Tribal artists
-
ఆదివాసీ కళకు ఆయువు పోసినవాడు!
ఆదివాసీ ‘గుస్సాడి’ నృత్యాన్ని అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేసిన కనకరాజు ‘అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం’ (అక్టోబర్ 25) నాడు తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహించి మొత్తం తెలంగాణ ఆదివాసీలకు గర్వకారణమైన ఆయన సేవలను ఒకసారి మననం చేసుకోవడం మన విధి. కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మార్ల వాయి గ్రామానికి చెందిన కనకరాజు 1941లో జన్మించారు. చిన్నతనం నుంచే ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు అంటే మక్కువ. ఆ క్రమంలోనే గుస్సాడి నృత్యకళపై అభిరుచిని పెంచుకున్నారు. పశువులను మేపడానికి అడవిలోకి పోయిన సందర్భంలో భుజం మీద కట్టెపుల్లను పెట్టుకొని టిక్కుటిక్కుమని శబ్దం చేసుకుంటూ తనే స్వతహాగా గుస్సాడి సాధన చేసేవారు. నిరక్షరాస్యుడైన కనకరాజు బతుకుదెరువు కోసం మార్లవాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో దినసరి కూలీగా పనిచేస్తూనే... ఊరూరా తిరు గుతూ గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించారు. అంత రించిపోతున్న కళను బతికించారు. ఏటా దీపావళికి వారం రోజుల ముందు నుండే గోండు ప్రాంతా లలో దండారి పండుగ మొదలవుతుంది. ఈ పండుగ వారికి చాలా పవిత్రం. గ్రామదేవతల శుభప్రద ఆశీస్సులను ఇతర గ్రామస్థులకు అందించే ధన్యజీవులు గుస్సాడీలు. వారు పొలికేక పెట్టి నాట్యం ఆపిన అనంతరమే వచ్చినవారికి ఆహ్వానాలు, పలకరింపులు మొదలవుతాయి. గుస్సాడీల చేతులలోని రోకళ్లను శంభు మహా దేవుని త్రిశూలంగా భావించి అభిషేకం చేస్తారు. గుస్సాడీలను శివుని ప్రతిరూపాలుగా భావించి వారి వస్తువులు, సంగీత పరిక రాలను (ఎత్మసూర్ పెన్) పూజిస్తారు. అందరూ కలసి గుస్సాడి నృత్యం చేస్తారు. తరువాత అతిథులకు భోజనం వడ్డిస్తారు. దండారీలో గుస్సాడీలు, పోరిక్‌లు ప్రముఖ పాత్ర వహిస్తారు. నెత్తి మీద నెమలి ఈకలు, పెద్ద టోపీ లతో ముఖానికి, ఒంటికి రంగులతో మెడ నిండా పూసల దండలు, కాళ్లకు గజ్జెలు, చేతిలో గంగారాం సోటితో గంతులు వేసుకుంటూ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ కళ అంతరించి పోకూడదనే ఉద్దేశంతో అప్పటి ఐఏఎస్ అధికారి మడావి తుకారాం ప్రత్యేక చొరవ తీసుకుని కనకరాజును ప్రోత్సహించారు. దీంతో కనకరాజు శిక్షకుడిగా మారి 150 మందికి ఐదు రకాల దరువులతో కూడిన డప్పు సహాయంతో శిక్షణ ఇచ్చారు. 1976 నుండి వరుసగా ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవా లలో ప్రదర్శనలు ఇప్పించారు.1981లో ప్రధాని ఇందిరాగాంధీ ముందు గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించారు. 2014లో ఎర్ర కోటలో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ముందు ప్రదర్శించారు. కొన్ని సినిమాలలో కూడా ఈ కళను ప్రదర్శించారు. కనకరాజు గుస్సాడి నృత్యానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2021లో కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ‘పద్మశ్రీ’ని ఇచ్చి గౌరవించింది. ఎనిమిది పదుల వయసు దాటినా, గుస్సాడిని బతికించడానికి మరో 30 మందికి శిక్షణనిచ్చారు. గుస్సాడి కళను వెలుగులోకి తెచ్చిన సామాన్యుడైన కనకరాజు ఈనాటి కళాభిమానులకు ఆదర్శప్రాయుడు. కనకరాజుకు నివాళిగా ఆయన శిష్యులు మరింతగా ఈ కళను ప్రపంచవ్యాప్తం చేస్తారని ఆశిద్దాం.– గుమ్మడి లక్ష్మినారాయణ,ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి, తెలంగాణ ‘ 94913 18409 -
Fashion: ట్రైబల్ హార్ట్.. ‘పోర్గై’ కళ.. ఎంబ్రాయిడరీతో మంచి ఆదాయం!
అడవి బిడ్డల మనసు ఎంత స్వచ్ఛమైనదో వారి కళారూపాలు మన కళ్లకు కడతాయి. వాటిలో గిరి తరుణుల చేత రూపుదిద్దుకున్న ఎంబ్రాయిడరీ వర్క్ ఇప్పుడు ఫ్యాషన్‌లో భాగమైంది.ఇంటి అలంకరణలో అద్దమై వెలుగుతోంది. ఆధునిక దుస్తుల మీద అందంగా అమరిపోతోంది. అంతరించిపోతున్న సంప్రదాయ లంబాడీ ఎంబ్రాయిడరీని పునరుద్ధరించి సమకాలీన శైలులకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు ‘పోర్గై’ కళాకారులు. మోడర్న్ డ్రెస్సులు, సంప్రదాయ చీరలు.. ఏవైనా ట్రైబల్ ఆర్ట్ ఫామ్ ఒక్కటైనా ఉండాలనుకుంటున్నారు నాగరీకులు. దీంట్లో భాగంగా ఇటీవల తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ‘పోర్గై’ కళ ఆకట్టుకుంది. తమిళనాడులోని ధర్మపురి జిల్లా సిత్లింగి వ్యాలీలో ఈ గిరిజనుల సంప్రదాయ ఎంబ్రాయిడరీ వినూత్నంగా మెరుస్తోంది. ∙∙ అంతరించిపోతున్న లంబాడీ ఎంబ్రాయిడరీని మహిళల బృందం పునరుద్ధరించింది. ‘మా కళ మాకు ఎంతో గర్వం’ అని చాటేలా దాదాపు 60 మంది లంబాడీ మహిళలు ఒక సంస్థగా ఏర్పడి దుస్తులు, గృహాలంకరణలో ప్రత్యేకతను చూపుతున్నారు. డిజైన్, నైపుణ్యం, కొత్తకళాకారులకు శిక్షణ, మార్కెటింగ్–ఆన్లైన్ సపోర్ట్, ఎగ్జిబిషన్లలో పాల్గొనడం వంటివి విస్తృతంగా జరుగుతున్నాయి. ∙∙ దాదాపు రెండు దశాబ్దాల క్రితం అక్కడి గ్రామంలోకి వచ్చిన వైద్యులు డాక్టర్ లలిత రేగి దంపతులు ఈ కళ ద్వారా గిరి పుత్రికలకు ఉపాధి లభించాలని కోరుకున్నారు. ఆరోగ్యసంరక్షణతో పాటు కళను బతికించే ప్రయత్నం చేశారు. దీంట్లో భాగంగా ‘పోర్గై’ అనే స్వచ్ఛంధ సంస్థను నెలకొల్పి కళాకారులకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేశారు. గతంలో వ్యవసాయ కూలీలుగా ఉండే మహిళలు ఈ ఎంబ్రాయిడరీ కళ ద్వారా ఒక్కటై మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. విదేశాలకు కూడా ఈ కళాకారుల చేతిలో రూపుదిద్దుకున్న ఎంబ్రాయిడరీ దుస్తులు, గృహాలంకరణ వస్తువులు ఎగుమతి చేస్తున్నారు. ∙∙ బెంగళూరు, ఢిల్లీ, ముంబై నుండి ఫ్యాషన్ డిజైనింగ్ పాఠశాలల కొంతమంది విద్యార్థులు ‘పోర్గై’ కళను తెలుసుకోవడానికి, డిజైన్లను మెరుగు పరచడానికి గిరిజన మహిళలతో కలిసి పనిచేస్తున్నారు. చదవండి: మోదీకి యాదమ్మ మెనూ -
ఆది ధ్వనికి... ఆతిథ్యం
సాక్షి, హైదరాబాద్: ఆదివాసి నగరా, గోండుతుడుం, కోయ డోలు,బుర్ర వీణ,మట్టి ఢంకా,అదివాసి మద్దెల ఇంకా చెక్క చెమిడికలు.. ఇలా ఒకటా..రెండా ఏకంగా అరుదైన 124 గిరిజన సంగీత వాయిద్యాలన్నీ ఒకే చోట దర్శనమివ్వను న్నాయి. వందల ఏళ్ల గోండు గూడేలు,ఆదివాసి పల్లెలకు సంగీత ఆహ్లాదం పంచి క్రమంగా కనుమరుగవుతున్న వాయిద్యాలన్నీ 9వ తేదీ నుంచి మాదాపూర్‌లోని స్టేట్‌ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించనున్నారు. తెలంగాణ ఆది ధ్వని వేదిక ఆధ్వర్యంలో 13వ తేదీ వరకు సాగే ప్రదర్శనలో కనుమరుగైన అనేక సంగీత వాయిద్య పరికరాలను ప్రదర్శనగా ఉంచుతారు. పరికరాలతో ఆదివాసి కిన్నెర,బుర్రవీణ, రుంజ తదితర ఎనిమిది రకాల వాయిద్యాలను సైతం ప్రదర్శించే కళాకారులు ఈ వేదికపై పాలుపంచుకోనున్నారు. ఈ విషయమై నిర్వాహకులు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు ‘సాక్షి’ తో మాట్లాడుతూ ఆదిలాబాద్,ఖమ్మం, బస్తర్ జిల్లాల్లో వినియోగించిన సంగీత పరికరాలన్నీ ప్రదర్శనలో ఉంచుతామని తెలిపారు. దేశంలో అతిపెద్ద గిరిజన సంగీత ప్రదర్శన దీన్ని పేర్కొనవచ్చని జయధీర్ చెప్పారు. -
కీర్తి పతాక...సంబురం
జనసాగరం.. కన్నుల పండువగా తెలంగాణ ఆవిర్భావోత్సవం నగరం నలుదిశలా మువ్వన్నెల రెపరెపలు హోరెత్తిన తెలంగాణ నినాదాలు ఆట, పాటలు..సాంస్కృతిక కార్యక్రమాలు నోరూరించిన తెలంగాణ రుచులు సిటీబ్యూరో: తెలంగాణ ఆవిర్భావ ఉత్సవం అంబరాన్నంటింది. మువ్వన్నెల జెండా ఎగిసింది. మహానగరం మురిసింది. జై తెలంగాణ నినాదం హోరెత్తింది. మదినిండా అమరుల జ్ఞాపకాలను నింపుకొని, సాధించుకొన్న కలల తెలంగాణను స్మరించుకొని జనం ఘనంగా వేడుకలు చేసుకున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో తెలంగాణ అవతరణ ద్వితీయ వేడుకలు గురువారం కన్నుల పండువగా జరిగాయి. వందలాదిగా తరలి వచ్చిన తెలంగాణ జానపద, గిరిజన కళాకారులు, వివిధ రకాల కళాప్రదర్శనలు బతుకమ్మలతో సాగిన భారీ ఊరేగింపుతో ట్యాంక్‌బండ్ తెలంగాణ కల్చరల్ కార్నివాల్‌కు వేదికైంది. ఒకవైపు అద్భుతంగా సాగిన కళా,సాంస్కృతిక ప్రదర్శనలు, మరోవైపు ఆకాశంలో హరివిల్లులను ఆవిష్కరిస్తూ వెలుగులు విరజిమ్మిన తారాజువ్వలు, తరలి వచ్చిన అతిరథమహారధులు, నింగినంటిన ఆనందోత్సాహాలతో హుస్సేన్‌సాగర్ పోటెత్తింది. రంగురంగుల విద్యుద్దీపాలతో మహానగరం సరికొత్త అందాలను సంతరించుకొంది. నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్, రవీంద్రభారతి, హరిహరకళాభవన్, సచివాలయం,అసెంబ్లీభవనం, నింగినంటే జాతీయ జెండాకు వేదికైన సంజీవయ్యపార్కు, ఎన్టీఆర్, లుంబినీ, ఇందిరాపార్కు, శిల్పారామం తదితర ఉద్యానవ నాలు, కళల లోగిళ్లు, సాంస్కృతిక కేంద్రాలలో సంబురాలు అంబరాన్నంటాయి. గన్‌పార్కు వద్ద, సికింద్రాబాద్ క్లాక్‌టవర్ వద్ద అమరుల స్థూపాలకు నివాళులర్పించారు. పలుచోట్ల ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ ఆట, పాటలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. పీపుల్స్‌ప్లాజా తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నోరూరించే వివిధ రకాల తెలంగాణ ప్రత్యేక వంటకాలు ప్రతి ఒక్కరిని కట్టిపడేశాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లోనూ రాష్ర్ట అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీహెచ్ఎంసీలో జరిగిన వేడుకల్లో నగర మేయర్ బొంతు రామ్మోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచశ్రేణి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఖైరతాబాద్ రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో సంయుక్త రవాణా కమిషనర్లు వెంకటేశ్వర్లు, రఘునాథ్, ఆర్టీఓ జీపీఎన్ ప్రసాద్, సామ్యూల్‌పాల్ తదితరులు జాతీయ జెండాను ఆవిష్కరించి వాహనదారులకు, సిబ్బందికి మిఠాయిలు పంచారు. 100 మందికి పైగా అనాథ పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. జలమండలి ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఎండీ దానకిషోర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఘనంగా అవతరణ వేడుకలు జరిగాయి.హైదరాబాద్ మెట్రో రైల్ కార్యాలయంలో ఎండీ ఎన్వీఎస్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్భవన్లోనూ, జూబ్లీ, మహాత్మాగాంధీ బస్స్టేషన్లలోనూ ఘనంగా వేడుకలు జరిగాయి. ఆర్టీసీ జేఎండీ రమణ రావు, ఈడీలు పురుషోత్తమ్, నాగరాజు, అధికారులు, సిబ్బంది, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలెక్టరేట్, హెచ్ఎండీఏ, విద్యుత్తు తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో, నగరంలోని ప్రధాన కూడళ్లలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు చేసుకున్నారు. సాంస్కృతికోత్సాహం.... తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కతిక శాఖ ఆధ్వర్యంలో పబ్లిక్‌గార్డెన్స్ లలితకళాతోరణంలో ఏర్పాటు చేసిన డప్పు, డోళ్ల దరువు ప్రదర్శన, 200 మందికి పైగా కళాకారులతో సాగిన పేరిణి నృత్య మహా ప్రదర్శన అద్భుతంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని సమున్నతంగా ఆవిష్కరించాయి. రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన తెలంగాణ గీత రచయితల ప్రత్యేక సంగీత విభావరి, అర్ధనారీశ్వరం నృత్య ప్రదర్శన, ‘నా తెలంగాణ -కోటి రతనాల వీణ’ నృత్యరూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నృత్య రూపక ప్రదర్శనలో ఇందిరాపరాశరం బృందం తమ కళా నైపుణ్యాన్ని ఎంతో అద్భుతంగా చాటారు. అలాగే ఎస్.శరత్ బృందం ప్రదర్శించిన ‘అమరవీరులకు జై బోలో’ ప్రదర్శన సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రసమయి బాలకిషన్ నేతృత్వంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పబ్లిక్‌గార్డెన్, తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన కవి సమ్మేళనంలో 45 మంది కవులు తమ కవితా గానం చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యంపై కవులు తమ కవిత్వాన్ని వినిపించారు. సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో సిక్కు సోదరుల కళా ప్రదర్శనలు, క్రైస్తవ సోదరుల సాంస్కృతిక కార్యక్రమాలు, బషీర్‌బాగ్ ఎల్బీస్టేడియంలో ప్రముఖ గజల్ గాయకుడు తలత్ అజీజ్ గానం చేసిన ‘షామ్-ఎ.గజల్’ అందరినీ ఆకట్టుకున్నాయి. ఉర్దూ, మోతీగల్లీ ఖిల్వత్లో గుల్బర్గా బృందం ఖవ్వాలీ ప్రదర్శన విశే షంగా ఆకట్టుకుంది. కులీఖుతుబ్షా స్టేడియంలో నిర్వహించిన ఆల్ ఇండియా ముషాయిరాలో (ఉర్దూ కవి సమ్మేళనంలో) వివిధ ప్రాంతాలకు చెందిన కవులు పాల్గొన్నారు. సిండికేట్ బ్యాంకు కార్యాలయంలో... మాసబ్‌ట్యాంక్ : నగరంలోని సిండికేట్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. సిండికేట్ బ్యాంక్ అన్ని శాఖల్లో ఉద్యోగులు మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిండికేట్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ఎప్పీ శర్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అభివృద్ది వైపు పరుగులు తీస్తుందన్నారు. అన్ని రకాల వనరులు, సౌకర్యాలు ఉన్న తెలంగాణ బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిండికేట్ రీజనల్ ఆఫీస్ (రూరల్) రీజనల్ మేనేజర్ శీలం గిరితో పాటు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.