దున్నపోతుపై జడివాన..ఇంకా తీపే ‘గ్లోబరీనా’ | Buffalo Squalls .. more tipe 'globarina' | Sakshi
Sakshi News home page

దున్నపోతుపై జడివాన..ఇంకా తీపే ‘గ్లోబరీనా’

Published Thu, Jul 10 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM

దున్నపోతుపై జడివాన..ఇంకా తీపే ‘గ్లోబరీనా’

దున్నపోతుపై జడివాన..ఇంకా తీపే ‘గ్లోబరీనా’

 సాక్షి ప్రతినిధి, కాకినాడ :కాకినాడ జేఎన్‌టీయూ కుదుర్చుకున్న ఒప్పందాలు వివాదాస్పదమై యూనివర్సిటీ పరువు, ప్రతిష్టలను బజారుకీడుస్తున్నాయి. గత ఏడాది వర్సిటీ గ్లోబరీనా సంస్థతో చేసుకున్న ఒప్పందంపై విచారణా నివేదిక అమలు కాకుండానే మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఒప్పందాలను వ్యతిరేకిస్తున్న అధికారులపై బదిలీ వేటు వేయడాన్ని వర్సిటీ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థుల జవాబుపత్రాల ఆన్‌లైన్ మూల్యాంకనం కోసం గ్లోబరీనాతో కుదుర్చుకున్న ఒప్పందంపై ఆది నుంచీ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. గ్లోబరీనా ఒప్పందంతో వస్తున్న నష్టాలపై ఇదివరకు గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన సీపీఐ జిల్లా కార్యదర్శి మీసాల సత్యనారాయణ ఇప్పుడు సీఎంను కలిసి వివరించడంతో మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. ఇంత జరుగుతున్నా ఒప్పందంపై ముందుకు వెళ్లేందుకే వర్సిటీ ఉన్నతాధికారులు మొగ్గు చూపడాన్ని వర్సిటీలో కొందరు వ్యతిరేకిస్తున్నారు.
 
 ఇదీ ఒప్పందం...    
 విద్యార్థి 14 పేజీల పేపర్ మూల్యాంకనానికి రూ.125 వంతున గ్లోబరీనాకు చెల్లించాలనేది ఒప్పందం. ఏడాదికి 268 ఇంజనీరింగ్ కళాశాలల పరిధిలో సుమారు 5 లక్షల మంది విద్యార్థులకు రూ.120 కోట్లు వర్సిటీ నిధుల నుంచి చెల్లించాలి. ఒప్పందానికి ముందు వర్సిటీ అధ్యాపకుల ద్వారా మూల్యాంకనం చేసే ప్రతి పేపర్‌కు రూ.18 నుంచి రూ.25 వంతున ఏడాదికి రూ.18 కోట్లు మాత్రమే ఖర్చయ్యేది. ప్రస్తుతం ఏడాదికి రూ.102 కోట్లు వర్సిటీపై భారం పడుతున్నా వెనక్కు తగ్గకపోవడం విమర్శలకు తావిస్తోంది. దాదాపు ఇలాంటి ఒప్పందాన్నే మరో సంస్థతో చేసుకున్న జేఎన్‌టీయూహెచ్ సహా పలు వర్సిటీలు ఆశించిన ఫలితాలు రాబట్టలేక రద్దు చేసుకున్నాయి. అలాంటి ఒప్పందాన్ని జేఎన్‌టీయూకే కొనసాగించాలనుకోవడంలో ఆంతర్యమేమిటన్నది ప్రశ్నార్థకం. 2013-14 విద్యాసంవత్సరంలో ఇంజనీరింగ్ 3, 4 సంవత్సరాల సెమిస్టర్ ఫలితాలు నెలల తరబడి ఆలస్యం కావడంపై విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి గ్లోబరీనాతో ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్ చేశాయి.
 
 అయినా వర్సిటీ ఉన్నతాధికారులు వెనక్కి తగ్గక జవాబుపత్రాలు అధ్యాపకులతో మూల్యాంకనం చేయించడంతో వివాదం నుంచి ఉపశమనం పొందారు. కానీ వివాదాస్పదమైన ఒప్పందాన్ని కొనసాగించారు. దీనిపై సీపీఐ నేత మీసాల సత్యనారాయణ తదితరులు రెండు నెలల కిత్రం గవర్నర్ నరసింహన్‌కు చేసిన ఫిర్యాదుపై ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డితో కూడిన కమిటీ విచారించడం తెలిసిందే. ఆ కమిటీ నివేదికలో స్వల్ప మార్పులనే సూచించడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. ఒప్పందంలో ఉన్న వీసీ పేరును తొలగించి రిజిస్ట్రార్ బాధ్యునిగా అమలుపర్చాలి. మూల్యాంకనం చేసే పేపర్లకే సొమ్ము చెల్లించాలని, ఒప్పంద సంస్థ సకాలంలో పని చేయకుంటే ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, ఏటా పనితీరుపై అధికారులతో సమీక్షలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది.
 
 బిల్లులు చెల్లించే సమయం వచ్చినందునే..
 కమిటీ సూచనల అమలు మాటేమో కాని వివాదం నడుస్తున్న సమయంలో పలువురు కీలకమైన అధికారుల బదిలీలు జరగడం విమర్శలకు తావిస్తోంది. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, పెట్రో అండ్ పెట్రో  కెమికల్ విభాగాధిపతి బాలకృష్ణను మెకానికల్ విభాగానికి, బ్రిక్స్ ఇంజనీర్ వి.రవీంద్రను మౌలికసదుపాయాల కల్పన విభాగం డెరైక్టర్‌గా, జేఎన్‌టీయూ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారావును బ్యూరో ఆఫ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ డెరైక్టర్‌గా, ఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ బాబులును కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా బదిలీ చేశారు. సాధారణ బదిలీల్లో భాగంగానే ఇవన్నీ జరిగాయని వర్సిటీ అధికారులు అంటున్నా, వారు గ్లోబరీనా ఒప్పందాన్ని వ్యతిరేకించడం, గ్లోబరీనాకు రూ.30 కోట్లు బిల్లులు చెల్లించాల్సిన సమయం రావడమే బదిలీలకు కారణమంటున్నారు. ఇటీవలనే గ్లోబరీనాకు రూ.2.5 కోట్ల చెల్లింపులు జరిగాయి. మరో రూ.30 కోట్ల బిల్లులు పాసవ్వాలంటే అధికారులంతా సంతకాలు చేయాలి. ఆ సంతకాలు చేయాల్సిన వారు తాజా బదిలీల్లో కీలకమైన అధికారులు కావడంతో పై ఆరోపణలకు బలం చేకూరుతోంది. మొండికేస్తున్న అధికారులను అడ్డు తొలగించుకునేందుకే బదిలీలు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement