అగాధం సృష్టించిన ఓపెన్ రీచ్‌ల టెండర్ల వ్యవహారం
69 శాతం లెస్‌తో టెండర్లు దక్కించుకునేందుకు ఆనం కుతంత్రం
పారదర్శకంగా లాటరీ విధానంలో రీచ్‌లు కేటాయించమన్న మంత్రి నారాయణ
టెండర్లు రద్దు చేయించేందుకు చక్రం తిప్పిన మంత్రి రామనారాయణ
తన అనుచరులకే నామినేషన్‌పై రీచ్‌లు కట్టబెట్టిన వైనం
జిల్లాలో ఇసుక ఓపెన్ రీచ్‌ల టెండర్ల వ్యవహారం ఇద్దరు మంత్రుల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి తెరతీసింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా లాటరీ విధానంలో పారదర్శకంగా ఇసుక రీచ్‌లు కేటాయించాలని మంత్రి నారాయణ ఇచ్చిన ఆదేశాలను మరో మంత్రి ఆనం తిప్పికొట్టారు. తన ఇలాకాలో ఉండే ఇసుక రీచ్‌లపై నారాయణ పెత్తనం ఏమిటన్నట్లుగా కన్నెర్ర చేశారు. బరితెగించి బాహాటంగానే కాంట్రాక్టర్‌ను, కలెక్టర్‌ను బెదిరించిన ఆనం.. ఏకంగా సహచర మంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన ఆధిపత్యంతో రీచ్‌ల కేటాయింపునే రద్దు చేయించారు. నామినేషన్ పద్ధతిలో తన అనుచరులకు కట్టబెట్టించుకున్నారు. మంత్రి నారాయణను చెల్లని నాణెం చేశారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య ఇసుక తుఫాన్ పెను దుమారం రేపుతోంది. టీడీపీ ప్రభుత్వంలో నంబర్ టు మంత్రిగా చెలామణి అవుతున్న నారాయణ ఆదేశాలకే దిక్కులేకుండా పోయింది. మరో మంత్రి ఆనం కింగ్ మేకర్‌గా చక్రం తిప్పే స్థాయిలో వ్యవహరిస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లో జరిగిన పరిణామాలు ఇద్దరు మంత్రుల మధ్య అగాధాన్ని సృష్టించాయి. ఇసుక టెండర్ల వ్యవహారంలో మంత్రి ఆనం తన పంతం నెగ్గించుకోవడంతో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయన కోటరీలో చేరిపోయారు. ఈ వ్యవహారం కలెక్టర్ ఆనంద్‌కు తలనొప్పిగా మారింది.
రీచ్‌లను పంచుకునేందుకు..
జిల్లాలోని పెన్నానదిలో నాలుగు చోట్ల ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మినగల్లు, పడమటి కంభంపాడు, పల్లిపాడు, విరువూరులో ఓపెన్ రీచ్‌ల ద్వారా 2.86 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నెల 6న టెండర్లను ఆహా్వనించారు. టెండర్ల ప్రక్రియను నామమాత్రం చేసి టీడీపీ నేతలకే కట్టబెట్టేందుకు మంత్రి ఆనంతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు రాజకీయంగా ఒత్తిడి తెచ్చారు. చివరి తేదీ వరకు ఎవరూ టెండర్లు దాఖలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆఖరు రోజు 16వ తేదీన ఆయా రీచ్‌లకు టీడీపీ నేతలతో పాటు బయట వ్యక్తులు మొత్తంగా 23 మంది కాంట్రాక్టర్లు 43 దరఖాస్తులు దాఖలు చేశారు. వీటిలో ఒకటి జీఎస్టీ సక్రమంగా లేకపోవడంతో రద్దయింది.
69 శాతం లెస్‌తో తమ్ముళ్ల టెండర్లు
నదుల్లో ఇసుక తవ్వకాలు జరిపించేందుకు మెట్రిక్ టన్నుకు గతంలో రూ.90 నుంచి రూ.100 చొప్పున ప్రభుత్వం చెల్లించేది. అంతకంటే తక్కువ ధరకే కేటాయిస్తే గిట్టుబాటు కాదని, అక్రమ రవాణాకు ప్రోత్సహించినట్లే అవుతుందని భావించిన కలెక్టర్ ఆనంద్ టన్నుకు రూ.114.90 వంతున నిర్ణయించి టెండర్లు ఆహా్వనించారు. కానీ టీడీపీ నేతలు మాత్రం రీచ్‌ల్లోకి ఎంట్రీ అయితే చాలన్నట్లుగా 69 శాతం లెస్‌తో కేవలం రూ.36 మాత్రమే కోట్ చేశారు. టీడీపీ నేతలు లోకాస్ట్‌లో టెండర్లు వేయడంతో వారికి కేటాయిస్తే అక్రమాలకు ఆస్కారం ఉంటుందని భావించిన కలెక్టర్ ఆనంద్ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్టర్లతో సమావేశమైన మంత్రి నారాయణ టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా చేయాలంటే లాటరీ విధానం ఉత్తమమని భావించి ఆ ప్రకారమే కేటాయించమని కలెక్టర్‌కు ఆదేశాలిచ్చారు. కలెక్టర్ లాటరీ విధానంలో నలుగురు కాంట్రాక్టర్లకు నాలుగు రీచ్‌లకు అనుమతులు కేటాయించారు. ఒక్కో రీచ్‌కు ముగ్గురిని ఎంపిక చేసి ప్రథమ స్థానంలో ఉన్న వారికి రీచ్‌ను కేటాయించారు. మరో ఇద్దరిని రిజర్వులో ఉంచారు.
నారాయణ ఆదేశాలు 48 గంటల్లోనే రద్దు
టీడీపీ ప్రభుత్వంలో నంబర్ టుగా చెలామణి అవుతున్న మంత్రి నారాయణ ఆదేశాలు 48 గంటల్లోనే రద్దు చేయించి.. తన ఆదేశాలు అమలు జరిగేలా మరో మంత్రి ఆనం చక్రం తిప్పారు. మంత్రి నారాయణ ఎవరు.. అంటూ కలెక్టర్‌పై అగ్గిమీద గుగ్గిలం కావడంతో పాటు టెండర్ల వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. సీఎం కార్యాలయంలో పంచాయితీ పెట్టి లాటరీ ద్వారా చేసిన కేటాయింపులను రద్దు చేయించారు.
మంత్రి నారాయణకు తీవ్ర అవమానం
ఇసుక టెండర్ల వ్యవహారంలో మంత్రి నారాయణకు అవమానం జరిగిందని ఆ పారీ్టలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది. టీడీపీకి ఆర్థికంగా వెన్నుముకలాంటి నారాయణ ఆదేశాలకు దిక్కేలేకుండా పోయిందని ఆ పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి నారాయణ తీసుకున్న పారదర్శక నిర్ణయాన్ని అమలు చేసిన తర్వాత అడ్డుకోవడం అంటే ఆయన్ను అవమానించినట్లేనని ఆ పార్టీలోని సీనియర్ నేత వ్యాఖ్యానించారు. కలెక్టర్ సైతం మంత్రి నారాయణ ఆదేశాలను పక్కన పెట్టడంతో జిల్లా యంత్రాంగంలో కూడా చెల్లని నాణెం అయ్యారనే చర్చ నడుస్తోంది.
నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టేశారు
ఇసుకను ఓపెన్ రీచ్‌లను ఓ పథకం ప్రకారం మంత్రి ఆనంతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. తమ అనుచరులకు నామినేషన్ పద్ధతిలో ఒక్కొక్కరికి 5 వేల టన్నుల తవ్వేందుకు తాత్కాలిక అనుమతులు ఇప్పించేశారు. ఆదివారం నుంచి బహిరంగంగానే ఇసుక దోపిడీకి జిల్లా అధికార యంత్రాంగం గేట్లు ఎత్తి రాచబాట వేశారు.
Comments
Please login to add a commentAdd a comment