ఏపీ అసెంబ్లీలోకి నో ఎంట్రీ.. ఉద్రిక్తత!
అమరావతి: ప్రపంచ స్థాయి అత్యాధునిక రాజధాని అమరావతి చిన్నపాటి వర్షానికే చిల్లులు పడిన ఘటనతో చంద్రబాబు ప్రభుత్వం ఇరకాటంలో పడింది. చిన్న వర్షానికి అసెంబ్లీ భవనం చిల్లులుపడి కురుస్తుండటంపై ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిజనిర్ధారణకు సిద్ధమయ్యారు. మీడియాతో కలిసి అసెంబ్లీ భవనాన్ని పరిశీలించడానికి వారు ప్రయత్నించారు. అయితే, వారితోపాటు మీడియా ప్రతినిధులను అసెంబ్లీలోకి అనుమతించడానికి మార్షల్స్ నిరాకరించారు. దీంతో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ భవనంలోని నిజానిజాలను తెలుసుకోవడానికి తమతోపాటు మీడియాను అనుమతించాలని కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు వద్ద ఆందోళనకు దిగారు.
తమకిష్టమైన ప్రైవేట్ సంస్థలకు రూ.వందల కోట్లు ధారపోసి.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రాష్ట్ర నూతన శాసనసభ, సచివాలయం చిన్నపాటి వర్షానికే కురవడంపై వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రజలకు నిజానిజాలు తెలియాల్సిన అవసరముందని, ఇందుకు అసెంబ్లీ భవనాన్ని పరిశీలించడానికి మీడియా ప్రతినిధులకు కూడా అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. మంగళవారం కేవలం 20 నిమిషాలపాటు కురిసిన సాధారణ వర్షానికే అసెంబ్లీ, సచివాలయం జలదిగ్బంధంలో చిక్కుకోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ అసెంబ్లీ గేటు వద్ద ఆందోళన