ఐఐటీ సూపర్‌.. ఫారిన్‌ ఆఫర్‌.. | Foreign Companies Have Queued For Jobs In Indian Institute Of Technologies | Sakshi
Sakshi News home page

ఐఐటీ సూపర్‌.. ఫారిన్‌ ఆఫర్‌..

Published Sun, Dec 15 2019 1:05 AM | Last Updated on Sun, Dec 15 2019 12:50 PM

Foreign Companies Have Queued For Jobs In Indian Institute Of Technologies - Sakshi

సాక్షి ప్రత్యేకప్రతినిధి: ఈ ఏడాది ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ఉద్యోగ నియామకాలకు విదేశీ కంపెనీలు క్యూ కట్టాయి. ఉత్తర అమెరికా, యూరప్, సింగపూర్, జర్మనీ, జపాన్‌ వంటి దేశాలు ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల విద్యార్థులను నియమించుకునేందుకు పోటీపడ్డాయి. ఐఐటీ ఖరగ్‌పూర్‌ విద్యార్థుల కోసం గత ఏడాది 26 విదేశీ కంపెనీలు బారులుతీరగా ఈ సీజన్‌లో ఏకంగా 51 విదేశీ కంపెనీలు నియామకాలు చేపట్టాయి. ఐఐటీ కాన్పూర్, ఐఐటీ బీహెచ్‌యూ, ఐఐటీ గువాహటిలలో ఒక్కో విద్యార్థికి సగటున ఐదు ఆఫర్లు లభిం చాయి. ఐఐటీ హైదరాబాద్‌ ఉద్యోగ నియామకాల్లో కొన్ని ఐఐటీలను దాటిపోయిం ది. ఈ విద్యా సంవత్సరం బీటెక్‌ పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులను నియమించుకునేందుకు 38 అంతర్జాతీయ కంపెనీలు అడుగుపెట్టాయి. ఐఐటీ మద్రాస్‌ (34), ఐఐటీ కాన్పూర్‌ (22), ఐఐటీ (బీహెచ్‌యూ) వారణాసి (11), ఐఐటీ గువాహటి (25) కంటే హైదరాబాద్‌ ఐఐటీ అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించడంలో ముందంజలో ఉంది. ‘వచ్చే జనవరి నుంచి మొదలయ్యే తుది సీజన్‌ నియామకాల తరువాత అంతర్జాతీయ కంపెనీల సంఖ్య పెరుగుతుంది’అని ఐఐటీ హైదరాబాద్‌ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

ఎక్కువ ఆఫర్‌ చేసిన మైక్రోసాఫ్ట్, ఉబర్‌...
ఈ ఏడాది ఐఐటీ విద్యార్థులకు పెద్ద మొత్తంలో ఉద్యోగాలు ఆఫర్‌ చేసిన అంతర్జాతీయ కంపెనీల్లో మైక్రోసాఫ్ట్, ఉబర్, పేపాల్‌తోపాటు యాక్సెంచర్‌ జపాన్, డెస్కెరా, హనీవెల్‌ వంటివి ఉన్నాయి. మైక్రోసాఫ్ట్‌ 100 మందికిపైగా విద్యార్థులకు రూ. కోటి అంతకంటే ఎక్కువ ఆఫర్‌ చేయడం విశేషం. ఉబర్, పేపాల్‌ వంటి అమెరికన్‌ కంపెనీలు తక్కువ సంఖ్యలో విద్యార్థులను నియమించుకున్నప్పటికీ కనిష్టంగా రూ. 60 లక్షలు, గరిష్టంగా రూ. కోటి మేర వేతనాలను ఆఫర్‌ చేశాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ జరిగిన నియామకాల్లో ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థుల్లో 60 శాతం మందికి అంతర్జాతీయ కంపెనీలు ఆఫర్లు ఇచ్చాయి. అంతర్జాతీయ కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లు పొందిన వారికి అమెరికా, సింగపూర్, జపాన్, జర్మనీ వంటి దేశాల్లోనే ఉద్యోగాలు దక్కాయి. ఇలా ఉద్యోగాలు పొందిన వారికి సంబంధిత కంపెనీలే వర్క్‌ పర్మిట్‌ (ఆయా దేశాల్లో పని చేసేందుకు అనుమతి) తీసుకుంటాయి.

ప్లేస్‌మెంట్స్‌లో హైదరాబాద్‌ ఐఐటీ రెండో స్థానం...
ఐఐటీ ఖరగ్‌పూర్‌కు ఈసారి అంతర్జాతీయ సంస్థలు వెల్లువెత్తాయి. ఈ విద్యా సంవత్సరం బీటెక్‌ పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులను నియమించుకునేందుకు 51 కంపెనీలు నియామక ప్రక్రియను పూర్తి చేశాయి. ఐఐటీ బాంబేలో తుది దశ నియామకాల ప్రక్రియ పూర్తయితేగానీ ఈ ఏడాది అంతర్జాతీయ కంపెనీలు ఏ ఐఐటీని ఎక్కువగా సందర్శించాయన్న వివరాలు లభ్యం కావు. అయితే ఇప్పటివరకూ పూర్తయిన నియామక ప్రక్రియను పరిశీలిస్తే ఖరగ్‌పూర్‌ తరువాత ఆ స్థానం హైదరాబాద్‌కు దక్కుతుంది. హైదరాబాద్‌ ఐఐటీని సందర్శించిన అంతర్జాతీయ కంపెనీల సంఖ్య 38. ప్లేస్‌మెంట్లలో ఐఐటీ హైదరాబాద్‌ ఈసారి పాత ఐఐటీలు ఎన్నింటినో అధిగమించి రికార్డు దిశగా దూసుకుపోతోంది. ఢిల్లీ, బాంబే ఐఐటీలలో నియామకాల ప్రక్రియ ఇటీవలే మొదలైందని, జనవరి ఆఖరుతో పూర్తవుతుందని, ఆ తరువాత ఐఐటీలవారీగా నియామకాలు చేపట్టిన జాతీయ, అంతర్జాతీయ కంపెనీల వివరాలు వెల్లడిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. ‘అంతర్జాతీయ పత్రికలు విద్యాసంస్థల రేటింగ్‌లో ఐఐటీలను తక్కువ చేసి చూపుతున్నా వాటిలో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న విద్యార్థులే రేటింగ్‌లకు చక్కని ఉదాహరణ అని ఆ ప్రతినిధి వ్యాఖ్యానించారు.

ప్లేస్‌మెంట్లు ఆఫర్‌ చేసిన అంతర్జాతీయ కంపెనీల్లో కొన్ని...
మైక్రోసాఫ్ట్‌
ఉబర్‌
పేపాల్‌
యాక్సెంచర్‌ జపాన్‌
డెస్కెరా
హనీవెల్‌ 

– మైక్రోసాఫ్ట్‌ 100 మందికిపైగా విద్యార్థులకు రూ. కోటి అంతకంటే ఎక్కువ ఆఫర్‌ చేసింది.
– ఉబర్, పేపాల్‌ తక్కువ మందిని నియమించుకున్నా రూ. 60 లక్షలు–రూ. కోటి వరకు ఆఫర్‌ చేశాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement