సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. ఎర్రమంజిల్‌లోని పురాతన భవనాలను కూల్చి నూతన అసెంబ్లీని నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టిపారేసింది. ఎర్రమంజిల్‌లోని చారిత్రాత్మక భవనాలను కూల్చి ఆ స్థానంలో కొత్త భవనాలకు తెలంగాణ ప్రభుత్వం భూపూజ కూడా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రివర్గం కూడా ఏకగ్రీవం తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో ఎర్రమంజిల్ భవనాలను కూల్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటినీ కలిపి ఉమ్మడిగా విచారించిన ధర్మాససం సుధీర్ఘ వాదనల అనంతరం సోమవారం తన తీర్పును వెలువరించింది. పురాతన భవనాల కూల్చివేతను తప్పుపడుతూ.. వాటిని కూల్చివేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కాగా ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతపై జూలై 3 నుంచి హైకోర్టులో పలు దఫాలుగా వాదనలు సాగుతోన్న విషయం తెలిసిందే. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. భవనాలను కూల్చివేసి వాటి స్థానంలో కొత్తవాటిని నిర్మించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త భవనం నిర్మిస్తే ట్రాఫిక్ సమస్యతో తలెత్తడంతోపాటు పురాతన కట్టడాలను పరిరక్షించాల్సిన ప్రభుత్వ బాధ్యతను విస్మరించినట్టు అవుతుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీరి వాదనతో ఏకీభవించిన ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయాన్ని తొసిపుచ్చింది. ఇదిలావుండగా.. తాజా హైకోర్టు తీర్పుతో ప్రభుత్వ తదుపరి నిర్ణయంపై ఆసక్తినెలకొంది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందింస్తో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment