కాకినాడ సిటీ :కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజాపోరాటాలు నిర్వహించి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా సీపీఐ ఆవిర్భవించాలని వలువురు వక్తలు అన్నారు. కాకినాడలో రెండు రోజులపాటు జరిగిన ఆ పార్టీ రాష్ట్ర సమితి సమావేశాలు మంగళవారం సాయంత్రం ముగిశాయి. పార్టీ నిర్మాణం, ప్రజా సమస్యలపై పోరాటం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. చంద్రబాబు పాలనలో రాష్ర్ట ప్రజలు నలిగిపోతున్నారని, ఇటువంటి తరుణంలో వారికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని పలువురు నేతలు అన్నారు. ప్రజలతో కార్యకర్తలు నిత్యసంబంధాలు పెట్టుకుని పార్టీ నిర్మాణాన్ని విస్తృత చేయాలన్నారు.
రెండు రోజుల సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ, కేంద్రం, రాష్ర్టంలోని ప్రభుత్వాలు అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయాయన్నారు. సుపరిపాలన అందిస్తామన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వంలో నలుగురు మంత్రులు అవినీతి ఊబిలో కూరుకుపోయారన్నారు. రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంలో ఇరుక్కున్నారని, ఆ పార్టీ ఎమ్మెల్యే నెల రోజులపాటు జైలులో ఉన్నారని అన్నారు. ఈ వ్యవహారం నుంచి తప్పించుకోవడానికే సెక్షన్-8పై రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేంద్రం కాలయాపన చేస్తోందన్నారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో పోలవరం ముంపు మండలాల్లో పార్టీ బృందం పర్యటిస్తుందన్నారు. ఆయా మండలాల్లో సమస్యలను పరిశీలించి పోరాట కార్యాచరణను రూపొందిస్తామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
పలు తీర్మానాలకు ఆమోదం
సెప్టెంబర్ ఒకటిన రైతాంగ డిమాండ్స్ డేగా పాటిస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర సమితి సమావేశంలో తీర్మానించారు. అలాగే రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన ఆర్డినెన్స్-2015ను రద్దు చేయాలని, సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన నిధులు మంజూరు చేసి, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేసి సాగునీరు అందించాలని, పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపు గడువును ఆగస్ట్ 30 వరకూ పొడించాలని, జాతీయ శాంపిల్ సర్వే నివేదిక ప్రకారం 93 శాతం మంది రైతులు అప్పుల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి షరతులూ లేకుండా రుణమాఫీ అమలు చేయాలని, కొత్త రుణాలివ్వాలని, పొగాకు, సుబాబుల్, జామాయిల్‌లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఈ సమావేశాల్లో తీర్మానించారు.
ప్రజా పోరాటాలతో ప్రత్యామ్నాయ శక్తిగా..
Published Wed, Jul 8 2015 12:25 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM
Advertisement
Advertisement