దూ, మోతీగల్లీ ఖిల్వత్‌లో గుల్బర్గా బృందం ఖవ్వాలీ ప్రదర్శన విశే షంగా ఆకట్టుకుంది. కులీఖుతుబ్‌షా స్టేడియంలో నిర్వహించిన ఆల్ ఇండియా ముషాయిరాలో (ఉర్దూ కవి సమ్మేళనంలో) వివిధ ప్రాంతాలకు చెందిన కవులు  పాల్గొన్నారు.

 
సిండికేట్ బ్యాంకు కార్యాలయంలో...
మాసబ్‌ట్యాంక్ : నగరంలోని సిండికేట్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. సిండికేట్ బ్యాంక్ అన్ని శాఖల్లో ఉద్యోగులు మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిండికేట్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ఎప్‌పీ శర్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అభివృద్ది వైపు పరుగులు తీస్తుందన్నారు. అన్ని రకాల వనరులు, సౌకర్యాలు ఉన్న తెలంగాణ బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిండికేట్ రీజనల్ ఆఫీస్ (రూరల్) రీజనల్ మేనేజర్ శీలం గిరితో పాటు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement