నీటి కొలనులో అసెంబ్లీ | State Cabinet Approved to Tower Design | Sakshi
Sakshi News home page

నీటి కొలనులో అసెంబ్లీ

Published Sun, Dec 17 2017 1:41 AM | Last Updated on Sun, Dec 17 2017 1:41 AM

State Cabinet Approved to Tower Design - Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని పరిపాలనా నగరం లో అసెంబ్లీ భవనానికి టవర్‌ డిజైన్‌ను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. నీటి కొలను మధ్యలో 250 మీటర్ల వెడల్పు, 250 మీటర్ల పొడవుతో అసెంబ్లీ డిజైన్‌ను నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థ రూపొందించింది. శనివారం రాత్రి వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఫోస్టర్స్‌ సంస్థ ప్రతినిధులు టవర్‌ డిజైన్‌తోపాటు వజ్రం డిజైన్‌పై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. టవర్‌ ఆకృతికే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

125 ఎకరాల విస్తీర్ణంలో కొలను 
250 మీటర్ల ఎత్తులో టవర్‌ ఆకారంలో నిర్మించే ఈ అసెంబ్లీ భవనం నాలుగు అంతస్తుల్లో ఉంటుంది. టవర్‌పైకి 40 మీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత వ్యూ పాయింట్‌ ఉంటుంది. అక్కడి నుంచి 217 చదరపు కిలోమీటర్ల రాజధాని నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు. 70 మంది సందర్శకులు ఒకేసారి వ్యూపాయింట్‌కు వెళ్లి రాజధాని నగరాన్ని చూడొచ్చు. ఈ భవనాన్ని నీటి కొలనులో నిర్మిస్తారు. ఈ కొలను 125 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. టవర్‌ ప్రతిబింబం ఈ నీటిలో పడేలా డిజైన్‌ చేశారు. టవర్‌ కింది భాగంలో శాసనసభ, శాసనమండలి, సెంట్రల్‌ హాల్, పరిపాలనా కేంద్రాల భవనాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. అసెంబ్లీ భవనం మొత్తం 87 వేల చదరపు మీటర్ల ప్రాంతంలో ఉంటుండగా, నిర్మిత ప్రాంతం 7.8 లక్షల చదరపు అడుగుల్లో ఉంటుంది.

ఈ భవనంపై పునరుత్పాదక విద్యుదుత్పత్తి వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. సూర్యకాంతి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వ్యవస్థను కూడా నెలకొల్పుతారు. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఈ టవర్‌ డిజైన్‌ను గురించి మంత్రులకు వివరించి అభిప్రాయాలు అడిగారు. అయితే చిత్రాల్లో డిజైన్‌ అంత ఆకర్శణీయంగా లేదని, పెద్ద చిత్రాలను చూపించాలని మంత్రులు కోరారు. డిజైన్లపై సోషల్‌ మీడియాలో అప్పుడే వ్యతిరేక ప్రచారం కూడా జరుగుతోందని, దీనిపై దృష్టి పెట్టి అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. డిజైన్లపై మంత్రి నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పూర్తిస్థాయి స్ట్రక్చరల్‌ డిజైన్లు ఇచ్చేందుకు ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని ఫోస్టర్స్‌ ప్రతినిధులు చెప్పినట్లు తెలిపారు. ఈ డిజైన్లు రాగానే టెండర్లు పిలిచి నిర్మాణ పనులు చేపడతామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement