నచ్చిన కాలేజీ.. మెచ్చిన బ్రాంచ్‌ | Engineering Colleges: Engineering Seats For Sale | Sakshi
Sakshi News home page

నచ్చిన కాలేజీ.. మెచ్చిన బ్రాంచ్‌

Published Mon, Sep 20 2021 2:36 AM | Last Updated on Mon, Sep 20 2021 2:36 AM

Engineering Colleges: Engineering Seats For Sale - Sakshi

గత వారం రోజులుగా ఇదే తంతు. ఎంసెట్‌ ర్యాంకు తక్కువొచ్చిన, కాస్త అటూ ఇటూగా వచ్చిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అదే పనిగా ఫోన్లు వస్తున్నాయి. ‘టాప్‌ టెన్‌ కాలేజీల్లో మీకు నచ్చిన బ్రాంచ్‌లో సీటు కావాలా? మేమిప్పిస్తాం..’ అని కన్సల్టెన్సీలకు చెందినవారు, దళారీలు ఊదరగొడుతున్నారు. కొన్ని కాలేజీ యాజమాన్యాలైతే ఏకంగా పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్లను (పీఆర్వోలు) పెట్టుకుని మరీ సీట్ల సేల్‌ కోసం విద్యార్థుల వెంటపడుతున్నాయి.

సీట్లు అయిపోతున్నాయంటూ తల్లిదండ్రులను హడలెత్తిస్తున్నాయి. నోటిఫికేషన్‌ జారీ చేసి ర్యాంకు ప్రకారమే సీటివ్వాలని ఉన్నత విద్యా మండలి పదేపదే చెబుతున్నా అడ్డదారిలో సీట్లన్నీ బేరం పెట్టేస్తున్నాయి. మరోవైపు తమ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను కూడా కొన్ని యాజమాన్యాలు ఉపయోగించుకుంటున్నాయి. వారికి తెలిసిన ఎంసెట్‌ అర్హత పొందిన విద్యార్థుల ఇళ్లకు పంపి సీటు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. 

డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటున్నారు 
పేరు మోసిన కాలేజీలు, ఆ తర్వాత స్థాయి కళాశాలలు కొన్ని.. తమకున్న డిమాండ్‌ను, తమ కాలేజీల్లో వివిధ బ్రాంచ్‌లకున్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా కాస్త ర్యాంకులు అటూ ఇటూగా వచ్చి, కన్వీనర్‌ కోటాలో సీటు రాదని భావించే విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనను ఆసరాగా తీసుకుని అలాంటి వారికి కన్సల్టెన్సీల ద్వారా ఎరవేస్తున్నాయి. సాధారణ యాజమాన్య, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల కేటాయింపులో దోపిడీకి పాల్పడుతున్నాయి. ముఖ్యంగా ఎన్‌ఆర్‌ఐ కోటా కింద ఎక్కువ సొమ్ము చేసుకునేందుకు కాలేజీలు ప్రయత్నిస్తున్నాయి. 

ఎన్‌ఆర్‌ఐ కోటా కింద దోపిడీ 
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 27 వేల ఇంజనీరింగ్‌ సీట్లు మేనేజ్‌మెంట్‌ కోటా కింద ఉంటాయి. ఇందులో సుమారు 13 వేలు సాధారణ యాజమాన్య కోటా సీట్లు కాగా సుమారు 14 వేల సీట్లు ఎన్‌ఆర్‌ఐ కోటా కింద ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రవాస భారతీయుల పిల్లలు, వారు స్పాన్సర్‌ చేసే వారికి ఈ సీట్లు ఇస్తారు. ఫీజు కూడా డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది.

భారత కరెన్సీ ప్రకారం చూస్తే ఏడాదికి దాదాపు రూ. 3.75 లక్షల వరకు వ్యయం అవుతుంది. కానీ డిమాండ్‌ను బట్టి దాదాపు రూ.15 లక్షల వరకు కాలేజీలు వసూలు చేస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని దళారులు కొన్ని కాలేజీల్లో కొంతమంది సాయంతో ఎన్‌ఆర్‌ఐ కోటా కింద సీట్లు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు.  

దళారుల పాత్రేంటి?: మేనేజ్‌మెంట్‌ సీటు ఆశించే తల్లిదండ్రులతో కాలేజీ అడ్మినిస్ట్రేటివ్‌ విభాగాలు నేరుగా బేరసారాలు చేస్తున్నాయి. పీఆర్వోలను పెట్టుకుని కథ నడిపిస్తున్నాయి. ఈ సమయంలో తల్లిదండ్రుల సెల్‌ఫోన్లు బయట సిబ్బంది వద్ద ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇక కన్సల్టెన్సీలు, దళారులుగా వ్యవహరిస్తున్న వ్యక్తులకు నిజానికి కొన్ని కాలేజీల యాజమాన్యంతో ఎలాంటి సంబంధం ఉండదు. కానీ, అక్కడ పనిచేసే సిబ్బంది ద్వారా ఆ కాలేజీలో సీటు ధర ఎంతో తెలుసుకుంటున్నారు.

అంతకన్నా ఎక్కువ రేటు తల్లిదండ్రులకు చెబుతున్నారు. నేరుగా యాజమాన్యాన్ని కలిసి రమ్మని, వాళ్లతో మాట్లాడామని, సీటు రేటు తగ్గిస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు బేరసారాలు చేసుకుని వస్తున్నారు. దళారులు, కన్సల్టెన్సీల వల్లే ధర తగ్గిందని భావిస్తున్న తల్లిదండ్రులు వారికి కమీషన్‌ ఇస్తున్నారు. కొన్ని కాలేజీలు మాత్రం దళారుల ద్వారా సీట్లు భర్తీ అయ్యేలా నేరుగా బేరాలు కుదుర్చుకుంటున్నాయి.   
– సాక్షి, హైదరాబాద్‌

వరంగల్‌కు చెందిన అరుణ్‌కు 16 వేల ఎంసెట్‌ ర్యాంకు వచ్చింది. టాప్‌టెన్‌ కాలేజీలో సీఎస్సీ చేయాలన్నది అతని కోరిక. కానీ  సీటు వస్తుందా? అని అనుమానం. ఇంతలోనే మీకు సీటిప్పిస్తామంటూ ఫోన్‌ కాల్‌ వచ్చింది. రూ.15 లక్షలు అవుతుందని చెప్పారు. దీంతో అతను ఆ వ్యక్తి చెప్పే మాట నిజమో? అబద్ధమో? తెలియని అయోమయంలో ఉన్నాడు. 

నిజామాబాద్‌కు చెందిన కార్తీక్‌ హైదరాబాద్‌లో టాప్‌టెన్‌లో ఉన్న ఒక కాలేజీలో డేటా సైన్స్‌ సీటు కోసం వెళ్లాడు. మేనేజ్‌మెంట్‌ కోటాలోనూ కష్టమని చెప్పారు. వేరే బ్రాంచ్‌ తీసుకోమంటే వద్దని బయటకొచ్చాడు. కాలేజీ బయట ఓ వ్యక్తి సీటిప్పిస్తానంటూ చెప్పాడు. అతడు చెప్పినట్లుగానే రెండురోజుల తర్వాత సీటు వచ్చింది.  

కృత్రిమ డిమాండ్‌ 
ఈసారి ఇంజనీరింగ్‌లో కొత్తగా ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్, డేటా సైన్స్‌ వంటి కొత్త కోర్సులు ప్రవేశపెట్టారు. వీటిపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. విద్యార్థులు కూడా ఈ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. ‘ఆ సీట్లు అయిపోయాయి. వేరే బ్రాంచ్‌ తీసుకుంటారా?’ అని సీటు కోసం వెళ్లిన తల్లిదండ్రులను అడుగుతున్నాయి.

వాళ్ల ఆసక్తిని ఆసరాగా చేసుకుని దళారులను రంగంలోకి దించి ఎక్కువ మొత్తానికి సీట్లు అమ్మేస్తున్నాయి. కూకట్‌పల్లికి చెందిన సత్యప్రకాశ్‌కు ఇదే అనుభవం ఎదురైంది. ‘యాజమాన్యం సీఎస్‌సీ సీటు కష్టమంది. గేటు దాటి బయటకు రాగానే దళారీ వచ్చాడు. అతని ద్వారా సీటు వచ్చింది..’ అని చెప్పాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement