టార్గెట్‌ ఐఐటీ.. విద్యార్థుల్లో పెరుగుతున్న ఆసక్తి  | Telangana Students Interested In IIT Engineering | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ ఐఐటీ.. విద్యార్థుల్లో పెరుగుతున్న ఆసక్తి 

Published Wed, Aug 31 2022 1:07 AM | Last Updated on Wed, Aug 31 2022 8:39 AM

Telangana Students Interested In IIT Engineering - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ఇంజనీరింగ్‌ సీట్లకు పోటీ పడేవారి సంఖ్య కొన్నేళ్ళుగా పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల విద్యార్థుల్లో ఎక్కువ మంది ఐఐటీల్లో సీటు సాధనే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఒక్కోసంవత్సరం ఒక్కో ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వహిస్తోంది. ఎన్‌టీఏ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) నిర్వహించే మెయిన్స్‌తో పోలిస్తే పదిరెట్లు కష్టంగా ఉంటుందని విద్యార్థులు భావిస్తుంటారు.

అయినా పోటీ పడేవారు, పరీక్షలో అర్హత సంపాదించే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతుండటం విశేషం. 2007లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసిన వారిలో కేవలం 3 శాతం మందే అర్హత సంపాదించగా ఇప్పుడది దాదాపు 30 శాతం వరకు పెరిగిందని జేఈఈ విభాగం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా గడచిన ఆరేళ్ళలో అడ్వాన్స్‌డ్‌లో క్వాలిఫై అయ్యే వారి సంఖ్య మరింత పెరిగింది.

ఒక విద్యా సంవత్సరం నష్టపోయినా.. లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకుని మరీ ఐఐటీ సీటు సాధించాలనే పట్టుదల విద్యార్థుల్లో బలపడుతోంది. జేఈఈలో మంచి ర్యాంకు వచ్చిన ప్రతి విద్యార్థికీ ఎన్‌ఐటీల్లో సీటు వస్తుందని తెలిసినా, ఐఐటీ సీటు కోసం అడ్వాన్స్‌డ్‌ కూడా రాసేందుకు సిద్ధపడుతున్నారు. నిజానికి 15 ఏళ్ళ క్రితం కంటే ఇప్పుడు ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్ల సంఖ్య పెరిగిందని.. ఇదే క్రమంలో అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించే అభ్యర్థులూ పెరుగుతున్నారని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.  

మారిన విధానంతో ముందుకు.. 
ఐఐటీలపై విద్యార్థుల ఆసక్తి పెరగడానికి అనేక కారణాలు కన్పిస్తున్నాయి. గతంలో ఐఐటీ–జేఈఈ, జేఈఈ మెయిన్, ఏఐఈఈఈ పేరుతో వేర్వేరుగా ప్రవేశ పరీక్షలుండేవి. అంటే ఐఐటీలకు, నిట్‌కు.. ట్రిపుల్‌ ఐటీలకు విడివిడిగా పరీక్షలు నిర్వహించి ప్రవేశాలు కల్పించేవారు. ఈ పరీక్షలకు విద్యార్థులు వేర్వేరుగా సన్నద్ధమవ్వాల్సిన పరిస్థితి ఉండేది. 2013 తర్వాత కేంద్రం ఈ విధానాన్ని మార్చింది.

ప్రస్తుతం జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ మాత్రమే ఉన్నాయి. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారు, అడ్వాన్స్‌డ్‌కు వెళ్తారు. మెయిన్స్‌ ర్యాంకుల ఆధారంగా నిట్, ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు పొందితే, అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు ద్వారా ఐఐటీల్లో సీట్లు లభిస్తాయి. ఈ విధానం వచ్చిన తర్వాత తేలికగా సన్నద్ధమయ్యే అవకాశం లభించిందని, అర్హత శాతం గణనీయంగా పెరగడం ప్రారంభం అయ్యిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అలాగే గత కొన్నేళ్ళుగా పరీక్ష విధానం, సిలబస్, సన్నద్ధమయ్యే తీరు తేలికగా ఉండి శిక్షకులు, విద్యార్థులు అర్థం చేసుకునే అవకాశం ఏర్పడిందని చెబుతున్నారు. మరోవైపు ఆసక్తి, పట్టుదల కలిగిన విద్యార్థులను అడ్వాన్స్‌డ్‌ వరకు తీసుకెళ్లగలిగేలా కోచింగ్‌ సెంటర్లు, ఆన్‌లైన్‌ మెటీరియల్స్‌ అందుబాటులోకి రావడం మరో కారణమని పేర్కొంటున్నారు.

2012లో 5.02గా ఉన్న అర్హత శాతం 2013లో ఏకంగా 17.96 శాతానికి పెరగడం ఇందుకు నిదర్శనం. కాగా అప్పట్నుంచీ 20 శాతానికి పైగా విద్యార్థులు అర్హత సాధిస్తుండటం గమనార్హం. సాధారణంగా జేఈఈ మెయిన్స్‌కు ఏటా 8 నుంచి 10 లక్షల మంది వరకు హాజరవుతున్నారు. ఇందు­లో 2.5 లక్షల మంది వరకు అడ్వాన్స్‌డ్‌కు క్వా­లిఫై అవుతున్నారు. వీరిలో 50 వేల మంది దా­కా ఐఐటీల్లో ప్రవేశానికి అర్హత సాధిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement