Indian Institute of Technology (IIT)
-
రూ. కోటికి పైగా జీతంతో జాబ్స్.. ఏకంగా 85 మందికి..
భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన బాంబే, ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) 2023-24 ప్లేస్మెంట్ సీజన్ ఫేజ్-1లో 85 మంది విద్యార్థులు రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక ప్యాకేజీలతో జాబ్ ఆఫర్లను పొందారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఐఐటీ బాంబే ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో మొత్తం 388 దేశీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. ఇందులో యాక్సెంచర్, ఎయిర్‌బస్, యాపిల్, బార్క్లేస్, గూగుల్, జెపి మోర్గాన్ చేజ్, మైక్రోసాఫ్ట్, టాటా గ్రూప్ వంటి ప్రముఖ రిక్రూటర్లు ప్లేస్మెంట్ ప్రక్రియలో భాగంగా ఉన్నాయి. రిక్రూట్మెంట్లో 1,340 మంది విద్యార్థులు హాజరు కాగా, ఇందులో 1,188 మంది ఉద్యోగాలు సాధించారు. ఇందుకో కూడా ఎక్కుమంది ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఉద్యోగాలు సాధించారు. ఆ తరువాత ఐటీ/సాఫ్ట్వేర్, ఫైనాన్స్/బ్యాంకింగ్/ ఫిన్‌టెక్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిజైన్ వంటి వాటిలో ఉద్యోగాలు పొందారు. సగటు ప్యాకేజీ వివరాలు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ: రూ. 21.88 లక్షలు ఐటీ/సాఫ్ట్వేర్: రూ. 26.35 లక్షలు ఫైనాన్స్: రూ. 32.38 లక్షలు కన్సల్టింగ్: రూ. 18.68 లక్షలు రీసర్చ్ అండ్ డెవలప్మెంట్: రూ. 36.94 లక్షలు ఇదీ చదవండి: గిఫ్ట్స్ ఇవ్వడంలో ఎవరైనా వీరి తర్వాతే.. కోడలికి రూ.451 కోట్ల నెక్లెస్ కొన్ని సంస్థలు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించగా.. మరికొన్ని సంస్థలు వర్చువల్‌గా పాల్గొన్నాయి. జపాన్, తైవాన్, సౌత్ కొరియా, నెదర్లాండ్స్, సింగపూర్, హాంకాంగ్ వంటి అంతర్జాతీయ స్థానాల్లో 63 మంది ఉద్యోగాలు సాధించారు. ఎంపికైన మొత్తం 1188 మంది విద్యార్థుల్లో ఏడు మంది ప్రభుత్వ రంగ సంస్థల్లో, 297 మంది ఇంటర్న్‌షిప్‌ల ద్వారా ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్లను పొందారు. గతంలో ఎన్నికైన ఉద్యోగులతో పోలిస్తే.. ఈ సారి ఎంపికైన ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉందని సమాచారం. -
ఐఐటీ బాంబేకి పూర్వ విద్యార్థుల భారీ విరాళం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బాంబే)కి పూర్వ విద్యార్థులు భారీగా విరాళం అందించారు. 1998 బ్యాచ్‌కి చెందిన సుమారు 200 మంది విద్యార్థులు రూ. 57 కోట్లు ప్రకటించారు. గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా 1971 బ్యాచ్ విద్యార్థులు ఇచ్చిన రూ. 41 కోట్లకన్నా ఇది అధికం కావడం గమనార్హం. ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ ఎండీ అపూర్వ్ సక్సేనా, పీక్ ఫిఫ్టీన్ ఎండీ శైలేంద్ర సింగ్, గ్రేట్ లెరి్నంగ్ సీఈవో మోహన్ లక్కంరాజు, వెక్టర్ క్యాపిటల్ ఎండీ అనుపమ్ బెనర్జీ తదితరుల 1998 బ్యాచ్‌లో ఉన్నారు. ఈ నిధులు సంస్థ వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు దోహదపడగలవని ఐఐటీ బాంబే డైరెక్టర్ శుభాశీస్ చౌదరి తెలిపారు. అలాగే 2030 నాటికల్లా ప్రపంచంలోనే టాప్ 50 యూనివర్సిటీల జాబితాలో చోటు దక్కించుకోవాలన్న లక్ష్య సాకారానికి కూడా తోడ్పడగలదని పేర్కొన్నారు. -
ఐఐటీ మండీలో ర్యాగింగ్ ఘటన
న్యూఢిల్లీ/మండీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–మండీలో జూనియర్లను ర్యాగింగ్ చేసిన 10 మంది సీనియర్లను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. మరో 62 మందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. విద్యార్థి విభాగం ఆఫీస్ బేరర్స్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ర్యాగింగ్ చేసిన సీనియర్ విద్యార్థులకు రూ.15వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించారు. 20 నుంచి 60 గంటలపాటు సమాజసేవ చేయాలని ఆదేశించినట్లు ఐఐటీ–మండీ ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. ముగ్గురు విద్యార్థి విభాగం ఆఫీస్ బేరర్లతోపాటు 10 మంది విద్యార్థులను తరగతి గదులు, వసతి గృహాల నుంచి డిసెంబర్‌దాకా సస్పెండ్ చేశారు. బీ.టెక్ కోర్సుల్లో కొత్తగా చేరిన మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం పరిచయ కార్యక్రమాన్ని ఇటీవల కాలేజీలో నిర్వహించారు. ‘ఈ ఘటనలో 72 మంది సీనియర్ విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం’ అని కాలేజీ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. -
కంటి వ్యాధులకు జన్యు చికిత్స
న్యూఢిల్లీ: వంశపారంపర్యంగా వచ్చే కంటి వ్యాధులను నయం చేసేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రిలయన్స్ లైఫ్ సైన్సెస్‌కు లైసెన్స్ ఇచ్చింది. ఈ జన్యు చికిత్సను రిలయన్స్ లైఫ్ మరింత అభివృద్ధి చేసి వాణిజ్యపరం చేయనుంది. జన్యు చికిత్సకు (జీన్ థెరపీ) సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, భారత్‌లోని ఒక విద్యాసంస్థ నుండి కంపెనీకి బదిలీ చేయడం ఇదే మొదటిసారి అని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఐఐటీ కాన్పూర్‌కు చెందిన బయాలాజికల్ సైన్సెస్, బయో ఇంజనీరింగ్ విభా గానికి చెందిన జయంధరణ్ గిరిధర రావు, శుభమ్ మౌర్య ఈ పేటెంటెడ్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. జంతువుల్లో దృష్టి లోపాన్ని సరిదిద్దడంలో ఇది మెరుగ్గా పనిచేసిందని ఐఐటీ కాన్పూర్ తెలిపింది. -
భరోస్, డేటా భద్రతకు ఓఎస్! భారత్ విప్లవాత్మక ముందడుగు
ప్రపంచమంతటా కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు విలాసాలు కాదు.. నిత్యావసరాలుగా మారిపోయాయి. మన దేశం కూడా అందుకు మినహాయింపు కాదు. దాదాపు అన్ని రంగాల్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల వాడకం తప్పనిసరిగా మారింది. ఇక ఫోన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ధనవంతుల నుంచి సామాన్యుల దాకా అందరి చేతుల్లోనూ దర్శనమిస్తున్నాయి. కంప్యూటర్లు, ఫోన్లు పని చేయాలంటే అందులో ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) కచ్చితంగా ఉండాలి. ఇలాంటి ఓఎస్ కోసం మనం ఇన్నాళ్లూ విదేశాలపైనే ఆధారపడుతున్నాం. ఓఎస్‌ను దేశీయంగా మనమే తయారు చేసుకోలేమా? అన్న ప్రశ్నకు సమాధానమే ‘భరోస్’. డిజిటల్ ఇండియా కలను సాకారం చేసే దిశగా ఫోన్లలో ఉపయోగపడే ఓఎస్‌ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)–మద్రాస్ అభివృద్ధి చేసింది. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్ స్వయంగా పరీక్షించారు. భరోస్ పరీక్ష విజయవంతమైందని ప్రకటించారు. ఈ ఓఎస్ అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములైన వారిని అభినందించారు. ఏమిటీ భరోస్? ► విదేశీ ఓఎస్‌పై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం, స్థానికంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ వాడకాన్ని ప్రోత్సహించడాన్ని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ► ఇందుకోసం భరోస్ పేరిట దేశీయ ఆపరేటింగ్ సిస్టమ్ అభివృద్ధికి నిధులు సమకూర్చింది. ► ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఆండ్రాయిడ్, ఆపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ఓఎస్‌లతో డిఫాల్ట్ యాప్‌లు, గూగుల్ సర్వీసులు తప్పనిసరిగా వస్తాయి. వాటిలో చాలావరకు మనకు అవసరం లేనివే ఉంటాయి. అవి ఏ మేరకు భద్రమో తెలియదు. ► భరోస్ ఓఎస్ వీటి కంటే కొంత భిన్నమనే చెప్పాలి. ఇదొక ఉచిత, ఓపెన్–సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది నో డిఫాల్ట్ యాప్స్(ఎన్డీఏ)తో వస్తుంది. అంటే భరోస్ ఓఎస్‌ను ఇన్స్టాల్ చేసుకున్న ఫోన్లో ఎలాంటి యాప్‌లు కనిపించవు. ► గూగుల్ ఆండ్రాయిడ్ వెర్షన్లతో క్రోమ్, జీమెయిల్, గూగుల్ సెర్చ్, యూట్యూబ్, మ్యాప్స్ వంటివి డిఫాల్ట్‌గా వస్తుండడం తెలిసిందే. ► డిఫాల్ట్‌గా వచ్చే యాప్‌లతో మోసాలకు గురవుతుండడం వినియోగదారులకు అనుభవమే. అందుకే భరోస్ ఓఎస్ ఉన్న ఫోన్లలో అవసరమైన యాప్‌లను ప్రైవేట్ యాప్ స్టోర్ సర్వీసెస్(పాస్) నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ► ‘పాస్’లో బాగా నమ్మకమైన, ప్రభుత్వ అనుమతి ఉన్న, అన్ని రకాల భద్రత, గోప్యత ప్రమాణాలు కలిగిన యాప్‌లు మాత్రమే ఉంటాయి. దీనివల్ల ఫోన్లలోని డేటా చోరీకి గురవుతుందన్న ఆందోళన ఉండదు. ► స్మార్ట్ఫోన్ల కంపెనీలకు ఈ ఓఎస్‌ను ఎలా అందజేస్తారు? ప్రజలకు ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తారు? రెగ్యులర్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరికీ ఇస్తారా? లేదా? అనేదానిపై ఐఐటీ–మద్రాస్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎవరు వాడుతున్నారు? ► కఠినమైన భద్రత, గోప్య త అవసరాలు కలిగిన కొన్ని సంస్థలు ప్రస్తుతం భరోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను పరీక్షిస్తున్నాయి. ► రహస్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొనే ప్రభుత్వ కంపెనీలు ఈ ఓఎస్‌ను వాడుతున్నట్లు సమాచారం. ఎందుకీ ఓఎస్? ► గూగుల్ మొబైల్ ఓఎస్ ఆండ్రాయిడ్‌పై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖకు చెందిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ► ఆండ్రాయిడ్‌తో డిఫాల్ట్‌గా వస్తున్న కొన్ని యాప్‌ల్లో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్లు తెలియజేసింది. ► ఈ నేపథ్యంలోనే దేశీయ ఆపరేటింగ్ సిస్టమ్ తయారీపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. విప్లవాత్మక ముందడుగు ఐఐటీ–మద్రాసు ఆధ్వర్యంలో స్థాపించిన జండ్ కే ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్(జండ్‌కాప్స్) అనే లాభాపేక్ష లేని స్టార్టప్ కంపెనీ భరోస్ ఓఎస్‌ను అభివృద్ధి చేసింది. ‘నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్’ కింద కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ నిధులు అందజేసింది. నమ్మకం అనే పునాదిపై భరోస్ మొబైల్ ఆపరేటింగ్ వ్యవస్థను రూపొందించినట్లు ఐఐటీ–మద్రాస్ డైరెక్టర్ చెప్పారు. తమ అవసరాలను తీర్చే యాప్‌లను పొందే స్వేచ్ఛను వినియోగదారులకు కల్పించాలన్నదే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని వివరించారు. దీనివల్ల సంబంధిత యాప్‌లపై వారికి తగిన నియంత్రణ ఉంటుందన్నారు. ఫోన్లలోని డేటా భద్రతకు భరోసా కల్పించే విషయంలో ఇదొక విప్లవాత్మకమైన ముందడుగు అని అభివర్ణించారు. మన దేశంలో ఈ ఓఎస్ వినియోగాన్ని పెంచేందుకు ప్రైవేట్ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, వ్యూహాత్మక సంస్థలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి పని చేస్తామని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జూన్ 4న జేఈఈ అడ్వాన్స్డ్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను వచ్చే ఏడాది జూన్ 4న నిర్వహిస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ పేపర్–2 ఉంటుందని పేర్కొంది. జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారిని ర్యాంకుల ప్రకారం 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అనుమతిస్తారు. ఇందులో వచ్చే ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. -
ఐఐటీల్లో హిందీ, స్థానిక భాషల్లో బోధించండి
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ఉన్నత విద్యా సంస్థలుసహా టెక్నికల్, నాన్–టెక్నికల్ విద్యా సంస్థల్లో హిందీ, స్థానిక భాషల్లో బోధించాలని అధికార భాషా పార్లమెంట్ కమిటీ సిఫార్సు చేసింది. ఇంగ్లిష్ భాష వాడకాన్ని కాస్త తగ్గించి భారతీయ భాషలకు తగిన ప్రాధాన్యతను కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఈ కమిటీ సిఫార్సులు పంపింది. ఇంగ్లిష్‌ను ఐచ్ఛికంగా వాడాలని హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ తన 11వ నివేదికను ఇటీవలే రాష్ట్రపతికి సమర్పించింది. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం అధికారిక లేదా ప్రాంతీయ భాషలనే వాడాలన్న సూచన మేరకు ఈ సిఫార్సులు చేసినట్లు కమిటీ ఉపాధ్యక్షుడు, బీజేడీ నేత భర్తృహరి మహతాబ్ చెప్పారు. ‘ఐక్యరాజ్యసమితి అధికారిక భాషల్లో హిందీని చేర్చాలి. ఏ–కేటగిరీ రాష్ట్రాల్లో హిందీకి ‘100 శాతం’ ప్రాధాన్యత ఇవ్వాలి. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాల యాలు, కేంద్రీయ విద్యాలయాల్లో హిందీలోనే బోధించాలి. వేరే రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో అక్కడి స్థానిక భాషల్లో బోధించాలి. వలస వాసనను వదిలించుకుంటూ విదేశీ భాష ఇంగ్లిష్‌ను కాస్త పక్కనబెట్టాలి’ అని కమిటీ సిఫార్సు చేసింది. ‘ హిందీ ఎక్కువగా మాట్లాడే ప్రాంతాల్లో ఉన్న బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ వర్సిటీ, జమియా మిలియా ఇస్లామియా, అలీగఢ్ ముస్లిం వర్సిటీలలో పూర్తిగా హిందీలోనే బోధిస్తే మేలు. ఇక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీస్‌లు, మంత్రిత్వ శాఖల మధ్య లేఖలు, ఫ్యాక్స్‌లు ఈ–మెయిల్లలో హిందీ లేదా స్థానిక భాషలను వాడాలి. అధికారిక కార్యక్రమాల్లో, ప్రసంగాల్లో, ఆహ్వాన పత్రాల్లో సులభంగా ఉండే హిందీ/స్థానిక భాషలనే వాడాలి’ అని సూచించింది. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, హరియాణా, హిమాచల్, రాజస్థాన్, ఢిల్లీ ఏ–కేటగిరీలో ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ బి–కేటగిరీలో ఉన్నాయి. మిగతావి సి –కేటగిరీలో ఉన్నాయి. -
జేఈఈ టాపర్స్ దృష్టి... ఐఐటీ బాంబే వైపే
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), బాంబే హవా కొనసాగుతోంది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్–2022లో టాప్–100 ర్యాంకర్లలో 93 మంది ఐఐటీ బాంబేను మొదటి ప్రాథామ్యంగా ఎంపిక చేసుకున్నారు. వీరిలో 69 మంది బాంబే ఐఐటీలో సీటు సాధించారు. ఇందులో 68 మంది మొదటి విడత కౌన్సిలింగ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోర్సును ప్రథమ ప్రాథామ్యంగా ఎంపిక చేసుకోగా ఒక్కరు ఇంజినీరింగ్ ఫిజిక్స్‌ను తీసుకున్నారు. టాప్–100 ర్యాంకర్లలో 28 మంది ఐఐటీ ఢిల్లీలోనూ ముగ్గురు ఐఐటీ మద్రాస్‌లోనూ జాయినయ్యారు. జాయింట్ సీట్ ఎలొకేషన్ అథారిటీ ఈ వివరాలను అందించింది. గత ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో టాప్–100 ర్యాంకర్లలో 62 మంది, 2020లో 58 ఐఐటీ బాంబేలో ప్రవేశం పొందగా 2019లో టాప్–100 ర్యాంకర్లలో 62 మంది, 2018లో 59 మంది ఇక్కడే సీటు సాధించారు. టాప్–500 ర్యాంకర్లకూ బాంబే ఐఐటీనే మొదటి ప్రాథామ్యంగా ఉంది. టాప్–500 ర్యాంకర్లలో 173 మంది ఇక్కడ, 127 మంది ఢిల్లీ ఐఐటీలో స్థానం సంపాదించారు. టాప్–500 ర్యాంకర్లలో మద్రాస్, ఖరగ్‌పూర్, కాన్పూర్ ఐఐటీల్లో సీట్లు సాధించిన వారి సంఖ్య 50 మంది లోపే. -
ఐఐటీలోనూ కంప్యూటర్ సైన్స్‌కే డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లోనూ కంప్యూటర్ సైన్స్ కోర్సు(సీఎస్సీ) సీట్ల కోసం విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ఐఐటీల్లో ఈసారి కూడా పోటీ తీవ్రంగానే కన్పిస్తోంది. ఐఐటీల్లో ఈ ఏడాది దాదాపు 500 సీట్లు పెరిగే వీలున్నప్పటికీ, సీఎస్సీకి ప్రాధాన్యం ఇచ్చేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. అయితే రాష్ట్రస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో మాదిరిగా కాకుండా ఐఐటీల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సులో సీట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మొత్తం 23 ఐఐటీల్లో 16,598 ఇంజనీరింగ్ సీట్లు ఉండగా, ఇందులో బాలికలకు 1,567 సూపర్ న్యూమరరీ సీట్లు ఉన్నాయి. అన్నీ కలిపి సీఎస్సీలో ఉన్న సీట్లు 1,891 మాత్రమే. మిగతావన్నీ వివిధ రకాల కోర్సులవే. ఫలితంగా సీఎస్సీ కోసం ఒక్కోచోట పోటీ ఒక్కో రకంగా ఉంది. పోటీ తీవ్రంగా ఉన్న బొంబాయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో 171, ధన్‌బాద్ 139, కాన్పూర్ 129, ఢిల్లీ 99, రూర్కీలో 109 సీట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనరల్ కేటగిరీలో అబ్బాయిలు 6 వేలలోపు, అమ్మాయిలు 11 వేల లోపు ర్యాంకు వస్తేనే ఎక్కడో ఒకచోట కంప్యూటర్ సైన్స్ సీటు దక్కే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. బొంబాయిలో హీట్... జమ్మూలో కూల్ ఐఐటీ సీట్లు దక్కే ర్యాంకులను నిశితంగా పరిశీలిస్తే బొంబాయి ఐఐటీలో పోటీ తీవ్రంగా కన్పిస్తోంది. ఇక్కడ జనరల్ కేటగిరీలో బాలురకు 67వ ర్యాంకు వరకూ, బాలికలకు 361వ ర్యాంకు వరకూ మాత్రమే సీటు దక్కే అవకాశముందని కొన్నేళ్ల అంచనాలను బట్టి తెలుస్తోంది. జమ్మూ ఐఐటీలో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఇక్కడ జనరల్ కేటగిరీ బాలురకు 5,238 వరకూ, బాలికలకు 10,552వ ర్యాంకు వరకూ కంప్యూటర్ సైన్స్ సీటు వచ్చే అవకాశం ఉంది. -
టార్గెట్ ఐఐటీ.. విద్యార్థుల్లో పెరుగుతున్న ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ఇంజనీరింగ్ సీట్లకు పోటీ పడేవారి సంఖ్య కొన్నేళ్ళుగా పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల విద్యార్థుల్లో ఎక్కువ మంది ఐఐటీల్లో సీటు సాధనే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఒక్కోసంవత్సరం ఒక్కో ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహిస్తోంది. ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) నిర్వహించే మెయిన్స్‌తో పోలిస్తే పదిరెట్లు కష్టంగా ఉంటుందని విద్యార్థులు భావిస్తుంటారు. అయినా పోటీ పడేవారు, పరీక్షలో అర్హత సంపాదించే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతుండటం విశేషం. 2007లో జేఈఈ అడ్వాన్స్డ్ రాసిన వారిలో కేవలం 3 శాతం మందే అర్హత సంపాదించగా ఇప్పుడది దాదాపు 30 శాతం వరకు పెరిగిందని జేఈఈ విభాగం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా గడచిన ఆరేళ్ళలో అడ్వాన్స్‌డ్‌లో క్వాలిఫై అయ్యే వారి సంఖ్య మరింత పెరిగింది. ఒక విద్యా సంవత్సరం నష్టపోయినా.. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని మరీ ఐఐటీ సీటు సాధించాలనే పట్టుదల విద్యార్థుల్లో బలపడుతోంది. జేఈఈలో మంచి ర్యాంకు వచ్చిన ప్రతి విద్యార్థికీ ఎన్ఐటీల్లో సీటు వస్తుందని తెలిసినా, ఐఐటీ సీటు కోసం అడ్వాన్స్డ్ కూడా రాసేందుకు సిద్ధపడుతున్నారు. నిజానికి 15 ఏళ్ళ క్రితం కంటే ఇప్పుడు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్ల సంఖ్య పెరిగిందని.. ఇదే క్రమంలో అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించే అభ్యర్థులూ పెరుగుతున్నారని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. మారిన విధానంతో ముందుకు.. ఐఐటీలపై విద్యార్థుల ఆసక్తి పెరగడానికి అనేక కారణాలు కన్పిస్తున్నాయి. గతంలో ఐఐటీ–జేఈఈ, జేఈఈ మెయిన్, ఏఐఈఈఈ పేరుతో వేర్వేరుగా ప్రవేశ పరీక్షలుండేవి. అంటే ఐఐటీలకు, నిట్‌కు.. ట్రిపుల్ ఐటీలకు విడివిడిగా పరీక్షలు నిర్వహించి ప్రవేశాలు కల్పించేవారు. ఈ పరీక్షలకు విద్యార్థులు వేర్వేరుగా సన్నద్ధమవ్వాల్సిన పరిస్థితి ఉండేది. 2013 తర్వాత కేంద్రం ఈ విధానాన్ని మార్చింది. ప్రస్తుతం జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్ మాత్రమే ఉన్నాయి. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారు, అడ్వాన్స్‌డ్‌కు వెళ్తారు. మెయిన్స్ ర్యాంకుల ఆధారంగా నిట్, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందితే, అడ్వాన్స్డ్ ర్యాంకు ద్వారా ఐఐటీల్లో సీట్లు లభిస్తాయి. ఈ విధానం వచ్చిన తర్వాత తేలికగా సన్నద్ధమయ్యే అవకాశం లభించిందని, అర్హత శాతం గణనీయంగా పెరగడం ప్రారంభం అయ్యిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే గత కొన్నేళ్ళుగా పరీక్ష విధానం, సిలబస్, సన్నద్ధమయ్యే తీరు తేలికగా ఉండి శిక్షకులు, విద్యార్థులు అర్థం చేసుకునే అవకాశం ఏర్పడిందని చెబుతున్నారు. మరోవైపు ఆసక్తి, పట్టుదల కలిగిన విద్యార్థులను అడ్వాన్స్డ్ వరకు తీసుకెళ్లగలిగేలా కోచింగ్ సెంటర్లు, ఆన్లైన్ మెటీరియల్స్ అందుబాటులోకి రావడం మరో కారణమని పేర్కొంటున్నారు. 2012లో 5.02గా ఉన్న అర్హత శాతం 2013లో ఏకంగా 17.96 శాతానికి పెరగడం ఇందుకు నిదర్శనం. కాగా అప్పట్నుంచీ 20 శాతానికి పైగా విద్యార్థులు అర్హత సాధిస్తుండటం గమనార్హం. సాధారణంగా జేఈఈ మెయిన్స్‌కు ఏటా 8 నుంచి 10 లక్షల మంది వరకు హాజరవుతున్నారు. ఇందులో 2.5 లక్షల మంది వరకు అడ్వాన్స్‌డ్‌కు క్వాలిఫై అవుతున్నారు. వీరిలో 50 వేల మంది దాకా ఐఐటీల్లో ప్రవేశానికి అర్హత సాధిస్తున్నారు. -
ఐఐటీల్లో పెరిగిన విద్యార్థినులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో సూపర్‌న్యూమరీ మహిళా కోటాను ప్రవేశ పెట్టాక విద్యార్థినుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని కేంద్ర విద్యాశాఖ పరిధిలోని అడ్మిషన్స్ స్టాటస్టిక్స్–2021 తాజా నివేదిక పేర్కొంది. ఈ కోటా కింద 2021–22 ఏడాది బ్యాచ్‌లో 20 శాతం మంది విద్యార్థినులే ఉన్నారని, 2017లో ఐఐటీల్లో విద్యార్థినులు కేవలం 995 మంది ఉండగా, ప్రస్తుతం వీరి సంఖ్య 2,990కి పెరిగిందని తెలిపింది. ప్రతిష్టాత్మక ముంబై ఐఐటీలో 2017లో కేవలం 100 మంది విద్యార్థినులు చేరగా, ప్రస్తుతం 271కి, ఐఐటీ ఢిల్లీలో ఈ సంఖ్య 90 నుంచి 246కి, హైదరాబాద్ ఐఐటీలో 43 నుంచి 94కు పెరిగిందని వెల్లడించింది. 2017–2021 కాలంలో ఐఐటీల్లో ప్రవేశం పొందిన మొత్తం విద్యార్థులు 10,988 నుంచి 16,296కి పెరగ్గా, విద్యార్థినుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని వివరించింది. ‘ఐఐటీల్లో విద్యార్థినుల సంఖ్య పెరగడం సామాజికంగా, దీర్ఘకాలికంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వీరిలో చాలా మంది అగ్రశ్రేణి స్థానాల్లో ఉంటారు. అత్యున్నత బ్యాంకర్లలో వీరి సంఖ్య పెరుగుతుంది’అని ఐఐటీ బాంబే డైరెక్టర్ సుభాశీష్ చౌదరి పేర్కొన్నారు. -
భారత్‌లో కోవిడ్ థర్డ్‌వేవ్.. ఫిబ్రవరిలో విజృంభణ!
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ థర్డ్‌వేవ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పతాక స్థాయికి చేరవచ్చని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) కాన్పూర్ పరిశోధకులు చేపట్టిన ఓ ముందస్తు అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల తీరు ప్రాతిపదికగా ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపింది. గౌసియన్ మిక్సర్ మోడల్ అనే టూల్‌ను ఉపయోగించి చేపట్టిన ఈ అధ్యయనాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే థర్డ్‌వేవ్‌తో సతమతమవుతున్న అమెరికా, బ్రిటన్, జర్మనీ, రష్యాల్లో నమోదైన రోజువారీ కేసుల డేటాను ఉపయోగించుకుంటూ దేశంలో థర్డ్‌వేవ్ ప్రభావంపై ఈ అంచనాకు వచ్చినట్లు చెప్పింది. దేశంలో థర్డ్‌వేవ్‌లో డిసెంబర్ 15వ తేదీకి అటూఇటుగా కరోనా కేసుల్లో పెరుగుదల నమోదు చోటుచేసుకోగా 2022 ఫిబ్రవరి 3వ తేదీకల్లా ఇది తీవ్ర స్థాయికి చేరుకోనుంది’ అని ఆ అధ్యయనం పేర్కొంది. అయితే, వ్యాక్సినేషన్ డేటాను పరిగణనలోకి తీసుకోనందున అప్పటికి కేసుల్లో పెరుగుదల ఏ మేరకు ఉంటుందో కచ్చితంగా చెప్పలేమని కూడా స్పష్టం చేసింది. -
ఐఐటీ హైదరాబాద్‌తో హనీవెల్ జట్టు
న్యూఢిల్లీ: హనీవెల్ టెక్నాలజీ సొల్యూషన్స్ (హెచ్‌టీఎస్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–హైదరాబాద్ (ఐఐటీ–హెచ్) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ల్యాబ్ ఏర్పాటుతో పాటు కొత్త టెక్నాలజీలపై సంయుక్తంగా పరిశోధనలకు ఇది తోడ్పడుతుందని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. ల్యాబ్‌ను బుధవారం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా దేశంలోనే ఏఐలో పూర్తి స్థాయి బీటెక్ కోర్సు అందిస్తున్న తొలి విద్యా సంస్థ ఐఐటీ–హెచ్ అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ ల్యాబ్‌ను ఐఐటీ–హెచ్ నిర్వహిస్తుంది. నిర్దిష్ట రంగాల్లోని వివిధ విభాగాల్లోని సిబ్బందికి అవసరమైన శిక్షణనిచ్చేందుకు, వర్క్‌షాప్‌ల నిర్వహణ, ఐఐటీ–హెచ్ విద్యార్థులు అలాగే హెచ్‌టీఎస్ ఉద్యోగులకు హ్యాకథాన్లు మొదలైన వాటి నిర్వహణకు రెండు సంస్థల మధ్య భాగస్వామ్య ఒప్పందం తోడ్పడనుంది. -
ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్డ్–2020 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్ష జరిగింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 2.50 లక్షల మంది అర్హత సాధించినా 1.60 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. కంప్యూటర్ ఆధారితంగా ఈ పరీక్షలు నిర్వహించారు. రెండు పేపర్లు తప్పనిసరిగా రాయాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 30 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరైనట్టు నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా 222 పట్టణాల్లో 1000 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో 15 పట్టణాల్లో, ఆంధ్రప్రదేశ్‌లో 30 చోట్ల ఈ పరీక్ష కేంద్రాలను ఏర్పాట చేశారు. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మాస్క్, శానిటైర్ ఉన్నవిద్యార్థులనే నిర్వాహకులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారని తెలిసిందే. ఆబ్జెక్టివ్ తరహాలో ఉండే ఈ పరీక్షల్లో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. వచ్చే నెల 5న ఫలితాలు విడుదల కానున్నాయి. -
ఐఐటీ పాట్నాతో ఫ్లిప్‌కార్ట్ జోడీ..
న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రతిష్టాత్మక సంస్థ ఐఐటీ పాట్నాతో జోడీ కట్టనుంది. త్వరలో కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటలిజన్స్), మెషిన్ లెర్నింగ్ తదితర అంశాలలో కలిసి పనిచేయనున్నట్లు మంగళవారం తెలిపింది. విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక అవగాహన కలిగించేందుకు తమ కలయిక ఎంతో ఉపయోగపడుతుందని ఇరు వర్గాలు తెలిపాయి. కాగా ఈ ప్రాజెక్ట్‌లో ఐఐటీ విద్యార్థులకు సెమినార్లు, రీసెర్చెపై అవగాహన, ఇంటర్న్‌షిప్, మెంటార్షిప్ తదితర అంశాలలో శిక్షణ పొందనున్నారు. ఈకామర్స్ రంగంలో వస్తున్న సాంకేతిక అంశాలు, వినియోగదారులు అభిరుచుల తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా ఇది వరకే ఫ్లిప్‌కార్ట్ ఐఐఎస్సీ, ఐఐటీ (ఖరగ్‌పూర్, బాంబే, కాన్పూర్) తదితర ఐఐటీ బ్రాంచ్‌లకు శిక్షణ ఇచ్చింది. -
ఇక ఐఐటీల్లోనూ ఆన్లైన్ పాఠాలు!
సాక్షి, హైదరాబాద్ : ఐఐటీల్లో ఆన్లైన్లో తరగతులను నిర్వహించేందుకు ఐఐటీ కౌన్సిల్ కసరత్తు చేస్తోంది. ఆగస్టు 23న జేఈఈ అడ్వాన్స్డ్, కౌన్సెలింగ్ అనంతరం సెప్టెంబర్ ఆఖరు లేదా అక్టోబర్‌లో తరగతులు ప్రారంభమయ్యే వీలుంది. ఇక ఇతర సెమిస్టర్ విద్యార్థులకు తరగతులను ఇప్పటికే ప్రారంభించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడంతో ఆన్లైన్ తరగతులను నిర్వహించేందుకు ఐఐటీల కౌన్సిల్ కసరత్తు ప్రారంభించింది. ఒక సెమిస్టర్ పాటు ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కసరత్తు చేస్తోంది. అప్పటికీ కరోనా అదుపులోకి రాకపోతే ఈ ఏడాది చివరి వరకు ఆన్లైన్ తరగతుల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. ఇందుకు ఐఐటీల కౌన్సిల్ గతవారం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. -
కరోనాపై ఐఐటీల పోరు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా జరుగుతున్న శాస్త్రీయ అధ్యయనాలు, పరిశోధనల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ (ఐఐటీ)లు ముందు వరుసలో ఉన్నాయి. దేశంలోని 18 ఐఐటీలకు చెందిన నిపుణులు 218 పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్ డీ) ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు. ఈ పరిశోధనలు ఏడు కేటగిరీల్లో జరుగుతుండగా వీటిలో కొన్నింటి ఫలితాలు ఇప్పుడిప్పుడే రావడం ప్రారంభమైనట్లు ఐఐటీ వర్గాలు చెబుతున్నాయి. కరోనాపై జరుగుతున్న ఆర్అండ్డీ ప్రాజెక్టుల్లో ఐఐటీ గౌహతి అగ్రస్థానంలో ఉండగా, ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆరు ఐఐటీల్లోనే 50 శాతం ప్రాజెక్టులు.. ఈ పరిశోధన ప్రాజెక్టుల్లో సుమారు 50 శాతం మేర ఆరు ఐఐటీల పరిధిలోనే జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో ఎక్కువ శాతం వ్యక్తిగత రక్షణ కిట్లు (పీపీఈ), శానిటైజేషన్, పారిశుధ్యానికి సంబంధించినవే ఉన్నాయి. పరీక్ష కిట్లు, వైద్య ఉపకరణాలు, రోబోలు, డ్రోన్లు, పర్యవేక్షణ, డేటా విశ్లేషణ, వ్యాధి విస్తరణ తీరుతెన్నులు వంటి రంగాల్లోనూ పరిశోధకు లు దృష్టి కేంద్రీకరించారు. ఐఐటీ గౌహతి, మద్రాసులో ఏడు రకాల కేటగిరీల్లో నూ అభివృద్ది, పరిశోధన ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. రూ.120 కోట్లతో పరిశోధన, అభివృద్ధి.. అన్ని ఐఐటీల్లో జరుగుతున్న ఆర్ అండ్ డీ కార్యక్రమాలకు రూ.120 కోట్ల మేర నిధులు సమకూర్చగా, వీటి ఫలితాలు ఏడాదిన్నరలోగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఐఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఐఐటీ మండి, ఐఐటీ పాలక్కడ్, ఐఐటీ గోవా వంటి కొత్త ఐఐటీల్లో కూడా ఆర్ అండ్ డీ కార్యక్రమాలు పురోగతిలో ఉన్నాయి. పీపీఈ సూట్లు, యూవీ ఆధారిత వ్యాధి నిరోధకాలు, డ్రోన్ టెక్నాలజీ ద్వారా వ్యాధిని కట్టడి చేయడం వంటి అంశాల్లో పలు పరిష్కారాలను ఇప్పటికే రూపొందించాయి. అయితే వాణిజ్యపరంగా మార్కెట్లో అందుబాటులోకి వచ్చేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. -
కోవిడ్ బాధితుల కోసం వార్డ్‌బోట్!
చండీగఢ్: కోవిడ్–19 బాధితులకు సేవలందించేందుకు పంజాబ్‌లోని రోపార్‌లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) శాస్త్రవేత్తలు ప్రత్యేక రోబోట్‌ను తయారు చేశారు. ఆసుపత్రుల్లో వార్డ్‌బోట్‌ల వాడకం ద్వారా వైద్యసిబ్బంది వైరస్ బారిన పడటాన్ని తగ్గించవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవి రోగులకు మందులు, ఆహారం అందివ్వగలవని అసోసియేట్ ప్రొఫెసర్ ఎక్తా సింగ్లా తెలిపారు. ఇవి చేతులు ఊపడం వంటి సంజ్ఞలను అర్థం చేసుకోగలవని వివరించారు. కంట్రోల్ రూం ద్వారా ఏకకాలంలో వేర్వేరు వార్డుల్లోని రోబోలను నియంత్రించడం, ఆదేశాలివ్వడం సాధ్యమని... తరచూ తనని తాను శానిటైజర్ ద్వారా శుభ్రం చేసుకోవడం వార్డుబోట్‌కు ఉన్న మరో ప్రత్యేకత అని తెలిపారు. -
కరోనా కట్టడిలో ఐఐటీలు
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశంలోని అత్యున్నత జాతీయ విద్యాసంస్థలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) సంస్థలు కరోనా వైరస్‌ను నిరోధించే పరికరాలను తయారు చేస్తూ అతి తక్కువ ఖర్చుతో ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాయి. ఇన్ఫెక్షన్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్స్ ► ఆస్పత్రుల్లోని సిబ్బంది, రోగులకు ఇన్ఫెక్షన్ రాకుండా నిరోధించడానికి ‘ఇన్ఫెక్షన్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్స్’ను కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహకారంతో ఢిల్లీ ఐఐటీ అభివృద్ధి చేసింది. ► అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఆస్పత్రులకు వచ్చే ప్రతి 100 మందిలో 10 మంది ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. కరోనా వైరస్ విజృంభణ సమయంలో ఇన్ఫెక్షన్ల సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. ► అధునాతన టెక్స్టైల్ టెక్నాలజీ ద్వారా సాధారణ కాటన్‌ను ఇన్ఫెక్షన్ ప్రూఫ్‌గా మార్పు చేశారు. ఇది శక్తివంతమైన యాంటీ మైక్రోబయాల్గా మారి ఇన్ఫెక్షన్లను నిరోధిస్తుంది. ► ఉతికిన తరువాత కూడా ఇవి యధావిధిగా ఇన్ఫెక్షన్లను నిరోధిస్తాయి. బెడ్షీట్లు, యూనిఫామ్, కర్టెన్లు ఇలా దేనికైనా ఈ వస్త్రాన్ని ఉపయోగించవచ్చు. ► రోడ్లు, పార్కులు, మైదానాలు, ఇతర ప్రాంతాల్లో మానవ రహితంగా శానిటైజర్‌ను స్ప్రే చేసేందుకు గౌహతిలోని ఐఐటీ విద్యార్థులు ఆటోమేటెడ్ స్ప్రేయర్ డ్రోన్‌ను అభివృద్ధి చేశారు. ► మొబైల్ ఫోన్‌తో నియంత్రించే డ్రోన్ .. 3 కిలోమీటర్ల పరిధిలో సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా ఇది పని చేస్తుంది. రియల్ టైమ్ పీసీఆర్ రెడీ ► కరోనా వైరస్‌ను గుర్తించేందుకు రియల్ టైమ్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్ (పీసీఆర్) యంత్రాలను ఐఐటీ గౌహతి రూపొందించి అక్కడి ఆస్పత్రులకు అందించింది. ► రోబో ఆధారిత స్క్రీనింగ్ యూనిట్లు, హైకెపాసిటీ ఆటోక్లేవ్ మెషిన్లు, టెంపరేచర్ మెజరింగ్ యూనిట్లు అందించింది. ► ఈశాన్య రాష్ట్రాల్లో కోవిడ్–19 నివారణకు ఐఐటీ గౌహతిలో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రూ.4 లక్షల వెంటిలేటర్ రూ.70 వేలతోనే.. ► ఐఐటీ కాన్పూర్ తక్కువ ఖర్చుతో.. నాణ్యమైన వెంటిలేటర్‌ను అభివృద్ధి చేసింది. మార్కెట్లో రూ.4 లక్షలకు పైగా ఉండే వెంటిలేటర్‌ను దేశీయంగా లభించే పరికరాలు వినియోగించి రూ.70 వేలతోనే దీనిని రూపొందించింది. ► ఒక్క నెలలోనే 1,000 పోర్టబుల్ వెంటిలేటర్లను సిద్ధం చేయొచ్చు. దీన్ని మొబైల్‌కు అనుసంధానించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ► అవసరమైనప్పుడు ఆక్సిజన్ సిలిండర్‌ను అమర్చుకునే వీలు కూడా ఇందులో ఉంటుంది. బ్యాగ్ వాల్వ్ మాస్క్ వెంటిలేటర్ ► ఎక్కడికైనా తీసుకువెళ్లేందుకు వీలుగా ‘అంబు బ్యాగ్’ పేరుతో బ్యాగ్ వాల్వ్ మాస్క్ వెంటిలేటర్‌ను హైదరాబాద్ ఐఐటీ సిద్ధం చేసింది. ► అత్యవసర పరిస్థితుల్లో శ్వాసక్రియను కొనసాగింప చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ► దీని తయారీకి కేవలం రూ.5 వేలు మాత్రమే ఖర్చవుతుంది. చేతితో పని చేయించే ఈ సాధనం రోగికి అప్పటికప్పుడు శ్వాసను అందించగలుగుతుంది. దీనిని బ్యాటరీతో కూడా పని చేయించవచ్చు. -
జేఈఈలో న్యూమరిక్ వ్యాల్యూ ప్రశ్నలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్‌లో కొత్తగా ప్రవేశపెడుతున్న న్యూమరిక్ వ్యాల్యూ ప్రశ్నల శాంపిల్ జాబితాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్ విభాగాల్లో ఇచ్చే ప్రశ్నల్లో 5 న్యూమరిక్ వ్యాల్యూకు చెందినవి ఉంటాయి. కొత్త విధానాన్ని వచ్చే ఏడాది నిర్వహించే తొలిదశ మెయిన్స్ నుంచి అమలు చేయనున్నారు. మూడు విభాగాల శాంపిల్ ప్రశ్నలను జేఈఈ–2020 వెబ్సైట్లో పొందుపరిచారు. మెరిట్ విద్యార్థులు నష్టపోకుండా.. జేఈఈ మెయిన్స్‌లో మల్టిపుల్ ఆన్సర్ల ప్రశ్నలకు సంబంధించి ఏదో ఒక సమాధానానికి గుడ్డిగా టిక్ చేస్తుండటంతో సామర్థ్యంలేని కొంతమంది విద్యార్థులకు కూడా ఎక్కువ మార్కులు వస్తున్నాయి. దీనివల్ల మెరిట్ విద్యార్థులకు నష్టం జరుగుతోందన్న సూచనలు ఎన్టీఏకు అందాయి. దాంతో పాటు జేఈఈలో ప్రశ్నల సంఖ్యను కూడా తగ్గిస్తూ కొత్త ప్యాట్రన్‌ను ఎన్టీఏ ప్రకటించింది. అడ్మిట్ కార్డులు సిద్ధం జేఈఈ–2020 మెయిన్స్ తొలిదశ ఆన్లైన్ పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 6 నుంచి 9వ తేదీ వరకు జరుగుతాయి. అడ్మిట్ కార్డులను వెబ్సైట్లో పొందుపరిచినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది. విద్యార్థులు ‘జేఈఈ మెయిన్.ఎన్టీఏ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించింది. డౌన్లోడ్ కాని పక్షంలో ‘జేఈఈ మెయిన్.ఎన్‌టీఏఎట్‌దరేట్‌జీఓవీ.ఐఎన్’ అడ్రస్‌కు అభ్యర్థనను ఈ–మెయిల్ చేయాలని సూచించింది. గతంలో ఎలా..ఇప్పుడెలా... ►గతంలో జేఈఈ మెయిన్స్‌లోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్ విభాగాల్లో 30 చొప్పున బహుళ సమాధానాల ప్రశ్నలు ఇచ్చేవారు. ►ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. సమాధానాలు తప్పుగా టిక్ పెడితే ఒక మార్కుచొప్పున కోత పడేలా మైనస్ మార్కుల విధానం అమలు చేస్తున్నారు. ►కొత్త ప్యాట్రన్ ప్రకారం 30 ప్రశ్నల సంఖ్యను 25కు కుదించి విద్యార్థులపై భారాన్ని తగ్గించారు. ►ఈ 25 ప్రశ్నల్లో 20 మల్టిపుల్ ఆన్సర్లతో కూడిన ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. మిగతా 5 న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలు ఉంటాయి. ►ఈ విభాగంలో మల్టిపుల్ ఆన్సర్స్ ఇవ్వకుండా కేవలం ప్రశ్న మాత్రమే అడుగుతారు. ప్రశ్నకు సమాధానంగా కేవలం సంఖ్య మాత్రమే ఉంటుంది. ఆన్సర్ స్థానంలో ఖాళీని ఉంచుతారు. సరైన సమాధానం వచ్చే సంఖ్యను మాత్రమే విద్యార్థి రాయాల్సి ఉంటుంది. ►ఇలా మూడు విభాగాల్లోనూ న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలు ఐదేసి ఉంటాయి. ►మల్టిపుల్ ఆన్సర్ ఆబ్జెక్టివ్‌గా ఇచ్చే 20 ప్రశ్నలకు మాత్రమే మైనస్ మార్కులు ఉంటాయి. ►న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలకు ఇది వర్తించదు. ►గతంలో జేఈఈ మెయిన్స్‌లో మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల పేపర్లలో ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలకు 120 మార్కుల చొప్పున మొత్తం 90 ప్రశ్నలు 360 మార్కులకు ఉండేవి. ►తాజాగా ప్రశ్నల కుదింపుతో ఇప్పుడు మూడు కేటగిరీల్లో 75 ప్రశ్నలతో 300 మార్కులకు ఉంటుంది. మెరిట్ విద్యార్థులకు ఎంతో మేలు ‘కొత్త ప్యాట్రన్‌లో న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నల విధానం వల్ల మెరిట్ విద్యార్థులకు మేలు జరుగుతుంది. గతంలో సబ్జెక్టుపై పట్టులేకున్నా గుడ్డిగా ఏదో ఒక ఆన్సర్‌కు టిక్ చేసే వారు అదృష్టవశాత్తు అది కరెక్టు అయితే మెరిట్‌లోకి చేరేవారు. దీనివల్ల ప్రతిభగల అభ్యర్థులకు నష్టం వాటిల్లేది. ఇప్పుడు న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నల వల్ల కేవలం ఆ ప్రశ్నకు సరైన సమాధానం తెలిసినవారే రాయగలుగుతారు. తద్వారా మెరిట్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. – కేతినేని శ్రీనివాసరావు కెమిస్ట్రీ అధ్యాపకుడు, విజయవాడ -
ఐఐటీ సూపర్.. ఫారిన్ ఆఫర్..
సాక్షి ప్రత్యేకప్రతినిధి: ఈ ఏడాది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ఉద్యోగ నియామకాలకు విదేశీ కంపెనీలు క్యూ కట్టాయి. ఉత్తర అమెరికా, యూరప్, సింగపూర్, జర్మనీ, జపాన్ వంటి దేశాలు ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల విద్యార్థులను నియమించుకునేందుకు పోటీపడ్డాయి. ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థుల కోసం గత ఏడాది 26 విదేశీ కంపెనీలు బారులుతీరగా ఈ సీజన్లో ఏకంగా 51 విదేశీ కంపెనీలు నియామకాలు చేపట్టాయి. ఐఐటీ కాన్పూర్, ఐఐటీ బీహెచ్‌యూ, ఐఐటీ గువాహటిలలో ఒక్కో విద్యార్థికి సగటున ఐదు ఆఫర్లు లభిం చాయి. ఐఐటీ హైదరాబాద్ ఉద్యోగ నియామకాల్లో కొన్ని ఐఐటీలను దాటిపోయిం ది. ఈ విద్యా సంవత్సరం బీటెక్ పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులను నియమించుకునేందుకు 38 అంతర్జాతీయ కంపెనీలు అడుగుపెట్టాయి. ఐఐటీ మద్రాస్ (34), ఐఐటీ కాన్పూర్ (22), ఐఐటీ (బీహెచ్‌యూ) వారణాసి (11), ఐఐటీ గువాహటి (25) కంటే హైదరాబాద్ ఐఐటీ అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించడంలో ముందంజలో ఉంది. ‘వచ్చే జనవరి నుంచి మొదలయ్యే తుది సీజన్ నియామకాల తరువాత అంతర్జాతీయ కంపెనీల సంఖ్య పెరుగుతుంది’అని ఐఐటీ హైదరాబాద్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎక్కువ ఆఫర్ చేసిన మైక్రోసాఫ్ట్, ఉబర్... ఈ ఏడాది ఐఐటీ విద్యార్థులకు పెద్ద మొత్తంలో ఉద్యోగాలు ఆఫర్ చేసిన అంతర్జాతీయ కంపెనీల్లో మైక్రోసాఫ్ట్, ఉబర్, పేపాల్తోపాటు యాక్సెంచర్ జపాన్, డెస్కెరా, హనీవెల్ వంటివి ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ 100 మందికిపైగా విద్యార్థులకు రూ. కోటి అంతకంటే ఎక్కువ ఆఫర్ చేయడం విశేషం. ఉబర్, పేపాల్ వంటి అమెరికన్ కంపెనీలు తక్కువ సంఖ్యలో విద్యార్థులను నియమించుకున్నప్పటికీ కనిష్టంగా రూ. 60 లక్షలు, గరిష్టంగా రూ. కోటి మేర వేతనాలను ఆఫర్ చేశాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ జరిగిన నియామకాల్లో ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్ విద్యార్థుల్లో 60 శాతం మందికి అంతర్జాతీయ కంపెనీలు ఆఫర్లు ఇచ్చాయి. అంతర్జాతీయ కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లు పొందిన వారికి అమెరికా, సింగపూర్, జపాన్, జర్మనీ వంటి దేశాల్లోనే ఉద్యోగాలు దక్కాయి. ఇలా ఉద్యోగాలు పొందిన వారికి సంబంధిత కంపెనీలే వర్క్ పర్మిట్ (ఆయా దేశాల్లో పని చేసేందుకు అనుమతి) తీసుకుంటాయి. ప్లేస్‌మెంట్స్‌లో హైదరాబాద్ ఐఐటీ రెండో స్థానం... ఐఐటీ ఖరగ్‌పూర్‌కు ఈసారి అంతర్జాతీయ సంస్థలు వెల్లువెత్తాయి. ఈ విద్యా సంవత్సరం బీటెక్ పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులను నియమించుకునేందుకు 51 కంపెనీలు నియామక ప్రక్రియను పూర్తి చేశాయి. ఐఐటీ బాంబేలో తుది దశ నియామకాల ప్రక్రియ పూర్తయితేగానీ ఈ ఏడాది అంతర్జాతీయ కంపెనీలు ఏ ఐఐటీని ఎక్కువగా సందర్శించాయన్న వివరాలు లభ్యం కావు. అయితే ఇప్పటివరకూ పూర్తయిన నియామక ప్రక్రియను పరిశీలిస్తే ఖరగ్‌పూర్ తరువాత ఆ స్థానం హైదరాబాద్‌కు దక్కుతుంది. హైదరాబాద్ ఐఐటీని సందర్శించిన అంతర్జాతీయ కంపెనీల సంఖ్య 38. ప్లేస్మెంట్లలో ఐఐటీ హైదరాబాద్ ఈసారి పాత ఐఐటీలు ఎన్నింటినో అధిగమించి రికార్డు దిశగా దూసుకుపోతోంది. ఢిల్లీ, బాంబే ఐఐటీలలో నియామకాల ప్రక్రియ ఇటీవలే మొదలైందని, జనవరి ఆఖరుతో పూర్తవుతుందని, ఆ తరువాత ఐఐటీలవారీగా నియామకాలు చేపట్టిన జాతీయ, అంతర్జాతీయ కంపెనీల వివరాలు వెల్లడిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. ‘అంతర్జాతీయ పత్రికలు విద్యాసంస్థల రేటింగ్‌లో ఐఐటీలను తక్కువ చేసి చూపుతున్నా వాటిలో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న విద్యార్థులే రేటింగ్‌లకు చక్కని ఉదాహరణ అని ఆ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ప్లేస్మెంట్లు ఆఫర్ చేసిన అంతర్జాతీయ కంపెనీల్లో కొన్ని... మైక్రోసాఫ్ట్ ఉబర్ పేపాల్ యాక్సెంచర్ జపాన్ డెస్కెరా హనీవెల్ – మైక్రోసాఫ్ట్ 100 మందికిపైగా విద్యార్థులకు రూ. కోటి అంతకంటే ఎక్కువ ఆఫర్ చేసింది. – ఉబర్, పేపాల్ తక్కువ మందిని నియమించుకున్నా రూ. 60 లక్షలు–రూ. కోటి వరకు ఆఫర్ చేశాయి. -
ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
చెన్నై: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాసు (ఐఐటీ– ఎం)లో ఫైనలియర్ విద్యార్థి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేరళలోని మళప్పురానికి చెందిన షాహుల్ కోర్నాథ్ (23) ఐఐటీ–ఎంలో నేవల్ ఆర్కిటెక్చర్ విభాగంలో బీటెక్– ఎంటెక్ (డ్యూయల్ డిగ్రీ) చదువుతున్నాడు. షాహుల్ శనివారం తన గదిలో సీలింగ్‌కు ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని వెల్లడించారు. హాజరు తక్కువగా ఉండటంతో షాహుల్ కొంత ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోందన్నారు. షాహుల్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, ఘటనపై దర్యాప్తు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. -
వివాదంతో ఐఐటీ డెరైక్టర్ రాజీనామా
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) ఢిల్లీ డెరైక్టర్ రఘునాథ్ కేఎస్ శెవ్‌గావొంకర్ రాజీనామా చేశారు. మరో రెండేళ్లకు పైగా సర్వీస్ ఉండగానే ఆయన రాజీనామా చేయడం, కేంద్ర మానవవనరుల శాఖ(హెచ్ఆర్డీ) ఒత్తిడి కారణంగానే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు వస్తుండటంతో ఆ రాజీనామా వ్యవహారం వివాదాస్పదమైంది. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఐఐటీ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ల చైర్మన్ విజయ్ పీ భట్కర్‌కు శుక్రవారం పంపిన లేఖలో పేర్కొన్నారు. అయితే, ఐఐటీ ఢిల్లీ క్యాంపస్‌లోని కొంత భూమిని ప్రముఖ క్రికెటర్ సచిన్ తేందూల్కర్ ఏర్పాటు చేయాలనుకుంటున్న క్రికెట్ అకాడమీకి అప్పగించాలని, ఐఐటీ ఢిల్లీలో కొంతకాలం ఫాకల్టీగా ఉన్న బీజేపీ నేత సుబ్రహణ్యస్వామికి చెల్లించాల్సి ఉన్న బకాయిలు రూ. 70 లక్షలను వెంటనే చెల్లించాలని హెచ్ఆర్డీ నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడం వల్లనే రఘునాథ్ ఐఐటీ ఢిల్లీ డెరైక్టర్ పదవికి రాజీనామా చేశారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఆదివారం హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖ ఖండించింది. ఆ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఒక వివరణ లేఖను అధికారులు మీడియాకు విడుదల చేశారు. ఐఐటీ ఢిల్లీ డెరైక్టర్‌కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, ఆయనపై ఏ విధమైన ఒత్తిడి తేలేదని అందులో స్పష్టం చేశారు. ఆ విషయమై మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవాలని పేర్కొంది. క్రికెట్ అకాడమీ కోసం ఐఐటీ భూమి కోరుతూ సచిన్ తేందూల్కర్ నుంచి ఎలాంటి అభ్యర్థన లేదని పేర్కొంది. అలాగే, సుబ్రమణ్యస్వామి జీతం బకాయిల గురించి కూడా ఐఐటీ ఢిల్లీకి ఏ విధమైన ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. కాగా, ఈ వివాదంలోకి తనను లాగడంపై సచిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రీసెర్చ్ ఓరియెంటేషన్‌కు పెద్దపీట
మై క్యాంపస్ లైఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) - రూర్కీ.. ఇంజనీరింగ్ లో ప్రపంచస్థాయీ పరిశోధనలకు, అత్యుత్తమ విద్యా బోధనకు పెట్టిం ది పేరు. క్యూఎస్ ర్యాంకింగ్‌సలో ఆసియాలోనే ఉత్తమ విద్యా సంస్థల్లో 70వ స్థానంలో నిలిచింది. ప్రముఖ వేసవి విడిది కేంద్రం ముస్సోరి, పవిత్ర పుణ్యధామం హరిద్వార్‌లకు దగ్గరలో ఉన్న ఈ ఇన్స్టిట్యూట్ పచ్చని సోయగాలతో విలసిల్లుతోంది. ఇక్కడ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో సెకండియర్ చదువుతున్న బండి అఖిల్ రెడ్డి తన క్యాంపస్ లైఫ్‌ను వివరిస్తున్నారిలా.. ప్రశాంత వాతావరణంలో క్యాంపస్.. మాది నల్గొండ.. పదో తరగతిలో 506 మార్కులు, ఇంటర్మీడియెట్ ఎంపీసీలో 958 మార్కులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్డ్- 2013లో 1706 ర్యాంకు సాధించాను. తర్వాత జేఈఈ కౌన్సెలింగ్‌లో ఐఐటీ-రూర్కీలో సీటు వచ్చింది. క్యాంపస్‌లో చేరినవారందరికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. ఇన్స్టిట్యూట్ ఉత్తరాఖండ్‌లో ఉండటం వల్ల ఎక్కువ ఉత్తర భారతదేశ ఆహారం అందుబాటులో ఉంటుంది. వారంలో ఒక రోజు దక్షిణ భారత వంటకాలను రుచి చూస్తాం. నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా రుచిగానే ఉంటుంది. చలికాలం చలి చాలా ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఉక్కపోత ఎక్కువ. సెకండియర్‌లో తెలుగు విద్యార్థులే దాదాపు 80 మంది వరకు ఉన్నారు. విద్యార్థులంతా చాలా స్నేహంగా ఉంటారు. సీనియర్స్ కూడా కలివిడిగా వ్యవహరిస్తారు. ర్యాగింగ్ అసలు లేదు. తరగతి గదులు, గ్రంథాలయం అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. ఆటలు ఆడుకోవడానికి క్రీడా మైదానాలున్నాయి. ఖాళీ సమయంలో బ్యాడ్మింటన్ ఆడతాను. బోధన.. వినూత్నం సాధారణంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తరగతులు, ప్రాక్టికల్ వర్క్, ట్యుటోరియల్స్ ఉంటాయి. ఎంచుకున్న బ్రాంచ్, సబ్జెక్టును బట్టి నిర్దేశిత షెడ్యూల్ ఆధారంగా తరగతులు నిర్వహిస్తారు. ఆధునిక విధానాల ద్వారా బోధిస్తారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. బోధనలో ఇండస్ట్రీ, రీసెర్చ్ ఓరియెంటేషన్‌కు పెద్దపీట వేస్తారు. ఏదైనా సబ్జెక్టు అర్థం కాకపోతే నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్సడ్ లెర్నింగ్ (ఎన్పీటీఈఎల్) పోర్టల్ ద్వారా ఆన్లైన్ లెక్చర్స్ వింటాను. ఎంటెక్/పీహెచ్డీ విద్యార్థులు ట్యుటోరియల్స్ నిర్వహిస్తారు. అకడమిక్ సందేహాలను నివృత్తి చేస్తారు. ప్రొఫెసర్స్ కూడా అందుబాటులోనే ఉంటారు. ఈ-మెయిల్ ద్వారా సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలను, పరిష్కారాలను వారిని అడగొచ్చు. ప్రతిభావంతులకు స్కాలర్షిప్స్.. ప్రతి సెమిస్టర్లో మిడ్ సెమిస్టర్, ఎండ్ సెమిస్టర్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి సెమిస్టర్ లో ఆరు సబ్జెక్టులుంటాయి. అదేవిధంగా ప్రతి ఏటా ఒక హ్యుమానిటీస్ సబ్జెక్టును చదవాలి. నేను మొదటి ఏడాది ఎథిక్స్, రెండో ఏడాది ఎకనామిక్స్ తీసుకున్నాను. పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన టాప్ 25 శాతం మంది విద్యార్థులకు స్కాలర్ షిప్స్/ఫెలోషిప్స్ ఇస్తారు. అయితే తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.4.50 లక్షలు మించకూడదు. ప్రతి సెమిస్టర్‌కు అన్నీ కలుపుకుని రూ. 60 వేల నుంచి రూ.70 వేల మధ్యలో ఫీజులుంటాయి. ఆలోచనలకు ప్రోత్సాహం ఇన్స్టిట్యూట్లో ప్రతి ఏటా టెక్నికల్ ఫెస్ట్ నిర్వహిస్తారు. ప్రొఫెసర్లు, ప్రముఖ శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొంటారు. త్రీడీ ప్రింటింగ్, రోబోటిక్స్ మొదలైనవాటిపై పోటీలు కూడా ఉంటాయి. విద్యార్థుల కొచ్చే ఆలోచనలను ఈ ఫెస్ట్‌లో వివరించవచ్చు. పోటీల్లో విజేత లుగా నిలిచినవారికి బహుమతులు ఇస్తారు. కల్చరల్ ఫెస్ట్ కూడా ఏటా జరుగుతుంది. ఇందులో నాటకాలు, పాటల పోటీలు ఉంటాయి. చిన్నచిన్న స్కిట్స్ కూడా ప్రదర్శిస్తాం. గతేడాది హిందీ సినిమా స్టార్ ఫర్హాన్ అక్తర్ క్యాంపస్‌కు వచ్చారు. ఇంకా క్యాంపస్‌లో అన్ని పండుగలను వైభవంగా చేసుకుంటాం. స్టార్టప్స్‌కు ఫండింగ్ సృజనాత్మక ఆలోచనలతో స్టార్టప్స్‌ను ఏర్పాటు చేయాలనుకునేవారికి.. ఇక్కడ మంచి అవకాశాలున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్, ఇంక్యుబేషన్ సెల్ ఏర్పాటయ్యాయి. కొత్త స్టార్టప్ ఏర్పాటులో ఎదురయ్యే సమస్యలు, అధిగమించే తీరును తెలియజేస్తారు. స్టార్టప్ విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు ఇస్తారు. మూడో ఏడాది వేసవిలో రెండునెలలపాటు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. కొన్ని కంపెనీలు సీజీపీఏ ఆధారంగా విద్యార్థులను ఇంటర్న్‌షిప్ కు ఎంపిక చేస్తున్నాయి. ఫేస్‌బుక్‌లాంటివి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి ఇంటర్న్‌షిప్ సదుపాయం కల్పిస్తున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఏడాదికి సగటున రూ. 11 లక్షలు, గరిష్టంగా రూ.35 లక్షలు అందుతున్నాయి. యూఎస్‌లో ఎంఎస్ చేస్తా బీటెక్ పూర్తయ్యాక గేట్ రాసి ఐఐఎస్సీలో ఎంటెక్ లేదంటే యూఎస్‌లో ఎంఎస్ చేస్తా. -
వినూత్న బోధన, విశిష్ట పరిశోధనలు @ ఐఐటీ- బాంబే
మై క్యాంపస్ లైఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) - బాంబే.. ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు.. అత్యంత ఇష్టమైన గమ్యం. అంతేకాదు ప్రపంచస్థాయీ పరిశోధనలకు, అత్యుత్తమ విద్యా బోధనకు పెట్టింది పేరు. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ)లో బీటెక్ సెకండియర్ చదువుతున్న ఎస్. వెంకట శైలేష్.. క్యాంపస్ లైఫ్‌ను వివరిస్తున్నారిలా.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 16వ ర్యాంకు మాది హైదరాబాద్. నాన్న డీఎల్‌ఆర్‌ఎల్‌లో సైంటిస్టుగా పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి. అక్క యూఎస్‌లోని పర్డ్యూ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తోంది. పదో తరగతిలో 555 మార్కులు, ఇంటర్మీడియెట్ ఎంపీసీలో 983 మార్కులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్డ్- 2013లో 16వ ర్యాంకు, ఎంసెట్‌లో 25వ ర్యాంకు సాధించాను. స్టూడెంట్ మెంటార్షిప్ ప్రోగ్రామ్: క్యాంపస్‌లో తెలుగు విద్యార్థులే దాదాపు 200 మంది వరకు ఉన్నారు. విద్యార్థులంతా చాలా స్నేహంగా ఉంటారు. ర్యాగింగ్ అసలు లేదు. క్యాంపస్‌లో చేరేటప్పుడే స్టూడెంట్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ కింద ఇద్దరు సీనియర్లను ప్రతి ఒక్క విద్యార్థికీ కేటాయిస్తారు. వీరు క్యాంపస్‌కు సంబంధించిన వివిధ విషయాలపై అవగాహన కల్పిస్తారు. బోధన.. వినూత్నం: సాధారణంగా ఉదయం 8.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉన్న సమయాన్ని స్లాట్స్‌గా విభజిస్తారు. ఈ స్లాట్స్‌లో ఎప్పుడైనా తరగతులు నిర్వహిస్తారు. బ్రాంచ్‌ను బట్టి రోజుకు 4 కోర్సుల్లో క్లాసులుంటాయి. వారానికి 20 గంటలు తగ్గకుండా తరగతులు నిర్వహిస్తారు. ల్యాబ్ వర్క్ వారానికి మూడుసార్లు ఉంటుంది. ఆధునిక విధానాల ద్వారా బోధిస్తారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. బోధనలో ఇండస్ట్రీ, రీసెర్చ్ ఓరియెంటేషన్‌కు పెద్దపీట వేస్తారు. ఆయా సబ్జెక్టులపై పట్టు కోసం చాలామంది విద్యార్థులు ఆన్లైన్లో కోర్సులు చేస్తుంటారు. నేను మొదటి ఏడాదిలో 10కి 9.56 సీజీపీఏ (క్యుములేటివ్ గ్రేడ్‌పాయింట్ ఏవరేజ్) సాధించాను. ఆయా బ్రాంచ్‌ల్లో ఎక్కువ మార్కులు సాధించినవారికి అవార్డుతోపాటు నగదు బహుమతులు ఉంటాయి. ఒత్తిడిని ఎదుర్కోవడానికి స్ట్రెస్ మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్పై తరగతులు కూడా నిర్వహిస్తారు. ఫ్యాకల్టీతోపాటు అదనంగా టీచింగ్ అసిస్టెంట్స్ కూడా ఉంటారు. సాధారణంగా బీటెక్ పూర్తయిన వారు, ఎంటెక్, పీహెచ్డీ విద్యార్థులు టీచింగ్ అసిస్టెంట్స్‌గా వ్యవహరిస్తారు. బీటెక్‌లో ప్రతి సెమిస్టర్‌కు ఆరు నుంచి ఏడు కోర్సులు ఉంటాయి. ఈ ఏడు కోర్సులకు కలిపి ఐదుగురు టీచింగ్ అసిస్టెంట్స్ ఉంటారు. సబ్జెక్టుల పరంగా ఎదురయ్యే సందేహాలను వీరినడిగి నివృత్తి చేసుకోవచ్చు. ఆలోచనలకు ప్రోత్సాహం: ఇన్స్టిట్యూట్లో ప్రతి ఏటా టెక్నికల్ ఫెస్ట్ నిర్వహిస్తారు. ప్రొఫెసర్లు, ప్రముఖ శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొంటారు. వివిధ పోటీలు కూడా నిర్వహిస్తారు. విద్యార్థుల కొచ్చే ఆలోచనలను ఈ ఫెస్ట్‌లో వివరించవచ్చు. వారు తయారుచేసిన వివిధ యంత్ర పరికరాలు, రూపొందించిన అప్లికేషన్స్‌ను ఎగ్జిబిషన్లో ప్రదర్శించవచ్చు. పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి అవార్డులు, నగదు బహుమతులు ఉంటాయి. స్టార్టప్స్‌కు ఫండింగ్: సృజనాత్మక ఆలోచనలతో స్టార్టప్స్‌ను ఏర్పాటు చేయాలనుకునేవారికి.. ఫండింగ్ సదుపాయం ఇన్స్టిట్యూట్ కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్, ఇంక్యుబేషన్ సెల్, బ్రాంచ్‌లవారీగా డిపార్ట్మెంట్ క్లబ్‌లు ఉన్నాయి. ఫండింగ్ కావాలనుకునేవారు ఈ క్లబ్‌లను సంప్రదించొచ్చు. విద్యార్థుల ఆలోచనలను స్వీకరించి ఉత్తమమైనవాటిని ఫండింగ్‌కు ఎంపిక చేస్తారు. సంబంధిత కంపెనీలతో మాట్లాడి ఆర్థిక సహాయం అందిస్తారు. అంతేకాకుండా కొత్త స్టార్టప్ ఏర్పాటులో ఎదురయ్యే సమస్యలు, అధిగమించే తీరును తెలియజేస్తారు. స్టార్టప్ విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు ఇస్తారు.