సాక్షి, హైదరాబాద్: అంతర్థానం కాబోతున్న వేళ అది సర్కారుకు ఆర్జన తెచ్చి పెడుతోంది. సినిమా షూటింగ్‌ల కోసం ముస్తాబైంది. సరికొత్త అందాలతో కనువిందు చేస్తోంది. ఇంకెంతకాలం నిలిచి ఉంటుందో తెలియని డోలాయమానంలో ఉన్న ఎర్రంమంజిల్ ప్యాలెస్ ఒక్కసారిగా జిగేల్‌మంటోంది. కొత్త రంగులద్దుకుని చమక్‌చమక్‌మంటోంది. నగరంలో గతించిన చరిత్రకు సజీవ సాక్ష్యం అది. నగరంలో ఉన్న పెద్ద ప్యాలెస్‌లలో ఒకటి. దాని నిర్మాణకౌశలం అబ్బురం. భవనం ఎలివేషన్‌లో చెక్కిన నగిషీలు నాటి నిర్మాణ ప్రత్యేకతను చాటిచెబుతున్నాయి. ఇంత పరిజ్ఞానం అందిపుచ్చుకున్న ఈ కాలంలో కూడా అలాంటి నిర్మాణం చేపట్టడం క్లిష్టతరమని ఆర్కిటెక్ట్‌లు అంటారు. అక్కడే తెలంగాణ ప్రభుత్వం చట్టసభలకు కొత్త భవన సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ శంకుస్థాపన కూడా చేశారు. ఆ తర్వాత కోర్టు కేసు నేపథ్యంలో దాని తొలగింపునకు విరామం ఏర్పడింది. ఆ నిర్మాణానికి క్లియరెన్స్ వస్తే ప్యాలెస్ ఉన్న స్థానంలో కొత్త అసెంబ్లీ భవన సముదాయం రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఇప్పటికే భవనం పూర్తిగా ఖాళీ చేయటంతో రోజువారీ నిర్వహణ పనులు లేక భూత్‌బంగ్లాగా కనిపిస్తోంది. ఈ తరుణంలో గత నాలుగైదు రోజులుగా ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి, చెత్తాచెదారం తొలగించి రంగులేయటం మొదలుపెట్టారు. ప్యాలెస్ వెనకవైపు.. రోడ్లు, భవనాల శాఖ ప్రధాన కార్యాలయ భవనం ఉన్న వైపు రంగులేయటం పూర్తయింది. చదవండి: (కరోనా మహమ్మారి కనుమరుగైనట్లేనా?)
గతంలో ప్రభుత్వ కార్యాలయ భవనాలకు వేసే సంప్రదాయ ముదురు పసుపురంగు వేశారు. ఆ భవనాన్ని తిరిగి సంరక్షించేందుకు ప్రభుత్వ విభాగం చర్యలు తీసుకుందేమోనని అక్కడికి వచ్చే వారికి సందేహం కలిగింది. కానీ, దానిని సినిమా షూటింగ్ కోసం తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న భవనాన్ని అధికారులు సినిమా షూటింగులకు అద్దెకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ యువ కథానాయకుడు హీరోగా నటిస్తున్న హిందీ సినిమా రీమేక్ కోసం సినిమా యూనిట్ దాన్ని అద్దెకు తీసుకుంది. కథానుసారం, గోవాలో ఉన్న ప్రాంతంగా ఆ భవనాన్ని చూపబోతున్నారు. ఇందుకోసం గోవా నేపథ్యంలో ప్రతిబింబించేలా అక్కడ ఏర్పాట్లు చేశారు. హిందీలో రాసి ఉన్న బోర్డులను ఏర్పాటు చేశారు.
చవకే..
సినిమా షూటింగ్ కోసం ఒకరోజు అద్దెగా రూ.10 వేలు వసూలు చేస్తున్నట్టు సమాచారం. అతి తక్కువ ఖర్చులో అంత కళాత్మక భవనం సమకూరుతుండటంతో సినిమా యూనిట్లు ఆ భవనంలో షూటింగ్‌లు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. పాతబడ్డప్పటికీ ఇప్పటికీ ఆ భవనంలో పటుత్వం, ఎలివేషన్ కళాత్మకంగా ఉన్నాయి. లోపలివైపు గంభీరమైన ఆర్కిటెక్చర్‌తో అది షూటింగ్‌లకు ఆహ్వానం పలుకుతోంది. త్వరలో మరికొన్ని సినిమా షూటింగ్‌లు కూడా అక్కడ నిర్వహించనున్నట్టు సమాచారం. అంతర్థానమయ్యేందుకు సిద్ధమై కూడా ఆ భవనం ఎంతోకొంత ఆర్జించి పెడుతుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment