సాక్షి, హైదరాబాద్: ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ భవనాన్ని నిర్మిచవద్దంటూ వేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా గూగుల్ మ్యాప్స్‌లో ఎర్రమంజిల్ ఛాయా చిత్రాన్ని హైకోర్టు పరిశీలించింది. ఎర్రమంజిల్‌లో చారిత్రక కట్టడాల కూల్చివేతను అడ్డుకోవాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధితో పాటు, సామాజికవేత్త లుజ్ఞా సార్వత్‌లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ఎర్రమంజిల్‌లో కాకుండా వేరే ప్రాంతంలో అసెంబ్లీ భవనాన్ని నిర్మించుకోవాలంటూ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ప్రస్తుత అసెంబ్లీ భవనం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 294 శాసనసభ సభ్యులు 90 మంది ఎమ్మెల్సీలు ఉన్నా ఎంతో సౌకర్యంగా ఉండేదని గుర్తుచేశారు. ఈ సంఖ్య ఇప్పుడు సగానికి తగ్గిపోయినా కూడా కొత్త అసెంబ్లీ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
పైగా ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ వద్ద ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేవని ఆయన చెప్పుకొచ్చారు. నూతన అసెంబ్లీ భవనాలను నిర్మిచడం వలన ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారసత్వ కట్టడాలను పరిరక్షించాలని కోరారు. ఎర్రమంజిల్‌లో సాగునీటి శాఖ, రహదారుల శాఖ, జలసౌధ కార్యాలయలున్నాయని, వాటి కూల్చివేత సరికాదని హితవు పలికారు. ఎర్రమంజిల్‌లో ప్రభుత్వం అసెంబ్లీ భవన నిర్మాణం చేపట్టకుండా స్టే ఇవ్వాలని హైకోర్టుకు విఙ్ఞప్తి చేశారు.
లుజ్ఞా సార్వత్ తరపు న్యాయవాది రచనా రెడ్డి మాట్లాడుతూ.. ఎర్రమంజిల్‌లో ఫక్రు ముల్క్ నిర్మించిన ప్యాలెస్ కూల్చివేతను నిలిపివేయాలని తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. తెలంగాణ హెరిటేజ్ కమిటీ గతంలో పురాతన కట్టడాలను కాపాడుతామని చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. దీనికి సంబంధించి హెరిటేజ్ కమిటీ ఇచ్చిన నివేదికను కోర్టుకు అందజేశారు. ఇప్పుడు ఎర్రమంజిల్‌లో ఉన్న పురాతన భవనాల స్థానంలో అసెంబ్లీ భవనాలను నిర్మించాలనుకోవటాన్ని ఆమె తప్పుపట్టారు. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మించడం వలన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment