రీసెర్చ్ ఓరియెంటేషన్‌కు పెద్దపీట | Research orientation songs | Sakshi
Sakshi News home page

రీసెర్చ్ ఓరియెంటేషన్‌కు పెద్దపీట

Published Sun, Oct 26 2014 11:52 PM | Last Updated on Tue, Oct 16 2018 8:03 PM

రీసెర్చ్ ఓరియెంటేషన్‌కు పెద్దపీట - Sakshi

రీసెర్చ్ ఓరియెంటేషన్‌కు పెద్దపీట

మై క్యాంపస్ లైఫ్
 
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) - రూర్కీ.. ఇంజనీరింగ్ లో ప్రపంచస్థాయీ పరిశోధనలకు, అత్యుత్తమ విద్యా బోధనకు పెట్టిం ది పేరు. క్యూఎస్ ర్యాంకింగ్‌‌సలో ఆసియాలోనే ఉత్తమ విద్యా సంస్థల్లో 70వ స్థానంలో నిలిచింది. ప్రముఖ వేసవి విడిది కేంద్రం ముస్సోరి, పవిత్ర పుణ్యధామం హరిద్వార్‌లకు దగ్గరలో ఉన్న ఈ ఇన్‌స్టిట్యూట్ పచ్చని సోయగాలతో విలసిల్లుతోంది. ఇక్కడ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో సెకండియర్ చదువుతున్న బండి అఖిల్ రెడ్డి తన క్యాంపస్ లైఫ్‌ను వివరిస్తున్నారిలా..
 
ప్రశాంత వాతావరణంలో క్యాంపస్..

మాది నల్గొండ.. పదో తరగతిలో 506 మార్కులు, ఇంటర్మీడియెట్ ఎంపీసీలో 958 మార్కులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్- 2013లో 1706 ర్యాంకు సాధించాను. తర్వాత జేఈఈ కౌన్సెలింగ్‌లో ఐఐటీ-రూర్కీలో సీటు వచ్చింది. క్యాంపస్‌లో చేరినవారందరికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. ఇన్‌స్టిట్యూట్ ఉత్తరాఖండ్‌లో ఉండటం వల్ల ఎక్కువ ఉత్తర భారతదేశ ఆహారం అందుబాటులో ఉంటుంది. వారంలో ఒక రోజు దక్షిణ భారత వంటకాలను రుచి చూస్తాం. నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా రుచిగానే ఉంటుంది. చలికాలం చలి చాలా ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఉక్కపోత ఎక్కువ. సెకండియర్‌లో తెలుగు విద్యార్థులే దాదాపు 80 మంది వరకు ఉన్నారు. విద్యార్థులంతా చాలా స్నేహంగా ఉంటారు. సీనియర్స్ కూడా కలివిడిగా వ్యవహరిస్తారు. ర్యాగింగ్ అసలు లేదు. తరగతి గదులు, గ్రంథాలయం అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. ఆటలు ఆడుకోవడానికి క్రీడా మైదానాలున్నాయి. ఖాళీ సమయంలో బ్యాడ్మింటన్ ఆడతాను.
 
బోధన.. వినూత్నం

సాధారణంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తరగతులు, ప్రాక్టికల్ వర్క్, ట్యుటోరియల్స్ ఉంటాయి. ఎంచుకున్న బ్రాంచ్, సబ్జెక్టును బట్టి నిర్దేశిత షెడ్యూల్ ఆధారంగా తరగతులు నిర్వహిస్తారు. ఆధునిక విధానాల ద్వారా బోధిస్తారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. బోధనలో ఇండస్ట్రీ, రీసెర్చ్ ఓరియెంటేషన్‌కు పెద్దపీట వేస్తారు. ఏదైనా సబ్జెక్టు అర్థం కాకపోతే నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్‌‌సడ్ లెర్నింగ్ (ఎన్‌పీటీఈఎల్) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ లెక్చర్స్ వింటాను. ఎంటెక్/పీహెచ్‌డీ విద్యార్థులు ట్యుటోరియల్స్ నిర్వహిస్తారు. అకడమిక్ సందేహాలను నివృత్తి చేస్తారు. ప్రొఫెసర్స్ కూడా అందుబాటులోనే ఉంటారు. ఈ-మెయిల్ ద్వారా సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలను, పరిష్కారాలను వారిని అడగొచ్చు.
 
ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్స్..


ప్రతి సెమిస్టర్‌లో మిడ్ సెమిస్టర్, ఎండ్ సెమిస్టర్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి సెమిస్టర్ లో ఆరు సబ్జెక్టులుంటాయి. అదేవిధంగా ప్రతి ఏటా ఒక హ్యుమానిటీస్ సబ్జెక్టును చదవాలి. నేను మొదటి ఏడాది ఎథిక్స్, రెండో ఏడాది ఎకనామిక్స్ తీసుకున్నాను. పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన టాప్ 25 శాతం మంది విద్యార్థులకు స్కాలర్ షిప్స్/ఫెలోషిప్స్ ఇస్తారు. అయితే తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.4.50 లక్షలు మించకూడదు. ప్రతి సెమిస్టర్‌కు అన్నీ కలుపుకుని రూ. 60 వేల నుంచి రూ.70 వేల మధ్యలో ఫీజులుంటాయి.
 
ఆలోచనలకు ప్రోత్సాహం

ఇన్‌స్టిట్యూట్‌లో ప్రతి ఏటా టెక్నికల్ ఫెస్ట్ నిర్వహిస్తారు. ప్రొఫెసర్లు, ప్రముఖ శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొంటారు. త్రీడీ ప్రింటింగ్, రోబోటిక్స్ మొదలైనవాటిపై పోటీలు కూడా ఉంటాయి. విద్యార్థుల కొచ్చే ఆలోచనలను ఈ ఫెస్ట్‌లో వివరించవచ్చు. పోటీల్లో విజేత లుగా నిలిచినవారికి బహుమతులు ఇస్తారు. కల్చరల్ ఫెస్ట్ కూడా ఏటా జరుగుతుంది. ఇందులో నాటకాలు, పాటల పోటీలు ఉంటాయి. చిన్నచిన్న స్కిట్స్ కూడా ప్రదర్శిస్తాం. గతేడాది హిందీ సినిమా స్టార్ ఫర్హాన్ అక్తర్ క్యాంపస్‌కు వచ్చారు. ఇంకా క్యాంపస్‌లో అన్ని పండుగలను వైభవంగా చేసుకుంటాం.
 
స్టార్టప్స్‌కు ఫండింగ్

సృజనాత్మక  ఆలోచనలతో స్టార్టప్స్‌ను ఏర్పాటు చేయాలనుకునేవారికి.. ఇక్కడ మంచి అవకాశాలున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్, ఇంక్యుబేషన్ సెల్ ఏర్పాటయ్యాయి. కొత్త స్టార్టప్ ఏర్పాటులో ఎదురయ్యే సమస్యలు, అధిగమించే తీరును తెలియజేస్తారు. స్టార్టప్ విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు ఇస్తారు. మూడో ఏడాది వేసవిలో రెండునెలలపాటు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. కొన్ని కంపెనీలు సీజీపీఏ ఆధారంగా విద్యార్థులను ఇంటర్న్‌షిప్ కు ఎంపిక చేస్తున్నాయి. ఫేస్‌బుక్‌లాంటివి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి ఇంటర్న్‌షిప్ సదుపాయం కల్పిస్తున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఏడాదికి సగటున రూ. 11 లక్షలు, గరిష్టంగా రూ.35 లక్షలు అందుతున్నాయి.
 
 యూఎస్‌లో ఎంఎస్ చేస్తా

బీటెక్ పూర్తయ్యాక గేట్ రాసి ఐఐఎస్సీలో ఎంటెక్ లేదంటే యూఎస్‌లో ఎంఎస్ చేస్తా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement