Assembly building
-
చారిత్రక వైభవానికి ఇబ్బంది రావద్దు
సాక్షి, హైదరాబాద్: అసఫ్‌జాహీల నిర్మాణ కౌశలం కొనసా గాలని, పాత అసెంబ్లీ భవన చారిత్రక వైభవానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పునరుద్ధరించాలని రాష్ట్ర ఆర్ అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగాఖాన్ నిర్మాణ సంస్థ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. పాత అసెంబ్లీ భవన పునరుద్ధరణ పనులపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి మంగళవారం అసెంబ్లీ స్పీకర్ చాంబర్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, ఆర్అండ్బీ అధికారులు, ఆగాఖాన్ ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ రాబోయే మూడు నెలల్లో ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, చారిత్రక వైభవానికి ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఆగాఖాన్ ట్రస్ట్ కు రూ.2 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్న విషయం తెలియడంతో వెంటనే స్పందించిన మంత్రి.. సమావేశం నుంచే ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కతో మాట్లాడి నిధులు విడుదల చేయించారు.బిల్లుల కోసం ప్రజోపయోగ పనులను ఆపవద్దని అధికారులకు సూచించారు. ఏవైనా బిల్లులు పెండింగ్‌లో ఉన్నా, ఇతర సమస్యలేమి ఉన్నా తనకు లేదా మంత్రి శ్రీధర్‌బాబుకు చెప్పాలని కోరారు. ఈ భవనం అందుబాటులోకి వస్తే కౌన్సిల్‌హాల్‌ను అసెంబ్లీ భవనంలోకి మార్చవచ్చన్నారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పాత అసెంబ్లీ భవన పునరుద్ధరణ పనుల పర్యవేక్షణ కోసం ఎస్ఈ స్థాయి అధికారిని నియమించాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు.అదో పెద్ద జోక్: మంత్రి కోమటిరెడ్డిఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విద్యుత్ చార్జీల అంశంపై కేటీఆర్ ఈఆర్సీ దగ్గరకు వెళ్లడం పెద్ద జోక్ అని అన్నారు. ఆయనో జోకర్ అని, పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు రాకుండా ప్రజలు ఓడించినా వారికి బుద్ధి రాలేదన్నారు. 200 యూనిట్ల వరకు పేదలకు తమ ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందజేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డిలు రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
అసెంబ్లీ పాత భవనం పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: శాసనసభ భవన సముదాయంలోని చారిత్రక నిర్మాణా న్ని పునరుద్ధరించే పనులు మొదలయ్యాయి. గతంలో ఆ భవనం శాసనసభగా సేవలు అందించింది. కాలక్రమంలో అది బాగా పాతబడిపోవటంతో కొత్త భవనాన్ని నిర్మించి శాసనసభను అందులోకి మార్చారు. అయితే రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే, శాసనసభ ప్రాంగణాన్ని పరిశీలించి.. పురాతన భవనాన్ని పునరుద్ధరించాలని ఆదేశించారు. పునరుద్ధరణ తర్వాత దాన్ని శాసనమండలిగా వినియోగించనున్నారు. ఇండో–పర్షియన్ నిర్మాణాలను పునరుద్ధరించటంలో గుర్తింపు పొందిన ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ (ఏకేటీసీ)కు పునరుద్ధరణ పనులు అప్పగించారు. ఇరానియన్ శైలిలో నిర్మించిన కుతుబ్‌షాహీ సమాధులను ఈ సంస్థే సొంత వ్యయంతో పునరుద్ధరిస్తోంది. ఢిల్లీ లోని హుమయూన్ టూంబ్‌ను కూడా పునరుద్ధరించింది. కాగా, 1905లో చారిత్రక నిర్మాణం ఎలా ఉందో అలానే తీర్చిదిద్దనున్నారు. ఇందుకు రూ.40కోట్లు ఖర్చవుతుందని సమాచారం. పాలరాతి తరహా మెరుపులుఈ భవన నిర్మాణ శైలి ప్రత్యేకంగా ఉంటుంది. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 40వ పుట్టిన రోజుకు గుర్తుగా 1905లో ఈ భవనాన్ని నిర్మించారు. దీన్ని నాటి ప్రభుత్వ ధనంతో కాకుండా ప్రజల నుంచి విరాళాలు వసూలు చేసి నిర్మించారు. అందుకే అప్పట్లో దీన్ని పబ్లిక్ హాలు, టౌన్‌హాలుగా పిలిచేవారు. ప్రజల సందర్శనకు వీలుగా ఉన్న పబ్లిక్ గార్డెన్‌ను ఆనుకుని దీన్ని నిర్మించటం విశేషం. రాజస్తాన్ రాజమహళ్లలోని కొన్ని నమూనాలు, కొన్ని పర్షియన్ నమూనాలు మేళవించి అద్భుత శైలిలో దీన్ని నిర్మించారు. డంగు సున్నం, కరక్కాయ, నల్లబెల్లం, గుడ్డు సొన, రాతి పొడిలతో కూడిన సంప్రదాయ మిశ్రమాన్ని దీనికి వినియోగించారు. కానీ పాలరాతితో నిర్మించిన తరహాలో కనిపించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వారసత్వ కట్టడం అయినందున కూల్చివేసేందుకు వీల్లేకపోవడంతో పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదనపు నిర్మాణాల తొలగింపు ఈ భవనానికి గతంలోనే పలుమార్లు మరమ్మతులు చేశారు. అవసరానికి తగ్గట్టుగా అదనపు నిర్మాణాలు కూడా జోడించారు. పైకప్పు లోపలి వైపు అదనపు చేరికలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఒరిజినల్ రూపురేఖలు వచ్చేలా ఆయా అదనపు చేరికలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి. చారిత్రక వారసత్వ భవనాల పునరుద్ధరణలో సిమెంటును వినియోగించరు. అప్పట్లో ఏ మిశ్రమంతో భవనాన్ని నిర్మించారో అదే తరహా మిశ్రమంతోనే పనులు కొనసాగిస్తారు. ఇప్పుడు శాసనసభ భవన పునరుద్ధరణలోనూ అదే పద్ధతి అవలంభించనున్నారు. ఈ పనులు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉన్నందున పునరుద్ధరణకు చాలా సమయం పడుతుందని అంటున్నారు. అయితే వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి దాన్ని సిద్ధం చేసే లక్ష్యంతో పనులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. తదుపరి జూబ్లీహాలు పునరుద్ధరణ దీని తర్వాత జూబ్లీహాలును కూడా పునరుద్ధరించనున్నారు. 1913లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పబ్లిక్‌గార్డెన్‌లో అంతర్భాగంగా దీన్ని నిర్మించారు. నిజాం ప్రభుత్వంలోని ప్రజాపనుల విభాగం ఇంజినీర్ అయిన అలీ నవాబ్ జంగ్ బహదూర్ ఆధ్వర్యంలో దీని నిర్మాణం కొనసాగింంది. ఇందులో నిజాం సమావేశాలు, సదస్సులు నిర్వహించేవారు. ఆయన పట్టాభిషేకం జరిగి 25 సంవత్సరాలు పూర్తయినప్పుడు ఇదే భవనంలో రజతోత్సవాలను నిర్వహించారు. అప్పటి నుంచే దీనిపేరు జూబ్లీహాలుగా మారింది. అప్పుడు ఇందులో ఏడో నిజాం రాజచిహ్నంతో బంగారు పూత పూసిన సింహాసనాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆయన దానిపై కూర్చుని ప్రజలను కలిసేవారంటారు. తర్వాత ఆ సింహాసనాన్ని పురానా హవేలీ మ్యూజియంకు తరలించారు. ఇప్పటికీ ఆ సింహాసనం ఉన్న వేదిక అక్కడ ఉంది. కాగా జూబ్లీహాలు చాలా ఏళ్లపాటు నగరంలో సమావేశాలకు ఉపయోపడింది. తర్వాత కొంతకాలం దాన్ని శాసనమండలిగా కూడా వినియోగించారు. -
ఉట్టిపడే ‘రాజసం’..
అందమైన భాగ్యనగరం మనది. ఘన చరిత్రకు సాక్ష్యం...అద్భుతమైన వారసత్వ సంపదకు నిలయం ఈ నగరం. 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్‌లో ఎన్నో అద్భుతమైన కట్టడాలు, ప్రాంతాలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. గత చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. చార్మినార్..గోల్కొండ.. అసెంబ్లీ భవనం.. చౌమహల్లా ప్యాలెస్, మక్కా మసీదు, సాలార్జంగ్ మ్యూజియం, సర్దార్ మహల్, మహబూబ్ మాన్షన్, కింగ్ కోఠి ప్యాలెస్.. ఇలా ఎన్నో అద్భుత నిర్మాణాలు వారసత్వ కట్టడాలుగా ఖ్యాతి పొందాయి. కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరాన్ని ‘హెరిటేజ్ ఇండియా ఫెస్టివల్’గా ప్రకటించిన నేపథ్యంలో మన అసెంబ్లీ భవనం ప్రత్యేకతలపై ‘సాక్షి’ కథనం.. సాక్షి, హైదరాబాద్: మన శాసనసభ నిర్మాణానికి పునాదిరాయి పడి ఎన్నేళ్లయిందో తెలుసా? రేపటితో అక్షరాలా 116 సంవత్సరాలు. ఇది నిర్మించి ఒక శతాబ్దంపైనే పూర్తయ్యింది. అయినా ఈ భవనం చెక్కు చెదరలేదు. ఉట్టిపడే రాజసానికి ప్రతీక ఇది. అప్పటి ఉమ్మడి రాష్ట్రం, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర చరిత్రను మలుపుతిప్పిన అనేక కీలకఘట్టాలు ఈ శాసనసభా ప్రాంగణంలోనే చోటుచేసుకున్నాయి. అద్భుతమైన నిర్మాణ శైలితో కట్టించిన ఈ భవనం హైదరాబాద్ నగరంలోనే ఒక అపురూప కట్టడం. అసెంబ్లీ భవన నిర్మాణానికి 1905 జనవరి 25న అంకురార్పణ జరిగింది. ప్రజా సమస్యలకు వేదికగా అప్పటి ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ పచ్చని ఉద్యానవనంలో ఈ భవనం నిర్మాణానికి శ్రీకారం చు ట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఈ వేదిక నుంచే తమ వాణిని వినిపిస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభు త్వం 2021ని చారిత్రక కట్టడాల పరిరక్షణ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ‘హైదరాబాద్ హెరిటేజ్’ను పురస్కరించుకుని అసెంబ్లీ భవనంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం నిజాం నవాబు ప్రసంగించిన వేళ.. అది 1904వ సంవత్సరం.. ఓ రోజు నగరం అంతా సందడిగా ఉంది. ఢిల్లీలో జరిగిన సంస్థానాధీశుల దర్బార్ సమావేశాలకు వెళ్లిన మ హబూబ్ అలీఖాన్ ఆ రోజు సాయంత్రం నగ రానికి చేరుకోనున్నారు. ఆయన రాకకోసం జనం ఎదురుచూస్తున్నారు. సరిగా అయిదున్నర గంటల సమయంలో పబ్లిక్ గార్డెన్‌లోని సభాస్థలికి చేరుకున్నారు. మహబూబ్‌కు సాదర స్వాగతం లభించింది. ఆయన ప్రసంగించిన వేదిక చిరకాలం గుర్తుండిపోయేలా ఒక అందమైన భవనం కట్టించాలని తీర్మానించారు. అలా టౌన్‌హాల్ నిర్మాణానికి బీజం పడింది. హైదరాబాద్ సంస్థాన ప్రజలు చందాలు పోగుచేసి ఆ భవనాన్ని కట్టించారు. భవన శంకుస్థాపన ఇలా.. అప్పటికే ఎన్నో భవనాలు ఉన్నాయి. కానీ మంత్రులు, ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు, సాధారణ ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు ఒక వేదిక లేదు. దీంతో 1905లో మహబూబ్ అలీఖాన్ 40వ పుట్టిన రోజు (హిజ్రీ క్యాలెండర్ ప్రకారం జనవరి 25) సందర్భంగా ఆయనకు నగరవాసుల బహుమానంగా అందమైన భవన నిర్మాణం చేపట్టారు. సమాజంలోని ఉన్నత వర్గాలే కాకుండా సాధారణ ప్రజలు సైతం తమవంతుగా విరాళాలు సమర్పించారు. ఈ కట్టడం కోసం అన్ని వర్గాల ప్రజలు పరిశ్రమించారు. అద్భుతమైన నిర్మాణ శైలి.. ఈ భవనం అందమైన గోపురాలు, ఆకాశాన్ని తాకే శిఖరాలు, మరెంతో అందంగా తీర్చిదిద్దిన డోమ్లతో ఆకట్టుకుంటుంది. భవనం గోడలపై మంత్రముగ్ధులను చేసే డిజైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇప్పటికీ దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులను, పర్యాటకులను ఆకట్టుకుంటూనే ఉంది. ఇరానీ, మొగలాయి, రాజస్థానీ వాస్తు నిర్మాణ శైలులతో దీన్ని కట్టించారు. టౌన్ హాల్ నిర్మా ణం కోసం రాజస్థాన్‌లోని మఖ్రా నా నుంచి రాళ్లను తెప్పించారు. రెండంతస్తులతో ని ర్మించిన టౌన్‌హాల్ చు ట్టూ 20 గదులు ఉంటా యి. గోపురాల కోసం డంగు సున్నం, బంకమట్టి వినియోగించారు.గోపురాలు, కమాన్లు మొగలాయి వాస్తు శైలిని సంతరించుకుంటే గోడలపై రూపొందించిన కళాత్మక దృశ్యాలు, లతలు, వివిధ రకాల డిజైన్లు ఇరాన్, రాజస్థానీ శైలులతో రూపుదిద్దుకున్నాయి. అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు తట్టుకొనేలా దీనిని కట్టించారు. చక్కటి గాలి, వెలుతురు వస్తాయి. చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్లగా ఉంటుంది. పచ్చిక బయళ్లతో పరిసరాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటాయి. అప్పట్లో రూ.20 లక్షల వ్యయంతో దీనిని నిర్మించారు. 1913లో నిర్మాణం పూర్తయ్యింది. మహబూబ్ అలీఖాన్ 1911లోనే చనిపోవడంతో ఆయన తనయుడు ఏడో నిజాం మీర్ఉస్మాన్ అలీఖాన్ భవన నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఈ శ్వేతసౌధానికి మహబూబ్ జ్ఞాపకార్థం మొదట మహబూబియా టౌన్ హాల్‌గా నామకరణం చేశారు. అదే రాష్ట్ర శాసనసభగా మారింది. అసెంబ్లీ భవనం ఫొటోతో పోస్టల్ స్టాంప్ 1913లో భవనం నిర్మాణం పూర్తి అయి ప్రజలకు అందుబాటులో రావడంతో ఈ భవనం ఫొటోతో ఏడో నిజాం సంస్థాన ప్రజల అందరికీ తెలిసేలా దీని ఫొటోతో పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. దీని విలువ అప్పటి రోజుల్లో ఒక అణాగా ఉండేది. -
అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన ఎన్ఎస్యూఐ
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల పై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రానందుకు నిరసనగా శనివారం ఎన్ఎస్యూఐ విద్యార్థి విభాగం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ వెంకట్ బలమూరి మాట్లాడుతూ.. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వారిపై అసెంబ్లీలో క్లారిటీ వస్తుందేమోనని చివరి రోజు వరకు వేచి చూశాం. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే అసెంబ్లీ ముట్టడి నిర్వహించామని పేర్కొన్నారు. రీ కరెక్షన్, రీ వాల్యుయేషన్ పేరుతో విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకున్న ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పుడు మాట మార్చి వారు ఎలాంటి ఫీజులు చెల్లించలేదని ఆరోపణలు చేస్తుంది. కాగా, విద్యార్థులు చెల్లించిన ఫీజులు మొత్తం రూ. కోటిదాకా ఉన్నట్లు మేము ఆర్టీఐ ద్వారా తెలుసుకున్నామని ఆయన తెలిపారు. ఎలాగూ ప్రభుత్వం చనిపోయిన విద్యార్థి కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమైంది, కనీసం విద్యార్థులు చెల్లించిన ఫీజులకు అదనంగా రూ. 2 లేదా 3 కోట్లు జత చేసి వారి కుటుంబాలకు అందజేయాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తప్పుడు ఫలితాలకు కారణమైన గ్లోబరీనా సంస్థ, ఇంటర్మీడియట్ బోర్డుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేసే వరకు ఎన్ఎస్యూఐ పోరాటం కొనసాగుతుందని వెంకట్ వెల్లడించారు. -
‘ఎర్రమంజిల్’ వారసత్వ భవనం కాదు..
సాక్షి, హైదరాబాద్ : ఎర్రమంజిల్ పురాతనమైన భవనం కాదన్న ప్రభుత్వ వాదన సంతృప్తికరంగా లేదని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. పూర్తి వివరణ శుక్రవారం ఇవ్వాలంటూ తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చి రాష్ట్ర చట్టసభల భవన సముదాయాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై గురువారం కూడా హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావు మరోసారి తన వాదనలు వినిపించారు. విధానపరమైన నిర్ణయాలల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం తగదన్నారు. ఈ సందర్భంగా గతంలో సుప్రీం, హైకోర్టులు ఇచ్చిన తీర్పులను కోర్టుకు చూపించారు. అసెంబ్లీ నిర్మాణానికి ప్లానింగ్ లేకుండా హెచ్ఎండీఏ నుంచి అనుమతి తీసుకోలేమని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేశారు. వీస్తీర్ణం ఎంత ఉందో చూసిన తర్వాతే హెచ్ఎండీఏ అనుమతి తీసుకుంటామని చెప్పారు. ప్రజా ప్రయోజనాల కోసమే ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతుందని కోర్టుకు వివరించారు. ప్రసుత్తం ఉన్న అసెంబ్లీ 102 ఏళ్ల క్రితం నిర్మించారని గుర్తుచేశారు. ఆ భవనం అసెంబ్లీ కోసం నిర్మించింది కాదని రాజు గారి నివాసం కోసం నిర్మించిందని కోర్టుకు తెలిపారు. కాలక్రమేణా అది అసెంబ్లీ భవనంగా మారిందన్నారు. అసెంబ్లీకి ఉండాల్సిన వసతులు, సౌకర్యాలు లేవని తెలిపారు. ఎర్రమంజిల్ భవనాన్ని వారసత్వ భవనం కాదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం..తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. -
నాటి టౌన్‌హాల్.. మన అసెంబ్లీ భవనం
సాక్షి సిటీబ్యూరో: అది 1903, జనవరి 1.. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ ఢిల్లీలో దేశంలోని వివిధ సంస్థానాదీశుల దర్బార్‌కు వెళ్లి జనవరి 4వ తేదీన తిరిగి నగరానికి వచ్చారు. వస్తునే ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక సభాస్థలికి (ప్రస్తుతం అసెంబ్లీ భవనం ఉన్న ప్రాంతం) చేరకుని ప్రసంగించారు. హైదరాబాద్ రాజ్యంలో తాను చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. భవిష్యత్‌లో చేయదలచిన పనులను చెప్పారు. సంస్థానాధీశుల సమావేశంలోని విశేషాలను వివరించారు. ఆ క్షణంలోనే నగరవాసులంతా ఒక నిర్ణయానికి వచ్చారు. నిజాం నవాబు ఢిల్లీ దర్బార్ సభల్లో పాల్గొని వచ్చిన చారిత్రక సందర్భం.. ఈ సభా వేదిక చిరకాలం గుర్తుండి పోయేలా అద్భుతమైన భవనం కట్టించాలని తీర్మానించారు. ఆ కట్టడం కోసం అన్ని వర్గాల ప్రజలు పరిశ్రమించారు. చందాలు పోగుచేశారు. మరో ఏడాది తర్వాత.. మహబూబ్ అలీఖాన్ 40వ పుట్టిన రోజు సందర్భంగా 1905 ఆగస్టు 18న భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. 1913 డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తయింది. కానీ మహబూబ్ అలీఖాన్ 1911లోనే మరణించారు. ఆయన తనయుడు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ఆ భవనం అందుబాటులోకి వచ్చింది. శ్వేతవర్ణంలో మెరిసిపోతున్న ఆ నిర్మాణాన్ని మహబూబ్ జ్ఞాపకార్థం ‘మహబూబియా టౌన్‌హాల్’æగా నామకరణం చేశారు. తర్వాత కాలంలో రాష్ట్ర శాసనసభగా మారింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశం సందర్భంగా ఆ భవనంపై ‘సాక్షి’ ప్రత్యే కథనం.. కుతుబ్‌షాహీ పాలకుల నుంచి ఆసిఫ్‌జాహీ పాలకుల వరకు హైదరాబాద్ సంస్థానంలో ప్రజా సౌకర్యార్థం వందల కట్టడాలు నిర్మించారు. కానీ ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ కట్టడానిది మాత్రం భిన్న చరిత్ర. ప్రజా అవసరాల కోసం ఈ భవనాన్ని నగర ప్రజలు చందాలతో నిర్మించారు. దీని నిర్మాణంలో డబ్బులు దానం చేసే వారు ఒక రూపాయి కంటే ఎక్కువ ఇవ్వరాదని ఫర్మానా జారీ చేశారు. దీంతో నగర సాధారణ ప్రజలు కూడా అర్ధణా, అణా, రెండు అణాలు చొప్పున ఇచ్చారని చరిత్రకారులు చెబుతారు. అలా మొత్తం రూ.20 లక్షల వ్యయంతో ఈ భవనాన్ని కట్టించారు. అద్భుతమైన నిర్మాణ శైలి నూరేళ్లకు పైగా కాలానికి సాక్షిగా నిలిచిన ఈ భవనంలో ఎందరెందరో రాజనీతిజ్ఞులు, విధాన రూపకర్తలు, ప్రజ సమస్యలపై ఎలుగెత్తిన రాజకీయ నాయకులు, ప్రజా జీవితంలో తలపండిన నేతలు ఆ భవనంలో కొలువుదీరారు. శాసనాల రూపకల?నలో భాగస్వాములయ్యారు. ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చర్చోపర్చలు జరిగాయి. ఆ నాటి నిజాం నవాబు కాలంలో హైదరాబాద్ సంస్థాన ప్రముఖులు, ప్రజలు సమావేశాలు ఏర్పాటు చేసుకొన్నారు. ఆరో నిజాం కాలంనాటి అధికారిక భవన నిర్మాణ నిపుణుల ప్రత్యేక్ష పరవేక్షణలో రూపుదిద్దుకుంది. కుతుబ్, ఆసిఫ్ జాహీల కాలంలో కట్టించిన అనేక చారిత్రక భవనాల కంటే కూడా అత్యాధునిక నిర్మాణ శైలిని సంతరించుకొన్న టౌన్‌హాల్æ ఇరానీ, మొగల్, రాజస్థానీ వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించారు. రాజస్థాన్ లోని మఖరానా నుంచి రాళ్లను తెప్పించారు. (తాజ్æమహల్æకు సైతం ఇక్కడి రాళ్లనే వినియోగించారు) రెండంతుస్తుల్లో నిర్మింన భవనంలో ఒక సువిశాలమైన హాల్æ, దాని చుట్టూ సుమారు 20 గదులు ఉంటాయి,. గోపురాలకు డంగు సున్నం, బంకమట్టిని వినియోగించారు. గోపురాలు, కమాన్లు మొగలాయి వాస్తు శైలిలోను, గోడలపై కళాత్మక దృశ్యాలు, లతలు ఇరాన్, రాజస్థానీ శైలితో తీర్చిదిద్దారు. అన్ని రకాల వాతావరణæ పరిస్థితులకు తట్టుకొనే విధంగా కట్టించారు. చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్లగా ఉండడం ఈ భవనం ప్రత్యేకత. అసెంబ్లీ భవనంతో పోస్టల్ స్టాంప్ భవన నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాక.. నిజాం సంస్థాన ప్రజలందరికీ దాని ప్రత్యేకతను తెలియజేయడానికి ఏదన్నా చేయాలనుకున్నారు. అలా 1940లో భవనం ఫొటోతో పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. దీని విలువ ఒక అణా. -
నీటి కొలనులో అసెంబ్లీ
సాక్షి, అమరావతి: రాజధాని పరిపాలనా నగరం లో అసెంబ్లీ భవనానికి టవర్ డిజైన్‌ను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. నీటి కొలను మధ్యలో 250 మీటర్ల వెడల్పు, 250 మీటర్ల పొడవుతో అసెంబ్లీ డిజైన్‌ను నార్మన్ ఫోస్టర్స్ సంస్థ రూపొందించింది. శనివారం రాత్రి వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఫోస్టర్స్ సంస్థ ప్రతినిధులు టవర్ డిజైన్‌తోపాటు వజ్రం డిజైన్‌పై ప్రజెంటేషన్ ఇచ్చారు. టవర్ ఆకృతికే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 125 ఎకరాల విస్తీర్ణంలో కొలను 250 మీటర్ల ఎత్తులో టవర్ ఆకారంలో నిర్మించే ఈ అసెంబ్లీ భవనం నాలుగు అంతస్తుల్లో ఉంటుంది. టవర్‌పైకి 40 మీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి 217 చదరపు కిలోమీటర్ల రాజధాని నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు. 70 మంది సందర్శకులు ఒకేసారి వ్యూపాయింట్‌కు వెళ్లి రాజధాని నగరాన్ని చూడొచ్చు. ఈ భవనాన్ని నీటి కొలనులో నిర్మిస్తారు. ఈ కొలను 125 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. టవర్ ప్రతిబింబం ఈ నీటిలో పడేలా డిజైన్ చేశారు. టవర్ కింది భాగంలో శాసనసభ, శాసనమండలి, సెంట్రల్ హాల్, పరిపాలనా కేంద్రాల భవనాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. అసెంబ్లీ భవనం మొత్తం 87 వేల చదరపు మీటర్ల ప్రాంతంలో ఉంటుండగా, నిర్మిత ప్రాంతం 7.8 లక్షల చదరపు అడుగుల్లో ఉంటుంది. ఈ భవనంపై పునరుత్పాదక విద్యుదుత్పత్తి వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. సూర్యకాంతి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వ్యవస్థను కూడా నెలకొల్పుతారు. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఈ టవర్ డిజైన్‌ను గురించి మంత్రులకు వివరించి అభిప్రాయాలు అడిగారు. అయితే చిత్రాల్లో డిజైన్ అంత ఆకర్శణీయంగా లేదని, పెద్ద చిత్రాలను చూపించాలని మంత్రులు కోరారు. డిజైన్లపై సోషల్ మీడియాలో అప్పుడే వ్యతిరేక ప్రచారం కూడా జరుగుతోందని, దీనిపై దృష్టి పెట్టి అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. డిజైన్లపై మంత్రి నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పూర్తిస్థాయి స్ట్రక్చరల్ డిజైన్లు ఇచ్చేందుకు ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని ఫోస్టర్స్ ప్రతినిధులు చెప్పినట్లు తెలిపారు. ఈ డిజైన్లు రాగానే టెండర్లు పిలిచి నిర్మాణ పనులు చేపడతామన్నారు. -
టవర్ ఆకారంలో అసెంబ్లీ!
సాక్షి, అమరావతి: రాజధాని పరిపాలనా నగరంలో అసెంబ్లీ భవనాన్ని టవర్ ఆకారంలో నిర్మించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. కింది భాగంలో 250 మీటర్ల వెడల్పుతో ప్రారంభించి అక్కడి నుంచి సెల్‌ఫోన్ టవర్లా 70 మీటర్ల ఎత్తు అయిన అసెంబ్లీ భవనం డిజైన్‌ను నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించింది. ఈ డిజైన్ ప్రకారం భవంతి కింది భాగంలో శాసనసభ, పైన ప్రజలు సందర్శించేందుకు అనువుగా వ్యూయింగ్ పాయింట్ ఉంటుంది. సుమారు 70 అంతస్తుల టవర్ నిర్మించాలని ఫోస్టర్ సంస్థ ప్రతిపాదించింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ 13వ అథారిటీ సమావేశంలో పరిపాలనా నగరంలోని ముఖ్య భవనాల డిజైన్లపై చర్చ జరిగింది. టవర్ డిజైన్‌తోపాటు ఫోస్టర్ సంస్థ ఇచ్చిన వజ్రం తరహా డిజైన్‌ను కూడా సమావేశంలో పరిశీలించారు. మొదటి నుంచి అనుకుంటున్నట్లే టవర్ డిజైన్‌వైపే ముఖ్యమంత్రితో పాటు అందరూ మొగ్గు చూపారు. అయితే ఈ రెండింటిపైనా ప్రజల అభిప్రాయాలు సేకరించాలని, వెంటనే వాటిని సోషల్ మీడియాలో పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గురువారం సాయంత్రం వరకూ వచ్చిన అభిప్రాయాల ప్రకారం ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంపిక చేయడానికి నిర్ణయించారు. ఇందుకోసం గురువారం సాయంత్రం మరోసారి సీఆర్డీఏ సమావేశం నిర్వహించనున్నారు. ప్రజల అభిప్రాయం అని చెబుతున్నా.. ప్రభుత్వం టవర్ డిజైన్‌నే ఖరారు చేయనున్నట్లు తెలిసింది. హైకోర్టు కోసం గతంలో ప్రతిపాదించిన బౌద్ధ స్థూపాకారపు డిజైన్‌కే కొన్ని మార్పులు చేసిన ఫోస్టర్ సంస్థ ఈ సమావేశంలో ప్రదర్శించగా దాన్ని దాదాపు ఖరారు చేశారు. రాజమౌళి సూచనలకు తిరస్కారం: రాజధాని కోసం సినీ దర్శకుడు రాజమౌళి ప్రతిపాదించిన డిజైన్లకు ఆమోదం లభించలేదు. సమావేశంలో పాల్గొన్న ఆయన పలు సూచనలు చేశారు. రాజమౌళి అందించిన త్రీ డైమెన్షన్ చిత్రాలతో కూడిన చతురస్రాకారపు రెండో డిజైన్‌ను కూడా పరిశీలించారు. ఈ డిజైన్ కంటే టవర్ డిజైన్‌కే ఎక్కువ మంది ఓటేశారు. కాగా నార్మన్ ఫోస్టర్ సంస్థ ఇచ్చిన రెండు డిజైన్లపై ప్రజాభిప్రాయం తీసుకుని దాని ప్రకారం గురువారం ఒకదాన్ని ఎంపిక చేస్తామని మీడియాతో మంత్రి నారాయణ తెలిపారు. నా డిజైన్లు ఆమోదం పొందలేదు రాజధాని కోసం తాను ప్రతిపాదించిన డిజైన్లు ఆమోదం పొందలేదని సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చెప్పారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థూపం డిజైన్‌కు తాను కొన్ని మార్పులు సూచించానని, నార్మన్ ఫోస్టర్ సంస్థ అడిగిన కొన్ని చిత్రాలు సేకరించి ఇచ్చానని తెలిపారు. తెలుగు సంస్కృతి, చరిత్ర, వారసత్వం ప్రతిబింబించేలా డిజైన్ల ఎంపికకు సహకరించాలని సీఎం కోరారని, అందుకనుగుణంగా తాను కొన్ని సూచనలు చేశానని తెలిపారు. స్థూపాకృతిలో ఉండే సెంట్రల్ హాలులో తెలుగుతల్లి విగ్రహం ఏర్పాటుచేసి దానిపై సూర్యకిరణాలు పడేలా తాను మార్పులు చెప్పానన్నారు. కానీ ఆ డిజైన్ ఆమోదం పొందలేదన్నారు. -
‘అసెంబ్లీకి వాస్తు దోషం ఉంది’
భోపాల్ : వాస్తు, గ్రహదోషాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ రాజకీయ నాయకులు మాత్రం వాటిని విపరీతంగా విశ్వసిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా ఇటువంటి వారు అధికంగానే ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. మధ్యప్రదేశ్ శాసనసభకు వాస్తు దోషం ఉందని.. అందువల్లే ప్రజాప్రతినిధులు అర్థాంతరంగా మరణిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కేపీ సింగ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తక్షణమే శాసనసభ భవానికి వాస్తు శాంతి చేయించాలని ఆయన పేర్కొన్నారు. 2013 నుంచి ఇప్పటివరకూ 9 మంది ఎమ్మెల్యేలు హఠాత్తుగా మృతి చెందారని కేపీ సింగ్ చెప్పారు. ప్రస్తుత సభకు ఇంకా ఏడాది కాలపరిమితి ఉన్న నేపథ్యంలో.. ప్రకృతి మరిన్ని ప్రాణాలను కోరుతున్నట్లు కనిపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సభకు రావాలంటేనే భయమేస్తోందని అన్నారు. ప్రస్తుత విధాన సభకు శాస్త్రప్రకారం వాస్తు పూజ చేసి, ఇతర దోష నివారణ చర్యలు చేపట్టాలని కేపీసింగ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. ఇదిలా ఉండగా.. 1993 నుంచి మధ్యప్రదేశ్ శాసనసభకు వాస్తు దోషం ఉందనే వాదనలు బలంగా విపిస్తున్నాయి. -
అసెంబ్లీ పక్కన కన్వెన్షన్ హాల్
సాక్షి, అమరావతి: మూడేళ్లుగా రాజధాని అమరావతిలో ఒక్క శాశ్వత భవనాన్ని కూడా నిర్మించని రాష్ట్ర ప్రభుత్వం మరో తాత్కాలికానికి సిద్ధమైంది. తాజాగా వెలగపూడిలోని అసెంబ్లీ భవనం పక్కనే కన్వెన్షన్ హాలు నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రూ. వెయ్యి కోట్లకుపైగా ఖర్చుతో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ భవనాలు నిర్మించిన విషయం తెలిసిందే. అంత వ్యయం చేసినా అవన్నీ డొల్లేనని పలుమార్లు స్పష్టమైంది. చిన్న వర్షానికే మంత్రుల గదుల్లో సైతం వర్షపు నీరు ధారాపాతంగా కారిపోవడం, గోడలు బీటలు వారడంతోపాటు పలు సమస్యలు ఈ తాత్కాలిక భవనాల్లో తరచూ కనిపిస్తున్నాయి. అయినప్పటికీ పూర్తి స్థాయి భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టని రాష్ట్ర సర్కారు తాత్కాలికంగానే వెలగపూడిలో కన్వెన్షన్ హాలు నిర్మించాలని నిర్ణయించింది. అసెంబ్లీ భవనం పక్కనే ఉన్న పార్కింగ్ స్థలంలో దీన్ని నిర్మిస్తారు. పూర్తిస్థాయి కాంక్రీట్ నిర్మాణమైతే ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో ‘ప్రి ఇంజనీరింగ్’ స్ట్రీల్ కట్టడాన్ని వెంటనే ఏర్పాటు చేయనున్నారు. రూ.4.36 కోట్ల అంచనాతో దీన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తోంది. -
అసెంబ్లీకి 13 డిజైన్లు
సాక్షి, అమరావతి : రాజధాని పరిపాలనా నగరంలో ప్రతిపాదిస్తున్న అసెంబ్లీ భవనం కోసం నార్మన్ ఫోస్టర్ సంస్థ 13 రకాల డిజైన్లు రూపొందించింది. వాటిని ప్రజల అభిప్రాయం కోసం సోషల్ మీడియాకు విడుదల చేసింది. రాజధాని పరిపాలనా నగరం వ్యూహ డిజైన్‌తోపాటు విడిగా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం డిజైన్లు రూపొందించే బాధ్యతను ప్రభుత్వం నార్మన్ ఫోస్టర్ సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. ఆరు నెలలుగా ఫోస్టర్ సంస్థ పలు డిజైన్లు ఇచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబుకు నచ్చలేదు. కొద్దిరోజుల క్రితమే వజ్రాకృతి, స్థూపాకృతి డిజైన్లను ఖరారు చేసినట్లే చేసి మళ్లీ తిరస్కరించారు. అనంతరం సినీ దర్శకుడు రాజమౌళిని రంగంలోకి దించి ఆయన సూచనల మేరకు డిజైన్లు రూపొందించాలని ఫోస్టర్ సంస్థకు చంద్రబాబు సూచించారు. ఇటీవలే మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్, రాజమౌళిని లండన్‌లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లి డిజైన్లు ఎలా ఉండాలో సలహాలిప్పించారు. గతంలో రూపొందించిన డిజైన్లను మార్చడంతోపాటు రాజమౌళి సూచనల ప్రకారం మొత్తం 13 డిజైన్లను రూపొందించి ఫోస్టర్ సంస్థ సీఆర్డీఏకు ఇచ్చింది. వాటిలో మూడు గతంలో ఇచ్చిన డిజైన్లే. మొత్తం డిజైన్లను ఫేస్బుక్, ట్విట్టర్‌తోపాటు సీఆర్డీఏ వెబ్సైట్లో పెట్టి ప్రజల అభిప్రాయం కోరారు. వారంపాటు అభిప్రాయాలు స్వీకరిస్తారు. మరోవైపు ఈ డిజైన్లతోపాటు మరికొన్నింటిని ఈ నెల 25, 26 తేదీల్లో సీఎం లండన్‌లో పరిశీలించనున్నారు. ప్రజల అభిప్రాయాలు, ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టు ఉంటే లండన్‌లోనే తుది డిజైన్లు ఖరారయ్యే అవకాశం ఉందని సీఆర్డీఏ వర్గాలు తెలిపాయి. -
వజ్రాకృతి అసెంబ్లీ.. స్తూపాకార హైకోర్టు
♦ పలు సూచనలు చేసిన సీఎం చంద్రబాబు ∙ ♦ రాజ్‌భవన్, సీఎం నివాసాలు సిటీ స్క్వేర్ నుంచి కృష్ణా వైపునకు మార్పు సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని పరిపాలనా నగరంలో శాసనసభ సముదాయానికి వజ్రాకృతి (డైమండ్), హైకోర్టు భవన సముదాయానికి స్తూపాకృతి(పిరమిడ్) డిజైన్లు ఖరారయ్యాయి. గతంలో శాసనసభ సముదాయానికి స్తూపాకృతిని రూపొందించినా తాజాగా దాన్ని వజ్రాకృతికి మార్చారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ హైకోర్టు కోసం రూపొందించిన వజ్రాకార భవన డిజైన్‌ను అసెంబ్లీ భవనాలకు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. అసెంబ్లీ భవనాల కోసం రూపొందించిన స్తూపాకార డిజైన్‌ను హైకోర్టు భవన సముదాయం కోసం వినియోగించాలని చెప్పారు. లండన్ నుంచి వచ్చిన రాజధాని మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులు బుధవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తాము రూపొందించిన డిజైన్లపై ప్రజెంటేషన్ ఇచ్చారు. పరిపాలనా నగరం తుది డిజైన్లను ప్రభుత్వానికి సమర్పించారు. కోహినూర్‌ను అసెంబ్లీ భవనంలో చూసుకోవచ్చు హైకోర్టు డిజైన్‌ను స్తూపాకృతికి మార్చి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చూపించాలని, ఆ తర్వాత రెండు రోజుల్లో తుది డిజైన్లను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రధాన ఆకర్షణ.. సిటీ స్క్వేర్ పరిపాలన నగరం చివరి భాగాన కృష్ణానదికి అభిముఖంగా నిర్మించనున్న ‘సిటీ స్క్వేర్’ రాజధాని అమరావతికి ప్రధాన ఆకర్షణగా ఉండాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆ మేరకు సిటీ స్క్వేర్ డిజైన్లను రూపొందిం చాలని నార్మన్ ఫోస్టర్స్ బృందానికి సూచించారు. రాజ్‌భవన్, ముఖ్యమంత్రి నివాసాలను సిటీ స్క్వేర్‌లో చెరోవైపు ఉండేలా నార్మన్ ఫోస్టర్స్ సంస్థ డిజైన్ చేయగా, వాటిని అక్కడి నుంచి మార్చాలని సీఎం పేర్కొన్నారు. సిటీ స్క్వేర్ను విశాలంగా ఏర్పాటు చేయాలని, గవర్నర్, ముఖ్యమంత్రి నివాసాలను అక్కడి నుంచి తీసివేసి, నదీ తీరానికి మార్చాలని సూచించారు. రాజధానిలో నిర్మించే ప్రతి కట్టడం అత్యుత్తమంగా ఉండాలని, ఆ విషయంలో ఎక్కడా రాజీ పడబోమని స్పష్టం చేశారు. రాజధానిపై ప్రజల్లో ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయని, ఏదో ఒక రాజధాని నిర్మించాలనుకుంటే ఇంతగా పరితపించనవసరం లేదని, ప్రపంచంలోని 5 అత్యుత్తమ నగరాల్లో అమరావతిని ఒకటిగా నిలపాలన్నదే తమ లక్ష్యమన్నారు. అమరావతి–టోక్యో మధ్య విమానాలు సాక్షి, అమరావతి: అమరావతి నుంచి నేరుగా జపాన్ రాజధాని టోక్యోకు, టోక్యో నుంచి అమరావతికి త్వరలో విమాన సర్వీసులను ప్రవేశపెడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. జపాన్ ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక శాఖ మంత్రి యొసుకె తకాగి ఆధ్వర్యంలోని ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధుల బృందంతో విజయవాడలోని ఒక హోటల్లో సీఎం బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరు నెలలకోసారి తాను జపాన్ వస్తానని, అలాగే మీరు అమరావతి రావాలని జపాన్ మంత్రిని, అక్కడి పారిశ్రామికవేత్తల్ని చంద్రబాబు కోరారు. రాష్ట్రప్రభుత్వం, జపాన్ ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వశాఖ(మేటి) ప్రతినిధులు పలు అంశాలపై చర్చించారు. -
రాజధాని.. అవినీతి పుట్ట
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల మండిపాటు సాక్షి, అమరావతి: వెలగపూడిలోని నూతన శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చాంబర్లో వర్షపు నీటి లీకేజీపై నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. వారితోపాటు మీడియా ప్రతిని ధులు అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు నిబంధనలు ఒప్పుకోవన్నారు. దీంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం కొద్దిసేపు కురిసిన వర్షానికి జగన్ చాంబర్లో సీలింగ్ ఊడిపడిన విషయం తెలిసిందే. రూఫ్ నుంచి ధారాళంగా వర్షపునీరు కారడంతో బకెట్లతో తోడిపోశారు. ఈ ఘటనలో వాస్తవాలు తెలుసుకునేందుకు బుధవారం ఉదయం ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ముస్తఫా, కొక్కిలిగడ్డ రక్షణనిధి వెలగపూడి అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అక్కడున్న మీడియా ప్రతినిధులతో కలిసి లోపలికి వెళుతుండగా అసెంబ్లీ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. మీడియాను అనుమతించలేదు. ఎందుకని ఎమ్మెల్యేలు ప్రశ్నించగా అసెంబ్లీ నిబంధనలు ఒప్పుకోవని సమాధానమిచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు ఎదుటే బైఠాయించి నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని ఆందోళనకు దిగారు. వారిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించడం, ఎమ్మెల్యేలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే కోన రఘుపతి అసెంబ్లీ కార్యదర్శికి ఫోన్ చేసి తమను లోనికి ఎందుకు పంపరని ప్రశ్నించారు. స్పీకర్ అనుమతి లేకుండా మీడియాతో సహా ఎమ్మెల్యేలను లోనికి పంపలేమని కార్యదర్శి బదులిచ్చారు. అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శి విజయరాజు బయటకు వచ్చి ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. జగన్మోహన్రెడ్డి గదికి ఉన్న కిటికీలు తెరిచి ఉండడం వల్లే వర్షపు నీరు లోపలికి వచ్చిందన్నారు. అసలు జగన్ గదికి కిటికీలే లేవని, అలాంటప్పుడు వర్షపు నీరు ఎలా వస్తుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాను లోనికి పంపకూడదనే నిబంధన ఎక్కడుందో చూపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి అధికారులు కూడా గుక్కతిప్పుకోకుండా అబద్ధాలాడుతున్నారని మండిపడ్డారు. మీడియాను అనుమతించకపోతే తామూ లోనికి వెళ్లబోమంటూ ఎమ్మెల్యేలు నిరసనగా వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సీబీఐ విచారణకు ఆదేశించాలి: ఆర్కే గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ప్రభుత్వమే జగన్ చాంబర్‌కు వెళ్లే ఏసీ పైపును కట్ చేయించి తమపై నింద వేస్తోందని మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆరోపించారు. ఆయన విజయవాడలోని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఒక వ్యూహం ప్రకారం మంగళవారం రాత్రే పైపు కట్ చేయించి, ఆ ఫొటోలు ముందే తీయించిందని, కానీ వాటిని బుధవారం బయటపెట్టిందని తెలిపారు.రిపేర్ల కోసం తామే విద్యుత్తు పైపు కిందకు దించామని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ చెప్పారని, దాని నుంచి నీరు కారిందని ఇంజనీరును వెంటపెట్టుకుని వెళ్లి మరీ మీడియాకు తెలిపారని, వర్షపు నీరు లీకై కుండపోతగా ధారపడిన విషయమే కాకుండా, నిర్మాణ దశనుంచి జరిగిన కుట్రలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆర్కే కోరారు. -
ఏపీ అసెంబ్లీలోకి నో ఎంట్రీ.. ఉద్రిక్తత!
అమరావతి: ప్రపంచ స్థాయి అత్యాధునిక రాజధాని అమరావతి చిన్నపాటి వర్షానికే చిల్లులు పడిన ఘటనతో చంద్రబాబు ప్రభుత్వం ఇరకాటంలో పడింది. చిన్న వర్షానికి అసెంబ్లీ భవనం చిల్లులుపడి కురుస్తుండటంపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిజనిర్ధారణకు సిద్ధమయ్యారు. మీడియాతో కలిసి అసెంబ్లీ భవనాన్ని పరిశీలించడానికి వారు ప్రయత్నించారు. అయితే, వారితోపాటు మీడియా ప్రతినిధులను అసెంబ్లీలోకి అనుమతించడానికి మార్షల్స్ నిరాకరించారు. దీంతో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ భవనంలోని నిజానిజాలను తెలుసుకోవడానికి తమతోపాటు మీడియాను అనుమతించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు వద్ద ఆందోళనకు దిగారు. తమకిష్టమైన ప్రైవేట్ సంస్థలకు రూ.వందల కోట్లు ధారపోసి.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రాష్ట్ర నూతన శాసనసభ, సచివాలయం చిన్నపాటి వర్షానికే కురవడంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రజలకు నిజానిజాలు తెలియాల్సిన అవసరముందని, ఇందుకు అసెంబ్లీ భవనాన్ని పరిశీలించడానికి మీడియా ప్రతినిధులకు కూడా అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. మంగళవారం కేవలం 20 నిమిషాలపాటు కురిసిన సాధారణ వర్షానికే అసెంబ్లీ, సచివాలయం జలదిగ్బంధంలో చిక్కుకోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ గేటు వద్ద ఆందోళన -
160 ఎకరాల్లో అసెంబ్లీ భవనం
- 8 నుంచి 10 అంతస్తుల్లో సచివాలయం - రాజధాని నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష సాక్షి, అమరావతి: రాజధాని పరిపాలనా నగరంలో ప్రధాన ఆకర్షణగా నిలిచేలా అసెంబ్లీ భవనాన్ని 160 ఎకరాల్లో నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో 140 ఎకరాలను కేవలం జల, హరిత అవసరాల కోసమే వినియోగిస్తారు. ఈ మేరకు పరిపాలనా నగరం డిజైన్లలో పలు మార్పులు చేసినట్లు సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రి చంద్రబాబు కు తెలియజేశారు. తుది మార్పుల ప్రకారం సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవనాలను ఉత్తర దిశగా కొంచెం ముందుకు జరిపినట్లు తెలిపారు. రాజధాని నిర్మాణంపై బుధవారం వెలగపూడి సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిజైన్ల గురించి సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ వివరించారు. ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకూ లండన్‌లో పరిపాలనా నగరం డిజైన్లపై జరిగిన వర్క్‌షాపులో పాల్గొన్నామని పేర్కొన్నారు. ప్రధానంగా అసెంబ్లీ నిర్మాణం, ప్రజా రవాణా, జల వనరులపై నార్మన్ ఫోస్టర్ సంస్థ బృందంతో చర్చించినట్లు చెప్పారు. క్రిస్‌బెర్గ్ నేతృత్వంలో 90 శాతం డిజైన్ల రూపకల్పన పూర్తయిందని, ఈ నెల 22న నార్మన్ ఫోస్టర్ బృందం డిజైన్లు ఇస్తుందని వెల్లడించారు. వాటిపై ఏవైనా సలహాలు, సూచనలు ఇస్తే వాటి ఆధారంగా తుది డిజైన్లు అందిస్తారని తెలిపారు. అమరావతిలో ఎలక్ట్రికల్ కార్లు రాజధానిలో సచివాలయ భవనం 8 నుంచి 10 అంతస్తుల్లో కనీసం ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని శ్రీధర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ... అంతర్జాతీయ నగరాల్లో డ్రైవర్ లేని ఎలక్ట్రికల్ కార్లు నడుస్తాయని, అమరావతిలోనూ అలాంటి కార్లు ఉంటాయని చెప్పారు. సౌర విద్యుత్‌పై అంతర్జాతీయ సదస్సు సౌర విద్యుత్ నిల్వ వ్యవస్థను ఏర్పాటు కు గాను అత్యున్నత సాంకేతిక పద్ధతులను తెలుసుకునేందుకు త్వరలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని యోచిస్తునట్లు సీఎం మాట్లాడుతూ చెప్పారు. -
రాష్ట్రపతి భవన్‌లా.. అసెంబ్లీ
డిజైన్ల కోసం అంతర్జాతీయ ఆర్కిటెక్ట్‌ల మధ్య పోటీ వాటిలో ఒకటి ఆర్కిటెక్ట్‌ల జ్యూరీ ఎంపిక చేస్తుంది ‘సాక్షి’తో సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడి విజయవాడ బ్యూరో : ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ స్థాయిలో అమరావతిలో నిర్మించే అసెంబ్లీ భవనాన్ని డిజైన్ చేయాలని ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌లను కోరామని సీఆర్డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్ చెప్పారు. ఈ డిజైన్ల కోసం ప్రపంచంలోని మూడు అత్యుత్తమ ఆర్కిటెక్ట్ బృందాల మధ్య పోటీ పెట్టినట్లు తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రాజధాని నగరంలో నిర్మించే ప్రభుత్వ భవనాల సముదాయంలో అసెంబ్లీ, హైకోర్టు ప్రపంచ స్థాయిలో ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. అందుకు తగ్గట్టుగా ఆ భవనాలను డిజైన్ చేసేందుకు కొద్దిరోజులుగా కసరత్తు చేసి ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ ఆర్కిటెక్ట్ సంస్థలను గుర్తించామన్నారు. అందులో మూడింటిని పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పారు. నార్మన్ పోస్టర్, పాస్టర్ ప్లస్ పార్టన్స్, రోజర్ స్టర్క్ హార్పర్ ప్లస్ సంస్థలు అత్యుత్తమ ఆర్కిటెక్ట్ సంస్థలు కావడంతో వాటికి ఈ రెండు భవనాల డిజైన్లను తయారు చేయాలని సూచించామని తెలిపారు. సంస్కృతి, చరిత్ర, ఆధునికత ఉట్టిపడేలా... అమరావతి సంస్కృతి, చరిత్ర, ఆధునికత ఉట్టిపడేలా డిజైన్లు తయారు చేయాలని పలు కొలమానాలు ఇచ్చామని, ఈ నెలాఖరులోపు ఈ సంస్థలు వాటిని ఇవ్వాల్సి ఉంటుందని శ్రీకాంత్ వివరించారు. ఈ మూడు సంస్థల మధ్య డిజైన్ల రూపకల్పనలో పోటీ పెట్టామని, ఉత్తమ డిజైన్‌ను రూపొందించిన సంస్థను ముగ్గురు సభ్యుల ఆర్కిటెక్ట్‌ల జ్యూరీ ఎంపిక చేస్తుందని తెలిపారు. ఈ జ్యూరీలోనూ దేశ, విదేశాల్లోని ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌లు ఉన్నారని చెప్పారు. డిజైన్ ఎంపిక చేయడానికీ పలు ప్రమాణాలను నిర్దేశించామన్నారు. పోటీ పడే మూడు సంస్థలకు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉందన్నారు. జర్మన్ పార్లమెంటు భవనం, స్పెయిన్‌లోని బిల్‌బావొలో ఉన్న గెగెన్‌హీమ్ మ్యూజియాన్ని ఈ సంస్థలు డిజైన్ చేశాయని తెలిపారు. గెగెన్‌హీమ్ మ్యూజియం ఏర్పాటు తర్వాత బిల్బావొ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారిందన్నారు. ఎంపికైన ప్రతిపాదిత డిజైన్‌ను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత దాని పూర్తి డిజైన్‌ను రూపొందించేందుకు సంబంధిత సంస్థకు 12 నెలల సమయం పడుతుందన్నారు. ఇది అతి తక్కువ సమయమని చెప్పారు. ప్రభుత్వ భవనాల సముదాయంలోని మిగిలిన సచివాలయం, రాజ్‌భవన్ ఇతర కట్టడాల డిజైన్ల తయారీ బాధ్యతను దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్ట్‌లకు అప్పగిస్తామన్నారు. రెండు వారాల్లో తుది మాస్టర్‌ప్లాన్ సిద్ధ.... రాజధాని తుది మాస్టర్‌ప్లాన్ రెండు వారాల్లో సిద్ధమవుతుందని కమిషనర్ తెలిపారు. సింగపూర్ ప్రభుత్వ సంస్థల ప్లాన్‌లో స్థానిక పరిస్థితులు, ఇతర అంశాల ఆధారంగా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయని చెప్పారు. తుది ప్లాన్‌ను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత దానిపై 30 రోజులపాటు ప్రజాభిప్రాయం సేకరిస్తామన్నారు. దాన్నిబట్టి తుది మాస్టర్‌ప్లాన్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. దీని తర్వాత మౌలిక సదుపాయాల మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేయాల్సి ఉందన్నారు. రాజధానిలోని అన్ని అవసరాలకు సంబంధించిన ఈ ప్లాన్‌ను కూడా విదేశీ సంస్థలకు అప్పగిస్తామని, దీన్ని తయారు చేసే యంత్రాంగం, ఇంజనీర్లు మన దగ్గర లేరని తెలిపారు. ఇది కూడా పూర్తయిన తర్వాత రాజధాని ప్రాజెక్టు అభివృద్ధి మ్యాప్ పూర్తిస్థాయిలో తయారైనట్లని వివరించారు. ఈ రెండూ పూర్తయిన తర్వాత రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. రాజధానిలో రైతులకిచ్చే ప్లాట్ల సైజుపై ఇంకా నిర్ణయం జరగలేదని తెలిపారు. -
అసెంబ్లీకి అంబేద్కర్‌పేరు పెట్టాలి
ఆనందపేట: నవ్యాంధ్రలో అసెంబ్లీ భవనానికి అంబేద్కర్‌పేరు పెట్టాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ సూచించారు. గుంటూరు లక్ష్మీపురంలోని తన కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరు పెట్టాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాజధాని భవన సముదాయానికి ఎన్టీఆర్ ప్రాంగణంగా నామకరణం చేయాలని, అసెంబ్లీకి అంబేద్కర్‌పేరు పెట్టాలని, అసెంబ్లీ ఎందుట జాతిపిత మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. అదే విధంగా తుళ్లూరు కరకట్టనుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసినట్టు విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. మొదట ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాలన్నారు. జ్ఞానబుద్ధను ఐకాన్‌గా చేస్తే ప్రపంచ దేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. ప్రదేశ్ అనేది ఉత్తరానికి చెందిన పేరనీ, కాబట్టి ఆంధ్ర ప్రదేశ్‌ను తెలుగునాడు అని పేరు పెట్టాలన్నారు. చెన్నై, లండన్ మ్యూజియంలలో ఉన్న అమరావతి శిల్ప సంపదను తీసుకొచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. కాగా ఏప్రిల్ 14న తన రాజకీయ భవిష్యత్‌ను వెల్లడిస్తాననీ, సహచరులు, కార్యకర్తల సలహాలు, సూచనల మేరకు తన నిర్ణయం ఉంటుందని వివరించారు. టీడీపీలోకి డొక్కా... డొక్కా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఆయన రాజకీయ గురువు రాయపాటి సాంబశివరావు ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరి నరసరావుపేట ఎంపీగా పోటీచేసి గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయన బాటలోనే డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.