
రాజధాని.. అవినీతి పుట్ట
ఈ ఘటనలో వాస్తవాలు తెలుసుకునేందుకు బుధవారం ఉదయం ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ముస్తఫా, కొక్కిలిగడ్డ రక్షణనిధి వెలగపూడి అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అక్కడున్న మీడియా ప్రతినిధులతో కలిసి లోపలికి వెళుతుండగా అసెంబ్లీ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. మీడియాను అనుమతించలేదు. ఎందుకని ఎమ్మెల్యేలు ప్రశ్నించగా అసెంబ్లీ నిబంధనలు ఒప్పుకోవని సమాధానమిచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు ఎదుటే బైఠాయించి నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని ఆందోళనకు దిగారు. వారిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించడం, ఎమ్మెల్యేలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఎమ్మెల్యే కోన రఘుపతి అసెంబ్లీ కార్యదర్శికి ఫోన్ చేసి తమను లోనికి ఎందుకు పంపరని ప్రశ్నించారు. స్పీకర్ అనుమతి లేకుండా మీడియాతో సహా ఎమ్మెల్యేలను లోనికి పంపలేమని కార్యదర్శి బదులిచ్చారు. అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శి విజయరాజు బయటకు వచ్చి ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. జగన్‌మోహన్‌రెడ్డి గదికి ఉన్న కిటికీలు తెరిచి ఉండడం వల్లే వర్షపు నీరు లోపలికి వచ్చిందన్నారు. అసలు జగన్ గదికి కిటికీలే లేవని, అలాంటప్పుడు వర్షపు నీరు ఎలా వస్తుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాను లోనికి పంపకూడదనే నిబంధన ఎక్కడుందో చూపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి అధికారులు కూడా గుక్కతిప్పుకోకుండా అబద్ధాలాడుతున్నారని మండిపడ్డారు. మీడియాను అనుమతించకపోతే తామూ లోనికి వెళ్లబోమంటూ ఎమ్మెల్యేలు నిరసనగా వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.