సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సహా దేశవ్యాప్తంగా గత రెండేళ్లుగా ఇంజనీరింగ్ విద్యలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కంప్యూటర్ అనుబంధ కోర్సులు పూర్తిగా పైచేయి సాధిస్తు న్నాయి. ఫలితంగా కొన్ని బ్రాంచ్‌ల్లో సీట్లు అనివార్యంగా తగ్గించాల్సి వస్తోంది. భవిష్యత్‌లో అవి పూర్తిగా తెరమరుగయ్యే ప్రమాదం ఉందని సాంకే తిక విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. సామాజిక పరిస్థితుల నేపథ్యమే దీనికి ప్రధాన కారణమనే వాదన విన్పిస్తోంది.
తాజా పరిస్థితిపై ఇటీవల అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఓ అధ్యయనం కూడా చేసింది. ఇంజనీరింగ్ విద్య సామాన్యులకు అందుబాటులోకి వచ్చాక, సంప్ర దాయ డిగ్రీ కోర్సుల ప్రాధాన్యత తగ్గింది. అలాగే అన్నింటా సాంకేతికత అవసరంతో సరికొత్త కోర్సుల ప్రాధాన్యత పెరుగుతోంది. ఇది ఆహ్వానిం చదగ్గ పరిణామమే అయినా, మిగతా కోర్సులను రక్షించుకోకపోతే అర్థవంతమైన ఇంజనీరింగ్ విద్య సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు.
ఎందుకీ పరిస్థితి?: ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాజ్యమేలుతోంది. సాంకే తికత లేకుండా ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు మెకానికల్‌కు సీఎస్‌ఈకి సంబంధం లేకున్నా.. ఏదైనా వాహనాన్ని డిజైన్ చేయాలంటే ముందుగా సాంకేతిక టెక్నాలజీతోనే చేస్తారు. కంప్యూటర్ టెక్నాలజీతోనే దాని సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాతే హార్డ్‌వేర్‌తో అవసరం. అలాగే ఎలక్ట్రానిక్స్‌తో రూపొందించే టీవీల తయారీలోనూ అత్యాధునిక ఐవోటీ టెక్నాలజీ కీలకం.
సివిల్‌లోనూ ఇదే ధోరణి. నిర్మాణాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ముందుగా వినియో గించాలి. మానవ జీవితంలో అంతర్భాగమైన ఇంటర్నెట్‌ను గుప్పిట్లో పెట్టుకునేది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. డేటాసైన్స్ ఉపయోగమూ అంతాఇంతా కాదు. దీంతో కంప్యూటర్ అనుబంధ కోర్సులకు అత్యధిక ప్రాధాన్యం ఏర్పడింది. తాజా ఎంసెట్ కౌన్సెలింగ్‌ను పరిశీలిస్తే 74,071 సీట్లు తొలి విడత భర్తీ చేస్తే అందులో 38,796 కంప్యూటర్, దాని అనుబంధ కొత్త బ్రాంచీల సీట్లే ఉన్నాయి.
ప్రైవేటు పంట...
కంప్యూటర్ అనుబంధ బ్రాంచ్‌ల్లో సీట్లకు ఉన్న డిమాండ్‌ను ప్రైవేట్ కాలేజీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఈ కోర్సులకు ఇష్టానుసారంగా డొనేషన్లు దండుకుంటున్నాయి. మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీ చేసే 30 శాతం సీట్లను ఎంసెట్ కౌన్సెలింగ్ మొదలుకాక ముందు నుంచే అమ్మేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఒక్కో సీటుకు రూ.10 లక్షలకు పైనే వసూలు చేశాయి. జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ విద్యలో సంస్కరణలు తీసుకొస్తే తప్ప డిమాండ్ తగ్గుతున్న కోర్సుల విషయంలో తామేమీ చేయలేమని రాష్ట్ర ఉన్నతవిద్యా మండలి ఉన్నతాధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.
కంప్యూటర్ కోర్సులే కాకుండా, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ కోర్సుల్లో కూడా కంప్యూటర్ టెక్నాలజీతో పాఠ్యప్రణాళిక రావాల్సిన అవసరం ఉందంటున్నారు. ఈ కోర్సులు పూర్తి చేసినా.. తాము అంతిమంగా సాఫ్ట్‌వేర్ వైపే వెళ్లాలి కదా అనే అభిప్రాయం వాళ్లలో ఉందని చెబుతున్నారు. ఇదే ప్రైవేటు కాలేజీలకు కలిసి వస్తోందని నిపుణులు అంటున్నారు.
- తెలంగాణలో 2018–19లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ సీట్లు 17,361 ఉంటే 2021 నాటికి అవి 18,614కు చేరాయి. అంటే ఈ రెండేళ్లలోనే 1,253 పెరిగాయి. తాజాగా హైకోర్టు తీర్పుతో మరో 3,500 పెరగబోతున్నాయి.
- ఎలక్ట్రికల్ కోర్సు (ఈఈఈ)లో సీట్లు 8,667 నుంచి 7,019 (1,648 తక్కువ)కు తగ్గాయి.
- సివిల్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెండేళ్ల క్రితం సివిల్ బ్రాంచ్ సీట్లు 8,293 ఉంటే ఇప్పుడు 6,221 (2072)కు తగ్గాయి.
- మెకానికల్ పరిస్థితి చెప్పుకోలేని స్థాయికి దిగజారింది. ఈ బ్రాంచ్‌లో 2018–19లో 10,104 ఉంటే, ఇప్పుడు 5,881 (4,223) సీట్లున్నాయి.
- సీఎస్‌ఈ తర్వాత పాత్ర పోషించే ఎలక్ట్రానిక్స్ (ఈసీఈ)లోనూ 15,415 నుంచి 13,935 (2,210 తక్కువ) సీట్లకు చేరుకున్నాయి.
- ఏడాది కాలంలోనే కంప్యూటర్ అనుబంధ కోర్సులైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, ఇంటర్ ఆఫ్ థింగ్స్ బ్రాంచ్‌ల్లో 14,920 మంది కొత్తగా చేరడం విశేషం.
కంప్యూటర్ కోర్సులే కాదు.. కోర్ సబ్జెక్టుల ప్రాధాన్యతను పెంచాల్సిన అవసరం ఉంది. జేఎన్‌టీయూహెచ్‌తో పాటు దేశవ్యాప్తంగా దీనిపై అధ్యయనం జరుగుతోంది. వ్యవస్థకు కోర్ ఇంజనీరింగ్ ఎప్పుడైనా అవసరం. యంత్రాలున్నంత కాలం సివిల్, మెకానికల్, ఎలక్ట్రిక్ కోర్సుల ప్రాధాన్యత ఉంటుంది. అయితే, వీటిని నేటి తరానికి, ముఖ్యంగా కంప్యూటర్ కోర్సులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణనలోనికి తీసుకుని తీర్చిదిద్దాలి. ఈ ప్రయత్నంలో అఖిలభారత సాంకేతిక విద్యా మండలి కూడా దృష్టి పెట్టింది.
– లింబాద్రి, రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment