అందమైన భాగ్యనగరం మనది. ఘన చరిత్రకు సాక్ష్యం...అద్భుతమైన వారసత్వ సంపదకు నిలయం ఈ నగరం. 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్‌లో ఎన్నో అద్భుతమైన కట్టడాలు, ప్రాంతాలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. గత చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. చార్మినార్..గోల్కొండ.. అసెంబ్లీ భవనం.. చౌమహల్లా ప్యాలెస్, మక్కా మసీదు, సాలార్‌జంగ్ మ్యూజియం, సర్దార్ మహల్, మహబూబ్ మాన్షన్, కింగ్ కోఠి ప్యాలెస్.. ఇలా ఎన్నో అద్భుత నిర్మాణాలు వారసత్వ కట్టడాలుగా ఖ్యాతి పొందాయి. కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరాన్ని ‘హెరిటేజ్ ఇండియా ఫెస్టివల్’గా ప్రకటించిన నేపథ్యంలో మన అసెంబ్లీ భవనం ప్రత్యేకతలపై ‘సాక్షి’ కథనం..
సాక్షి, హైదరాబాద్: మన శాసనసభ నిర్మాణానికి పునాదిరాయి పడి ఎన్నేళ్లయిందో తెలుసా? రేపటితో అక్షరాలా 116 సంవత్సరాలు. ఇది నిర్మించి ఒక శతాబ్దంపైనే పూర్తయ్యింది. అయినా ఈ భవనం చెక్కు చెదరలేదు. ఉట్టిపడే రాజసానికి ప్రతీక ఇది. అప్పటి ఉమ్మడి రాష్ట్రం, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర చరిత్రను మలుపుతిప్పిన అనేక కీలకఘట్టాలు ఈ శాసనసభా ప్రాంగణంలోనే చోటుచేసుకున్నాయి. అద్భుతమైన నిర్మాణ శైలితో కట్టించిన ఈ భవనం హైదరాబాద్ నగరంలోనే ఒక అపురూప కట్టడం. అసెంబ్లీ భవన నిర్మాణానికి 1905 జనవరి 25న అంకురార్పణ జరిగింది. ప్రజా సమస్యలకు వేదికగా అప్పటి ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ పచ్చని ఉద్యానవనంలో ఈ భవనం నిర్మాణానికి శ్రీకారం చు ట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఈ వేదిక నుంచే తమ వాణిని వినిపిస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభు త్వం 2021ని చారిత్రక కట్టడాల పరిరక్షణ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ‘హైదరాబాద్ హెరిటేజ్’ను పురస్కరించుకుని అసెంబ్లీ భవనంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం
నిజాం నవాబు ప్రసంగించిన వేళ..
అది 1904వ సంవత్సరం.. ఓ రోజు నగరం అంతా సందడిగా ఉంది. ఢిల్లీలో జరిగిన సంస్థానాధీశుల దర్బార్ సమావేశాలకు వెళ్లిన మ హబూబ్ అలీఖాన్ ఆ రోజు సాయంత్రం నగ రానికి చేరుకోనున్నారు. ఆయన రాకకోసం జనం ఎదురుచూస్తున్నారు. సరిగా అయిదున్నర గంటల సమయంలో పబ్లిక్ గార్డెన్‌లోని సభాస్థలికి చేరుకున్నారు. మహబూబ్‌కు సాదర స్వాగతం లభించింది. ఆయన ప్రసంగించిన వేదిక చిరకాలం గుర్తుండిపోయేలా ఒక అందమైన భవనం కట్టించాలని తీర్మానించారు. అలా టౌన్‌హాల్ నిర్మాణానికి బీజం పడింది. హైదరాబాద్ సంస్థాన ప్రజలు చందాలు పోగుచేసి ఆ భవనాన్ని కట్టించారు.
భవన శంకుస్థాపన ఇలా..
అప్పటికే ఎన్నో భవనాలు ఉన్నాయి. కానీ మంత్రులు, ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు, సాధారణ ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు ఒక వేదిక లేదు. దీంతో 1905లో మహబూబ్ అలీఖాన్ 40వ పుట్టిన రోజు (హిజ్రీ క్యాలెండర్ ప్రకారం జనవరి 25) సందర్భంగా ఆయనకు నగరవాసుల బహుమానంగా అందమైన భవన నిర్మాణం చేపట్టారు. సమాజంలోని ఉన్నత వర్గాలే కాకుండా సాధారణ ప్రజలు సైతం తమవంతుగా విరాళాలు సమర్పించారు. ఈ కట్టడం కోసం అన్ని వర్గాల ప్రజలు పరిశ్రమించారు.
అద్భుతమైన నిర్మాణ శైలి..
ఈ భవనం అందమైన గోపురాలు, ఆకాశాన్ని తాకే శిఖరాలు, మరెంతో అందంగా తీర్చిదిద్దిన డోమ్‌లతో ఆకట్టుకుంటుంది. భవనం గోడలపై మంత్రముగ్ధులను చేసే డిజైన్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇప్పటికీ దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులను, పర్యాటకులను ఆకట్టుకుంటూనే ఉంది. ఇరానీ, మొగలాయి, రాజస్థానీ వాస్తు నిర్మాణ శైలులతో దీన్ని కట్టించారు. టౌన్ హాల్ నిర్మా ణం కోసం రాజస్థాన్‌లోని మఖ్రా నా నుంచి రాళ్లను తెప్పించారు. రెండంతస్తులతో ని ర్మించిన టౌన్‌హాల్ చు ట్టూ 20 గదులు ఉంటా యి. గోపురాల కోసం డంగు సున్నం, బంకమట్టి వినియోగించారు.గోపురాలు, కమాన్‌లు మొగలాయి వాస్తు శైలిని సంతరించుకుంటే గోడలపై రూపొందించిన కళాత్మక దృశ్యాలు, లతలు, వివిధ రకాల డిజైన్‌లు ఇరాన్, రాజస్థానీ శైలులతో రూపుదిద్దుకున్నాయి.
అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు తట్టుకొనేలా దీనిని కట్టించారు. చక్కటి గాలి, వెలుతురు వస్తాయి. చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్లగా ఉంటుంది. పచ్చిక బయళ్లతో పరిసరాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటాయి. అప్పట్లో రూ.20 లక్షల వ్యయంతో దీనిని నిర్మించారు. 1913లో నిర్మాణం పూర్తయ్యింది. మహబూబ్ అలీఖాన్ 1911లోనే చనిపోవడంతో ఆయన తనయుడు ఏడో నిజాం మీర్‌ఉస్మాన్ అలీఖాన్ భవన నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఈ శ్వేతసౌధానికి మహబూబ్ జ్ఞాపకార్థం మొదట మహబూబియా టౌన్ హాల్‌గా నామకరణం చేశారు. అదే రాష్ట్ర శాసనసభగా మారింది.
అసెంబ్లీ భవనం ఫొటోతో పోస్టల్ స్టాంప్
1913లో భవనం నిర్మాణం పూర్తి అయి ప్రజలకు అందుబాటులో రావడంతో ఈ భవనం ఫొటోతో ఏడో నిజాం సంస్థాన ప్రజల అందరికీ తెలిసేలా దీని ఫొటోతో పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. దీని విలువ అప్పటి రోజుల్లో ఒక అణాగా ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment