
సాక్షి, అమరావతి: మూడేళ్లుగా రాజధాని అమరావతిలో ఒక్క శాశ్వత భవనాన్ని కూడా నిర్మించని రాష్ట్ర ప్రభుత్వం మరో తాత్కాలికానికి సిద్ధమైంది. తాజాగా వెలగపూడిలోని అసెంబ్లీ భవనం పక్కనే కన్వెన్షన్ హాలు నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రూ. వెయ్యి కోట్లకుపైగా ఖర్చుతో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ భవనాలు నిర్మించిన విషయం తెలిసిందే. అంత వ్యయం చేసినా అవన్నీ డొల్లేనని పలుమార్లు స్పష్టమైంది. చిన్న వర్షానికే మంత్రుల గదుల్లో సైతం వర్షపు నీరు ధారాపాతంగా కారిపోవడం, గోడలు బీటలు వారడంతోపాటు పలు సమస్యలు ఈ తాత్కాలిక భవనాల్లో తరచూ కనిపిస్తున్నాయి.
అయినప్పటికీ పూర్తి స్థాయి భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టని రాష్ట్ర సర్కారు తాత్కాలికంగానే వెలగపూడిలో కన్వెన్షన్ హాలు నిర్మించాలని నిర్ణయించింది. అసెంబ్లీ భవనం పక్కనే ఉన్న పార్కింగ్ స్థలంలో దీన్ని నిర్మిస్తారు. పూర్తిస్థాయి కాంక్రీట్ నిర్మాణమైతే ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో ‘ప్రి ఇంజనీరింగ్’ స్ట్రీల్ కట్టడాన్ని వెంటనే ఏర్పాటు చేయనున్నారు. రూ.4.36 కోట్ల అంచనాతో దీన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తోంది.