సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) చట్టంలో అర్బన్ ఆర్ట్స్ కమిషన్ ఉందని, దీని ప్రకారం ఎర్రమంజిల్‌లోని చారిత్రక భవనాన్ని హెచ్‌ఎండీఏ రక్షించాలని ఓ స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది స్వరూప్‌రెడ్డి హైకోర్టులో వాదించారు. ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చి అక్కడ అసెంబ్లీ సముదాయాన్ని నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సోమవారం కూడా హైకోర్టు వాదనలు కొనసాగాయి. గుర్తించిన భవనాలను రక్షించే బాధ్యత మాత్రమే హెచ్‌ఎండీ తీసుకుంటుందని ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు చెప్పారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం స్పందిస్తూ.. హెరిటేజ్ కమిటీకీ, హెచ్‌ఎండీఏలోని అర్బన్ ఆర్ట్స్ కమిషన్ మధ్య తేడాలు, ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఆ రెండింటి పాత్ర ఏమిటో చెప్పాలని కోరింది. వాదనలు మంగళవారం కొనసాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment