భరోస్‌, డేటా భద్రతకు ఓఎస్‌! భారత్‌ విప్లవాత్మక ముందడుగు | Union ministers test BharOS operating system developed by IIT-Madras | Sakshi
Sakshi News home page

భరోస్‌, డేటా భద్రతకు ఓఎస్‌! భారత్‌ విప్లవాత్మక ముందడుగు

Published Sat, Jan 28 2023 4:46 AM | Last Updated on Sat, Jan 28 2023 2:17 PM

Union ministers test BharOS operating system developed by IIT-Madras - Sakshi

ప్రపంచమంతటా కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లు విలాసాలు కాదు.. నిత్యావసరాలుగా మారిపోయాయి. మన దేశం కూడా అందుకు మినహాయింపు కాదు. దాదాపు అన్ని రంగాల్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల వాడకం తప్పనిసరిగా మారింది. ఇక ఫోన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ధనవంతుల నుంచి సామాన్యుల దాకా అందరి చేతుల్లోనూ దర్శనమిస్తున్నాయి. కంప్యూటర్లు, ఫోన్లు పని చేయాలంటే అందులో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌) కచ్చితంగా ఉండాలి.

ఇలాంటి ఓఎస్‌ కోసం మనం ఇన్నాళ్లూ విదేశాలపైనే ఆధారపడుతున్నాం. ఓఎస్‌ను దేశీయంగా మనమే తయారు చేసుకోలేమా? అన్న ప్రశ్నకు సమాధానమే ‘భరోస్‌’. డిజిటల్‌ ఇండియా కలను సాకారం చేసే దిశగా ఫోన్లలో ఉపయోగపడే ఓఎస్‌ను ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)–మద్రాస్‌ అభివృద్ధి చేసింది. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్‌ స్వయంగా పరీక్షించారు. భరోస్‌ పరీక్ష విజయవంతమైందని ప్రకటించారు. ఈ ఓఎస్‌ అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములైన వారిని అభినందించారు.  

ఏమిటీ భరోస్‌?  
► విదేశీ ఓఎస్‌పై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం, స్థానికంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ వాడకాన్ని ప్రోత్సహించడాన్ని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.  
► ఇందుకోసం భరోస్‌ పేరిట దేశీయ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అభివృద్ధికి నిధులు సమకూర్చింది.  
► ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌ ఆండ్రాయిడ్, ఆపిల్‌ ఐఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ఓఎస్‌లతో డిఫాల్ట్‌ యాప్‌లు, గూగుల్‌ సర్వీసులు తప్పనిసరిగా వస్తాయి. వాటిలో చాలావరకు మనకు అవసరం లేనివే ఉంటాయి. అవి ఏ మేరకు భద్రమో తెలియదు.    
► భరోస్‌ ఓఎస్‌ వీటి కంటే కొంత భిన్నమనే చెప్పాలి. ఇదొక ఉచిత, ఓపెన్‌–సోర్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌. ఇది నో డిఫాల్ట్‌ యాప్స్‌(ఎన్‌డీఏ)తో వస్తుంది. అంటే భరోస్‌ ఓఎస్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్న ఫోన్‌లో ఎలాంటి యాప్‌లు కనిపించవు.  
► గూగుల్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్లతో క్రోమ్, జీమెయిల్, గూగుల్‌ సెర్చ్, యూట్యూబ్, మ్యాప్స్‌ వంటివి డిఫాల్ట్‌గా వస్తుండడం తెలిసిందే.   
► డిఫాల్ట్‌గా వచ్చే యాప్‌లతో మోసాలకు గురవుతుండడం వినియోగదారులకు అనుభవమే. అందుకే భరోస్‌ ఓఎస్‌ ఉన్న ఫోన్లలో అవసరమైన యాప్‌లను ప్రైవేట్‌ యాప్‌ స్టోర్‌ సర్వీసెస్‌(పాస్‌) నుంచి  డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.  
► ‘పాస్‌’లో బాగా నమ్మకమైన, ప్రభుత్వ అనుమతి ఉన్న, అన్ని రకాల భద్రత, గోప్యత ప్రమాణాలు కలిగిన యాప్‌లు మాత్రమే ఉంటాయి. దీనివల్ల ఫోన్లలోని డేటా చోరీకి గురవుతుందన్న ఆందోళన ఉండదు.  
► స్మార్ట్‌ఫోన్ల కంపెనీలకు ఈ ఓఎస్‌ను ఎలా అందజేస్తారు? ప్రజలకు ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తారు? రెగ్యులర్‌ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులందరికీ ఇస్తారా? లేదా? అనేదానిపై ఐఐటీ–మద్రాస్‌ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.  
                       

ఎవరు వాడుతున్నారు?  
► కఠినమైన భద్రత, గోప్య త అవసరాలు కలిగిన కొన్ని సంస్థలు ప్రస్తుతం భరోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను పరీక్షిస్తున్నాయి.  
► రహస్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొనే ప్రభుత్వ కంపెనీలు ఈ ఓఎస్‌ను వాడుతున్నట్లు సమాచారం.

ఎందుకీ ఓఎస్‌?  
► గూగుల్‌ మొబైల్‌ ఓఎస్‌ ఆండ్రాయిడ్‌పై కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖకు చెందిన కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేసింది.  
► ఆండ్రాయిడ్‌తో డిఫాల్ట్‌గా వస్తున్న కొన్ని యాప్‌ల్లో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్లు తెలియజేసింది.  
► ఈ నేపథ్యంలోనే దేశీయ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తయారీపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.  


విప్లవాత్మక ముందడుగు  
ఐఐటీ–మద్రాసు ఆధ్వర్యంలో స్థాపించిన జండ్‌ కే ఆపరేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(జండ్‌కాప్స్‌) అనే లాభాపేక్ష లేని స్టార్టప్‌ కంపెనీ భరోస్‌ ఓఎస్‌ను అభివృద్ధి చేసింది. ‘నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఇంటర్‌ డిసిప్లినరీ సైబర్‌ ఫిజికల్‌ సిస్టమ్స్‌’ కింద కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ నిధులు అందజేసింది. నమ్మకం అనే పునాదిపై భరోస్‌ మొబైల్‌ ఆపరేటింగ్‌ వ్యవస్థను రూపొందించినట్లు ఐఐటీ–మద్రాస్‌ డైరెక్టర్‌ చెప్పారు.

తమ అవసరాలను తీర్చే యాప్‌లను పొందే స్వేచ్ఛను వినియోగదారులకు కల్పించాలన్నదే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని వివరించారు. దీనివల్ల సంబంధిత యాప్‌లపై వారికి తగిన నియంత్రణ ఉంటుందన్నారు. ఫోన్లలోని డేటా భద్రతకు భరోసా కల్పించే విషయంలో ఇదొక విప్లవాత్మకమైన ముందడుగు అని అభివర్ణించారు. మన దేశంలో ఈ ఓఎస్‌ వినియోగాన్ని పెంచేందుకు ప్రైవేట్‌ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, వ్యూహాత్మక సంస్థలు, టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లతో కలిసి పని చేస్తామని వివరించారు.  
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement