'వెంకయ్య నుంచే చంద్రబాబు అబద్ధాలు నేర్చారు'
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో అటు బీజేపీ, ఇటు టీడీపీ ప్రజలను మోసపుచ్చాయని సీపీఐ జాతీయ నేత డాక్టర్ కే నారాయణ అన్నారు. ప్రత్యేక హోదాపై ప్రధానితో అధికార పూర్వకంగా మాట్లాడానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఎన్నికలకు ముందు పుస్తకాలు రాసుకుని, మీసాలు మెలేసిన వెంకయ్యనాయుడికి అబద్ధాలు చెప్పే శాపం ఉందని, చంద్రబాబు అబద్ధాలు చెప్పడం ఆయననుంచే నేర్చుకున్నారని విమర్శించారు. ఈ విషయంలో ప్రజలను మోసంచేసినందుకు వాళ్లిద్దరినీ జైల్లో పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం కాకినాడలో విలేకరులతో మాట్లాడిన ఆయన అసెంబ్లీలో అధికార పార్టీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. సీఎం చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితేనే రాయలసీమకు నీళ్లొస్తాయని తేల్చిచెప్పిన నారాయణ.. పట్టిసీమ ప్రాజెక్టును సీపీఐ వ్యతిరేకిస్తోందని స్పష్టంచేశారు.