Erramanzil Palace
-
ఎర్రంమంజిల్ జిగేల్
సాక్షి, హైదరాబాద్: అంతర్థానం కాబోతున్న వేళ అది సర్కారుకు ఆర్జన తెచ్చి పెడుతోంది. సినిమా షూటింగ్‌ల కోసం ముస్తాబైంది. సరికొత్త అందాలతో కనువిందు చేస్తోంది. ఇంకెంతకాలం నిలిచి ఉంటుందో తెలియని డోలాయమానంలో ఉన్న ఎర్రంమంజిల్ ప్యాలెస్ ఒక్కసారిగా జిగేల్‌మంటోంది. కొత్త రంగులద్దుకుని చమక్చమక్మంటోంది. నగరంలో గతించిన చరిత్రకు సజీవ సాక్ష్యం అది. నగరంలో ఉన్న పెద్ద ప్యాలెస్‌లలో ఒకటి. దాని నిర్మాణకౌశలం అబ్బురం. భవనం ఎలివేషన్‌లో చెక్కిన నగిషీలు నాటి నిర్మాణ ప్రత్యేకతను చాటిచెబుతున్నాయి. ఇంత పరిజ్ఞానం అందిపుచ్చుకున్న ఈ కాలంలో కూడా అలాంటి నిర్మాణం చేపట్టడం క్లిష్టతరమని ఆర్కిటెక్ట్‌లు అంటారు. అక్కడే తెలంగాణ ప్రభుత్వం చట్టసభలకు కొత్త భవన సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ శంకుస్థాపన కూడా చేశారు. ఆ తర్వాత కోర్టు కేసు నేపథ్యంలో దాని తొలగింపునకు విరామం ఏర్పడింది. ఆ నిర్మాణానికి క్లియరెన్స్ వస్తే ప్యాలెస్ ఉన్న స్థానంలో కొత్త అసెంబ్లీ భవన సముదాయం రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఇప్పటికే భవనం పూర్తిగా ఖాళీ చేయటంతో రోజువారీ నిర్వహణ పనులు లేక భూత్బంగ్లాగా కనిపిస్తోంది. ఈ తరుణంలో గత నాలుగైదు రోజులుగా ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి, చెత్తాచెదారం తొలగించి రంగులేయటం మొదలుపెట్టారు. ప్యాలెస్ వెనకవైపు.. రోడ్లు, భవనాల శాఖ ప్రధాన కార్యాలయ భవనం ఉన్న వైపు రంగులేయటం పూర్తయింది. చదవండి: (కరోనా మహమ్మారి కనుమరుగైనట్లేనా?) గతంలో ప్రభుత్వ కార్యాలయ భవనాలకు వేసే సంప్రదాయ ముదురు పసుపురంగు వేశారు. ఆ భవనాన్ని తిరిగి సంరక్షించేందుకు ప్రభుత్వ విభాగం చర్యలు తీసుకుందేమోనని అక్కడికి వచ్చే వారికి సందేహం కలిగింది. కానీ, దానిని సినిమా షూటింగ్ కోసం తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న భవనాన్ని అధికారులు సినిమా షూటింగులకు అద్దెకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ యువ కథానాయకుడు హీరోగా నటిస్తున్న హిందీ సినిమా రీమేక్ కోసం సినిమా యూనిట్ దాన్ని అద్దెకు తీసుకుంది. కథానుసారం, గోవాలో ఉన్న ప్రాంతంగా ఆ భవనాన్ని చూపబోతున్నారు. ఇందుకోసం గోవా నేపథ్యంలో ప్రతిబింబించేలా అక్కడ ఏర్పాట్లు చేశారు. హిందీలో రాసి ఉన్న బోర్డులను ఏర్పాటు చేశారు. చవకే.. సినిమా షూటింగ్ కోసం ఒకరోజు అద్దెగా రూ.10 వేలు వసూలు చేస్తున్నట్టు సమాచారం. అతి తక్కువ ఖర్చులో అంత కళాత్మక భవనం సమకూరుతుండటంతో సినిమా యూనిట్లు ఆ భవనంలో షూటింగ్‌లు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. పాతబడ్డప్పటికీ ఇప్పటికీ ఆ భవనంలో పటుత్వం, ఎలివేషన్ కళాత్మకంగా ఉన్నాయి. లోపలివైపు గంభీరమైన ఆర్కిటెక్చర్‌తో అది షూటింగ్‌లకు ఆహ్వానం పలుకుతోంది. త్వరలో మరికొన్ని సినిమా షూటింగ్‌లు కూడా అక్కడ నిర్వహించనున్నట్టు సమాచారం. అంతర్థానమయ్యేందుకు సిద్ధమై కూడా ఆ భవనం ఎంతోకొంత ఆర్జించి పెడుతుండటం విశేషం. -
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ షాక్
-
తెలంగాణ ప్రభుత్వానికి భారీ షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. ఎర్రమంజిల్‌లోని పురాతన భవనాలను కూల్చి నూతన అసెంబ్లీని నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టిపారేసింది. ఎర్రమంజిల్‌లోని చారిత్రాత్మక భవనాలను కూల్చి ఆ స్థానంలో కొత్త భవనాలకు తెలంగాణ ప్రభుత్వం భూపూజ కూడా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రివర్గం కూడా ఏకగ్రీవం తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో ఎర్రమంజిల్ భవనాలను కూల్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటినీ కలిపి ఉమ్మడిగా విచారించిన ధర్మాససం సుధీర్ఘ వాదనల అనంతరం సోమవారం తన తీర్పును వెలువరించింది. పురాతన భవనాల కూల్చివేతను తప్పుపడుతూ.. వాటిని కూల్చివేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతపై జూలై 3 నుంచి హైకోర్టులో పలు దఫాలుగా వాదనలు సాగుతోన్న విషయం తెలిసిందే. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. భవనాలను కూల్చివేసి వాటి స్థానంలో కొత్తవాటిని నిర్మించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త భవనం నిర్మిస్తే ట్రాఫిక్ సమస్యతో తలెత్తడంతోపాటు పురాతన కట్టడాలను పరిరక్షించాల్సిన ప్రభుత్వ బాధ్యతను విస్మరించినట్టు అవుతుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీరి వాదనతో ఏకీభవించిన ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయాన్ని తొసిపుచ్చింది. ఇదిలావుండగా.. తాజా హైకోర్టు తీర్పుతో ప్రభుత్వ తదుపరి నిర్ణయంపై ఆసక్తినెలకొంది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందింస్తో వేచి చూడాలి. -
ఎర్రమంజిల్ భవనం కూల్చివేతపై స్టే ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చరాదంటూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎర్రగడ్డలోని ‘ఇరానుమా’ కూల్చివేత ప్రయత్నాలను అడ్డుకున్నట్లుగానే ఎర్రమంజిల్ భవనం కూల్చివేత విషయంలోనూ స్టే ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయ వాది నళిన్ కుమార్ కోరారు. రెగ్యులేషన్ 13ప్రకారం హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో చేర్చారని, దీని ద్వారానే హెరిటేజ్ కన్జర్వేటివ్ కమిటీ ఏర్పడిందన్నారు. వారసత్వ జాబితాలో భవనాల్ని చేర్చినా, తిరిగి ఆ జాబితా నుంచి ఏదైనా భవనాన్ని తొలగించాలన్నా ఆ చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం చేయాలన్నారు. మరమ్మతులు చేయాలన్నా కమిటీ అనుమతి అవసరమని, ఏ అనుమతి లేకుండా ఎర్రమంజిల్ భవన ప్రదేశంలో చట్టసభల భవన సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించడం చట్టవ్యతిరేకమన్నారు. ఇరానుమా భవనం కూల్చివేయరాదన్న కేసులో హైకోర్టు.. హెరిటేజ్ కన్జర్వేటివ్ కమిటీ ఏర్పాటు చేయాలని 2015లో ఇచ్చిన ఆదేశాల్ని ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ధర్మాసనం కల్పించుకుని.. దీన్ని లోతుగా విచారించాల్సి ఉందంది. గత విచారణ సమయంలో హెచ్ఎండీఏ చట్టంలోని రెగ్యులేష న్ 13ను తొలగించినప్పటికీ జోనల్ రెగ్యులేషన్‌లో ఉన్నందున మాస్టర్ ప్లాన్‌లో అది కొనసాగుతుందని వాదించారని తెలిపింది. ఇప్పుడు జోనల్ రెగ్యులేషన్‌కు స్వయంప్రతిపత్తి ఉందని, హెచ్ఎండీఏ చట్టంలోని 13వ నిబంధన తొలగింపు ప్రభావం లేదని అందుకు విరుద్ధంగా ఎలా చెబుతున్నారో వివరణ ఇవ్వాలంది. హెచ్ఎండీఏ చట్టాన్ని రూపొందించినప్పుడు 13వ నిబంధన లేదని, తర్వాత చేర్చిన ప్రభుత్వం తిరిగి 2015లో తొలగించిందని, కొత్త చట్టంలో 13వ నిబంధన ఏ విధంగా ఉనికిలో ఉంటుందో చెప్పాలని, పిటిషనర్లను కోరుతూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. -
మాస్టర్ ప్లాన్ నివేదించండి
సాక్షి, హైదరాబాద్: ఎర్రమంజిల్ భవన కూల్చివేతను అడ్డుకోవాలని కోరుతున్న కేసులో హెచ్ఎం డీఏ మాస్టర్ ప్లాన్‌ను హైకోర్టుకు నివేదించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎర్రమంజిల్ భవన ప్రదేశంలో చట్టసభల సముదాయాన్ని నిర్మించాలనే ప్రయత్నాల్ని అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను శుక్రవారం హైకోర్టు విచారణ చేసింది. ధర్మాసనం ఆదేశాల మేరకు రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి స్వయంగా విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా హుడా చట్టంలోని 13వ నిబంధనను రద్దు చేశామని ప్రభుత్వం చెబుతున్నా ఆ నిబంధనను హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో పొందుపర్చారని ధర్మాసనానికి న్యాయవాది నివేదించారు. కొత్త అసెంబ్లీ భవన సముదాయాల నిర్మాణానికి 20 నుంచి 25 ఎకరాల భూమి అవసరమని «గణపతిరెడ్డి ధర్మాసనానికి తెలిపారు. కొత్త అసెంబ్లీ భవనాల కోసం ప్రణాళిక ఇంకా సిద్ధం కాలేదన్నారు. ప్రణాళిక బాధ్యతలను ప్రభుత్వం మూడు కన్సల్టెన్సీ సంస్థలకు ఇచ్చిందని, ఆ సంస్థల నుంచి మూడు ప్రణాళికలు వచ్చాక అందులో ఒక దానిని ప్రభుత్వం ఆమోదిస్తుందన్నారు. దీంతో ధర్మా సనం జోక్యం చేసుకుని గదులు, సమావేశ మందిరాలు ఎన్నెన్ని ఉంటాయి వంటి వివరాలు ఇవ్వాల ని కోరింది. ఇవి కన్సల్టెన్సీల నుంచి ప్రణాళికలు వచ్చాకే అవి తెలుస్తాయని గణపతిరెడ్డి సమాధానమిచ్చారు. ఇప్పుడున్న అసెంబ్లీ, కౌన్సిల్ వేర్వేరుగా ఉన్నాయని, ఇవి సుమారు 25 ఎకరాల్లో ఉన్నాయని, ఇప్పుడు కూడా అదే భూమి అవసరం అవు తుందని తెలిపారు. ప్రభుత్వం నిబంధన 13 ను రద్దు చేసిందని, ఈ పరిస్థితుల్లో ఆ నిబంధన ప్రారంభమైనప్పటి నుంచి అమల్లో లేనట్లేనని చెబుతోందని, దీనిపై ఏం చెబుతారని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. -
‘ఎర్రమంజిల్’ వారసత్వ భవనం కాదు..
సాక్షి, హైదరాబాద్ : ఎర్రమంజిల్ పురాతనమైన భవనం కాదన్న ప్రభుత్వ వాదన సంతృప్తికరంగా లేదని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. పూర్తి వివరణ శుక్రవారం ఇవ్వాలంటూ తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చి రాష్ట్ర చట్టసభల భవన సముదాయాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై గురువారం కూడా హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావు మరోసారి తన వాదనలు వినిపించారు. విధానపరమైన నిర్ణయాలల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం తగదన్నారు. ఈ సందర్భంగా గతంలో సుప్రీం, హైకోర్టులు ఇచ్చిన తీర్పులను కోర్టుకు చూపించారు. అసెంబ్లీ నిర్మాణానికి ప్లానింగ్ లేకుండా హెచ్ఎండీఏ నుంచి అనుమతి తీసుకోలేమని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేశారు. వీస్తీర్ణం ఎంత ఉందో చూసిన తర్వాతే హెచ్ఎండీఏ అనుమతి తీసుకుంటామని చెప్పారు. ప్రజా ప్రయోజనాల కోసమే ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతుందని కోర్టుకు వివరించారు. ప్రసుత్తం ఉన్న అసెంబ్లీ 102 ఏళ్ల క్రితం నిర్మించారని గుర్తుచేశారు. ఆ భవనం అసెంబ్లీ కోసం నిర్మించింది కాదని రాజు గారి నివాసం కోసం నిర్మించిందని కోర్టుకు తెలిపారు. కాలక్రమేణా అది అసెంబ్లీ భవనంగా మారిందన్నారు. అసెంబ్లీకి ఉండాల్సిన వసతులు, సౌకర్యాలు లేవని తెలిపారు. ఎర్రమంజిల్ భవనాన్ని వారసత్వ భవనం కాదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం..తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. -
ఉన్న అసెంబ్లీని కాదని కొత్త భవనం ఎందుకు?
సాక్షి, హైదరాబాద్ : పురాతన ఎర్రమంజిల్ భవన్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని కాదని కొత్త భవనం ఎందుకని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఎర్రమంజిల్ భవనం కూల్చివేత పిటిషన్‌పై విచారణ సందర్భంగా .. ఇప్పుడున్న అసెంబ్లీలో అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా?. ఎర్రమంజిల్ భవనం కూల్చివేతకు హెచ్ఎండీఏ అనుమతి తీసుకున్నారా?, అనుమతి ఉందా లేదా అన్న విషయం చెప్పడానికి ఇంత ఆలస్యం ఎందుకంటూ రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం ప్రశ్నలు సంధించింది. వాస్తవ పరిస్థితి ఏంటన్న దానిపై రేపటిలోగా వివరాలు ఇవ్వాలంటూ తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. కాగా ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చి అక్కడ అసెంబ్లీ సముదాయాన్ని నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు వాదనలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఎర్రమంజిల్ భవనాల్ని 1870లో నవాబ్ సఫ్దర్‌జంగ్ ముషీర్దౌలా ఫక్రుల్ ముల్క్ నిర్మించారని, ఆ భవనం, అక్కడి స్థలం అంశాలపై సివిల్ వివాదం ఉండగా ప్రభుత్వం ఆ భవనాన్ని కూల్చి అసెంబ్లీ భవనాన్ని నిర్మించడం చెల్లదంటూ నవాబు వారసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
అజంతా, ఎల్లోరా గుహలు కూల్చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భవనాలైనంత మాత్రాన, చారిత్రక కట్టడాల కింద రక్షణ ఉన్న భవనాలను కూల్చివేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అజంతా, ఎల్లోరా గుహలు కూడా ప్రభుత్వానికి చెందినవేనని, అంత మాత్రాన వాటిని కూల్చేస్తామంటే కుదరదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వమేమీ చట్టానికి అతీతం కాదని, ఎవరైనా సరే చట్టానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని పేర్కొంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని, ఏకవ్యక్తి పాలనలో లేమని ఘాటుగా వ్యాఖ్యానించింది. హైదరాబాద్ పట్టణాభివృద్ధి చట్టంలో నిబంధన 13 ప్రకారం 137 గుర్తించిన చారిత్రక కట్టడాలకు రక్షణ ఉందని తెలిపింది. ఈ రక్షణను తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదంది. చారిత్రక కట్టడాల రక్షణ విషయంలో కేంద్ర సాధారణ నిబంధనల చట్టంలోని సెక్షన్ 6 గురించి వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ నిర్మాణం నిమిత్తం ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ, హుడా చట్టంలో నిబంధన 13 చేర్చేంత వరకు చారిత్రక కట్టడాలకు ఎటువంటి రక్షణ ఉండదన్నారు. ఒకసారి చట్టంలో నుంచి ఓ నిబంధనను తొలగించిన తరువాత, మాస్టర్ ప్లాన్‌లో ఉన్న భవనాలకు ఎటువంటి విలువ లేదన్నారు. అలా అయితే మాస్టర్ ప్లాన్‌ను ఎవరైనా ఉల్లంఘించవచ్చునని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎర్రమంజిల్ భవనం ప్రభుత్వ భవనమని, దీని విషయంలో నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం ఉందని రామచంద్రరావు చెప్పారు. అలా అయితే అజంతా, ఎల్లోరా గుహలు కూడా ప్రభుత్వానివేనని, వాటిని కూల్చేస్తామని కేంద్రం చెబితే అందుకు ఎవ్వరూ అంగీకరించరని ధర్మాసనం తెలిపింది. చట్టాలకు లోబడి ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నప్పుడు వాటికి మాత్రమే న్యాయస్థానాల ఆమోదం ఉంటుందని గుర్తు చేసింది. చారిత్రక కట్టడాల విషయంలో సాధారణ నిబంధనల చట్టంలోని సెక్షన్ 6 గురించి వివరించాలని ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ విచారణను 22కి వాయిదా వేసింది. -
ఎన్నికలకు నో చెప్పిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు బుధవారం పలు కేసులను విచారించింది. ఈ సందర్భంగా మల్లన్నసాగర్ భూ వివాదం, మిర్యాలగూడ ఎన్నికలపై స్టే విధించగా సచివాలయం, ఎర్రమంజిల్ భవనం కూల్చివేతపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. విచారణలో భాగంగా.. సచివాలయం, ఎర్రమంజిల్‌లో పురాతన భవనం కూల్చివేతల పిటిషన్‌పై ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు తమ వాదనలను వినిపించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ ప్రభుత్వం చట్టబద్దంగానే కూల్చివేతల నిర్ణయం తీసుకుంది. నిపుణుల సిఫారసు మేరకు కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వ పాలసీ విధానాలపై ప్రశ్నించే హక్కు పిటిషనర్లకు లేదు’ అని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఏ ప్రాతిపదికత ఆధారంగా పురాతన భవనాలను తొలగించారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దానికి ప్రభుత్వ తరపు న్యాయవాది వివరణనిస్తూ.. ఎర్రమంజిల్ పురాతన భవనం కాదని, హెరిటేజ్ జాబితాలో ఎర్రమంజిల్ భవనం లేదని చెప్పుకొచ్చారు. అనంతరం చారిత్రక కట్టడాల కూల్చివేతపై కౌంటర్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణనుసోమవారానికి వాయిదా వేసింది. విచారణ వాయిదా మల్లన్నసాగర్ భూ వివాదంలో ముగ్గురు అధికారులకు జైలు శిక్ష అమలును తక్షణమే నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో రైతులకు న్యాయం చేయకుండా కోర్టును తప్పుదోవ పట్టించారని సింగిల్ బెంచ్ ముగ్గురికి జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఎన్నికలకు నో మిర్యాలగూడ, మహబూబ్‌నగర్ పురపాలక ఎన్నికల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఓటర్ల జాబితా, వార్డుల విభజన సరిగా జరగలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, బుధవారం కోర్టు దీనిపై విచారణ చేపట్టింది. అనంతరం ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది. -
ఎర్రమంజిల్ భవనాన్ని హెచ్ఎండీఏ కాపాడాలి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) చట్టంలో అర్బన్ ఆర్ట్స్ కమిషన్ ఉందని, దీని ప్రకారం ఎర్రమంజిల్‌లోని చారిత్రక భవనాన్ని హెచ్ఎండీఏ రక్షించాలని ఓ స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది స్వరూప్‌రెడ్డి హైకోర్టులో వాదించారు. ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చి అక్కడ అసెంబ్లీ సముదాయాన్ని నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సోమవారం కూడా హైకోర్టు వాదనలు కొనసాగాయి. గుర్తించిన భవనాలను రక్షించే బాధ్యత మాత్రమే హెచ్ఎండీ తీసుకుంటుందని ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు చెప్పారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం స్పందిస్తూ.. హెరిటేజ్ కమిటీకీ, హెచ్ఎండీఏలోని అర్బన్ ఆర్ట్స్ కమిషన్ మధ్య తేడాలు, ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఆ రెండింటి పాత్ర ఏమిటో చెప్పాలని కోరింది. వాదనలు మంగళవారం కొనసాగుతాయి. -
భవనాల కూల్చివేతపై ‘సుప్రీం’కు వెళ్తాం
సాక్షి, హైదరాబాద్: భవనాల కూల్చివేతపై సర్కార్ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్షా లు ఏకమయ్యాయి. సచివాలయం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత, కొత్త భవనాల నిర్మా ణం విషయంలో న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశాయి. ఈ విషయమై వచ్చేవారం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అఖిలపక్ష నేతలు వెల్లడించారు. ఈ అంశంపై వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ సాగుతుండగానే, వివిధ ప్రభుత్వ శాఖలు, భవనాల తరలింపు చేపట్టిందన్నారు. వ్యక్తిగత మూఢనమ్మకాల కోసం సీఎం కేసీఆర్ ప్రజలపై భారం మోపుతున్నారని రాజ్‌భవన్ వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. సచివాలయం, అసెం బ్లీ, ఎర్రమంజిల్ భవనాలను యథాతథంగా కొనసాగించాలని సోమవారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు అఖిలపక్ష బృందం వినతిపత్రం సమర్పించింది. ఇటీవల జి.వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ వేదిక నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో చేసిన తీర్మానాలను గవర్నర్‌కు అందజేశారు. అంతకు ముందు మాజీ ఎంపీ జి.వివేక్ నివాసంలో ఈ అఖిలపక్ష బృందం లోని జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, జువ్వాడి నర్సిం గ్రావు (టీపీసీసీ), కోదండరాం, పీఎల్ విశ్వేశ్వ ర్రావు (టీజేఎస్) ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి(టీడీపీ) డీకే అరుణ, చింతల రాంచం ద్రారెడ్డి(బీజేపీ) చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ), సంధ్య(పీవోడబ్ల్యూ) సమావేశమయ్యారు. తరలింపు పెద్ద కుట్ర: రేవంత్ సచివాలయంలోని వివిధ కార్యాలయాల తరలింపులో పెద్దకుట్ర దాగుందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏ ఆఫీస్‌లో ఉన్న రికార్డులను ఏవిధంగా పరిరక్షించాలనేది కూడా చాలా ముఖ్యమైన విషయమని అన్నారు. ఈ ఫైళ్ల భద్రత బాధ్యత కూడా గవర్నర్దేనని చెప్పారు. సచివాలయం కూల్చివేత, శాసనసభ తరలింపుపై అభ్యంతరం చెబుతూ కలగజేసుకోవాలని గవర్నర్‌ను కోరామన్నారు. ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, సెక్షన్ 8, 80 రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం జీహెచ్ఎంసీ తరఫున కస్టోడియన్ అయిన గవర్నర్ అన్ని భవనాల భద్రతను పర్యవేక్షించాలని కోరినట్టు వివేక్ చెప్పారు. ట్రాఫిక్ సహా దేనికీ ఎటువంటి ఇబ్బందులు కలిగించని సెక్రటేరియట్ భవనాలను కూల్చడం ప్రజాస్వామిక పద్ధతికాదని కోదండరాం అన్నారు. కస్టోడియన్ అయిన గవర్నర్‌కే సర్వాధికారాలున్నాయని చెప్పామని, గవర్నర్ న్యాయం చేస్తారనే విశ్వాసంతో ఉన్నామని అన్నారు. హైకోర్టులో 17 ప్రజాప్రయోజన వ్యాజ్యాలు విచారణలో ఉన్నాయనీ, అన్నింటిపై విచారణ పూర్తయ్యేవరకు సెక్రటేరియట్‌ను కూల్చొద్దని హైకోర్టు సూచించిందని పీఎల్ విశ్వేశ్వర్రావు చెప్పారు. ఎన్నో ఏళ్లు సేవలందించే భవనాలను కూలగొట్టాలన్న ఆలోచన సరైంది కాదని, రాష్ట్రాన్ని సీఎం అప్పుల ఊబిలోకి నెడుతున్నారని డీకే అరుణ విమర్శించారు. రాష్ట్రానికి సర్వం తానే అనీ, సర్వాంతర్యామి తానే అని కేసీఆర్ భావిస్తున్నారని. ఇలాంటి సీఎం తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ సమర్థించొద్దని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ప్రజాధనం వృథా చేస్తున్నారని ఎల్. రమణ, చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. గవర్నర్‌తో అఖిలపక్షం ఆసక్తికర చర్చ గవర్నర్‌తో అఖిలపక్ష నేతల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ‘ఏం రేవంత్.... ఏం జరుగుతోంది. తిరుపతిలో ఉన్నట్టున్నారు కదా’అని గవర్నర్ ప్రశ్నించగా ‘మీతో అపాయింట్మెంట్ ఉండడంతో కలవడానికి వచ్చాను’అని రేవంత్ సమాధానమిచ్చారు. తిరుపతిలో దేవుడి మాదిరిగానే గవర్నర్ వ్యవహరిస్తున్నారని నవ్వుతూ అన్నట్టు సమాచారం. ఏం జరుగుతోందంటూ షబ్బీర్ అలీని గవర్నర్ ప్రశ్నించగా ‘మీరు రెండు రాష్ట్రాల సీఎంలనే చూసుకుంటున్నారు. రాష్ట్రాలను పట్టించుకోవడం లేదు’అని షబ్బీర్ అలీ స్పందించినట్టు తెలిసింది. దీనికి గవర్నర్ స్పందిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ వేదికలపై చేసుకోవాలంటూ ఒకింత తీవ్రంగానే అన్నారు. ‘మేం చెబుతున్నది నిజమే, రెండు రాష్ట్రాలను పటించుకోవడం లేదు’అంటూ షబ్బీర్‌అలీ వాదన కొనసాగించగా, అట్లా మాట్లాడొద్దని, తాను ఇరు రాష్ట్రాలను సరిగ్గానే చూసుకుంటున్నానని గవర్నర్ బదులిచ్చినట్లు సమాచారం. చివర్లో జానారెడ్డి వ్యాఖ్యలతో అక్కడ నవ్వులు విరిశాయి. ‘ఏవో వార్తలొస్తున్నాయి. మళ్లీ గవర్నర్‌ను మేం కలుస్తామో లేదో’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు కూల్చకుండా మీరు జోక్యం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఆ విధంగా చేయాలని కోరుకుంటున్నాం. మరి చేస్తారో లేదో తెలియదు. మీకా అధికారం ఉంది. దానిని ఉపయోగించండి. గవర్నర్‌గా మీరున్నారని గుర్తుండేలా చేసి వెళ్లండి’అంటూ జానారెడ్డి చేసిన వ్యాఖ్యలపట్ల గవర్నర్ నవ్వుతూ ఉండిపోయారని తెలుస్తోంది. -
ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చొద్దు
సాక్షి, హైదరాబాద్: ఎర్రమంజిల్‌లోని పురాతన భవనాన్ని కూల్చొద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచింది. వివిధ రకాల కేసులు తమ వద్ద విచారణ దశలో ఉండగా ప్రభుత్వం ఆ భవనాన్ని కూల్చుతుందని తాము భావించట్లేదని వ్యాఖ్యానించింది. కోర్టులపట్ల ప్రభుత్వానికి గౌరవభావం ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది. ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఆశిస్తున్నాం... ఎర్రమంజిల్‌లో 150 ఏళ్ల నాటి పురాతన భవనాన్ని కూల్చి అక్కడ శాసనసభల ప్రాంగణాన్ని నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు సోమవారం విచారించింది. భవనాన్ని కూల్చరాదని హైకోర్టు చెప్పిన విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు తెలిపారు. ఈ సమయంలో మరో పిటిషనర్, సామాజిక కార్యకర్త లుబ్నా సారస్వత్ తరఫు రచనారెడ్డి కల్పించుకొని యథాతథ స్థితి (స్టేటస్ కో) ఉత్తర్వులు జారీ చేయాలని లేకుంటే భవనాన్ని ప్రభుత్వం కూల్చేసే అవకాశం ఉందన్నారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ ‘ప్రభుత్వానికి న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంటుంది. విచారణ దశలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఆశిస్తున్నాం. ఎర్రమంజిల్ భవనం విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోదని భావిస్తున్నాం’అని మౌఖికంగా పేర్కొంది. హైదరాబాద్‌లో ప్రభుత్వ భవనాలపై గవర్నర్‌కే నిర్ణయాధికారం... అంతకుముందు వాదనల సందర్భంగా తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వర్రావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014 ప్రకారం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోని ప్రభుత్వ కట్టడాలపై గవర్నర్‌కే నిర్ణయాధికారం ఉంటుందన్నారు. ఆ చట్టంలోని సెక్షన్ 8 (2) (3) ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో భవనాలు, శాంతిభద్రతల అంశాలపై గవర్నర్‌కే అధికారం ఉంటుందని, ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమలు చేయడం చట్ట వ్యతిరేకమని చెప్పారు. గతంలో ఈ భవనాన్ని వారసత్వ సంపదగా గుర్తించారని చెప్పగా అందుకు సంబంధించిన పత్రాలు సమర్పించాలని ధర్మాసనం కోరింది. ప్రభుత్వం గుర్తించకుండానే వందేళ్లు దాటిన కట్టడాలను జాతీయ వారసత్వ సంపదగా పరిగణించరని కూడా చెప్పింది. అయితే ఆ వివరాల్ని తర్వాత అందజేస్తామని, కొత్త అసెంబ్లీ భవనాల నిర్మాణం కోసం గత నెల 28న ప్రభుత్వం శంకుస్థాపన చేసిందని న్యాయవాది బదులిచ్చారు. పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారంగా చూపవద్దని, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు లేదా జీవోలను ఆధారాలుగా చూపాలని ధర్మాసనం కోరింది. ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చాలని నిర్ణయం తీసుకున్నట్లు కౌంటర్లో ప్రభుత్వం చెప్పిందని న్యాయవాది బదులిచ్చారు. దీనిపై ధర్మాసనం కల్పించుకొని ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ సముదాయాన్ని నిర్మించాలని మాత్రమే ఉందని, ఉన్న భవనాన్ని కూల్చుతామని ఎక్కడా కౌంటర్లో లేదని గుర్తుచేసింది. ఎర్రమంజిల్ వద్ద అసెంబ్లీ నిర్మిస్తే అక్కడి ఇరుకురోడ్ల కారణంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని గతంలో చెప్పారని, దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్‌లతో వివరించాలని ధర్మాసనం కోరింది. ఉన్న భవనాన్ని వదిలి కొత్త భవనాన్ని నిర్మించాలనే నిర్ణయం వల్ల ప్రజాధనం దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. హైకోర్టును ఆశ్రయించిన నవాబు వారసులు... ఎర్రమంజిల్ భవనాల్ని 1870లో నవాబ్ సఫ్దర్‌జంగ్ ముషీర్దౌలా ఫక్రుల్ ముల్క్ నిర్మించారని, ఆ భవనం, అక్కడి స్థలం అంశాలపై సివిల్ వివా దం ఉండగా ప్రభుత్వం ఆ భవనాన్ని కూల్చి అసెంబ్లీ భవనాన్ని నిర్మించడం చెల్లదంటూ నవాబు వార సులు నూరి మజుఫర్ హుస్సేన్, మరో ఏడుగురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ల తరఫు న్యాయవా ది రచనారెడ్డి కోరారు. ఎర్రమంజిల్‌లో వివిధ రూపాల్లో వినియోగించగా ఎకరం 21 కుంటల స్థలం విషయంలో ప్రభుత్వంతో 1951 నుంచి సివి ల్ వివాదం నడుస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఆ వివాదం పరిష్కారం కాకుండానే అసెంబ్లీ భవనాల నిర్మాణ ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. -
కాపాడతామని చెప్పి ధ్వంసం చేస్తారా..?
సాక్షి, హైదరాబాద్: ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ భవనాన్ని నిర్మిచవద్దంటూ వేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా గూగుల్ మ్యాప్స్‌లో ఎర్రమంజిల్ ఛాయా చిత్రాన్ని హైకోర్టు పరిశీలించింది. ఎర్రమంజిల్‌లో చారిత్రక కట్టడాల కూల్చివేతను అడ్డుకోవాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధితో పాటు, సామాజికవేత్త లుజ్ఞా సార్వత్లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ఎర్రమంజిల్‌లో కాకుండా వేరే ప్రాంతంలో అసెంబ్లీ భవనాన్ని నిర్మించుకోవాలంటూ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ప్రస్తుత అసెంబ్లీ భవనం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 294 శాసనసభ సభ్యులు 90 మంది ఎమ్మెల్సీలు ఉన్నా ఎంతో సౌకర్యంగా ఉండేదని గుర్తుచేశారు. ఈ సంఖ్య ఇప్పుడు సగానికి తగ్గిపోయినా కూడా కొత్త అసెంబ్లీ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పైగా ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ వద్ద ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేవని ఆయన చెప్పుకొచ్చారు. నూతన అసెంబ్లీ భవనాలను నిర్మిచడం వలన ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారసత్వ కట్టడాలను పరిరక్షించాలని కోరారు. ఎర్రమంజిల్‌లో సాగునీటి శాఖ, రహదారుల శాఖ, జలసౌధ కార్యాలయలున్నాయని, వాటి కూల్చివేత సరికాదని హితవు పలికారు. ఎర్రమంజిల్‌లో ప్రభుత్వం అసెంబ్లీ భవన నిర్మాణం చేపట్టకుండా స్టే ఇవ్వాలని హైకోర్టుకు విఙ్ఞప్తి చేశారు. లుజ్ఞా సార్వత్ తరపు న్యాయవాది రచనా రెడ్డి మాట్లాడుతూ.. ఎర్రమంజిల్‌లో ఫక్రు ముల్క్ నిర్మించిన ప్యాలెస్ కూల్చివేతను నిలిపివేయాలని తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. తెలంగాణ హెరిటేజ్ కమిటీ గతంలో పురాతన కట్టడాలను కాపాడుతామని చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. దీనికి సంబంధించి హెరిటేజ్ కమిటీ ఇచ్చిన నివేదికను కోర్టుకు అందజేశారు. ఇప్పుడు ఎర్రమంజిల్‌లో ఉన్న పురాతన భవనాల స్థానంలో అసెంబ్లీ భవనాలను నిర్మించాలనుకోవటాన్ని ఆమె తప్పుపట్టారు. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మించడం వలన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. -
ఎర్రంమంజిల్.. ఇక సెలవ్
సాక్షి, సిటీబ్యూరో/పంజగుట్ట: చారిత్రక భవంతి మరో చారిత్రక నిర్మాణానికి నిలయం కానుంది. నగరం నడిబొడ్డున ఉన్న ఎర్రంమంజిల్ (ఇర్రంమంజిల్) ప్రాంతంలో నూతన అసెంబ్లీ, మండలి భవన నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు, చారిత్రక ఆసక్తి ఉన్నవారు దీనిపై ఆరా తీస్తున్నారు. కొందరు ఇది సరైన ప్రదేశమని అంటుండగా మరికొందరు పురాతన చరిత్ర ఆనవాళ్లు కోల్పోతామని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రంమంజిల్ విశిష్టతలపై ‘సాక్షి’ కథనం.. ఈ పేరెలా వచ్చింది.. ‘ఇర్రంమంజిల్’ అనేది పర్షియన్ పదం. తెలుగులో ‘స్వర్గంలో నిర్మించిన అందాల భవనం’ అని అర్థం. ఒకప్పడు చుట్టూ పంట పొలాల మధ్య ఖైరతాబాద్– పంజగుట్ట మార్గంలోని చిన్న గుట్టపై ఇర్రం మంజిల్ నిర్మించారు. ఆరో నిజాంకు అత్యంత ప్రియమిత్రుడు, నిజాం హయాంలో పోలీసు, న్యాయశాఖల మంత్రి నవాబ్ ఫక్రుల్ ముల్క్ బహదూర్ ఈ భవనాన్ని 1870లో నిర్మించారు. వాడుక భాషలో ఈ భవనం ఉన్న ప్రాంతం ఎర్రమంజిల్గా మారింది. తీరైన వాస్తురీతి.. శతాబ్దాల క్రితమే ఈ భవనాన్ని 1.13 లక్షల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో ఇండో–యూరోపియన్ చారిత్రక శైలిలో నిర్మించారు. ఇందుకు రూ.30 కోట్లు ఖర్చుచేశారు. అత్యంత విశాలమైన డ్రాయింగ్‌రూమ్ ఈ భవనంలో ఉంది. వివిధ కళాకృతులతో 150 గదులు ఈ భవనంలో ఉన్నాయి. భవన ప్రాంగణంలోనే పోలో, గోల్ఫ్ కోర్టులుండేవి. పాయిగా ప్రభువులు నిర్మించిన ఫలక్‌నుమా ప్యాలెస్‌కు దీటుగా ఇర్రంమంజిల్ను తీర్చిదిద్దారు. 1948 వరకు నవాబ్ ఫక్రుల్ ముల్క్ సంబంధీకుల అధీనంలోనే ఈ భవనం ఉంది. ఆ తర్వాత 1956 వరకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ ఈ భవనం నుంచే కార్యకలాపాలు నిర్వహించింది. అనంతరం ఈ పరిసరాలను రోడ్లు, భవనాల శాఖకు అప్పగించారు. అయినప్పటికీ ఈ భవనం పరిసరాల్లో చాలా ఖాళీ ప్రదేశం ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ఈ భవనంలోని మూడు గదులను ఏపీ ఆర్అండ్బీ విభాగానికి కేటాయించారు. దీనికి కూతవేటు దూరంలోనే ఐఅండ్సీఏడీకి చెందిన విశాల భవంతి ఉంది. జలసౌధగా పిలుస్తోన్న ఈ భవనం 2.2 లక్షల చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. ఈ భవనం చుట్టూ సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్‌బెల్ట్ ఉంది. మారనున్న రూపురేఖలు.. ఖైరతాబాద్– పంజగుట్ట ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతం చుట్టూ మూడు కాలనీలు, ఒకవైపు నిమ్స్, మరో వైపు మెట్రో మాల్‌కు సమీపంలోనే ఉంది. ఈ ప్రాంతంలో సుమారు 17 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అసెంబ్లీ, మండలి భవనాలను నిర్మించనున్నారు. పార్కింగ్, సాధారణ పౌరుల రాకపోకలు, వాహనాల రాకపోకల విషయంలో నియంత్రణలు శాపంగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గతంలో వందేళ్ల చరిత్ర కలిగిన ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్ చారిత్రక భవనం తొలగించి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నిర్మించిన తర్వాత నగరంలో మరో అతి పురాతన చారిత్రక భవనం కాలగర్భంలో కలిసిపోనుండడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రూ.100 కోట్లతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల చేసిన ప్రకటన మేరకు ఎర్రం మంజిల్‌లోని 17 ఎకరాల సువిశాల ప్రాంగణంలో చట్టసభలను ఠీవీగా నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చుచేయనున్నారు. పార్లమెంట్‌ను తలపించేలా సెంట్రల్ హాల్, శాసన సభ, శాసన మండలి ఉంటాయి. బస్తీవాసుల్లో భయం..భయం.. ఎర్రంమంజిల్లో శాసనసభ, శాసన మండలి భవనాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి సమీప బస్తీవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు బస్తీ నాయకులు సమావేశమై భవనాల నమూనా ఇంకా రాలేదని, స్థలాలు ఎక్కడ నుంచి ఎక్కడి వరకు సేకరిస్తారో ఇంకా వివరించకముందే ఉద్యమాలు చేయడం ఎందుకు? మన బస్తీలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లు తెలిస్తే మాత్రం పార్టీలు, జెండాలు పక్కనపెట్టి బస్తీలు రక్షించుకునేందుకు ఐక్యంగా పోరాడదామని తీర్మానించారు. ఎవరి స్థాయిలో వారు సెక్రటేరియట్లో, ఆర్అండ్బీ కార్యాలయంలో స్థలం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు సేకరిస్తున్నారు? తమ బస్తీలకు ఏమైనా ప్రమాదం ఉందా? అనే విషయాలమై ఆరా తీస్తున్నారు. కానీ సరైన సమాచారం ఎవరి వద్దా లేదని తెలిసింది. అసెంబ్లీ, శాసనమండలి భవనాలు వస్తే ఈ ప్రాంతం మొత్తం హై సెక్యురిటీ జోన్ కిందకు వెళ్తుందని తప్పకుండా బస్తీలు తొలగించాల్సి వస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రామకృష్ణానగర్, తబేళా బస్తీలకు ప్రమాదం ఉందని బస్తీవాసులు అంటున్నారు. సుమారు 50 సంవత్సరాల చరిత్ర ఉన్న బస్తీలో 300 కుటుంబాల వరకు ఉన్నాయి. ఇంతమందిని రోడ్డుపాలు చేసే నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకోరని భావిస్తున్నాం. ఒకవేళ మా బస్తీకి ఏదైనా ప్రమాదం వాటిల్లుతుందంటే మాత్రం తీవ్రస్థాయిలో ఉద్యమిస్తాం. తప్పకుండా మా బస్తీని కాపాడుకుంటాం. – టి.వి.రమణ, రామకృష్ణానగ విడిచి వెళ్లేది లేదు.. మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. ఇప్పుడు శాసనసభ, శాసన మండలి వస్తుంది. హై సెక్యురిటీ జోన్ పరిధిలోకి వస్తుందని వెళ్లిపొమ్మంటే సహించేది లేదు. మాకు ఎలాంటి నష్టపరిహారం, వేరే చోట ఇళ్లు ఇస్తామన్నా ఒప్పుకునేది లేదు. ఇక్కడ నుండి కదిలేది లేదు. మా బస్తీలను ఎలా కాపాడుకోవాలో తెలుసు. – మురళి, రామకృష్ణానగర్ ఆ ఆలోచన విరమించుకోవాలి సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక కట్టడమైన ఎర్రమంజిల్ ప్యాలెస్ హైదరాబాద్ సొత్తని, కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసమంటూ దాన్ని కూల్చి వేయాలనే ఆలోచన విరమించుకోవాలని నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. తాము సీఎంను కలవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నామని, అయితే ఆ అవకాశం చిక్కట్లేదని పేర్కొన్నారు. రెడ్‌హిల్స్‌లోని అలీ విల్లాలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘నవాబ్ ఫక్రుల్ ముల్క్ లీగల్ హెయిర్స్ అసోసియేషన్’ ప్రతినిధులు మాట్లాడారు. అసోసియేషన్ కార్యదర్శి నవాబ్ షఫత్ అలీ ఖాన్ మాట్లాడుతూ... ‘సేవ్ ఎర్రమంజిల్ అంటూ ఓ కుటుంబం మొదలెట్టిన ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారుతోంది. కేవలం హైదరాబాద్‌లోని వారే కాకుండా అమెరికా, కెనడా దేశాల్లోని వాళ్లూ ఈ నినాదానికి మద్దతు పలుకుతున్నారు. నిజాం హయాంలో మంత్రిగా పని చేసిన ఫక్రుల్ ముల్క్ తన భవనాల్లో ఒకదాన్ని నిజాం కాలేజీ కోసం దానం ఇచ్చారు. కేవలం కొత్త నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే పాతబస్తీలోని ఇంటిని వదిలి 1870లో ఎర్రమంజిల్ ప్రాంతానికి వచ్చారు. అక్కడున్న ఓ కొండపై ఎర్రమంజిల్ ప్యాలెస్ నిర్మించారు. 150 మంది ఒకేసారి భోజనం చేసే వీలున్న డైనింగ్ రూమ్‌తో పాటు అనేక హంగులతో కూడిన ఈ ప్యాలెస్ అప్పట్లో వైస్రాయ్, గవర్నర్ జనరల్స్లనూ ఆకట్టుకుంది. వారసత్వం సంపద లాంటి దాన్ని కూల్చాలని ప్రభుత్వం నిర్ణయించడం ఫక్రుల్ ముల్క్ వారసుల్ని తీవ్ర మనోవేదనకు గురి చేస్తోంది. ఆ ప్యాలెస్ కూలే స్థితిలో ఉందంటూ వస్తున్న వార్తలు వదంతులు మాత్రమే. ఆ ప్యాలెస్ చుట్టూ ఉన్న ప్రాంతంలో అసెంబ్లీ నిర్మించే అంశాన్ని సీఎం పరిశీలించాలి. ఎర్రమంజిల్‌ను పునరుద్ధరిస్తే రాష్ట్రానికి వచ్చే విదేశీ అతి«థులకు విడిదిగా వాడుకునే ఆస్కారం ఉంటుంది. 1934లో ఫక్రుల్ ముల్క్ కన్నుమూసిన తర్వాత ఆయన ఐదుగురు కుమారులు వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. దీంతో అప్పట్లో ప్రభుత్వం కోరడంతో రూ.15 లక్షల నామమాత్రపు ధరకు ప్యాలెస్‌తో పాటు చుట్టూ ఉన్న స్థలాన్ని విక్రయించారు. ప్రభుత్వ అధీనంలో ఉంటే ఎర్రమంజిల్ తన రూపుకోల్పోదని భావించిన ఫక్రుల్ ముల్క్ కుమారులు విక్రయ సమయంలో ఆ విషయం ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఇన్నేళ్ల తర్వాత ఎర్రమంజిల్ కూల్చివేత భావ్యం కాదు. మేం ప్రభుత్వానికి విన్నవించడానికే తప్ప పోరాడటానికి సిద్ధంగా లేము. ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచన లేదు. వీలున్నంత వరకు చర్చల ద్వారా సమస్య పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తాం. ఒకవేళ ఎర్రమంజిల్‌ను కూల్చాలనే ప్రభుత్వం భావిస్తే కొత్తగా నిర్మించే అసెంబ్లీని ప్రస్తుతం ఉన్న ప్యాలెస్ మోడల్లోనే కట్టి, ఎర్రమంజిల్ పేరునే కొనసాగించాలి. అందులో ఫక్రుల్ ముల్క్ విగ్రహం పెట్టి ఆయన చరిత్రతో రికార్డులు పొందుపరచాలి’ అని పేర్కొన్నారు. -
మా బస్తీల పరిస్థితి ఏంటి?
పంజగుట్ట: ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో అధికారులు ఆ ప్రాంతానికి వచ్చి స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. ఇది జరిగినప్పటి నుంచి స్థానిక బస్తీల ప్రజలు కంటిమీద కునుకు లేకుండా ఆందోళన చెందుతున్నారు. ఎర్రమంజిల్ పక్కనే ఉన్న రామకృష్ణానగర్, తబేళాబస్తీ వాసులు తమ ఇళ్లు ఇక్కడి నుంచి తొలగిస్తారని, మరోచోట డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తారన్న పుకారు పుట్టడంతో ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఇదే విషయంపై మాట్లాడుకుంటున్నారు. తాము అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లకుండా ఉండేందుకు ఇప్పటికే పార్టీలకు అతీతంగా ఐక్యమై ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు. రెండు కాలనీలకు దాదాపు 50 ఏళ్ల చరిత్ర ఉంది. రామకృష్ణానగర్ గుట్టపైన ఉంది. పక్కనే అసెంబ్లీ నిర్మిస్తే రక్షణ సమస్య తలెత్తే అవకాశం ఉన్న నేపధ్యంలో కాలనీని తొలగించే అవకాశం ఉండగా, తబేళాబస్తీ కూడా ప్రస్తుతం అసెంబ్లీ నిర్మించే ప్రాంతానికి ఆనుకుని ఉండడంతో దాన్ని కూడా తొలగిస్తారనే పుకార్లు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే ఎర్రమంజిల్ క్వార్టర్స్ చాలామటుకు నిమ్స్ స్వాధీనం చేసుకుని అక్కడ నెఫ్రాలజీ, న్యూరాలజీ టవర్లు కట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ వస్తే ఎత్తయిన టవర్లకు కూడా అనుమతి ఇస్తారా.. లేదా..? అన్నదానిపై ప్రస్తుతం సందేహం నెలకొంది. నివాసితులతో స్థానిక నేత మంతనాలు స్థానిక ప్రజా ప్రతినిధి ఇప్పటికే రామకృష్ణానగర్ బస్తీ వాసులకు పార్టీలతో సంబంధం లేకుండా గ్రూపులుగా పిలిపించుకుని మాట్లాడుతున్నట్లు సమాచారం. డబుల్ బెడ్రూం ఇళ్లకు అనుకూలంగా ఉన్న వారికి, వ్యతిరేకంగా ఉన్న వారి అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. కాగా వారికి అనుకూలంగా ఉన్నవారు కొంతమంది వెళుతుండగా, మరి కొంతమంది చర్చలకు వెళ్లడంలేదని తెలిసింది. ఒకవేళ ఈ రెండు బస్తీలను తొలగిస్తే రామకృష్ణానగర్‌లో సుమారు 300 కుటుంబాలు, తబేళాబస్తీలో 120 కుటుంబాల వరకు రోడ్డున పడ్డం ఖాయం. దీంతో పార్టీలతో సంబంధం లేకుండా ఇప్పటికే సుమారు రెండు వేలమంది వరకు దీనికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాలనీ ప్రతినిధులు తెలిపారు. నిత్యం బిజీగా ఉండే రోడ్లలో అసెంబ్లీ నిర్మిస్తే మంరిత ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఖైరతాబాద్ నుంచి అమీర్‌పేట వరకు ఎప్పుడూ ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుంది. ఎర్రమంజిల్, నిమ్స్ వద్ద ఈ సమస్య ఇంకా అధికం. దీనికితోడు సమీపంలోనే అసెంబ్లీ నిర్మిస్తే ఏ విధంగానూ అనువైంది కాదని ఇక్కడి వారు చెబుతున్నారు. అన్నింటికీ ఇబ్బందికరంగా ఉన్న ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మాణాన్ని తాము అంగీకరించమని స్థానిక బస్తీల ప్రజలు చెబుతున్నారు. -
డెయిరీ మిల్క్ చాకొలెట్లో పురుగులు
-
క్యాడ్బరి చాకొలెట్లో పురుగులు
సాక్షి, హైదరాబాద్ : మోర్ సూపర్మార్కెట్లో చాకొలెట్ కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. చాకొలెట్లో పురుగులు దర్శనమివ్వడంతో సదరు వ్యక్తి షాక్ తిన్నాడు. వివరాలు.. వెంకటరమణ కాలనీకి చెందిన సుబ్బారావు ఎర్రమంజిల్ మోర్ సూపర్మార్కెట్లో మూడు రోజుల క్రితం క్యాడ్బరి డెయిరీ మిల్క్ చాకొలెట్ కొనుగోలు చేశాడు. గురువారం ఆ చాకొలెట్ తిందామని కవర్ ఓపెన్ చేసిన ఆయన కుమారుడికి అందులో పురుగులు కనిపించాయి. సుబ్బారావు మోర్ సిబ్బందిని వివరణ కోరగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చాకొలెట్లో పురుగులతో తమకు సంబంధం లేదని మోర్ సిబ్బంది తేల్చిచెప్పడంతో.. ఆయన విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు. -
నందమూరి జయకృష్ణకు జైలు శిక్ష
- ఆరు నెలల జైలు, రూ.25 లక్షల జరిమాన విధింపు సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. శిక్షతోపాటు రూ.25 లక్షల జరిమానాను విధించారు. ఈ మేరకు ఎర్రమంజిల్ కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. అబిడ్స్‌లోని రామకృష్ణ థియేటర్ క్యాంటిన్, పార్కింగ్ లీజుకు సంబంధించిన వివాదంలో నందమూరి జయకృష్ణ ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో నర్సింగరావు అనే వ్యక్తి ఎర్రమంజిల్‌లోని మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం జయకృష్ణను దోషిగా పేర్కొన్న కోర్టు.. కఠిన శిక్ష, భారీ జరిమాన విధించింది. ఈ తీర్పును సవాలు చేసేందుకుగానూ జయకృష్ణకు నెల రోజుల గడువు ఇచ్చింది. ఈ వ్యవహారంపై నందమూరి కుటుంబీకులు స్పందించాల్సిఉంది. -
ఎర్రమంజిల్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్
-
ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ!
మండలి భవనం కూడా అక్కడే ► 15 ఎకరాల్లో నిర్మాణానికి ప్రభుత్వం యోచన ► చారిత్రక ప్యాలస్, జలసౌధ భవనాలు తొలగించి నిర్మాణం ► సీఎం ఆదేశాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన రోడ్లు, భవనాల శాఖ ► వచ్చేనెలలో కొత్త క్యాంపు ఆఫీస్‌లోకి సీఎం ► అదే సమయంలో అసెంబ్లీ, మండలికి కొత్త భవనాలపై ప్రణాళికలు ఖరారు సాక్షి, హైదరాబాద్: శాసనసభ, శాసనమండలికి కొత్త భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఖైరతాబాద్-పంజాగుట్ట దారిలో ఉన్న చారిత్రక ‘ఎర్రమంజిల్ ప్యాలస్’ ప్రాంగణంలో వీటిని నిర్మించాలని తాత్కాలికంగా నిర్ణయించింది. ప్యాలస్ భవనాన్ని, దాని దిగువన కొనసాగుతున్న నీటిపారుదల శాఖ కార్యాలయం(జలసౌధ) భవన సముదాయాలను కూల్చి ఆ స్థలంలో అసెంబ్లీ, మండలి భవనాలు నిర్మించాలని యోచిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేయటంతో రోడ్లు, భవనాల శాఖ అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం నాంపల్లిలోని శాసనసభ, శాసనమండలి భవనాలు పాతబడటంతోపాటు ఆ ప్రాంగణం ఇరుగ్గా ఉండటంతో కొత్త భవనాలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త సచివాలయం, చట్ట సభలు, పరేడ్ మైదానం, విభాగాధిపతుల కార్యాలయాలు అన్నీ ఒకేచోట ఉండాలని సీఎం తొలుత భావించారు. ఇందుకు ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆసుపత్రి, మానసిక చికిత్సాలయం ఉన్న ప్రాంగణాలను ఎంపిక చేశారు. కానీ కొన్ని కారణాలతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. ప్రస్తుత సచివాలయం ఉన్నచోటనే భవనాలను కూల్చి కొత్త సచివాలయ భవనాన్ని నిర్మించాలని తాజాగా నిర్ణయించి పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో చట్టసభలకు విడిగా మరో ప్రాంతాన్ని ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు ఎర్రమంజిల్ భవన ప్రాంగణం అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వం దృష్టికి రావటంతో సీఎం వెంటనే ప్రతిపాదనలు పంపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కొత్త క్యాంపు కార్యాలయ భవనం సిద్ధమవుతోంది. వచ్చేనెలలో కేసీఆర్ అందులోకి మారనున్నారు. ఆ వెంటనే ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చి కొత్త భవనాల నిర్మాణం ప్రారంభించనున్నారు. అదే సమయంలో శాసనసభ, శాసన మండలికి కూడా కొత్త భవనాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్టు సమాచారం. 15 ఎకరాల విస్తీర్ణంలో.. ఎర్రమంజిల్ భవనంలో ప్రస్తుతం రోడ్లు, భవనాల శాఖ కార్యాలయం కొనసాగుతోంది. ఇటీవలే దాని వెనకే తెలంగాణ రోడ్లు భవనాల శాఖకు కొత్తగా ఆధునిక భవన సముదాయం నిర్మించి అందులోకి కార్యాలయాన్ని మార్చారు. ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ కార్యాలయం మాత్రం పాత భవనంలోనే కొనసాగుతోంది. త్వరలో దాన్ని పూర్తిగా ఏపీ రాజధానికి తరలించి భవనాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించనున్నారు. ఇక దాని దిగువన నీటిపారుదల శాఖకు చెందిన జలసౌధ భవనం ఉంది. దాని ముందు రోడ్లు, భవనాల శాఖకు చెందిన మరో పాత భవనం ఉంది. ఇప్పుడు ఈ అన్ని భవనాలను కూల్చి మొత్తం స్థలంలో ఆధునిక హంగులతో అసెంబ్లీ, మండలిని నిర్మించాలనేది ఆలోచన. ఈ మొత్తం స్థలం దాదాపు 15 ఎకరాల విస్తీర్ణం ఉంది. ప్రస్తుత అసెంబ్లీ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దానితో పోలిస్తే ఇక్కడ విశాలమైన భవనంతోపాటు పార్కింగ్, సెక్యూరిటీ తదితరాలకు మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. వారసత్వ కట్టడమే కానీ.. నగరంలో అలనాటి ప్యాలెస్‌లు ఎన్నో చారిత్రక వారసత్వ కట్టడాలుగా భాసిల్లుతున్నాయి. ఎర్రమంజిల్ ప్యాలెస్ కూడా ఆ కోవలోనిదే. అయితే ప్రస్తుత అవసరాలకు కొత్త భవనాల నిర్మాణానికి ఈ వారసత్వ హోదా కొంత అడ్డంకిగా ఉంటోందని ప్రభుత్వం భావిస్తోంది. పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రాధాన్యం ఉన్న కట్టడాలను అలాగే పరిరక్షిస్తూ... ఇతర భవనాలు, శిథిలావస్థకు చేరుకున్న పాత భవనాలను ఇతర అవసరాలకు వీలుగా వాడుకోవాలని భావిస్తోంది. ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను వారసత్వ జాబితా నుంచి తొలగించాలని అధికారులు భావిస్తున్నారు. ఖర్చు విషయంలో ఆచితూచి! భవనాల నిర్మాణానికి భారీగా ఖర్చు కానుండటంతో సీఎం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సచివాలయం కోసం తొలుత ఢిల్లీలోని నార్త్‌బ్లాక్, సౌత్ బ్లాక్ తరహాలో మూడు భవన సముదాయాలుగా నిర్మించాలని భావించారు. ఇందుకు 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని ఖరారు చేశారు. కానీ ఇటీవల దాన్ని 5 లక్షల చదరపు అడుగులకే పరిమితం చేయాలని, ఒకే బ్లాకుగా నిర్మించాలని సూచించారు. దీంతో అంచనా వ్యయం రూ.350 కోట్ల నుంచి రూ.180 కోట్లకు తగ్గింది. ఈ నేపథ్యంలో చట్టసభలకు కొత్త భవనాల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. ఆ ప్యాలెస్ వయసు 146 ఏళ్లు ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను 1870లో నిర్మించారు. నాటి నిజాం నవాబులు రాయల్ డిన్నర్లు, ఇతర వినోదాల కోసం దీన్ని విడిదిగా వాడేవారు. సంబరాలకు, కుటుంబపరమైన కార్యక్రమాలకు, ముఖ్య అతిథులు వచ్చినప్పుడు విందుల కోసం వినియోగించేవారు. ఇండో-యురోపియన్ నమూనాలో దీన్ని అత్యంత ఠీవీగా నిర్మించారు. ఇందుకు విదేశాల నుంచి నాణ్యమైన కలపను తెప్పించారు. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం తర్వాత ఇది రాష్ట్రప్రభుత్వం పరిధిలోకి వచ్చింది. అప్పట్లో దీన్ని రికార్డు స్టోర్స్‌గా వాడారు. ఆ తర్వాత పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటుకు కేటాయించారు. ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖ పరిధిలో ఉంది. ఇక శాసనసభ పాత భవనాన్ని 1905లో టౌన్‌హాల్ కోసం నాటి నిజాం ప్రభుత్వం నిర్మించింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభగా వాడుతూ వచ్చింది. చెన్నారెడ్డి సీఎంగా ఉండగా కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించారు. అందుకు 1980లో ప్రణాళిక సిద్ధం చేసి 1985లో భవనాన్ని ప్రారంభించారు. -
ప్చ్.. ‘తెలంగాణ’ కనిపిస్తలేదు!
కొత్త సచివాలయ డిజైన్లను తిరస్కరించిన సీఎం * యూరోపియన్, రోమన్ శైలిలో ఉన్నాయని పెదవి విరుపు * మళ్లీ నమూనాలు రూపొందించాల్సిందిగా ఆర్కిటెక్ట్‌కు సూచన * కొత్త అసెంబ్లీ, మండలికి స్థలాన్వేషణ * ఎర్రమంజిల్‌లో నీటిపారుదల శాఖ ప్రాంగణంపై దృష్టి సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మించబోయే సచివాలయం కోసం ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ రూపొందించిన నమూనాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తిరస్కరించారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ సచివాలయమైన సౌత్‌బ్లాక్, నార్త్ బ్లాక్ భవన నమూనాల తరహాలో తెలంగాణ కొత్త సచివాలయం కోసం కొన్ని నెలల క్రితం ఆయన డిజైన్లు రూపొందించి స్వయంగా సీఎంకు అందజేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ నమూనాలు ఎక్కడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా లేవని భావించిన ముఖ్యమంత్రి తాజాగా వాటిని తిరస్కరిం చారు. వాటిని తెలంగాణ సంప్రదాయరీతులకు తగ్గట్టుగా మార్చి కొత్త నమూనాలు రూపొందించాలని, వాస్తుపరంగా కూడా మరికొన్ని మార్పులు చేయాలని సూచించారు. దీంతో ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ కొత్త నమూనాల రూపకల్పనలో ఉన్నారు. కొత్త సచివాలయానికి ‘గుమ్మటం’ డిజైన్ సాధారణంగా సీఎం కేసీఆర్ గుమ్మటాలతో కూడిన నిర్మాణాలను ఇష్టపడతారు. అవి దక్కన్ నిర్మాణ శైలికి దగ్గరగా ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్, ఇటీవల తెలంగాణ సచివాలయానికి కొత్తగా నిర్మించిన ప్రధాన ద్వారం సెక్యూరిటీ కార్యాలయ భవనం నమూనాలు దీనికి నిదర్శనం. కొత్త సచివాలయ భవనం ప్రధాన బ్లాకుకు కూడా గుమ్మటం డిజైన్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఇక సచివాలయంలో సీఎం బ్లాక్ అన్నింటికంటే ఎత్తుగా ఉండటంతోపాటు, అందులో ముఖ్యమంత్రి కూర్చునే కార్యాలయం నైరుతి దిశలో ఉండేలా చూడాలని ఆయన సూచించారు. రెండు బ్లాకులు పెంచటం గాని లేదా సీఎం బ్లాకు 11 అంతస్తులతో నార్త్, 9 అంతస్తులతో సౌత్ బ్లాకులు ఉండేలా చూడాలని ఆయన సూచించినట్టు సమాచారం. విభాగాధిపతులు సహా 55 విభాగాల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. మొత్తం విభాగాల సంఖ్య, ఉద్యోగుల సంఖ్య, అవసరమైన వైశాల్యం... తదితర వివరాలను ఇటీవలే రోడ్లు భవనాల శాఖ అధికారులు హఫీజ్ కాంట్రాక్టర్‌కు అందజేశారు. నాలుగు రోజుల క్రితం ఆయన కార్యాలయం నుంచి వచ్చిన ప్రతినిధులు ఆర్అండ్బీ అధికారులతో సమావేశమయ్యారు. అంతకు నెల ముందు హఫీజ్ కూడా వచ్చి అధికారులతో మాట్లాడి వెళ్లారు. అసెంబ్లీ, మండలికి స్థలాల వేట ఉన్నచోటనే కొత్త సచివాలయం నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. అసెంబ్లీ, శాసనమండలి భవనాలకు వేరేచోట స్థలం వెదకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం జీఏడీ ఆధ్వర్యంలో కొన్ని స్థలాలను కూడా పరిశీలించారు. ఎర్రమంజిల్‌లో నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ పాత కార్యాలయ భవనాలున్న ప్రాంగణం అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవలే ఆర్‌అండ్‌బీకి కొత్త భవనం అందుబాటులోకి రావటంతో పాత హెరిటేజ్ భవనం ఖాళీగా ఉంది. పాత భవనాలను తొలగిస్తే దాదాపు పదెకరాల స్థలం అందుబాటులోకి వస్తుంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇంతకాలం తర్వాత.. తొలుత ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆసుపత్రిని నగర శివారు ప్రాంతానికి తరలించి అక్కడ కొత్త సచివాలయంతోపాటు అసెంబ్లీ, శాసనమండలి భవనాలను నిర్మించాలని భావించారు. కానీ దానిపై తీవ్ర విమర్శలు రావటంతోపాటు కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ప్రస్తుతం సచివాలయం ఉన్న చోటనే పాత భవనాలు తొలగించి నిర్మించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి నాలుగైదు నెలల క్రితమే హఫీజ్ కాంట్రాక్టర్ నమూనాలు రూపొందించి సీఎంకు అందజేశారు. ఆ నమూనాలను సీఎం కార్యాలయం కూడా బహిర్గతం చేసింది. త్వరలో ఏపీ సచివాలయం ఖాళీ అవుతున్నందున దసరా సందర్భంగా కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక హఫీజ్ కాంట్రాక్టర్ రూపొందించిన నమూనాల ప్రకారమే పనులు మొదలవుతాయని భావిస్తున్న తరుణంలో సీఎం వాటిని తిరస్కరించటం గమనార్హం. ఆ నమూనాలు యూరోపియన్, రోమన్ శైలిని ప్రతిబింబిస్తున్నాయని సీఎం భావిస్తున్నారు. -
మాల్యా చెక్ బౌన్స్ కేసు మరోసారి వాయిదా
హైదరాబాద్ : వేలకోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టి, విదేశాలకు పారిపోయి, రుణాలు చెల్లించేందుకు ముప్పతిప్పలు పెడుతున్న లిక్కర్ కింగ్, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా చెక్ బౌన్స్ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. కింగ్ ఫిషర్ చెక్ బౌన్స్ కేసు విచారణను హైదరాబాద్ కోర్టు మంగళవారం ఆగష్టు 4 వరకు వాయిదా వేసింది. వాయిదాల వాయిదాలు పడుతూ వస్తున్న ఈ కేసు విచారణ ఇటీవల జులై అయిదుకి వాయిదా పడింది. దీంతో నేడు విచారణ చేపట్టిన హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు...తదుపరి విచారణను మరో నెలపాటు వాయిదా వేసింది. కింగ్‌ఫిషర్ విమానాల కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టును వినియోగించుకున్నందుకుగాను జీఎంఆర్‌కు మాల్యా రూ. 50లక్షలు విలువ చేసే రెండు చెక్కులను ఇచ్చారు. బ్యాంక్ ఖాతాల్లో నగదు లేకపోవడంతో ఈ రెండు చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీనిపై జీఎంఆర్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీంతో మాల్యాను కోర్టులో హాజరుపర్చాలని కోర్టు గతంలో సమన్లు జారీ చేసింది. సమన్లు జారీ చేసిన చిరునామాలో ఉన్న నివాసాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై బ్రాంచ్ సీజ్ చేయడంతో సమన్ల జారీ ప్రక్రియ చిక్కుల్లో పడింది. ఆయన అక్కడ ఉండడం లేదని వివరిస్తూ మహారాష్ట్ర పోలీసులు కోర్టుకు నివేదించారు. దీంతో మాల్యా నివసిస్తున్న సరైన చిరునామా ఇవ్వాలని న్యాయవాది ఎం కృష్ణారావు ఈ సందర్భంగా జీఎంఆర్‌కు సూచించిన నేపథ్యంలో కేసు విచారణను వాయిదా వేసింది. జీఎంఆర్ సంస్థకు విజయ్ మాల్యా చెల్లించాల్సిన 8 కోట్ల రూపాయలకు గాను ఆయనపై మొత్తం 11 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. -
మాల్యా చెక్ బౌన్స్ కేసు జూలై 5కి వాయిదా
హైదరాబాద్ : బ్యాంకులను ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా చెక్ బౌన్స్ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. కింగ్‌ఫిషర్ విమానాల కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టును వినియోగించుకున్నందుకుగాను జీఎంఆర్‌కు మాల్యా రూ. 50లక్షలు విలువ చేసే రెండు చెక్కులను ఇచ్చారు. బ్యాంక్ ఖాతాల్లో నగదు లేకపోవడంతో ఈ రెండు చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీనిపై జీఎంఆర్ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో మాల్యను కోర్టులో హాజరుపర్చాలని కోర్టు గతంలో సమన్లు జారీ చేసింది. సమన్లు జారీ చేసిన చిరునామాలో ఉన్న నివాసాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై బ్రాంచ్ సీజ్ చేశారని, ఆయన అక్కడ ఉండడం లేదని వివరిస్తూ మహారాష్ట్ర పోలీసులు కోర్టుకు నివేదికను సమర్పించారు. దీంతో మాల్యా నివసిస్తున్న సరైన చిరునామా ఇవ్వాలని న్యాయవాది ఎం కృష్ణారావు ఈ సందర్భంగా జీఎంఆర్‌కు సూచించిన విషయం తెలిసిందే. అనంతరం కేసు విచారణను వాయిదా వేసిన విషయం తెలిసిందే. సరైన చిరునామాతో వస్తే మాల్యాకు ఫ్రెష్ వారెంట్ జారీ చేస్తామని కోర్టు పేర్కొంది. -
మాల్యా చెక్ బౌన్స్ కేసులో కొత్త ట్విస్ట్
హైదరాబాద్ : బ్యాంకుల్లో రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా చెక్‌బౌన్స్ కేసు కొత్త మలుపు తిరిగింది. జీఎంఆర్ సంస్థ నమోదు చేసిన చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు జారీ చేసిన వారెంట్‌ను ముంబై విలేపార్లే పోలీసులు తిప్పిపంపారు. కాగా మాల్యా నివాసాన్ని ఎస్బీఐ సీజ్ చేసిందని, కింగ్ఫిషర్కు చెందిన యాజమాన్యం, ఉద్యోగులెవరూ లేరని ముంబై పోలీసులు బుధవారం లిఖితపూర్వకంగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో మాల్యా కొత్త చిరునామాను జూన్ 6లోగా తెలపాలని పోలీసుల్ని ఎర్రమంజిల్ కోర్టు ఆదేశించింది. అలాగే మాల్యాకు మరోసారి వారంట్లు జారీ చేయాలని కోర్టు నిర్ణయించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ను వాడుకున్నందుకు గాను జీఎంఆర్ సంస్థకు గతంలో విజయ్ మాల్యా చెక్కులను సమర్పించారు. అయితే, ఈ చెక్ బౌన్స్ కావడంతో జీఎంఆర్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. జీఎంఆర్ సంస్థకు విజయ్ మాల్యా చెల్లించాల్సిన 8 కోట్ల రూపాయలకు గాను ఆయనపై మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. -
మాల్యాకు మరో షాక్!
హైదరాబాద్: వివిధ బ్యాంకులకు డబ్బు ఎగవేతకు పాల్పడి ఇప్పటికే విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జీఎంఆర్ సంస్థ నమోదు చేసిన చెక్ బౌన్స్ కేసులో ఆయన చట్టాలను అతిక్రమించినట్లు నిర్థారణ అయింది. విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ను వాడుకుంన్నందుకు గాను జీఎంఆర్ సంస్థకు గతంలో విజయ్ మాల్యా చెక్కులను సమర్పించారు. అయితే, ఈ చెక్ బౌన్స్ కావడంతో జీఎంఆర్ సంస్థ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బుధవారం ఎర్రమంజిల్ కోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా.. విజయ్ మాల్యా చట్టాలను అతిక్రమించినట్లు నిర్థారణ అయింది. మే 5న ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం తుదితీర్పును వెలువరించనుంది. జీఎంఆర్ సంస్థకు విజయ్ మాల్యా చెల్లించాల్సిన 8 కోట్ల రూపాయలకు గాను ఆయనపై మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. -
జీవితా రాజశేఖర్‌కు ఊరట
హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో సినీనటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ కు ఊరట లభించింది. ఆమెపై ఉన్న చెక్ బౌన్సు కేసును ఎర్రమంజిల్ కోర్టు శనివారం కొట్టేసింది. ఈ సందర్భంగా జీవితా మాట్లాడుతూ తనను కోర్టుకు లాగిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని, కావాలనే తన దగ్గర నుంచి చెక్‌లు తీసుకుని, కేసులో ఇరికించారని ఆరోపించారు. తనపై కేసు కొట్టివేయడం సంతోషంగా ఉందన్నారు. కాగా జీవితా రాజశేఖర్ 2007లో 'ఎవడైతే నాకేంటి' అనే సినిమా నిర్మించారు. ఇందుకోసం సామ శేఖర్‌రెడ్డి వద్ద రుణం తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడికి ఇచ్చిన చెక్ బౌన్స్ కావటంతో కోర్టును ఆశ్రయించాడు. కేసు విచారించిన ఎర్రమంజిల్ కోర్టు 2014లో జీవితకు రూ. 25 లక్షల జరిమానా, రెండేళ్ల జైలుశిక్ష విధించింది. అనంతరం ఆమె బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఎర్రమంజిల్ కోర్టు తీర్పుపై సామ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... జీవితా రాజశేఖర్‌పై హైకోర్టులో అప్పీల్ చేస్తామన్నారు. -
కోర్టు ఆవరణలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: కేసు విచారణ నిమిత్తం ఎర్రమంజిల్ కోర్టుకు వచ్చిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన పి.వంశీకృష్ణ (30)ను మారేడ్‌పల్లి పోలీసులు 2012లో వ్యభిచారం కేసులో అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ-1 ముద్దాయి అయిన వంశీకృష్ణ అప్పటి నుంచి కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరవుతూ ఉన్నాడు. మంగళవారం కేసు విచారణ ఉండటంతో కోర్టుకు వచ్చాడు. బెంచ్‌లో తన కేసు విచారణ జరుగుతుండగా వంశీకృష్ణ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. నోటి నుంచి నురగలు రావడం గమనించి అక్కడి సిబ్బంది వెంటనే సోమాజిగూడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, బాధితుడి వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా సంబంధీకులకు ఫోన్ చేస్తే వారు అతనితో తమకు సంబంధంలేదని చెప్తున్నారని పోలీసులు తెలిపారు. కోర్టు సూపరింటెండెంట్ శోభాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోర్టు ఆవరణలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : కోర్టు వాయిదాకు హజరయ్యేందుకు వచ్చిన ఒక వ్యక్తి అదే కోర్టు ఆవరణలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం నగరంలోని ఎర్రమంజిల్ కోర్టు ఆవరణలో చోటు చేసుకుంది. వివరాలు..ఒక కేసు విషయంలో పశ్చిమగోదావరికి చెందిన వంశీకృష్ణ(35) కోర్టులో హాజరయ్యాడు. కాగా, తన వాదనను కోర్టులో న్యాయవాదికి వినిపించాలని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో అతను కోర్టు పరిసరాల్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన పోలీసులు నిందితుడిని వెంటనే స్థానికంగా ఉన్న యశోదా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వంశీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. (ఎర్రమంజిల్) -
రెయిన్-బో హైదరాబాద్!
నేను ఎర్రమంజిల్ రోడ్లో తిరుగుతూ ఏదో వెతుకున్నట్లుగా ఉండటం చూసి మా ఫ్రెండ్ అడిగాడు... ‘ఏమిట్రా వెతుకుతున్నావ్?’ అని. ‘ఇది ఎర్రమంజిల్ రోడ్డు కదా. ఎర్ర మంజిల్ అంటే ఎరుపు రంగులో ఉండే భవంతి కదా! అదెక్కడ ఉందా అని వెతుకుతున్నా’ అన్నాను నేను. అంతే... లెక్చర్ మొదలుపెట్టాడు నా ఫ్రెండ్. ‘ఒరే... పిచ్చోడా! అది ఎర్రమంజిల్ కాదురా. ఇర్రమ్ మంజిల్. అంటే స్వర్గంలో ఉన్న భవంతి అని అర్థం. అప్పట్లో సఫ్దర్‌జంగ్ ముషీరుద్దౌలా ఫఖ్రుల్ ముల్క్ అని నిజాంకు ఒక స్నేహితుడూ కమ్ సలహాదారు ఉండేవాడు. ఆయన భవంతి అది. అది ఎరుపు రంగులో ఉండదు. ఆ హెరిటేజ్ బిల్డింగ్‌ను మొదట్లో పీడబ్ల్యూడీకి ఇచ్చారు. ఆ తర్వాత అది ఇరిగేషన్ అనీ, ఆర్ అండ్ బీ అని విభజితమైంది. అప్పట్లో ఇరిగేషన్ ఇంజనీర్-ఇన్-చీఫ్ ఉండేవారు. ఇప్పుడు వాళ్లు వేరే బిల్డింగ్ కట్టుకుని వెళ్లిపోతే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంటు వాళ్లుంటున్నారట’ అని సమాచారం చెప్పాడు వాడు. ‘అరె... ఇంతకాలం నేను ఎర్రమంజిల్ అంటే రెడ్ కలర్ బిల్డింగేమో అని పొరబడ్డానే’ అని నేను అంటే... ‘ఇంకా నయం... ఎర్రగడ్డ అంటే ఆ ప్రాంతమంతా ఎర్రగా ఉంటుందేమో అనీ అనుకోలేదు’ అన్నాడు వాడు. ‘నువ్వేమైనా చెప్పరా. ఎర్రగడ్డ ఎరుపులో లేకపోవచ్చేమో గానీ... రెడ్ కలర్‌కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు మనవాళ్లు. అమీర్‌పేట సెంటర్ నుంచి బేగంపేట పోయే రోడ్లో ఉన్న ఒక ల్యాండ్‌మార్క్ భవనం పేరేమిటో తెలుసా... లాల్ బంగ్లా’ అన్నాను నేను. ‘ఆ మాటకొస్తే గ్రీన్కూ చాలా ఇంపార్టెన్స్ ఉంది. బడీ చౌడీ పక్కనే ఉన్న మసీదు పేరేమిటో తెలుసా... హరీ మస్జిద్. ఇక్కడ హరీ అంటే ఉర్దూలో గ్రీన్ అని అర్థం. బడీచౌడీ పోలీస్ స్టేషన్ పక్కనే ఉండే అది పేరుకు తగ్గట్టుగా గ్రీన్ కలర్లో ఉంటుంది. నమాజ్ కోసం ముస్లింలు హరీ మస్జిద్ అని గ్రీన్ మసీదు నిర్మించుకుంటే ఇక నగేశ్ కుకునూర్ అనే డెరైక్టర్‌కు బ్లూ అంటే ఇష్టమేమో హైదరాబాద్ బ్లూస్ అనే సినిమాను సీక్వెల్‌తో పాటు రెండుసార్లు నిర్మించాడు’ అన్నాడు వాడు. ‘అబ్బా నిజంగా హైదరాబాద్ అంతా కలర్‌ఫుల్ రా’ అన్నాన్నేను ముచ్చటపడుతూ. ‘ఒరేయ్... ఏదో లాల్‌బంగ్లా, హరీమసీద్ను బట్టి అన్నీ అలాగే అనుకోకు. ఇప్పుడు నల్లకుంట నల్లగా ఉండదు... తెల్లాపూర్ తెల్లగా ఉండదు. నీలాద్రీ నగర్ నీలంగా ఉండదు. ఏదో అప్పట్లో ఆ ఏరియాలకు అలా పేర్లు పెట్టారు’ అని చెప్పాడు వాడు. ‘నువ్వేమైనా చెప్పరా. అవి ఆయా రంగుల్లో ఉండకపోవచ్చుగానీ... హైదరాబాద్‌ను చూస్తే నాకు ఇంద్రధనుస్సు గుర్తొస్తుంది. మామూలుగా అయితే ఇంద్రధనుస్సులో సగమే మనకు కనపడుతుంది కదా. అదే విమానంలో వెళ్లేవాళ్లకు మొత్తం వృత్తాకారంలో కనిపిస్తూ ఉంటుందట. అలాగే... ఆ వృత్తాకారపు ఇంద్రధనుస్సు అంచులను ఔటర్ రింగ్‌రోడ్డుకు ఆనించి, కోయిన్సైడ్ అయ్యేలా నేల మీద పరిచామనుకో. అప్పుడు నేల మీద పరచిన ఇంద్రధనుస్సులాంటి అరౌండ్ అండ్ సరౌండ్స్ ఆఫ్ హైదరాబాద్. అవే నా కలర్స్ ఆఫ్ హైదరాబాద్. అదే నా రెయిన్బో హైదరాబాద్’ అన్నాన్నేను పరవశంగా. -
స్వర్గధామం
విశాలమైన ప్రాంగణం... అందులో కొలువుదీరిన అద్భుత భవనం. వందకు పైగా గదులు... లెక్కకు మించి అశ్వాలు... పాడి ఆవులు. కళకళలాడే ఫర్నిచర్... కళ్లు చెదిరే కళాకృతులు... క్రీడా ప్రాంగణాలు. స్వర్గాన్ని తలపించే అలనాటి ఎర్రమంజిల్ ప్యాలెస్ దర్పం ఇది. ఖైరతాబాద్- పంజగుట్ట మధ్యన నిర్మించిన ఈ భవనం నాటి నగర వైభవానికి సాక్ష్యం. ‘ఎర్రమంజిల్’ పర్షియన్ పదం. దీనికి అర్థం... ‘స్వర్గంలో నిర్మించుకున్న అందమైన భవనం’ అని చెబుతారు. 1870 ప్రాంతంలో నవాబ్ ఫక్రూల్ ముల్క్ బహదూర్ దీన్ని నిర్మించారు. ఈయన ఆరో నిజాంకు అత్యంత సన్నిహిత స్నేహితుడే కాదు, ఆయన ఆస్థానంలో పోలీసుల, న్యాయశాఖల మంత్రిగా కూడా ఉన్నారు. ఈ అందాల సౌధం రెండు అంతస్తుల్లో, ఇండో-యూరోపియన్ శైలిలో నిర్మించారు. ఈ ప్యాలెస్ మొత్తం విస్తీర్ణం 1.13 లక్షల చదరపు అడుగులని అంచనా. ప్యాలెస్ లోపల చక్కని కళాకృతులతో పాటు ఫర్నిచర్ హంగులు ఆకట్టుకుంటాయి. అలాగే అత్యంత విశాలమైన డైనింగ్ హాలు ఈ ప్యాలెస్‌కు ఒక ప్రత్యేక ఆకర్షణ. భవనం లోపల సుమారుగా 150కి పైగా గదులున్నాయి. ఆ రోజుల్లోనే దీని నిర్మాణానికి 30 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అంచనా. ఎర్రమంజిల్ ప్రాంగణంలోనే విశాలమైన గోల్ఫ్, పోలో క్రీడా కోర్టులుండేవి. 200 అశ్వాలు, మరెన్నో పాడినిచ్చే ఆవులు, గేదెలకు ఆలవాలంగా ఉండేది. ఆనాటి రాచరికపు విందులు, అనేక అధికార కార్యక్రమాలు ఈ ప్యాలెస్‌లోనే జరిగేవి. అంతేకాదు, పాయిగాలు నిర్మించిన ఫలక్‌నుమా ప్యాలెస్‌ను తలదన్నేలా ఎర్రమంజిల్ ఉండాలన్నది ఈ భవన నిర్మాత తలపోశారని చరిత్రకారులు చెబుతారు. భారత స్వాతంత్య్రానంతరం ఎర్రమంజిల్ ప్యాలెస్ ముందుగా పబ్లిక్ వర్క్స్ శాఖ వారి ఆధీనంలోకి వచ్చింది. ఆ తరువాత రాష్ర్ట ప్రభుత్వ పరిధిలోని రోడ్లు, భవనాలు, సాగునీటి పారుదల శాఖల కార్యాలయాలు ఇక్కడ పనిచేస్తున్నాయి. మండుటెండాకాలంలో కూడా చల్లగా ఉండే ఈ భవనం వారసత్వపు వాసనలు స్థానిక అధికారులు, సిబ్బందిలో చాలా కొద్ది మందికే తెలుసు. ఈ క్రమంలో రాచఠీవీతో అలరారుతున్న ఎర్రమంజిల్ విశిష్టతను తెలియజెప్పేలా ఇక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలనేది చరిత్రకారుల అభిప్రాయం. రోజురోజుకూ శిథిలావస్థకు చేరుతున్న ఈ ప్యాలెస్‌కు తక్షణమే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న ఈ రాచరికపు భవనాన్ని పర్యాటక శాఖ సిటీ టూర్ ప్యాకేజీల్లో చేర్చాలి. తద్వారా దీని విశిష్టత మరింత మందికి తెలిసే అవకాశం ఉంటుంది. -
చెక్‌బౌన్సు కేసు.. జీవితకు బెయిల్
-
చెక్‌బౌన్సు కేసు.. జీవితకు బెయిల్
హైదరాబాద్ : చెక్‌బౌన్సు కేసులో సినీనటి, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి జీవితకు బెయిల్ లభించింది. సోమవారం మధ్యాహ్నం జీవిత 25 లక్షల రూపాయల జరిమానాను చెల్లించడంతో ఎర్రమంజిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు కోర్టు జీవితకు రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 25 లక్షల జరిమానా విధించింది. తీర్పు వెలువడిన వెంటనే జీవిత కోర్టులో కన్నీటిపర్యంతమయ్యారు. ఈ కేసుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. 2007లో ఎవడైతే నాకేంటి అనే సినిమా నిర్మించారు. అందుకు సామ శేఖర్‌రెడ్డి వద్ద రుణం తీసుకున్నారు. సినిమా రైట్స్ కూడా ఇస్తామని చెప్పారు. అయితే, ఏడేళ్లయినా తనకు డబ్బులు ఇవ్వలేదని, అనేకసార్లు ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని శేఖర్ రెడ్డి చెప్పారు. ఇన్నాళ్లు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో చివరకు 2014 జనవరిలో ఎర్రమంజిల్ కోర్టులో తాను చెక్ బౌన్స్ కేసు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. కేసు విచారించిన ఎర్రమంజిల్ కోర్టు జీవితకు జరిమానా, జైలుశిక్ష విధించింది. -
చెక్‌బౌన్స్ కేసు: జీవితకు రెండేళ్ల జైలు
-
చెక్‌బౌన్స్ కేసు: జీవితకు రెండేళ్ల జైలు
చెక్‌బౌన్సు కేసులో సినీనటి, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి జీవితకు రెండేళ్ల జైలుశిక్ష పడింది. రూ. 25 లక్షల జరిమానా కూడా విధించారు. 2007లో ఎవడైతే నాకేంటి అనే సినిమా నిర్మించారు. సామ శేఖర్‌రెడ్డి వద్ద రుణం తీసుకున్నారు. సినిమా రైట్స్ కూడా ఇస్తామని చెప్పారు. అయితే, ఏడేళ్లయినా తనకు డబ్బులు ఇవ్వలేదని, అనేకసార్లు ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని శేఖర్ రెడ్డి చెప్పారు. ఇన్నాళ్లు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో చివరకు 2014 జనవరిలో ఎర్రమంజిల్ కోర్టులో తాను చెక్ బౌన్స్ కేసు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. కేసు విచారించిన ఎర్రమంజిల్ కోర్టు జీవితకు రూ. 25 లక్షల జరిమానా, రెండేళ్ల జైలుశిక్ష విధించింది. (ఇంగ్లీషు కథనం) -
హైకోర్టు భవనం వేటలో కేసీఆర్ !
* కింగ్‌కోఠి, ఎర్రమంజిల్ పరిశీలన * హైకోర్టు వేరైతే.. ఏదో ఒక రాష్ట్రానికి పనికొస్తుందని యోచన * ఢిల్లీ నుంచి రాగానే సీఎస్‌తో కలసి పర్యటన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు విభజన కోరుతున్న సీఎం కేసీఆర్ స్వయంగా తగిన భవనాల కోసం అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టుభవనం విభజనలో ఏ రాష్ట్రానికి వెళ్లినా, ఇంకో హైకోర్టును మరోచోట ఏర్పాటు చేయక తప్పదు. అందుకే సీఎం చారిత్రక కట్టడాలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తును కలసి, ఆదివారం రాత్రి హైదరాబాద్ చే రుకున్న సీఎం సోమవారం మధ్యాహ్నం తర్వాత కింగ్‌కోఠిలోని పర్దా ప్యాలెస్‌ను, ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ ఈఎన్సీ కార్యాలయాన్ని పరిశీలించారు. మరికొన్ని భవనాలను కూడా పరిశీలించే యోచనలో ఉన్నట్టు తెలిసింది. సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ కూడా ఈ భవనాలను పరిశీలించారు. రాష్ట్ర విభజనతో సచివాలయం ఇరుకుగా మారినందున, హైకోర్టు విభజన వల్ల అక్కడ న్యాయమూర్తులు, న్యాయవాదులు ఇబ్బంది పడకుండా చూడాలన్న భావనతోనే ఈ భవనాల వేటలో సీఎం పడ్డట్టు తెలి సింది. కింగ్‌కోఠిలోని పర్దా ప్యాలెస్‌లో గతంలో నిజాం నవాబు నివసించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రాజభవనం ఆలనాపాలనా లేక శిథిలావస్థకు చేరుకుంటోంది. ఈ భవనాన్ని ముఖ్యమంత్రి పరిశీలించినట్టు ఓ అధికారి వివరించారు. హైకోర్టు విభజన కోసం ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లను కలసిన విషయం విదితమే. ఇటీవలి పర్యటనలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ ఎల్ దత్తును కలసి త్వరగా హైకోర్టును విభజించాలని విన్నవించిన సంగతి తెలిసిందే. -
శ్వేతబసుకు కోర్టులో చుక్కెదురు!
హైదరాబాద్: సినీనటి శ్వేత బసును అప్పగించాలని కోర్టుకు ఆమె తల్లి తండ్రులు చేసిన విజ్క్షప్తిని సోమవారం ఎర్రమంజిల్ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో శ్వేత బసు పెట్టుకున్న పిటిషన్ పై విచారణ జరిపారు. తల్లితండ్రులకు అప్పగించేందుకు కోర్టు నిరాకరించింది. అర్నెళ్లపాటు పునరావాస కేంద్రంలో ఉండాలని కోర్టు ఆదేశించింది. గత నెల వ్యభిచార కేసులో సినీనటి శ్వేతబసు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
ఎర్రమంజిల్ కోర్టుకు హజరైన కొత్తపల్లి గీత
హైదరాబాద్: చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టుకు ఎంపీ కొత్తపల్లి గీత హాజరయ్యారు. తనకు వ్యతిరేకంగా జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను రీకాల్ చేయాలని చేసిన విజ్క్షప్తికి ఎర్రమంజిల్ కోర్టు సానుకూలంగా స్పందించింది. దాంతో కొత్తపల్లి గీతపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్ ను కోర్టు రీకాల్ చేసింది. గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 25 కోట్ల రుణాన్ని కొత్తపల్లి గీత తీసుకున్నారు. కొత్తపల్లి గీత ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కోర్టులో పిటిషన్ వేశారు. విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కొత్తపల్లి గీత, ఆమె భర్త సీఆర్‌కే రావులు డైరెక్టర్లుగా ఉన్నారు. -
ఎంపీ కొత్తపల్లి గీతకు అరెస్ట్ వారెంట్
హైదరాబాద్: విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీతాకు నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీ అయ్యింది. చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు సోమవారం ఆమెకు ఈ వారెంట్ జారీ చేసింది. కొత్తపల్లి గీత... విశ్వేశ్వరయ్య ఇన్ఫ్రాస్టక్చర్ సంస్థకు డైరెక్టర్ గా ఉన్న ఆమె ఇచ్చిన చెక్కు చెల్లలేదు. దీంతో చెక్కు అందుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే కేసు విచారణ నిమిత్తం కొత్తపల్లి గీత కోర్టుకు హాజరు కాకపోవటంతో కోర్టు వారెంట్ జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. -
ఎర్రమంజిల్ కోర్టుకు శ్వేతాబసు ప్రసాద్
హైదరాబాద్ : వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడిన వర్థమాన నటి శ్వతాబసు ప్రసాద్‌ను పోలీసులు సోమవారం ఎర్రమంజిల్ కోర్టులో ప్రవేశపెట్టారు. నగరంలోని ఓ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ ఆదివారం ఆమె పోలీసులకు పట్టబడిన విషయం తెలిసిందే. కాగా బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా చేసిన దాడిలో శ్వేతాబసు ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి బాలు అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దర్ని పోలీసులు ఈరోజు ఉదయం కోర్టులో హాజరు పరిచారు. కాగా నటి శ్వేతబసు ప్రసాద్‌ను ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించాలని కోర్టు పంజాగుట్ట పోలీసులను ఆదేశించింది. అలాగే బాలును చర్లపల్లి జైలుకు తరలించారు. పోలీసులు బాలును కస్టడీలోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అతడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
54 మంది ‘నిషా’చరులకు జైలు
హైదరాబాద్ : ప్రమాదకర స్థాయిలో మద్యం తాగి వాహ నాలు నడుపుతూ గత వారాంతంలో ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన 296 మంది వాహనచోదకుల్లో 54 మందికి జైలు శిక్షపడిందని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అమిత్‌గార్గ్ గురువారం వెల్లడించారు. ఎర్రమంజిల్‌లోని మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి బి.చెంగల్రాయనాయుడు ఎనిమిది మందికి ఐదు రోజులు, మరో 39 మందికి మూడు రోజులు శిక్ష విధించగా... నాలుగో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శివశంకర్ ప్రసాద్ ఒకరికి ఐదు రోజులు, మరో ఆరుగురికి ఒక రోజు చొప్పున జైలు శిక్ష విధించారు. వీరితో పాటు మిగిలిన వారికి రూ.2,600 వరకు జరిమానా విధించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మద్యం తాగి వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన వారి సంఖ్య 12,976కు, జైలు శిక్షపడిన వారి సంఖ్య 1,181కు చేరిందని అమిత్‌గార్గ్ వివరించారు. -
మహిళ సజీవ దహనం
హైదరాబాద్, న్యూస్‌లైన్: దీపావళి పండుగపూట హైదరాబాద్‌లోని పం జాగుట్ట ప్రాంతంలో ఓ ఇంట్లో విషా దం అలముకుంది. టపాసు వచ్చి గుడిసెపై పడడంతో అది పూర్తిగా దగ్ధమై, అందులో నిద్రిస్తున్న ఓ మహిళ సజీవ దహనమైంది. స్థాని కులు స్పందించి మంటలను ఆర్పేయడంతో చుట్టుపక్కల వారికి ప్రమా దం తప్పింది. వివరాలు.. పంజాగుట్ట పరిధిలోని రామకృష్ణనగర్ కాలనీలో కన్నబోయిన సంఘమేశ్వర్, అతని భార్య నాగమణి(50) లు ఓ గుడిసెలో నివసిస్తున్నారు. వీరి పిల్లలు పెళ్లిళ్లు చేసుకొని వెళ్లిపోవడంతో వీరు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. సంఘమేశ్వర్ శనివారం మెదక్ జిల్లా బాచుపల్లికి వెళ్లడంతో నాగమణి ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఇదిలావుంటే, శనివారం అర్ధరాత్రి సమయంలో దీపావళి టపాసు స్కైలాంప్ జీవీకే వైపు నుంచి దూసుకువచ్చి నాగమణి ఉన్న గుడిసెపై పడింది. దీంతో ఒక్కసారిగా గుడిసెకు నిప్పంటుకుంది. అయితే, గాఢనిద్రలో ఉన్న నాగమణి ఈ ప్రమాదం గ్రహించేలోగానే మంటల్లో చిక్కుకుని సజీవదహనమైంది. ఇంట్లోని టీవీ, ఫ్యాను, గ్యాస్ స్టౌ, మంచం, బట్టలు, ఇతర వస్తువులు, నిత్యావసర సరుకులు పూర్తిగా కాలిపోయాయి. ఈ సమయంలో నాగమణి గుడిసెను ఆనుకుని ఉన్న జలేందర్‌కు చెందిన గుడిసెకూ నిప్పంటుకుంది. మంటలు టీవీకి అంటుకుని అది పేలిపోవడంతో జలేందర్ మేల్కొని చూడగా గుడిసె సగభాగం అప్పటికే కాలిపోయింది. దీంతో తన కుటుంబ సభ్యులను బయటకు పంపి, చుట్టుపక్కల వారిని నిద్రలేపి జలేందర్ మంటలను ఆర్పివేశారు. ఇదే ఘటనలో నాగమణి గుడిసెకు ఎదురుగా ఉన్న ఇంట్లో కరెంట్ మీటర్ పూర్తిగా, ఇంటితలుపులు స్వల్పంగా కాలిపోయాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాలిబూడిదైన నాగమణి అస్థికలను ఓ గుడ్డలో చుట్టుకుని పోస్టుమార్టానికి పంపారు. -
ఎర్రమంజిల్‌లో మహిళ సజీవ దహనం
హైదరాబాద్: హైదరాబాద్ ఎర్రమంజిల్‌లో దీపావళి పండగ రోజు విషాద ఘటన జరిగింది. తారాజువ్వపడి గుడిసె దగ్ధం అయింది. ఈ ప్రమాదంలో నాగమణి అనే మహిళ సజీవ దహనం అయింది. ఘటనా స్థలాన్ని ఆర్డీఓ, తహసీల్దార్, టీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. మృతరాలి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. -
జలసౌధ కార్యాలయంలో జగడం
హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని జలసౌధ కార్యాలయం మరోసారి ఘర్షణకు నిలయమైంది. వారంరోజులుగా పోటాపోటీ నినాదాలు, ధర్నాలతో హోరెత్తిస్తున్న తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు.. శుక్రవారం ఒకడుగు ముందుకేసి కొట్టుకున్నంత పనిచేశారు. పరస్పరం దాడులకు యత్నించారు. దూషణలు, తోపులాటలతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక దశలో వీరిని పోలీసులు కూడా నియంత్రించ లేకపోయారు. భోజన విరామ సమయంలో ఏపీఎన్జీవోలు చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసనతెలపడంతో టీఎన్జీవోలు అభ్యంతరం తెలిపారు. ‘మా తెలంగాణలో మమ్మల్ని దోచుకొని చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన తెలుపుతారా? అని ప్రశ్నించారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన ఏపీఎన్జీవోలు ఒక్కసారిగా టీఎన్జీవో ఇరిగేషన్ సెక్రటరీ ప్రతాప్‌పై దాడికి యత్నించారు. రెండువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరి గింది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ సమయంలో ఏపీఎన్జీవోలకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డిని అడ్డుకున్నారు. బయటి వ్యక్తులు లోపలికి రావడానికి వీళ్లేదని చెప్పడంతో తులసిరెడ్డి, ఏపీఎన్జీఓల నగర అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిని స్టేషన్‌కు తరలిస్తుండగా.. తులసిరెడ్డి గోబ్యాక్.. అంటూ తెలంగాణ ఉద్యోగులు పెద్దఎత్తున నినాదాలు చేయడంతో మళ్లీ గందరగోళం నెలకొంది. ఏపీఎన్జీవోలు రెచ్చగొడుతున్నారు హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఏపీఎన్జీవోలు రెచ్చగొడుతున్నారని తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ కో కన్వీనర్ శ్రీధర్ దేశ్‌పాండే, టీఎన్జీఓల ఇరిగేషన్ సెక్రటరీ ప్రతాప్, టీఎన్జీవో నగర అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు ఆరోపించారు. తాము శాంతిర్యాలీ నిర్వహిస్తుంటే దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. 42రోజుల పాటు సకలజనుల సమ్మె చేసినప్పుడు ఏపీఎన్జీవోలకు సమైక్యాంధ్ర గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఏజెంట్‌గా తులసిరెడ్డి కార్యాలయాలకు వచ్చి ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంటుకు లేఖలు పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ కార్యాలయాల్లో తెలంగాణ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసనకు దిగారు. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలంటూ పార్లమెంట్‌కు లేఖలు రాశారు. కాగా, పంచాయతీరాజ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాల్లో సీమాంధ్ర ఉద్యోగులు మానవహారంగా ఏర్పడి జై సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. అలాగే, గన్‌ఫౌండ్రీలోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కోఠి డీఎంహెచ్ఎస్లో... సమైక్యాంధ్రకు మద్దతుగా కోఠి డీఎంహెచ్ఎస్ ప్రాంగణం లో, అబిడ్స్ తిలక్‌రోడ్డులోని బీమా భవన్ ఎదుట సీమాంధ్ర ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రకటన వెనక్కు తీసుకోవాలంటూ వెనక్కి నడుస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఏపీఎన్జీవోలు కొద్దిసేపు నిరసన తెలిపారు.