=ప్రతిభను వెలికి తీసేందుకు యువజనోత్సవాలు దోహదం
=హైకోర్టు జడ్జి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి
కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని హైకోర్టు జడ్జి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి అన్నారు. 29వ అంతర్ యూనివర్సిటీ సెంట్రల్ జోన్ యువజనోత్సవాలను సోమవారం రాత్రి కాకతీయ యూనివర్సిటీలోని నూతన ఆడిటోరియంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువశక్తి ఎంతో గొప్పదని, వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
దేశంలోని పలువురు శాస్త్రవేత్తలను ఉటంకిస్తూ వారు కొనుగొన్న సిద్ధాంతాలను విద్యార్థులకు వివరించారు. అలాగే వందేమాతరం గొప్పదనం గురించి తెలిపారు. కాకతీయుల సంస్కృతీసంప్రదాయాలతోపాటు వారి సాంకేతిక పరిజ్ఞానం కూడా ఎంతోగొప్పదని కొనియాడారు. శతాబ్దాల క్రితం నిర్మించిన కట్టడాలు, దేవాలయాలు, నీటిపారుదల వ్యవస్థ వారి దూరదృష్టికి నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. ప్రతిభను వెలికి తీసేందుకు యువజనోత్సవాలు దోహదం చేస్తాయని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి ఆడిటోరియం మరెక్కడా లేదు
సభకు అధ్యక్షత వహించిన కేయూ వీసీ ప్రొఫెసర్ బి.వెంకటరత్నం మాట్లాడుతూ సెంట్రల్‌జోన్ యూత్ ఫెస్టివల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కొన్ని రోజులుగా కృషి జరుగుతోందన్నారు. కేయూలో నూతంగా నిర్మించిన ఆడిటోరియం లాంటిది ఈ రీజియన్‌లో మరొకటి లేదన్నారు. యువజనోత్సవాలను విజయవంతం చేసేందుకు అందరి సహాకారంతో ముందుకెళ్తున్నామన్నారు. ఈ నూతన ఆడిటోరియంలో రాబోయే నంది అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఐదు రోజులపాటు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మహిళల భద్రతకు పోలీసుల సహాకారం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో యువత ఎక్కువగాఉందన్నారు. యువజనోత్సవాల కల్చర్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ జి.దామోదర్ మాట్లాడుతూ కేయూలో సెంట్రల్‌జోన్ యూత్ ఫెస్టివల్‌కు మొదటిరోజు 19 యూనివర్సిటీల నుంచి 800మందికిపైగా విద్యార్థులు వచ్చారని తెలిపారు. 25 ఈవెంట్‌లలో ఉత్సవాలు జరుగుతాయని, దీనికోసం నాలుగు వేదికలను సిద్ధం చేశామన్నారు.షెడ్యూల్ ప్రకారం మంగళవారం నుంచి పోటీలు కొనసాగుతాయన్నారు.
ప్రముఖ మిమిక్రీ కళాకారుడు పద్మశ్రీ డాక్టర్ నేరళ్ల వేణుమాధవ్ మాట్లాడుతూ మిమ్రిక్రీ ప్రాముఖ్యతను వివరిస్తూనే మిమిక్రీ చేసి అకట్టుకున్నారు. సభలో క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రామస్వామి, ప్రొఫెసర్ కె.దామోదర్‌రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాధికారాణి మాట్లాడారు. కాగా హైకోర్టు జడ్జి నర్సింహారెడ్డిని ఇతర అతిథులను కేయూ వీసీ ప్రొఫెసర్ బి.వెంకటరత్నం, రిజిస్ట్రార్ సాయిలు శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు. అనంతరం కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.
ఉత్సాహంగా యువజనోత్సవాలు
కాకతీయ యూనివర్సిటీలో యువకళారత్నం-2013 సెంట్రల్‌జోన్ యూనివర్సిటీల యువజనోత్సవాలు సోమవారం రాత్రి ఆడిటోరియంలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 22వరకు జరిగే ఈ ఉత్సవాలకు ఆరు రాష్ట్రాల నుంచి తొలిరోజు 19 యూనివర్సిటీల విద్యార్థులు హాజరయ్యారు. అనంతరం విద్యార్థులందరూ తమ సంస్కృతిసంప్రదాయలను ప్రతిబింబించే వేషధారణలతో పబ్లిక్ గార్డెన్‌కు చేరుకుని నృత్యాలతో అలరించారు. పబ్లిక్ గార్డెన్ నుంచి సాయంత్రం శోభయాత్రను కేయూ వీసీ ప్రొఫెసర్ బి.వెంకటరత్నం జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్‌హెడ్ కార్వర్టర్స్, న యీననగర్ మీదుగా దూరవిద్యాకేంద్రం క్రాస్ రోడ్డు నుంచి క్యాంపస్‌లోని నూతన ఆడిటోరియం వరకు శోభాయాత్ర కొనసాగింది.
ఈవెంట్లు ఇవే..
క్లాసికల్ ఓకల్( హిందుస్తానీ, కర్ణాటక ), క్లాసికల్ ఇన్‌స్ట్రుమెంటల్ సోలో, క్విజ్, ఫోక్, ఆర్కెస్ట్రా, మిమిక్రీ, స్కిట్, స్పాట్ పెయింటింగ్, స్పాట్ ఫోటోగ్రఫీ, కాలేజ్ ఇన్‌స్టాలేషన్, పోస్టర్ మేకింగ్, క్లే మోడలింగ్, కార్టూనింగ్, రంగోళి, గ్రూప్‌డ్యాన్స్‌లు, ఫోక్, ట్రైబల్ డ్యాన్స్, వెస్టర్న్ వోకల్, ఎలక్యూషన్,లైట్ ఓకల్ సోలో, ఫోక్ ఆర్కెస్ట్రా, మైమ్, వన్‌యాక్ట్‌ప్లే తదితర అంశాల్లో పోటీలు జరగనున్నాయి.
కిక్కిరిసిన ఆడిటోరియం
కేయూలో సెంట్రల్‌జోన్ యూనివర్సిటీ యువజనోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు నూతన ఆడిటోరియంను ఆగమేఘాల మీద హైదరాబాద్‌లోనే మంత్రి దామోదర రాజనర్సింహతో ప్రారంభింపజేసి సోమవారం రాత్రి ప్రధాన వేదిక గా ఆడిటోరియంలో ఉత్సవాలను ప్రారంభించారు. వివిధ ఈవెంట్‌లలో భాగస్వాములయ్యే విద్యార్థులను తొలుత లోనికి అనుమతించారు.
దీంతోపాస్‌లు లేని విద్యార్థులు కూడా ఆడిటోరియంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పలువురు పాత్రికేయలను కూడా అనుమతించకపోవడంతో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో తర్వాత అనుమతించారు. ఉత్సవాలను తిలకించేందుకు వచ్చిన వందలాదిమంది విద్యార్థులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యూనివర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారు.
చివరకు చేసేది లేక లోపలికి అనుమతించిన సీట్లు నిండిపోవడంతో నిలబడే ఉపన్యాసాలు విన్నారు. ఇంకొందరు బయట ఏర్పాటు చేసిన స్క్రీన్‌లోనే కార్యక్రమాన్ని వీక్షించారు. యువజనోత్సవాలను నిర్వహించేందుకు 18 కమిటీలను ఏర్పాటుచేశారు. ఉత్సవాలకు సంబంధించిన ఇన్విటేషన్ తమకు అందలేదని కొందరు కేయూ ఉద్యోగులు కార్యక్రమానికి హాజరుకాలేదు.
యువతపైనే దేశ భవిష్యత్
Published Tue, Nov 19 2013 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM
Advertisement
Advertisement