
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల పై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రానందుకు నిరసనగా శనివారం ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి విభాగం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్ వెంకట్ బలమూరి మాట్లాడుతూ.. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వారిపై అసెంబ్లీలో క్లారిటీ వస్తుందేమోనని చివరి రోజు వరకు వేచి చూశాం. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే అసెంబ్లీ ముట్టడి నిర్వహించామని పేర్కొన్నారు. రీ కరెక‌్షన్, రీ వాల్యుయేషన్ పేరుతో విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకున్న ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పుడు మాట మార్చి వారు ఎలాంటి ఫీజులు చెల్లించలేదని ఆరోపణలు చేస్తుంది.
కాగా, విద్యార్థులు చెల్లించిన ఫీజులు మొత్తం రూ. కోటిదాకా ఉన్నట్లు మేము ఆర్టీఐ ద్వారా తెలుసుకున్నామని ఆయన తెలిపారు. ఎలాగూ ప్రభుత్వం చనిపోయిన విద్యార్థి కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమైంది, కనీసం విద్యార్థులు చెల్లించిన ఫీజులకు అదనంగా రూ. 2 లేదా 3 కోట్లు జత చేసి వారి కుటుంబాలకు అందజేయాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తప్పుడు ఫలితాలకు కారణమైన గ్లోబరీనా సంస్థ, ఇంటర్మీడియట్ బోర్డుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేసే వరకు ఎన్‌ఎస్‌యూఐ పోరాటం కొనసాగుతుందని వెంకట్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment