బీటెక్ ప్రశ్నాపత్రం లైవ్‌లీగా ఉంటుందని..!
కాకినాడ: బీటెక్ కంప్యూటర్ సైన్స్ పరీక్షా పత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లు రావడం పొరపాటే అని జేఎన్‌టీయూ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ సుబ్బారావు ఒప్పుకున్నారు. ఇంత వరకు యూనివర్సిటీ పరిధిలో ఇలాంటి ఘటన జరగలేదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయంపై సబ్జెక్టు నిపుణులను వివరణ కోరగా.. పేపర్ లైవ్‌లీగా ఉంటుందని ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినట్లు తెలిపారని సుబ్బారావు వెల్లడించారు.
బీటెక్ కంప్యూటర్ సైన్స్ విభాగం విద్యార్థులకు సోమవారం నిర్వహించిన 'మేనేజేరియల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్సియల్ ఎనాలిసిస్'(ఎమ్‌ఈఎఫ్ఏ) పరీక్షలో లోకేష్ బ్యాంక్, హెరిటేజ్ లిమిటెడ్, బ్రాహ్మణి లిమిటెడ్ అంటూ చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను అధికారులు ప్రశ్నపత్రంలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో సుబ్బారావు పొరపాటు జరిగిందని తెలిపారు.