
రాజధానిలో అసెంబ్లీ కోసం రూపొందించిన టవర్ డిజైన్
సాక్షి, అమరావతి: రాజధాని పరిపాలనా నగరంలో అసెంబ్లీ భవనాన్ని టవర్ ఆకారంలో నిర్మించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. కింది భాగంలో 250 మీటర్ల వెడల్పుతో ప్రారంభించి అక్కడి నుంచి సెల్‌ఫోన్ టవర్‌లా 70 మీటర్ల ఎత్తు అయిన అసెంబ్లీ భవనం డిజైన్‌ను నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించింది. ఈ డిజైన్ ప్రకారం భవంతి కింది భాగంలో శాసనసభ, పైన ప్రజలు సందర్శించేందుకు అనువుగా వ్యూయింగ్ పాయింట్ ఉంటుంది. సుమారు 70 అంతస్తుల టవర్ నిర్మించాలని ఫోస్టర్ సంస్థ ప్రతిపాదించింది.
వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ 13వ అథారిటీ సమావేశంలో పరిపాలనా నగరంలోని ముఖ్య భవనాల డిజైన్లపై చర్చ జరిగింది. టవర్ డిజైన్‌తోపాటు ఫోస్టర్ సంస్థ ఇచ్చిన వజ్రం తరహా డిజైన్‌ను కూడా సమావేశంలో పరిశీలించారు. మొదటి నుంచి అనుకుంటున్నట్లే టవర్ డిజైన్‌వైపే ముఖ్యమంత్రితో పాటు అందరూ మొగ్గు చూపారు. అయితే ఈ రెండింటిపైనా ప్రజల అభిప్రాయాలు సేకరించాలని, వెంటనే వాటిని సోషల్ మీడియాలో పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గురువారం సాయంత్రం వరకూ వచ్చిన అభిప్రాయాల ప్రకారం ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంపిక చేయడానికి నిర్ణయించారు. ఇందుకోసం గురువారం సాయంత్రం మరోసారి సీఆర్‌డీఏ సమావేశం నిర్వహించనున్నారు. ప్రజల అభిప్రాయం అని చెబుతున్నా.. ప్రభుత్వం టవర్ డిజైన్‌నే ఖరారు చేయనున్నట్లు తెలిసింది. హైకోర్టు కోసం గతంలో ప్రతిపాదించిన బౌద్ధ స్థూపాకారపు డిజైన్‌కే కొన్ని మార్పులు చేసిన ఫోస్టర్ సంస్థ ఈ సమావేశంలో ప్రదర్శించగా దాన్ని దాదాపు ఖరారు చేశారు.
రాజమౌళి సూచనలకు తిరస్కారం: రాజధాని కోసం సినీ దర్శకుడు రాజమౌళి ప్రతిపాదించిన డిజైన్లకు ఆమోదం లభించలేదు. సమావేశంలో పాల్గొన్న ఆయన పలు సూచనలు చేశారు. రాజమౌళి అందించిన త్రీ డైమెన్షన్ చిత్రాలతో కూడిన చతురస్రాకారపు రెండో డిజైన్‌ను కూడా పరిశీలించారు. ఈ డిజైన్ కంటే టవర్ డిజైన్‌కే ఎక్కువ మంది ఓటేశారు. కాగా నార్మన్ ఫోస్టర్ సంస్థ ఇచ్చిన రెండు డిజైన్లపై ప్రజాభిప్రాయం తీసుకుని దాని ప్రకారం గురువారం ఒకదాన్ని ఎంపిక చేస్తామని మీడియాతో మంత్రి నారాయణ తెలిపారు.
నా డిజైన్లు ఆమోదం పొందలేదు
రాజధాని కోసం తాను ప్రతిపాదించిన డిజైన్లు ఆమోదం పొందలేదని సినీ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి చెప్పారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థూపం డిజైన్‌కు తాను కొన్ని మార్పులు సూచించానని, నార్మన్ ఫోస్టర్ సంస్థ అడిగిన కొన్ని చిత్రాలు సేకరించి ఇచ్చానని తెలిపారు. తెలుగు సంస్కృతి, చరిత్ర, వారసత్వం ప్రతిబింబించేలా డిజైన్ల ఎంపికకు సహకరించాలని సీఎం కోరారని, అందుకనుగుణంగా తాను కొన్ని సూచనలు చేశానని తెలిపారు. స్థూపాకృతిలో ఉండే సెంట్రల్ హాలులో తెలుగుతల్లి విగ్రహం ఏర్పాటుచేసి దానిపై సూర్యకిరణాలు పడేలా తాను మార్పులు చెప్పానన్నారు. కానీ ఆ డిజైన్ ఆమోదం పొందలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment