సాక్షి ఎఫెక్ట్: 21 మంది అవినీతి ఉద్యోగులపై వేటు
నల్లగొండ టూటౌన్: నల్లగొండ మున్సిపాలిటీలో కోట్లు కొల్లగొట్టిన అక్రమార్కులపై సర్కార్ కొరడా ఝుళిపించింది. 2011 ప్రత్యేకాధికారుల పాలన నుంచి పాలకవర్గం పాలన 2015 మార్చి వరకు అవినీతికి పాల్పడి రూ.3.32 కోట్లకు పైగా కొల్లగొట్టిన 21 మంది నీలగిరి మున్సిపల్ ఉద్యోగులు సస్పెండయ్యారు. మున్సిపల్ కమిషనర్ ఖాతాలో జమ చేయాల్సినడబ్బును పక్కదారి పట్టించి సొంతానికి వాడుకున్నారు. ఫిబ్రవరిలో చేపట్టిన ఏజీ ఆడిట్‌లో కొన్ని అక్రమాలు వెలుగు చూశాయి. కానీ, ఇక్కడి మున్సిపల్ అధికారులు నిజాలను తొక్కిపెట్టే ప్రయత్నాలను ‘సాక్షి’ పసిగట్టి వెలుగులోకి తెచ్చింది.
‘మున్సిపాలిటీలో దొంగలు పడ్డారు’ అనే కథనంతో మొదలు పెట్టి మున్సిపల్ కార్యాలయంలో 2009 నుంచి జరిగిన అక్రమాలపై వరుస కథనాలు ప్రచురించింది. దీంతో జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్పెషల్ ఆడిట్, ఏజీ ఆడిట్ చేయించారు. జిల్లా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సైతం ఈ అవినీతి అక్రమాలపై విచారించారు. 2011 నుంచి ఇక్కడ పని చేసిన 21 మంది ఉద్యోగులకు అవినీతిలో భాగస్వామ్యంతో ఉందని తేలడంతో వారిపై సస్పెన్షన్ వేటు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్వో, యూడీఆర్‌ఐ, ముగ్గురు రెవెన్యూ ఇన్‌స్పెక్లర్లు, 16 మంది బిల్ కలెక్టర్లు సస్పెండయిన వారిలో ఉన్నారు. కాగా, వీరిలో ఇక్కడ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా పని చేసిన వహీద్ ప్రస్తుతం సూర్యాపేటలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. అదే విధంగా నల్లగొండలో బిల్ కలెక్టర్‌గా పని చేసిన గులాం ఖాదర్ ఖాన్ జూనియర్ అసిస్టెంట్ పదోన్నతితో మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్నారు. ఎ. సత్యనారాయణ, కె. హన్‌మాన్ ప్రసాద్ (మిర్యాలగూడ), పి. భిక్షం (సూర్యాపేట) మున్సిపాలిటీలలో బిల్ కలెక్టర్‌లుగా పని చేస్తున్నారు. మిగతా వారంతా ప్రస్తుతం నల్లగొండ మున్సిపాలిటీలోనే పని చేస్తున్నారు. వీరందరినీ తక్షణమే విధుల నుంచి తొలగించి వారి స్థానంలో ఇతరులను నియమించాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.