♦ పలు సూచనలు చేసిన సీఎం చంద్రబాబు ∙
♦ రాజ్‌భవన్, సీఎం నివాసాలు సిటీ స్క్వేర్ నుంచి కృష్ణా వైపునకు మార్పు
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని పరిపాలనా నగరంలో శాసనసభ సముదాయానికి వజ్రాకృతి (డైమండ్), హైకోర్టు భవన సముదాయానికి స్తూపాకృతి(పిరమిడ్) డిజైన్లు ఖరారయ్యాయి. గతంలో శాసనసభ సముదాయానికి స్తూపాకృతిని రూపొందించినా తాజాగా దాన్ని వజ్రాకృతికి మార్చారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ హైకోర్టు కోసం రూపొందించిన వజ్రాకార భవన డిజైన్‌ను అసెంబ్లీ భవనాలకు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
అసెంబ్లీ భవనాల కోసం రూపొందించిన స్తూపాకార డిజైన్‌ను హైకోర్టు భవన సముదాయం కోసం వినియోగించాలని చెప్పారు. లండన్ నుంచి వచ్చిన రాజధాని మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులు బుధవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తాము రూపొందించిన డిజైన్లపై ప్రజెంటేషన్ ఇచ్చారు. పరిపాలనా నగరం తుది డిజైన్లను ప్రభుత్వానికి సమర్పించారు.
కోహినూర్‌ను అసెంబ్లీ భవనంలో చూసుకోవచ్చు
హైకోర్టు డిజైన్‌ను స్తూపాకృతికి మార్చి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చూపించాలని, ఆ తర్వాత రెండు రోజుల్లో తుది డిజైన్లను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
ప్రధాన ఆకర్షణ.. సిటీ స్క్వేర్
పరిపాలన నగరం చివరి భాగాన కృష్ణానదికి అభిముఖంగా నిర్మించనున్న ‘సిటీ స్క్వేర్’ రాజధాని అమరావతికి ప్రధాన ఆకర్షణగా ఉండాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆ మేరకు సిటీ స్క్వేర్ డిజైన్లను రూపొందిం చాలని నార్మన్ ఫోస్టర్స్ బృందానికి సూచించారు. రాజ్‌భవన్, ముఖ్యమంత్రి నివాసాలను సిటీ స్క్వేర్‌లో చెరోవైపు ఉండేలా నార్మన్ ఫోస్టర్స్ సంస్థ డిజైన్ చేయగా, వాటిని అక్కడి నుంచి మార్చాలని సీఎం పేర్కొన్నారు. సిటీ స్క్వేర్‌ను విశాలంగా ఏర్పాటు చేయాలని, గవర్నర్, ముఖ్యమంత్రి నివాసాలను అక్కడి నుంచి తీసివేసి, నదీ తీరానికి మార్చాలని సూచించారు. రాజధానిలో నిర్మించే ప్రతి కట్టడం అత్యుత్తమంగా ఉండాలని, ఆ విషయంలో ఎక్కడా రాజీ పడబోమని స్పష్టం చేశారు. రాజధానిపై ప్రజల్లో ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయని, ఏదో ఒక రాజధాని నిర్మించాలనుకుంటే ఇంతగా పరితపించనవసరం లేదని, ప్రపంచంలోని 5 అత్యుత్తమ నగరాల్లో అమరావతిని ఒకటిగా నిలపాలన్నదే తమ
లక్ష్యమన్నారు.
అమరావతి–టోక్యో మధ్య విమానాలు
సాక్షి, అమరావతి: అమరావతి నుంచి నేరుగా జపాన్ రాజధాని టోక్యోకు, టోక్యో నుంచి అమరావతికి త్వరలో విమాన సర్వీసులను ప్రవేశపెడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. జపాన్ ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక శాఖ మంత్రి యొసుకె తకాగి ఆధ్వర్యంలోని ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధుల బృందంతో విజయవాడలోని ఒక హోటల్‌లో సీఎం బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరు నెలలకోసారి తాను జపాన్ వస్తానని, అలాగే మీరు అమరావతి రావాలని జపాన్ మంత్రిని, అక్కడి పారిశ్రామికవేత్తల్ని చంద్రబాబు కోరారు. రాష్ట్రప్రభుత్వం, జపాన్ ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వశాఖ(మేటి) ప్రతినిధులు పలు అంశాలపై చర్చించారు.
వజ్రాకృతి అసెంబ్లీ.. స్తూపాకార హైకోర్టు
Published Thu, Jul 13 2017 1:05 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM
Advertisement
Advertisement