
ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్‌కు బాధ్యత.. రూ.40 కోట్లతో పనులు ప్రారంభం
ఒరిజినల్ రూపం తీసుకువచ్చే క్రమంలో అదనపు నిర్మాణాల తొలగింపు
పాత పద్ధతిలో డంగుసున్నం, కరక్కాయ, నల్లబెల్లం, రాతిపొడి మిశ్రమంతోనే పనులు
బడ్జెట్ సమావేశాల నాటికి సిద్ధమయ్యే చాన్స్!.. మండలిగా వినియోగించనున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ భవన సముదాయంలోని చారిత్రక నిర్మాణా న్ని పునరుద్ధరించే పనులు మొదలయ్యాయి. గతంలో ఆ భవనం శాసనసభగా సేవలు అందించింది. కాలక్రమంలో అది బాగా పాతబడిపోవటంతో కొత్త భవనాన్ని నిర్మించి శాసనసభను అందులోకి మార్చారు. అయితే రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే, శాసనసభ ప్రాంగణాన్ని పరిశీలించి.. పురాతన భవనాన్ని పునరుద్ధరించాలని ఆదేశించారు. పునరుద్ధరణ తర్వాత దాన్ని శాసనమండలిగా వినియోగించనున్నారు.
ఇండో–పర్షియన్ నిర్మాణాలను పునరుద్ధరించటంలో గుర్తింపు పొందిన ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ (ఏకేటీసీ)కు పునరుద్ధరణ పనులు అప్పగించారు. ఇరానియన్ శైలిలో నిర్మించిన కుతుబ్‌షాహీ సమాధులను ఈ సంస్థే సొంత వ్యయంతో పునరుద్ధరిస్తోంది. ఢిల్లీ లోని హుమయూన్ టూంబ్‌ను కూడా పునరుద్ధరించింది. కాగా, 1905లో చారిత్రక నిర్మాణం ఎలా ఉందో అలానే తీర్చిదిద్దనున్నారు. ఇందుకు రూ.40కోట్లు ఖర్చవుతుందని సమాచారం.
పాలరాతి తరహా మెరుపులు
ఈ భవన నిర్మాణ శైలి ప్రత్యేకంగా ఉంటుంది. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 40వ పుట్టిన రోజుకు గుర్తుగా 1905లో ఈ భవనాన్ని నిర్మించారు. దీన్ని నాటి ప్రభుత్వ ధనంతో కాకుండా ప్రజల నుంచి విరాళాలు వసూలు చేసి నిర్మించారు. అందుకే అప్పట్లో దీన్ని పబ్లిక్ హాలు, టౌన్‌హాలుగా పిలిచేవారు. ప్రజల సందర్శనకు వీలుగా ఉన్న పబ్లిక్ గార్డెన్‌ను ఆనుకుని దీన్ని నిర్మించటం విశేషం.
రాజస్తాన్ రాజమహళ్లలోని కొన్ని నమూనాలు, కొన్ని పర్షియన్ నమూనాలు మేళవించి అద్భుత శైలిలో దీన్ని నిర్మించారు. డంగు సున్నం, కరక్కాయ, నల్లబెల్లం, గుడ్డు సొన, రాతి పొడిలతో కూడిన సంప్రదాయ మిశ్రమాన్ని దీనికి వినియోగించారు. కానీ పాలరాతితో నిర్మించిన తరహాలో కనిపించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వారసత్వ కట్టడం అయినందున కూల్చివేసేందుకు వీల్లేకపోవడంతో పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అదనపు నిర్మాణాల తొలగింపు
ఈ భవనానికి గతంలోనే పలుమార్లు మరమ్మతులు చేశారు. అవసరానికి తగ్గట్టుగా అదనపు నిర్మాణాలు కూడా జోడించారు. పైకప్పు లోపలి వైపు అదనపు చేరికలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఒరిజినల్ రూపురేఖలు వచ్చేలా ఆయా అదనపు చేరికలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి. చారిత్రక వారసత్వ భవనాల పునరుద్ధరణలో సిమెంటును వినియోగించరు.
అప్పట్లో ఏ మిశ్రమంతో భవనాన్ని నిర్మించారో అదే తరహా మిశ్రమంతోనే పనులు కొనసాగిస్తారు. ఇప్పుడు శాసనసభ భవన పునరుద్ధరణలోనూ అదే పద్ధతి అవలంభించనున్నారు. ఈ పనులు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉన్నందున పునరుద్ధరణకు చాలా సమయం పడుతుందని అంటున్నారు. అయితే వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి దాన్ని సిద్ధం చేసే లక్ష్యంతో పనులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది.
తదుపరి జూబ్లీహాలు పునరుద్ధరణ
దీని తర్వాత జూబ్లీహాలును కూడా పునరుద్ధరించనున్నారు. 1913లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పబ్లిక్‌గార్డెన్‌లో అంతర్భాగంగా దీన్ని నిర్మించారు. నిజాం ప్రభుత్వంలోని ప్రజాపనుల విభాగం ఇంజినీర్ అయిన అలీ నవాబ్ జంగ్ బహదూర్ ఆధ్వర్యంలో దీని నిర్మాణం కొనసాగింంది. ఇందులో నిజాం సమావేశాలు, సదస్సులు నిర్వహించేవారు. ఆయన పట్టాభిషేకం జరిగి 25 సంవత్సరాలు పూర్తయినప్పుడు ఇదే భవనంలో రజతోత్సవాలను నిర్వహించారు. అప్పటి నుంచే దీనిపేరు జూబ్లీహాలుగా మారింది.
అప్పుడు ఇందులో ఏడో నిజాం రాజచిహ్నంతో బంగారు పూత పూసిన సింహాసనాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆయన దానిపై కూర్చుని ప్రజలను కలిసేవారంటారు. తర్వాత ఆ సింహాసనాన్ని పురానా హవేలీ మ్యూజియంకు తరలించారు. ఇప్పటికీ ఆ సింహాసనం ఉన్న వేదిక అక్కడ ఉంది. కాగా జూబ్లీహాలు చాలా ఏళ్లపాటు నగరంలో సమావేశాలకు ఉపయోపడింది. తర్వాత కొంతకాలం దాన్ని శాసనమండలిగా కూడా వినియోగించారు.
Comments
Please login to add a commentAdd a comment