సాక్షి, అమరావతి: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2023లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈసారి పలు మార్పులు చేసింది. కరోనా సమయంలో సడలింపులిచ్చిన అంశాలను పునరుద్ధరించింది. కొన్ని కొత్త సడలింపులను ప్రకటించింది. జేఈఈ మెయిన్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించి ఉండటం సహా పలు నిబంధనలను పెట్టింది.
సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు నిబంధనల ప్రకారం ఎన్‌ఐటీ, ఐఐఐటీ, సీఎఫ్‌ఐటీ తదితర సంస్థల్లో ప్రవేశానికి అభ్యర్థులు జేఈఈలో ఆలిండియా ర్యాంకుతో పాటు ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే ఇంటర్మీడియెట్‌లోని ప్రతి సబ్జెక్టులోనూ అభ్యర్థి నిర్ణీత అర్హత మార్కులను సాధించాలి. అందువల్ల మెయిన్‌కు 75 శాతం మార్కులు తప్పనిసరి చేసింది.
మరికొన్ని నిబంధనలు
జేఈఈ మెయిన్ తొలి దశ పరీక్షలు జనవరి 24 నుంచి 31 వరకు, రెండో దశ ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. తొలి దశ పరీక్షలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. రెండో దశ రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 7న ప్రారంభమవుతాయి. అభ్యర్ధులు రెండు విడతల పరీక్షలకు వేర్వేరుగా దరఖాస్తు చేయాలి. ఒక సెషన్‌కు ఒక్క దరఖాస్తే సమర్పించాలి.
ఒకటికి మించి దరఖాస్తులు ఇస్తే.. ఆ తరువాత ఎప్పుడు దాన్ని గుర్తించినా ఆ అభ్యర్థిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఎన్టీఏ స్పష్టంచేసింది. 2021, 2022 సంవత్సరాల్లో ఇంటర్మీడియెట్, తత్సమాన బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసారి వయోపరిమితిని విధించకుండా బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణతను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటోంది.
అయితే, అడ్మిషన్ల సమయంలో విద్యా సంస్థలు నిర్ణయించే వయోపరిమితి నిబంధనలను అభ్యర్థులు అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే డ్రాపర్ల (గత ఏడాది మెయిన్‌లో ఫెయిలై, మళ్లీ ఈ ఏడాది రాసే వారు, ఇంటర్మీడియెట్ పూర్తి చేసి కొన్ని సంవత్సరాలు వ్యవధి ఇచ్చి జేఈఈకి దరఖాస్తు చేసేవారు)కు వయోపరిమితిని సడలించి వరుసగా మూడుసార్లు మెయిన్‌కు అవకాశం కల్పించింది.
ముందుగానే రిజర్వు తేదీల ప్రకటన
రెండు దశల పరీక్షల తేదీల్లో మార్పులు చేయాల్సి వచ్చినా, ఇతర పరీక్షలకు ఆటంకం లేకుండా కొన్ని రిజర్వు తేదీలను కూడా ఎన్టీఏ ఈసారి ముందుగానే ప్రకటించింది. తొలివిడత పరీక్షలకు ఫిబ్రవరి 1, 2, 3 తేదీలను రిజర్వుగా ప్రకటించింది. రెండో విడతకు ఏప్రిల్ 13, 15 తేదీలను రిజర్వు తేదీలుగా పేర్కొంది.
తగ్గిన పరీక్ష కేంద్రాలు
కరోనా సమయంలో భౌతిక దూరం పాటించడం, ఇతర నిబంధనల కారణంగా మెయిన్ పరీక్షలను ఎక్కువ నగరాల్లో నిర్వహించింది. గత ఏడాది కూడా దేశవ్యాప్తంగా 514 నగరాలు, పట్టణాల్లో నిర్వహించింది. ఈసారి వాటిని 399కు కుదించింది. ఇతర దేశాల్లో పరీక్షల కేంద్రాలు గత ఏడాది 24 కాగా ఈసారి 13కు తగ్గించింది.
రిజిస్ట్రేషన్ల ఫీజు పెంపు
రిజిస్ట్రేషన్ల ఫీజులను కూడా ఎన్టీఏ పెంచింది. జనరల్ కేటగిరీ అభ్యర్థుల ఫీజు రూ.650 నుంచి రూ.1,000కి పెంచింది. మహిళలకు రూ.800 చేసింది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు ఫీజును రూ.325 నుంచి రూ.500కు పెంచింది. ఇతర దేశాల అభ్యర్థుల ఫీజును రూ.3 వేల నుంచి రూ.5 వేలకు, మహిళల ఫీజును రూ.1500 నుంచి రూ.3 వేలకు పెంచింది.
అభ్యర్థులు జేఈఈ మెయిన్ ఆన్‌లైన్ దరఖాస్తులో తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఈమెయిల్, మొబైల్ నంబర్లు తదితర వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలని, లేదంటే రిజిస్ట్రేషన్ పూర్తి కాదని ఎన్టీఏ స్పష్టంచేసింది. ఇదిలా ఉండగా కరోనా పరిస్థితులు సద్దుమణిగినా గతంలోని పరిస్థితుల ప్రభావం ఇంకా ఉన్నందున, ఇంటర్మీడియెట్‌లో 75% మార్కుల నిబంధనను ఈసారి కూడా మినహాయించాలని అభ్యర్థులు కోరుతున్నారు. తొలివిడత సెషన్ పరీక్షలకు వ్యవధి తక్కువగా ఉందని, దీనినీ పునఃపరిశీలన చేయాలని అభ్యర్థిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment