సాక్షి, హైదరాబాద్: గ్లోబరీనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వల్లే ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో పొరపాట్లు చోటు చేసుకున్నాయని, ఆ సంస్థ వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీంతో ఆ సంస్థను కూడా తమ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చా లని అభ్యర్థిస్తూ బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు బుధవారం హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2.15కు ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని ఆయన తరఫు న్యాయవాది దామోదర్‌రెడ్డి హైకోర్టును కోరారు. అది సాధ్యం కాదని స్పష్టం చేసిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం, విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. ఇదే వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలతో కలిపి ఇంప్లీడ్ పిటిషన్‌పై ఆ రోజున విచారణ జరుపుతామంది.
ఇంటర్ పత్రాల మూల్యాంకనం సక్రమంగా జరగకపోవడం వల్లే విద్యా ర్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించడంతోపాటు, బాధ్యులైన అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అచ్యుతరావు ఇటీవల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తమ ముందుంచాలం టూ విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఇందులో భాగంగా బుధవారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా అచ్యుతరావు తరఫు న్యాయవాది గ్లోబరీనా సంస్థను ప్రతివాదిగా చేరుస్తూ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలుకు అనుమతి కోరారు. అనుమతినిచ్చిన ధర్మాసనం అత్యవసర విచారణకు నిరాకరించింది.
ప్రభుత్వ కమిటీ అదే తేల్చింది..
గ్లోబరీనా నిర్లక్ష్యం వల్లే ఇంటర్ పత్రాల మూల్యాంకనంలో పొరపాట్లు జరిగాయని ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చిందని అచ్యుతరావు తన ఇంప్లీడ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇంటర్ పత్రాల మూల్యాంకన కాంట్రాక్ట్‌ను గ్లోబరీనా రూ.4.35 కోట్లకు దక్కించుకుందన్నారు. అయితే ఈ ఒప్పందంపై ఏ సంతకాలు లేవని ప్రభుత్వ కమిటీ తేల్చిందని వివరించారు. పెరిగిన అవసరా లకు అనుగుణంగా తగిన సాంకేతిక, మానవ వనరులు గ్లోబరీనా వద్ద లేవన్నారు. ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో కూడా లోపాలున్నాయని, దీనిపై అనేక మంది ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు. అంతిమంగా అటు బోర్డు, ఇటు గ్లోబరీనా సంస్థల నిర్వాకం వల్ల 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలకు ఆదేశించాలని కోరారు.
గ్లోబరీనా వల్లే సమస్యలు
Published Thu, May 9 2019 2:13 AM | Last Updated on Thu, May 9 2019 2:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment