160 ఎకరాల్లో అసెంబ్లీ భవనం
- 8 నుంచి 10 అంతస్తుల్లో సచివాలయం
- రాజధాని నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష
సాక్షి, అమరావతి: రాజధాని పరిపాలనా నగరంలో ప్రధాన ఆకర్షణగా నిలిచేలా అసెంబ్లీ భవనాన్ని 160 ఎకరాల్లో నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో 140 ఎకరాలను కేవలం జల, హరిత అవసరాల కోసమే వినియోగిస్తారు. ఈ మేరకు పరిపాలనా నగరం డిజైన్లలో పలు మార్పులు చేసినట్లు సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రి చంద్రబాబు కు తెలియజేశారు. తుది మార్పుల ప్రకారం సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవనాలను ఉత్తర దిశగా కొంచెం ముందుకు జరిపినట్లు తెలిపారు. రాజధాని నిర్మాణంపై బుధవారం వెలగపూడి సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా డిజైన్ల గురించి సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ వివరించారు. ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకూ లండన్‌లో పరిపాలనా నగరం డిజైన్లపై జరిగిన వర్క్‌షాపులో పాల్గొన్నామని పేర్కొన్నారు. ప్రధానంగా అసెంబ్లీ నిర్మాణం, ప్రజా రవాణా, జల వనరులపై నార్మన్ ఫోస్టర్ సంస్థ బృందంతో చర్చించినట్లు చెప్పారు. క్రిస్‌బెర్గ్ నేతృత్వంలో 90 శాతం డిజైన్ల రూపకల్పన పూర్తయిందని, ఈ నెల 22న నార్మన్ ఫోస్టర్ బృందం డిజైన్లు ఇస్తుందని వెల్లడించారు. వాటిపై ఏవైనా సలహాలు, సూచనలు ఇస్తే వాటి ఆధారంగా తుది డిజైన్లు అందిస్తారని తెలిపారు.
అమరావతిలో ఎలక్ట్రికల్ కార్లు
రాజధానిలో సచివాలయ భవనం 8 నుంచి 10 అంతస్తుల్లో కనీసం ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని శ్రీధర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ... అంతర్జాతీయ నగరాల్లో డ్రైవర్ లేని ఎలక్ట్రికల్ కార్లు నడుస్తాయని, అమరావతిలోనూ అలాంటి కార్లు ఉంటాయని చెప్పారు.
సౌర విద్యుత్‌పై అంతర్జాతీయ సదస్సు
సౌర విద్యుత్ నిల్వ వ్యవస్థను ఏర్పాటు కు గాను అత్యున్నత సాంకేతిక పద్ధతులను తెలుసుకునేందుకు త్వరలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని యోచిస్తునట్లు సీఎం మాట్లాడుతూ చెప్పారు.