Norman Foster Institute
-
నీటి కొలనులో అసెంబ్లీ
సాక్షి, అమరావతి: రాజధాని పరిపాలనా నగరం లో అసెంబ్లీ భవనానికి టవర్ డిజైన్‌ను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. నీటి కొలను మధ్యలో 250 మీటర్ల వెడల్పు, 250 మీటర్ల పొడవుతో అసెంబ్లీ డిజైన్‌ను నార్మన్ ఫోస్టర్స్ సంస్థ రూపొందించింది. శనివారం రాత్రి వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఫోస్టర్స్ సంస్థ ప్రతినిధులు టవర్ డిజైన్‌తోపాటు వజ్రం డిజైన్‌పై ప్రజెంటేషన్ ఇచ్చారు. టవర్ ఆకృతికే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 125 ఎకరాల విస్తీర్ణంలో కొలను 250 మీటర్ల ఎత్తులో టవర్ ఆకారంలో నిర్మించే ఈ అసెంబ్లీ భవనం నాలుగు అంతస్తుల్లో ఉంటుంది. టవర్‌పైకి 40 మీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి 217 చదరపు కిలోమీటర్ల రాజధాని నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు. 70 మంది సందర్శకులు ఒకేసారి వ్యూపాయింట్‌కు వెళ్లి రాజధాని నగరాన్ని చూడొచ్చు. ఈ భవనాన్ని నీటి కొలనులో నిర్మిస్తారు. ఈ కొలను 125 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. టవర్ ప్రతిబింబం ఈ నీటిలో పడేలా డిజైన్ చేశారు. టవర్ కింది భాగంలో శాసనసభ, శాసనమండలి, సెంట్రల్ హాల్, పరిపాలనా కేంద్రాల భవనాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. అసెంబ్లీ భవనం మొత్తం 87 వేల చదరపు మీటర్ల ప్రాంతంలో ఉంటుండగా, నిర్మిత ప్రాంతం 7.8 లక్షల చదరపు అడుగుల్లో ఉంటుంది. ఈ భవనంపై పునరుత్పాదక విద్యుదుత్పత్తి వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. సూర్యకాంతి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వ్యవస్థను కూడా నెలకొల్పుతారు. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఈ టవర్ డిజైన్‌ను గురించి మంత్రులకు వివరించి అభిప్రాయాలు అడిగారు. అయితే చిత్రాల్లో డిజైన్ అంత ఆకర్శణీయంగా లేదని, పెద్ద చిత్రాలను చూపించాలని మంత్రులు కోరారు. డిజైన్లపై సోషల్ మీడియాలో అప్పుడే వ్యతిరేక ప్రచారం కూడా జరుగుతోందని, దీనిపై దృష్టి పెట్టి అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. డిజైన్లపై మంత్రి నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పూర్తిస్థాయి స్ట్రక్చరల్ డిజైన్లు ఇచ్చేందుకు ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని ఫోస్టర్స్ ప్రతినిధులు చెప్పినట్లు తెలిపారు. ఈ డిజైన్లు రాగానే టెండర్లు పిలిచి నిర్మాణ పనులు చేపడతామన్నారు. -
టవర్ ఆకారంలో అసెంబ్లీ!
సాక్షి, అమరావతి: రాజధాని పరిపాలనా నగరంలో అసెంబ్లీ భవనాన్ని టవర్ ఆకారంలో నిర్మించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. కింది భాగంలో 250 మీటర్ల వెడల్పుతో ప్రారంభించి అక్కడి నుంచి సెల్‌ఫోన్ టవర్లా 70 మీటర్ల ఎత్తు అయిన అసెంబ్లీ భవనం డిజైన్‌ను నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించింది. ఈ డిజైన్ ప్రకారం భవంతి కింది భాగంలో శాసనసభ, పైన ప్రజలు సందర్శించేందుకు అనువుగా వ్యూయింగ్ పాయింట్ ఉంటుంది. సుమారు 70 అంతస్తుల టవర్ నిర్మించాలని ఫోస్టర్ సంస్థ ప్రతిపాదించింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ 13వ అథారిటీ సమావేశంలో పరిపాలనా నగరంలోని ముఖ్య భవనాల డిజైన్లపై చర్చ జరిగింది. టవర్ డిజైన్‌తోపాటు ఫోస్టర్ సంస్థ ఇచ్చిన వజ్రం తరహా డిజైన్‌ను కూడా సమావేశంలో పరిశీలించారు. మొదటి నుంచి అనుకుంటున్నట్లే టవర్ డిజైన్‌వైపే ముఖ్యమంత్రితో పాటు అందరూ మొగ్గు చూపారు. అయితే ఈ రెండింటిపైనా ప్రజల అభిప్రాయాలు సేకరించాలని, వెంటనే వాటిని సోషల్ మీడియాలో పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గురువారం సాయంత్రం వరకూ వచ్చిన అభిప్రాయాల ప్రకారం ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంపిక చేయడానికి నిర్ణయించారు. ఇందుకోసం గురువారం సాయంత్రం మరోసారి సీఆర్డీఏ సమావేశం నిర్వహించనున్నారు. ప్రజల అభిప్రాయం అని చెబుతున్నా.. ప్రభుత్వం టవర్ డిజైన్‌నే ఖరారు చేయనున్నట్లు తెలిసింది. హైకోర్టు కోసం గతంలో ప్రతిపాదించిన బౌద్ధ స్థూపాకారపు డిజైన్‌కే కొన్ని మార్పులు చేసిన ఫోస్టర్ సంస్థ ఈ సమావేశంలో ప్రదర్శించగా దాన్ని దాదాపు ఖరారు చేశారు. రాజమౌళి సూచనలకు తిరస్కారం: రాజధాని కోసం సినీ దర్శకుడు రాజమౌళి ప్రతిపాదించిన డిజైన్లకు ఆమోదం లభించలేదు. సమావేశంలో పాల్గొన్న ఆయన పలు సూచనలు చేశారు. రాజమౌళి అందించిన త్రీ డైమెన్షన్ చిత్రాలతో కూడిన చతురస్రాకారపు రెండో డిజైన్‌ను కూడా పరిశీలించారు. ఈ డిజైన్ కంటే టవర్ డిజైన్‌కే ఎక్కువ మంది ఓటేశారు. కాగా నార్మన్ ఫోస్టర్ సంస్థ ఇచ్చిన రెండు డిజైన్లపై ప్రజాభిప్రాయం తీసుకుని దాని ప్రకారం గురువారం ఒకదాన్ని ఎంపిక చేస్తామని మీడియాతో మంత్రి నారాయణ తెలిపారు. నా డిజైన్లు ఆమోదం పొందలేదు రాజధాని కోసం తాను ప్రతిపాదించిన డిజైన్లు ఆమోదం పొందలేదని సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చెప్పారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థూపం డిజైన్‌కు తాను కొన్ని మార్పులు సూచించానని, నార్మన్ ఫోస్టర్ సంస్థ అడిగిన కొన్ని చిత్రాలు సేకరించి ఇచ్చానని తెలిపారు. తెలుగు సంస్కృతి, చరిత్ర, వారసత్వం ప్రతిబింబించేలా డిజైన్ల ఎంపికకు సహకరించాలని సీఎం కోరారని, అందుకనుగుణంగా తాను కొన్ని సూచనలు చేశానని తెలిపారు. స్థూపాకృతిలో ఉండే సెంట్రల్ హాలులో తెలుగుతల్లి విగ్రహం ఏర్పాటుచేసి దానిపై సూర్యకిరణాలు పడేలా తాను మార్పులు చెప్పానన్నారు. కానీ ఆ డిజైన్ ఆమోదం పొందలేదన్నారు. -
అసెంబ్లీకి 13 డిజైన్లు
సాక్షి, అమరావతి : రాజధాని పరిపాలనా నగరంలో ప్రతిపాదిస్తున్న అసెంబ్లీ భవనం కోసం నార్మన్ ఫోస్టర్ సంస్థ 13 రకాల డిజైన్లు రూపొందించింది. వాటిని ప్రజల అభిప్రాయం కోసం సోషల్ మీడియాకు విడుదల చేసింది. రాజధాని పరిపాలనా నగరం వ్యూహ డిజైన్‌తోపాటు విడిగా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం డిజైన్లు రూపొందించే బాధ్యతను ప్రభుత్వం నార్మన్ ఫోస్టర్ సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. ఆరు నెలలుగా ఫోస్టర్ సంస్థ పలు డిజైన్లు ఇచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబుకు నచ్చలేదు. కొద్దిరోజుల క్రితమే వజ్రాకృతి, స్థూపాకృతి డిజైన్లను ఖరారు చేసినట్లే చేసి మళ్లీ తిరస్కరించారు. అనంతరం సినీ దర్శకుడు రాజమౌళిని రంగంలోకి దించి ఆయన సూచనల మేరకు డిజైన్లు రూపొందించాలని ఫోస్టర్ సంస్థకు చంద్రబాబు సూచించారు. ఇటీవలే మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్, రాజమౌళిని లండన్‌లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లి డిజైన్లు ఎలా ఉండాలో సలహాలిప్పించారు. గతంలో రూపొందించిన డిజైన్లను మార్చడంతోపాటు రాజమౌళి సూచనల ప్రకారం మొత్తం 13 డిజైన్లను రూపొందించి ఫోస్టర్ సంస్థ సీఆర్డీఏకు ఇచ్చింది. వాటిలో మూడు గతంలో ఇచ్చిన డిజైన్లే. మొత్తం డిజైన్లను ఫేస్బుక్, ట్విట్టర్‌తోపాటు సీఆర్డీఏ వెబ్సైట్లో పెట్టి ప్రజల అభిప్రాయం కోరారు. వారంపాటు అభిప్రాయాలు స్వీకరిస్తారు. మరోవైపు ఈ డిజైన్లతోపాటు మరికొన్నింటిని ఈ నెల 25, 26 తేదీల్లో సీఎం లండన్‌లో పరిశీలించనున్నారు. ప్రజల అభిప్రాయాలు, ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టు ఉంటే లండన్‌లోనే తుది డిజైన్లు ఖరారయ్యే అవకాశం ఉందని సీఆర్డీఏ వర్గాలు తెలిపాయి. -
సిద్ధమైన పరిపాలనా నగరం డిజైన్లు
నేడు ప్రభుత్వానికి తుది డిజైన్లు సమర్పించనున్న నార్మన్ ఫోస్టర్ సంస్థ సాక్షి, అమరావతి: రాజధాని పరిపాలనా నగరం డిజైన్లు సిద్ధమయ్యాయి. విడతల వారీగా ప్రభుత్వం సూచించిన మార్పులకు అనుగుణంగా తుది డిజైన్లు రూపొందించిన లండన్‌కు చెందిన మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ బృందం మంగళవారం హైదరాబాద్‌కు చేరుకుని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమావేశమైంది. మార్పులు చేసిన హైకోర్టు భవనం డిజైన్లను ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులకు చూపించింది. ఆయనకు నచ్చితే దాన్నే ఖరారు చేయనున్నారు. వాటితోపాటు మిగిలిన అసెంబ్లీ, సచివాలయం ఇతర భవనాల డిజైన్లను బుధవారం ముఖ్యమంత్రికి చూపించనున్నారు. అసెంబ్లీ భవనాన్ని కోహినూర్ వజ్రం ఆకృతిలో రూపొందించాలని గతంలో చంద్రబాబు సూచించడంతో ఆ మేరకు దాన్ని మార్చారు. మార్పులతో కూడిన ఈ తుది డిజైన్లనే ప్రభుత్వం ఖరారు చేసే అవకాశం ఉంది. 1,350 ఎకరాల్లో నిర్మించనున్న పరిపాలనా నగరాన్ని ఆరు బ్లాకులుగా విభజించి డిజైన్లు రూపొందించారు. పూర్తిస్థాయిలో రూపొందించిన ఈ డిజైన్లను ఆమోదించి విజయదశమి రోజు పరిపాలనా నగరానికి మరోసారి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.