ఇంజనీరింగ్ ప్రశ్నాపత్రంలో 'వింత'
కాకినాడ: కాకినాడలోని జవహార్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్‌టీయూ-కే) ఇంజనీరింగ్ విద్యార్థులకు వింత పరీక్ష ఎదురైంది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో సెకండియర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు.. ప్రశ్నాపత్రంలో కనిపించిన అధికారుల 'చంద్రబాబు భజన'ను చూసి బిత్తరపోయారు. ఎక్కడా లేని లోకేష్ బ్యాంక్ ప్రశ్నాపత్రంలో కనిపించడంతో ముక్కున వేలేసుకున్నారు.
సోమవారం జరిగిన మేనేజేరియల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్సియల్ ఎనాలిసిస్(ఎమ్‌ఈఎఫ్ఏ) పరీక్ష ప్రశ్నాపత్రంలో జర్నల్ ఎంట్రీ రికార్డింగ్ విధానానికి సంబంధించి అడిగిన ఓ ప్రశ్నలో లోకేష్ బ్యాంక్, హెరిటేజ్ లిమిటెడ్, బ్రాహ్మణి లిమిటెడ్ అంటూ ప్రశ్నపత్రం తయారుచేసిన వారు చంద్రబాబు కుటుంబ పల్లవి అందుకున్నారు. దీంతో విద్యార్థులు ఒకింత గందరగోళానికి గురయ్యారు. అధికారులకు చంద్రబాబు కుటుంబమంటే ఎంత అనురాగమున్నా కీలకమైన ఇంజనీరింగ్ ఎగ్జామ్ ప్రశ్నపత్రంలో అది కనబడటం విమర్శలకు తావిస్తోంది.
ఈ విషయంపై జేఎన్‌టీయూ వీసీ సంబంధిత విభాగం నుంచి వివరణ కోరినట్లు తెలుస్తోంది. అలాగే ప్రశ్నపత్రంలో అలాంటి ప్రశ్నలు ఉంచడం వెనుక ప్రత్యేకంగా ఎలాంటి ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. ఇప్పటికే జేఎన్‌టీయూ-కేలో ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రొఫెసర్‌లు 'తెలుగుదేశం' కుటుంబానికి చెందిన వారుగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజా ఘటన దానిని బలపరుస్తోంది.