హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని జలసౌధ కార్యాలయం మరోసారి ఘర్షణకు నిలయమైంది. వారంరోజులుగా పోటాపోటీ నినాదాలు, ధర్నాలతో హోరెత్తిస్తున్న తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు.. శుక్రవారం ఒకడుగు ముందుకేసి కొట్టుకున్నంత పనిచేశారు. పరస్పరం దాడులకు యత్నించారు. దూషణలు, తోపులాటలతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక దశలో వీరిని పోలీసులు కూడా నియంత్రించ లేకపోయారు. భోజన విరామ సమయంలో ఏపీఎన్జీవోలు చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసనతెలపడంతో టీఎన్జీవోలు అభ్యంతరం తెలిపారు. ‘మా తెలంగాణలో మమ్మల్ని దోచుకొని చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన తెలుపుతారా? అని ప్రశ్నించారు.
వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన ఏపీఎన్జీవోలు ఒక్కసారిగా టీఎన్జీవో ఇరిగేషన్ సెక్రటరీ ప్రతాప్‌పై దాడికి యత్నించారు. రెండువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరి గింది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ సమయంలో ఏపీఎన్జీవోలకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డిని అడ్డుకున్నారు. బయటి వ్యక్తులు లోపలికి రావడానికి వీళ్లేదని చెప్పడంతో తులసిరెడ్డి, ఏపీఎన్జీఓల నగర అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిని స్టేషన్‌కు తరలిస్తుండగా.. తులసిరెడ్డి గోబ్యాక్.. అంటూ తెలంగాణ ఉద్యోగులు పెద్దఎత్తున నినాదాలు చేయడంతో మళ్లీ గందరగోళం నెలకొంది.
ఏపీఎన్జీవోలు రెచ్చగొడుతున్నారు
హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఏపీఎన్జీవోలు రెచ్చగొడుతున్నారని తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ కో కన్వీనర్ శ్రీధర్ దేశ్‌పాండే, టీఎన్జీఓల ఇరిగేషన్ సెక్రటరీ ప్రతాప్, టీఎన్జీవో నగర అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు ఆరోపించారు. తాము శాంతిర్యాలీ నిర్వహిస్తుంటే దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. 42రోజుల పాటు సకలజనుల సమ్మె చేసినప్పుడు ఏపీఎన్జీవోలకు సమైక్యాంధ్ర గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఏజెంట్‌గా తులసిరెడ్డి కార్యాలయాలకు వచ్చి ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పార్లమెంటుకు లేఖలు
పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ అండ్ ఎస్ కార్యాలయాల్లో తెలంగాణ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసనకు దిగారు. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలంటూ పార్లమెంట్‌కు లేఖలు రాశారు. కాగా, పంచాయతీరాజ్ అండ్ ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయాల్లో సీమాంధ్ర ఉద్యోగులు మానవహారంగా ఏర్పడి జై సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. అలాగే, గన్‌ఫౌండ్రీలోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
కోఠి డీఎంహెచ్‌ఎస్‌లో...
సమైక్యాంధ్రకు మద్దతుగా కోఠి డీఎంహెచ్‌ఎస్ ప్రాంగణం లో, అబిడ్స్ తిలక్‌రోడ్డులోని బీమా భవన్ ఎదుట సీమాంధ్ర ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రకటన వెనక్కు తీసుకోవాలంటూ వెనక్కి నడుస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఏపీఎన్జీవోలు కొద్దిసేపు నిరసన తెలిపారు.
జలసౌధ కార్యాలయంలో జగడం
Published Sat, Aug 24 2013 3:28 AM | Last Updated on Thu, Jul 11 2019 7:42 PM
Advertisement