
సాక్షి, హైదరాబాద్ : ఎర్రమంజిల్ పురాతనమైన భవనం కాదన్న ప్రభుత్వ వాదన సంతృప్తికరంగా లేదని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. పూర్తి వివరణ శుక్రవారం ఇవ్వాలంటూ తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చి రాష్ట్ర చట్టసభల భవన సముదాయాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై గురువారం కూడా హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావు మరోసారి తన వాదనలు వినిపించారు. విధానపరమైన నిర్ణయాలల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం తగదన్నారు. ఈ సందర్భంగా గతంలో సుప్రీం, హైకోర్టులు ఇచ్చిన తీర్పులను కోర్టుకు చూపించారు.
అసెంబ్లీ నిర్మాణానికి ప్లానింగ్ లేకుండా హెచ్‌ఎండీఏ నుంచి అనుమతి తీసుకోలేమని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేశారు. వీస్తీర్ణం ఎంత ఉందో చూసిన తర్వాతే హెచ్‌ఎండీఏ అనుమతి తీసుకుంటామని చెప్పారు. ప్రజా ప్రయోజనాల కోసమే ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతుందని కోర్టుకు వివరించారు. ప్రసుత్తం ఉన్న అసెంబ్లీ 102 ఏళ్ల క్రితం నిర్మించారని గుర్తుచేశారు. ఆ భవనం అసెంబ్లీ కోసం నిర్మించింది కాదని రాజు గారి నివాసం కోసం నిర్మించిందని కోర్టుకు తెలిపారు. కాలక్రమేణా అది అసెంబ్లీ భవనంగా మారిందన్నారు. అసెంబ్లీకి ఉండాల్సిన వసతులు, సౌకర్యాలు లేవని తెలిపారు. ఎర్రమంజిల్ భవనాన్ని వారసత్వ భవనం కాదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం..తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.