భవనాల కూల్చివేతపై ‘సుప్రీం’కు వెళ్తాం | Congress Leaders Complaints About TRS On Demolition Of Erramanzil Palace | Sakshi
Sakshi News home page

భవనాల కూల్చివేతపై ‘సుప్రీం’కు వెళ్తాం

Published Tue, Jul 16 2019 1:03 AM | Last Updated on Tue, Jul 16 2019 1:03 AM

Congress Leaders Complaints About TRS On Demolition Of Erramanzil Palace - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భవనాల కూల్చివేతపై సర్కార్‌ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్షా లు ఏకమయ్యాయి. సచివాలయం, ఎర్రమంజిల్‌ భవనాల కూల్చివేత, కొత్త భవనాల నిర్మా ణం విషయంలో న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశాయి. ఈ విషయమై వచ్చేవారం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అఖిలపక్ష నేతలు వెల్లడించారు. ఈ అంశంపై వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ సాగుతుండగానే, వివిధ ప్రభుత్వ శాఖలు, భవనాల తరలింపు చేపట్టిందన్నారు. వ్యక్తిగత మూఢనమ్మకాల కోసం సీఎం కేసీఆర్‌ ప్రజలపై భారం మోపుతున్నారని రాజ్‌భవన్‌ వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. సచివాలయం, అసెం బ్లీ, ఎర్రమంజిల్‌ భవనాలను యథాతథంగా కొనసాగించాలని సోమవారం గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు అఖిలపక్ష బృందం వినతిపత్రం సమర్పించింది. ఇటీవల జి.వెంకటస్వామి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ వేదిక నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో చేసిన తీర్మానాలను గవర్నర్‌కు అందజేశారు. అంతకు ముందు మాజీ ఎంపీ జి.వివేక్‌ నివాసంలో ఈ అఖిలపక్ష బృందం లోని జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, రేవంత్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ, జీవన్‌ రెడ్డి, జువ్వాడి నర్సిం గ్‌రావు (టీపీసీసీ), కోదండరాం, పీఎల్‌ విశ్వేశ్వ ర్‌రావు (టీజేఎస్‌) ఎల్‌ రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి(టీడీపీ) డీకే అరుణ, చింతల రాంచం ద్రారెడ్డి(బీజేపీ) చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ), సంధ్య(పీవోడబ్ల్యూ) సమావేశమయ్యారు. 

తరలింపు పెద్ద కుట్ర: రేవంత్‌ 
సచివాలయంలోని వివిధ కార్యాలయాల తరలింపులో పెద్దకుట్ర దాగుందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏ ఆఫీస్‌లో ఉన్న రికార్డులను ఏవిధంగా పరిరక్షించాలనేది కూడా చాలా ముఖ్యమైన విషయమని అన్నారు. ఈ ఫైళ్ల భద్రత బాధ్యత కూడా గవర్నర్‌దేనని చెప్పారు. సచివాలయం కూల్చివేత, శాసనసభ తరలింపుపై అభ్యంతరం చెబుతూ కలగజేసుకోవాలని గవర్నర్‌ను కోరామన్నారు. ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, సెక్షన్‌ 8, 80 రీ ఆర్గనైజేషన్‌ యాక్ట్‌ ప్రకారం జీహెచ్‌ఎంసీ తరఫున కస్టోడియన్‌ అయిన గవర్నర్‌ అన్ని భవనాల భద్రతను పర్యవేక్షించాలని కోరినట్టు వివేక్‌ చెప్పారు. ట్రాఫిక్‌ సహా దేనికీ ఎటువంటి ఇబ్బందులు కలిగించని సెక్రటేరియట్‌ భవనాలను కూల్చడం ప్రజాస్వామిక పద్ధతికాదని కోదండరాం అన్నారు. కస్టోడియన్‌ అయిన గవర్నర్‌కే సర్వాధికారాలున్నాయని చెప్పామని, గవర్నర్‌ న్యాయం చేస్తారనే విశ్వాసంతో ఉన్నామని అన్నారు. హైకోర్టులో 17 ప్రజాప్రయోజన వ్యాజ్యాలు విచారణలో ఉన్నాయనీ, అన్నింటిపై విచారణ పూర్తయ్యేవరకు సెక్రటేరియట్‌ను కూల్చొద్దని హైకోర్టు సూచించిందని పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు చెప్పారు. ఎన్నో ఏళ్లు సేవలందించే భవనాలను కూలగొట్టాలన్న ఆలోచన సరైంది కాదని, రాష్ట్రాన్ని సీఎం అప్పుల ఊబిలోకి నెడుతున్నారని డీకే అరుణ విమర్శించారు. రాష్ట్రానికి సర్వం తానే అనీ, సర్వాంతర్యామి తానే అని కేసీఆర్‌ భావిస్తున్నారని. ఇలాంటి సీఎం తీసుకున్న నిర్ణయాలను గవర్నర్‌ సమర్థించొద్దని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ ప్రజాధనం వృథా చేస్తున్నారని ఎల్‌. రమణ, చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. 

గవర్నర్‌తో అఖిలపక్షం ఆసక్తికర చర్చ 
గవర్నర్‌తో అఖిలపక్ష నేతల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ‘ఏం రేవంత్‌.... ఏం జరుగుతోంది. తిరుపతిలో ఉన్నట్టున్నారు కదా’అని గవర్నర్‌ ప్రశ్నించగా ‘మీతో అపాయింట్‌మెంట్‌ ఉండడంతో కలవడానికి వచ్చాను’అని రేవంత్‌ సమాధానమిచ్చారు. తిరుపతిలో దేవుడి మాదిరిగానే గవర్నర్‌ వ్యవహరిస్తున్నారని నవ్వుతూ అన్నట్టు సమాచారం. ఏం జరుగుతోందంటూ షబ్బీర్‌ అలీని గవర్నర్‌ ప్రశ్నించగా ‘మీరు రెండు రాష్ట్రాల సీఎంలనే చూసుకుంటున్నారు. రాష్ట్రాలను పట్టించుకోవడం లేదు’అని షబ్బీర్‌ అలీ స్పందించినట్టు తెలిసింది. దీనికి గవర్నర్‌ స్పందిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ వేదికలపై చేసుకోవాలంటూ ఒకింత తీవ్రంగానే అన్నారు. ‘మేం చెబుతున్నది నిజమే, రెండు రాష్ట్రాలను పటించుకోవడం లేదు’అంటూ షబ్బీర్‌అలీ వాదన కొనసాగించగా, అట్లా మాట్లాడొద్దని, తాను ఇరు రాష్ట్రాలను సరిగ్గానే చూసుకుంటున్నానని గవర్నర్‌ బదులిచ్చినట్లు సమాచారం. చివర్లో జానారెడ్డి వ్యాఖ్యలతో అక్కడ నవ్వులు విరిశాయి. ‘ఏవో వార్తలొస్తున్నాయి. మళ్లీ గవర్నర్‌ను మేం కలుస్తామో లేదో’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు కూల్చకుండా మీరు జోక్యం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఆ విధంగా చేయాలని కోరుకుంటున్నాం. మరి చేస్తారో లేదో తెలియదు. మీకా అధికారం ఉంది. దానిని ఉపయోగించండి. గవర్నర్‌గా మీరున్నారని గుర్తుండేలా చేసి వెళ్లండి’అంటూ జానారెడ్డి చేసిన వ్యాఖ్యలపట్ల గవర్నర్‌ నవ్వుతూ ఉండిపోయారని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement