
హైకోర్టు భవనం వేటలో కేసీఆర్ !
* కింగ్‌కోఠి, ఎర్రమంజిల్ పరిశీలన
* హైకోర్టు వేరైతే.. ఏదో ఒక రాష్ట్రానికి పనికొస్తుందని యోచన
* ఢిల్లీ నుంచి రాగానే సీఎస్‌తో కలసి పర్యటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు విభజన కోరుతున్న సీఎం కేసీఆర్ స్వయంగా తగిన భవనాల కోసం అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టుభవనం విభజనలో ఏ రాష్ట్రానికి వెళ్లినా, ఇంకో హైకోర్టును మరోచోట ఏర్పాటు చేయక తప్పదు. అందుకే సీఎం చారిత్రక కట్టడాలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్తును కలసి, ఆదివారం రాత్రి హైదరాబాద్ చే రుకున్న సీఎం సోమవారం మధ్యాహ్నం తర్వాత కింగ్‌కోఠిలోని పర్దా ప్యాలెస్‌ను, ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ ఈఎన్‌సీ కార్యాలయాన్ని పరిశీలించారు.
మరికొన్ని భవనాలను కూడా పరిశీలించే యోచనలో ఉన్నట్టు తెలిసింది. సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ కూడా ఈ భవనాలను పరిశీలించారు. రాష్ట్ర విభజనతో సచివాలయం ఇరుకుగా మారినందున, హైకోర్టు విభజన వల్ల అక్కడ న్యాయమూర్తులు, న్యాయవాదులు ఇబ్బంది పడకుండా చూడాలన్న భావనతోనే ఈ భవనాల వేటలో సీఎం పడ్డట్టు తెలి సింది. కింగ్‌కోఠిలోని పర్దా ప్యాలెస్‌లో గతంలో నిజాం నవాబు నివసించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రాజభవనం ఆలనాపాలనా లేక శిథిలావస్థకు చేరుకుంటోంది.
ఈ భవనాన్ని ముఖ్యమంత్రి పరిశీలించినట్టు ఓ అధికారి వివరించారు. హైకోర్టు విభజన కోసం ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లను కలసిన విషయం విదితమే. ఇటీవలి పర్యటనలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ ఎల్ దత్తును కలసి త్వరగా హైకోర్టును విభజించాలని విన్నవించిన సంగతి తెలిసిందే.