
రాష్ట్రపతి భవన్‌లా.. అసెంబ్లీ
డిజైన్ల కోసం అంతర్జాతీయ ఆర్కిటెక్ట్‌ల మధ్య పోటీ
వాటిలో ఒకటి ఆర్కిటెక్ట్‌ల జ్యూరీ ఎంపిక చేస్తుంది
‘సాక్షి’తో సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడి
విజయవాడ బ్యూరో : ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ స్థాయిలో అమరావతిలో నిర్మించే అసెంబ్లీ భవనాన్ని డిజైన్ చేయాలని ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌లను కోరామని సీఆర్‌డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్ చెప్పారు. ఈ డిజైన్ల కోసం ప్రపంచంలోని మూడు అత్యుత్తమ ఆర్కిటెక్ట్ బృందాల మధ్య పోటీ పెట్టినట్లు తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రాజధాని నగరంలో నిర్మించే ప్రభుత్వ భవనాల సముదాయంలో అసెంబ్లీ, హైకోర్టు ప్రపంచ స్థాయిలో ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. అందుకు తగ్గట్టుగా ఆ భవనాలను డిజైన్ చేసేందుకు కొద్దిరోజులుగా కసరత్తు చేసి ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ ఆర్కిటెక్ట్ సంస్థలను గుర్తించామన్నారు. అందులో మూడింటిని పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పారు. నార్మన్ పోస్టర్, పాస్టర్ ప్లస్ పార్టన్స్, రోజర్ స్టర్క్ హార్పర్ ప్లస్ సంస్థలు అత్యుత్తమ ఆర్కిటెక్ట్ సంస్థలు కావడంతో వాటికి ఈ రెండు భవనాల డిజైన్లను తయారు చేయాలని సూచించామని తెలిపారు.
సంస్కృతి, చరిత్ర, ఆధునికత ఉట్టిపడేలా...
అమరావతి సంస్కృతి, చరిత్ర, ఆధునికత ఉట్టిపడేలా డిజైన్లు తయారు చేయాలని పలు కొలమానాలు ఇచ్చామని, ఈ నెలాఖరులోపు ఈ సంస్థలు వాటిని ఇవ్వాల్సి ఉంటుందని శ్రీకాంత్ వివరించారు. ఈ మూడు సంస్థల మధ్య డిజైన్ల రూపకల్పనలో పోటీ పెట్టామని, ఉత్తమ డిజైన్‌ను రూపొందించిన సంస్థను ముగ్గురు సభ్యుల ఆర్కిటెక్ట్‌ల జ్యూరీ ఎంపిక చేస్తుందని తెలిపారు. ఈ జ్యూరీలోనూ దేశ, విదేశాల్లోని ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌లు ఉన్నారని చెప్పారు. డిజైన్ ఎంపిక చేయడానికీ పలు ప్రమాణాలను నిర్దేశించామన్నారు. పోటీ పడే మూడు సంస్థలకు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉందన్నారు. జర్మన్ పార్లమెంటు భవనం, స్పెయిన్‌లోని బిల్‌బావొలో ఉన్న గెగెన్‌హీమ్ మ్యూజియాన్ని ఈ సంస్థలు డిజైన్ చేశాయని తెలిపారు. గెగెన్‌హీమ్ మ్యూజియం ఏర్పాటు తర్వాత బిల్‌బావొ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారిందన్నారు. ఎంపికైన ప్రతిపాదిత డిజైన్‌ను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత దాని పూర్తి డిజైన్‌ను రూపొందించేందుకు సంబంధిత సంస్థకు 12 నెలల సమయం పడుతుందన్నారు. ఇది అతి తక్కువ సమయమని చెప్పారు. ప్రభుత్వ భవనాల సముదాయంలోని మిగిలిన సచివాలయం, రాజ్‌భవన్ ఇతర కట్టడాల డిజైన్ల తయారీ బాధ్యతను దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్ట్‌లకు అప్పగిస్తామన్నారు.
రెండు వారాల్లో తుది మాస్టర్‌ప్లాన్ సిద్ధ....
రాజధాని తుది మాస్టర్‌ప్లాన్ రెండు వారాల్లో సిద్ధమవుతుందని కమిషనర్ తెలిపారు. సింగపూర్ ప్రభుత్వ సంస్థల ప్లాన్‌లో స్థానిక పరిస్థితులు, ఇతర అంశాల ఆధారంగా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయని చెప్పారు. తుది ప్లాన్‌ను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత దానిపై 30 రోజులపాటు ప్రజాభిప్రాయం సేకరిస్తామన్నారు. దాన్నిబట్టి తుది మాస్టర్‌ప్లాన్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. దీని తర్వాత మౌలిక సదుపాయాల మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేయాల్సి ఉందన్నారు. రాజధానిలోని అన్ని అవసరాలకు సంబంధించిన ఈ ప్లాన్‌ను కూడా విదేశీ సంస్థలకు అప్పగిస్తామని, దీన్ని తయారు చేసే యంత్రాంగం, ఇంజనీర్లు మన దగ్గర లేరని తెలిపారు. ఇది కూడా పూర్తయిన తర్వాత రాజధాని ప్రాజెక్టు అభివృద్ధి మ్యాప్ పూర్తిస్థాయిలో తయారైనట్లని వివరించారు. ఈ రెండూ పూర్తయిన తర్వాత రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. రాజధానిలో రైతులకిచ్చే ప్లాట్ల సైజుపై ఇంకా నిర్ణయం జరగలేదని తెలిపారు.