globarina
-
అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన ఎన్ఎస్యూఐ
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల పై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రానందుకు నిరసనగా శనివారం ఎన్ఎస్యూఐ విద్యార్థి విభాగం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ వెంకట్ బలమూరి మాట్లాడుతూ.. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వారిపై అసెంబ్లీలో క్లారిటీ వస్తుందేమోనని చివరి రోజు వరకు వేచి చూశాం. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే అసెంబ్లీ ముట్టడి నిర్వహించామని పేర్కొన్నారు. రీ కరెక్షన్, రీ వాల్యుయేషన్ పేరుతో విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకున్న ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పుడు మాట మార్చి వారు ఎలాంటి ఫీజులు చెల్లించలేదని ఆరోపణలు చేస్తుంది. కాగా, విద్యార్థులు చెల్లించిన ఫీజులు మొత్తం రూ. కోటిదాకా ఉన్నట్లు మేము ఆర్టీఐ ద్వారా తెలుసుకున్నామని ఆయన తెలిపారు. ఎలాగూ ప్రభుత్వం చనిపోయిన విద్యార్థి కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమైంది, కనీసం విద్యార్థులు చెల్లించిన ఫీజులకు అదనంగా రూ. 2 లేదా 3 కోట్లు జత చేసి వారి కుటుంబాలకు అందజేయాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తప్పుడు ఫలితాలకు కారణమైన గ్లోబరీనా సంస్థ, ఇంటర్మీడియట్ బోర్డుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేసే వరకు ఎన్ఎస్యూఐ పోరాటం కొనసాగుతుందని వెంకట్ వెల్లడించారు. -
గ్లోబరీనా తొలగింపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల ప్రక్రియలో పొరపాట్లు చేసిన గ్లోబరీనా సంస్థను ప్రభుత్వం పక్కన పెట్టింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల ప్రాసెస్ కోసం కొత్త సంస్థను ఎంపిక చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల 25 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆ పరీక్షలకు హాజరయ్యే దాదాపు 3.5 లక్షల మంది విద్యార్థుల ఫలితాలను ప్రాసెస్ చేయాల్సి ఉంది. ఆ పనుల బాధ్యతలను గ్లోబరీనాకు అప్పగిం చకుండా, కొత్త సంస్థకు అప్పగించేందుకు తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ (టీఎస్టీఎస్) ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లను ఆహ్వానించింది. కనీసం 10 లక్షల మంది విద్యార్థుల డాటా ప్రాసెస్ చేసి ఉండాలన్న నిబంధనను అందులో పొందుపరిచింది. అంతేకాకుండా గతంలో 2 ఏళ్లపాటు ఇంటర్ బోర్డులో పనిచేసి ఉండకూడదనే నిబంధన కూడా విధించింది. దీంతో గ్లోబరీనా సంస్థ ఈ టెండర్లలో పాల్గొనే అవకాశం కోల్పోయింది. -
గ్లోబరీనా వల్లే సమస్యలు
సాక్షి, హైదరాబాద్: గ్లోబరీనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వల్లే ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో పొరపాట్లు చోటు చేసుకున్నాయని, ఆ సంస్థ వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీంతో ఆ సంస్థను కూడా తమ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చా లని అభ్యర్థిస్తూ బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు బుధవారం హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2.15కు ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని ఆయన తరఫు న్యాయవాది దామోదర్‌రెడ్డి హైకోర్టును కోరారు. అది సాధ్యం కాదని స్పష్టం చేసిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం, విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. ఇదే వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలతో కలిపి ఇంప్లీడ్ పిటిషన్‌పై ఆ రోజున విచారణ జరుపుతామంది. ఇంటర్ పత్రాల మూల్యాంకనం సక్రమంగా జరగకపోవడం వల్లే విద్యా ర్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించడంతోపాటు, బాధ్యులైన అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అచ్యుతరావు ఇటీవల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తమ ముందుంచాలం టూ విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఇందులో భాగంగా బుధవారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా అచ్యుతరావు తరఫు న్యాయవాది గ్లోబరీనా సంస్థను ప్రతివాదిగా చేరుస్తూ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలుకు అనుమతి కోరారు. అనుమతినిచ్చిన ధర్మాసనం అత్యవసర విచారణకు నిరాకరించింది. ప్రభుత్వ కమిటీ అదే తేల్చింది.. గ్లోబరీనా నిర్లక్ష్యం వల్లే ఇంటర్ పత్రాల మూల్యాంకనంలో పొరపాట్లు జరిగాయని ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చిందని అచ్యుతరావు తన ఇంప్లీడ్ పిటిషన్లో పేర్కొన్నారు. ఇంటర్ పత్రాల మూల్యాంకన కాంట్రాక్ట్‌ను గ్లోబరీనా రూ.4.35 కోట్లకు దక్కించుకుందన్నారు. అయితే ఈ ఒప్పందంపై ఏ సంతకాలు లేవని ప్రభుత్వ కమిటీ తేల్చిందని వివరించారు. పెరిగిన అవసరా లకు అనుగుణంగా తగిన సాంకేతిక, మానవ వనరులు గ్లోబరీనా వద్ద లేవన్నారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్లో కూడా లోపాలున్నాయని, దీనిపై అనేక మంది ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు. అంతిమంగా అటు బోర్డు, ఇటు గ్లోబరీనా సంస్థల నిర్వాకం వల్ల 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలకు ఆదేశించాలని కోరారు. -
కేసును సీబీఐకి అప్పగించాలి : భట్టి
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ బోర్డ్ అవకతవకలపై కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గ్లోబరినా సంస్థకు, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకపోతే వెంటనే ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అర్హత, అనుభవం లేని గ్లోబరినా సంస్థకు అప్పజెప్పి లక్షలాది మంది విద్యార్థుల జీవితాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై, ఇంటర్ బోర్డ్ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబరినా సంస్థపై కేసు నమోదైనప్పటికీ తెలంగాణలో ఆ సంస్థకు బాధ్యతలు ఎలా అప్పగించారని నిలదీశారు. ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల స్వప్రయోజనాల కోసమే అలా చేశారని ఆరోపించారు. -
దున్నపోతుపై జడివాన..ఇంకా తీపే ‘గ్లోబరీనా’
సాక్షి ప్రతినిధి, కాకినాడ :కాకినాడ జేఎన్టీయూ కుదుర్చుకున్న ఒప్పందాలు వివాదాస్పదమై యూనివర్సిటీ పరువు, ప్రతిష్టలను బజారుకీడుస్తున్నాయి. గత ఏడాది వర్సిటీ గ్లోబరీనా సంస్థతో చేసుకున్న ఒప్పందంపై విచారణా నివేదిక అమలు కాకుండానే మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఒప్పందాలను వ్యతిరేకిస్తున్న అధికారులపై బదిలీ వేటు వేయడాన్ని వర్సిటీ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థుల జవాబుపత్రాల ఆన్లైన్ మూల్యాంకనం కోసం గ్లోబరీనాతో కుదుర్చుకున్న ఒప్పందంపై ఆది నుంచీ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. గ్లోబరీనా ఒప్పందంతో వస్తున్న నష్టాలపై ఇదివరకు గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన సీపీఐ జిల్లా కార్యదర్శి మీసాల సత్యనారాయణ ఇప్పుడు సీఎంను కలిసి వివరించడంతో మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. ఇంత జరుగుతున్నా ఒప్పందంపై ముందుకు వెళ్లేందుకే వర్సిటీ ఉన్నతాధికారులు మొగ్గు చూపడాన్ని వర్సిటీలో కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇదీ ఒప్పందం... విద్యార్థి 14 పేజీల పేపర్ మూల్యాంకనానికి రూ.125 వంతున గ్లోబరీనాకు చెల్లించాలనేది ఒప్పందం. ఏడాదికి 268 ఇంజనీరింగ్ కళాశాలల పరిధిలో సుమారు 5 లక్షల మంది విద్యార్థులకు రూ.120 కోట్లు వర్సిటీ నిధుల నుంచి చెల్లించాలి. ఒప్పందానికి ముందు వర్సిటీ అధ్యాపకుల ద్వారా మూల్యాంకనం చేసే ప్రతి పేపర్‌కు రూ.18 నుంచి రూ.25 వంతున ఏడాదికి రూ.18 కోట్లు మాత్రమే ఖర్చయ్యేది. ప్రస్తుతం ఏడాదికి రూ.102 కోట్లు వర్సిటీపై భారం పడుతున్నా వెనక్కు తగ్గకపోవడం విమర్శలకు తావిస్తోంది. దాదాపు ఇలాంటి ఒప్పందాన్నే మరో సంస్థతో చేసుకున్న జేఎన్టీయూహెచ్ సహా పలు వర్సిటీలు ఆశించిన ఫలితాలు రాబట్టలేక రద్దు చేసుకున్నాయి. అలాంటి ఒప్పందాన్ని జేఎన్టీయూకే కొనసాగించాలనుకోవడంలో ఆంతర్యమేమిటన్నది ప్రశ్నార్థకం. 2013-14 విద్యాసంవత్సరంలో ఇంజనీరింగ్ 3, 4 సంవత్సరాల సెమిస్టర్ ఫలితాలు నెలల తరబడి ఆలస్యం కావడంపై విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి గ్లోబరీనాతో ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. అయినా వర్సిటీ ఉన్నతాధికారులు వెనక్కి తగ్గక జవాబుపత్రాలు అధ్యాపకులతో మూల్యాంకనం చేయించడంతో వివాదం నుంచి ఉపశమనం పొందారు. కానీ వివాదాస్పదమైన ఒప్పందాన్ని కొనసాగించారు. దీనిపై సీపీఐ నేత మీసాల సత్యనారాయణ తదితరులు రెండు నెలల కిత్రం గవర్నర్ నరసింహన్‌కు చేసిన ఫిర్యాదుపై ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డితో కూడిన కమిటీ విచారించడం తెలిసిందే. ఆ కమిటీ నివేదికలో స్వల్ప మార్పులనే సూచించడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. ఒప్పందంలో ఉన్న వీసీ పేరును తొలగించి రిజిస్ట్రార్ బాధ్యునిగా అమలుపర్చాలి. మూల్యాంకనం చేసే పేపర్లకే సొమ్ము చెల్లించాలని, ఒప్పంద సంస్థ సకాలంలో పని చేయకుంటే ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, ఏటా పనితీరుపై అధికారులతో సమీక్షలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. బిల్లులు చెల్లించే సమయం వచ్చినందునే.. కమిటీ సూచనల అమలు మాటేమో కాని వివాదం నడుస్తున్న సమయంలో పలువురు కీలకమైన అధికారుల బదిలీలు జరగడం విమర్శలకు తావిస్తోంది. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, పెట్రో అండ్ పెట్రో కెమికల్ విభాగాధిపతి బాలకృష్ణను మెకానికల్ విభాగానికి, బ్రిక్స్ ఇంజనీర్ వి.రవీంద్రను మౌలికసదుపాయాల కల్పన విభాగం డెరైక్టర్‌గా, జేఎన్టీయూ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారావును బ్యూరో ఆఫ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ డెరైక్టర్‌గా, ఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ బాబులును కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా బదిలీ చేశారు. సాధారణ బదిలీల్లో భాగంగానే ఇవన్నీ జరిగాయని వర్సిటీ అధికారులు అంటున్నా, వారు గ్లోబరీనా ఒప్పందాన్ని వ్యతిరేకించడం, గ్లోబరీనాకు రూ.30 కోట్లు బిల్లులు చెల్లించాల్సిన సమయం రావడమే బదిలీలకు కారణమంటున్నారు. ఇటీవలనే గ్లోబరీనాకు రూ.2.5 కోట్ల చెల్లింపులు జరిగాయి. మరో రూ.30 కోట్ల బిల్లులు పాసవ్వాలంటే అధికారులంతా సంతకాలు చేయాలి. ఆ సంతకాలు చేయాల్సిన వారు తాజా బదిలీల్లో కీలకమైన అధికారులు కావడంతో పై ఆరోపణలకు బలం చేకూరుతోంది. మొండికేస్తున్న అధికారులను అడ్డు తొలగించుకునేందుకే బదిలీలు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.