అసఫ్‌జాహీల నిర్మాణ కౌశలం కొనసాగాలి
ఆగాఖాన్ ప్రతినిధులకు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబుల మార్గదర్శన
పాత అసెంబ్లీ భవన పునర్నిర్మాణంపై స్పీకర్ చాంబర్‌లో సమీక్ష
సాక్షి, హైదరాబాద్: అసఫ్‌జాహీల నిర్మాణ కౌశలం కొనసా గాలని, పాత అసెంబ్లీ భవన చారిత్రక వైభవానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పునరుద్ధరించాలని రాష్ట్ర ఆర్ అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగాఖాన్ నిర్మాణ సంస్థ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. పాత అసెంబ్లీ భవన పునరుద్ధరణ పనులపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి మంగళవారం అసెంబ్లీ స్పీకర్ చాంబర్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, ఆర్‌అండ్‌బీ అధికారులు, ఆగాఖాన్ ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ రాబోయే మూడు నెలల్లో ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, చారిత్రక వైభవానికి ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఆగాఖాన్ ట్రస్ట్ కు రూ.2 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్న విషయం తెలియడంతో వెంటనే స్పందించిన మంత్రి.. సమావేశం నుంచే ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కతో మాట్లాడి నిధులు విడుదల చేయించారు.
బిల్లుల కోసం ప్రజోపయోగ పనులను ఆపవద్దని అధికారులకు సూచించారు. ఏవైనా బిల్లులు పెండింగ్‌లో ఉన్నా, ఇతర సమస్యలేమి ఉన్నా తనకు లేదా మంత్రి శ్రీధర్‌బాబుకు చెప్పాలని కోరారు. ఈ భవనం అందుబాటులోకి వస్తే కౌన్సిల్‌హాల్‌ను అసెంబ్లీ భవనంలోకి మార్చవచ్చన్నారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పాత అసెంబ్లీ భవన పునరుద్ధరణ పనుల పర్యవేక్షణ కోసం ఎస్‌ఈ స్థాయి అధికారిని నియమించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు.
అదో పెద్ద జోక్: మంత్రి కోమటిరెడ్డి
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విద్యుత్ చార్జీల అంశంపై కేటీఆర్ ఈఆర్సీ దగ్గరకు వెళ్లడం పెద్ద జోక్ అని అన్నారు. ఆయనో జోకర్ అని, పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు రాకుండా ప్రజలు ఓడించినా వారికి బుద్ధి రాలేదన్నారు. 200 యూనిట్ల వరకు పేదలకు తమ ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందజేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డిలు రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment